అబార్షన్ చట్టం: టాయిలెట్లో శిశుహత్యారోపణల నుంచి ఎల్ సాల్వడార్ మహిళకు విముక్తి

ఎల్ సాల్వడార్‌లో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన నవజాత శిశువు హత్యకు సంబంధించి ఆమె తల్లిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
21ఏళ్ల మహిళ తను ప్రసవించిన శిశువును టాయిలెట్లో పడేసి హత్య చేసిందనే ఆరోపణలపై జరిగిన పునర్విచారణలో ఆమెకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది.
తనకు ఏ పాపం తెలియదని ఎవెలిన్ హెర్నాండెజ్ మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. తను బిడ్డను ప్రసవించేవరకు అసలు గర్భవతిని అనే విషయమే తనకు తెలియదని ఆమె అంటున్నారు. ప్రసవ సమయంలో తాను స్పృహలో లేనని చెప్పారు.
ఆమెకు 40 ఏళ్ల జైలుశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది.
ఆమెను నిర్దోషిగా విడుదల చేయాలంటూ మహిళా హక్కుల కార్యకర్తల పోరాటం కారణంగా ఈ కేసు ఉదంతం ఎల్ సాల్వడార్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరి దృష్టినో ఆకర్షించింది.
కఠినమైన అబార్షన్ చట్టాలు ఉన్న కొన్ని దేశాల్లో ఎల్ సాల్వడార్ ఒకటి. ఎలాంటి సందర్భంలోనైనా గర్భస్రావం ఇక్కడ చట్టవిరుద్ధం. ఎవరైనా దీనికి పాల్పడినట్లు రుజువైతే రెండు నుంచి ఎనిమిది సంవత్సరాల జైలుశిక్ష విధించే అవకాశముంది.
కానీ హెర్నాండెజ్ విషయంలో తీవ్రమైన హత్యానేరంగా కేసు నమోదు చేశారు. దీనికి కనీసం 30 సంవత్సరాల జైలు శిక్ష విధించొచ్చు.

"దేవుడున్నాడు, న్యాయం జరిగింది" అని కోర్టు తీర్పు అనంతరం 33 నెలల కఠిన జైలు జీవితం నుంచి బయట అడుగుపెట్టిన హెర్నాండెజ్ వ్యాఖ్యానించారు.
"నా చదువును కొనసాగించాలి. నా లక్ష్యాల సాధన దిశగా ముందుకు సాగాలి. చాలా సంతోషంగా ఉంది" అని హెర్నాండెజ్ చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్త సంస్థ పేర్కొంది.
ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నానని హెర్నాండెజ్ అన్నారని ఆమె తరపు న్యాయవాది బెర్తా మరియా డెలియోన్ ట్వీట్ చేశారు.
"అయితే, కేవలం హెర్నాండెజ్ కేసులో మాత్రమే పూర్తి స్థాయి పునర్విచారణ జరిగింది. ఈ పోరాటం ఇంతటితో ముగియలేదు. ఎల్ సాల్వడార్‌లో ఎంతో మంది మహిళలు గర్భస్రావం చేసుకున్నారనే ఆరోపణలపై ఏళ్ల తరబడి జైలు జీవితం గడుపుతున్నారు" అని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ తీర్పు అలాంటి మహిళలందరికీ తమ పోరాటాన్ని కొనసాగించేందుకు దోహదం చేస్తుందని మహిళల హక్కుల కార్యకర్తలు ఆశిస్తున్నారు.
ఎల్ సాల్వడార్ మహిళల హక్కుల పరిరక్షణకు ఈ తీర్పు ఓ గొప్పవిజయం అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ అభిప్రాయపడింది. మహిళలపై విచక్షణారహితంగా క్రిమినల్ కేసులను నమోదుచేసే చర్యలకు ముగింపు పలకాలని ప్రభుత్వానికి సూచించింది.
ఎల్ సాల్వడార్ తమ అబార్షన్ చట్టాలను సంస్కరించాలని యూఎన్ హైకమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ కార్యాలయం సూచించింది.

ఫొటో సోర్స్, AFP
అసలేం జరిగింది?
2016 ఏప్రిల్ 6న ఇంట్లో ఉండగా తనకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చిందని, రక్తస్రావమైందని ఎల్ సాల్వడార్‌లోని ఓ గ్రామంలో నివసించే ఎవెలిన్ హెర్నాండెజ్ తెలిపారు.
వెంటనే ఇంటి బయట ఉన్న టాయిలెట్‌కు వెళ్లిన ఆమె అక్కడే స్పృహ తప్పారు. ఆమె తల్లి హెర్నాండెజ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె ప్రసవించారని డాక్టర్లు గుర్తించారు.
టాయిలెట్ సెప్టిక్ ట్యాంకులో శిశువు మృతదేహం లభ్యం కావడంతో హెర్నాండెజ్‌ను అరెస్టు చేశారు.
అప్పుడు హెర్నాండెజ్ వయసు 18 ఏళ్లు. ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని, కానీ తను గర్భవతిననే విషయం తనకు ఏమాత్రం తెలియలేదని ఆమె అన్నారు.
"గర్భంతో ఉన్న సమయంలో ఉండే లక్షణాలను నేను కడుపునొప్పి అనుకున్నా. తీవ్రమైన రక్తస్రావం కావడంతో నాకు పీరియడ్స్ వచ్చాయనుకున్నా. నేను గర్భవతిని అని తెలిస్తే సంతోషంగా నా బిడ్డకు జన్మనిచ్చేదాన్ని" అని హెర్నాండెజ్ వెల్లడించారు.
"ఏదో కింద పడుతోందని అనిపించింది. కానీ శిశువు ఏడుపు వినబడలేదు. అందుకే నాకు ప్రసవిస్తున్నాననే విషయం తెలియలేదు" అని ఆమె చెప్పారు.
ఆమె అబార్షన్ చేసుకునేందుకు ప్రయత్నించిందని ముందుగా ఆరోపణలు ఎదుర్కొన్నా, తర్వాత అది తీవ్రమైన హత్యానేరంగా మారింది. ఆమె తన గర్భాన్ని దాచిపెట్టి, గర్భిణులు తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలేవీ తీసుకోలేదని ప్రాసిక్యూషన్ వాదించింది.
2017 జులైలో హెర్నాండెజ్‌ను దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఆమెకు 30ఏళ్ల జైలుశిక్ష విధించింది. దీనిలో ఇప్పటికే 33 నెలల శిక్షను ఆమ అనుభవించారు.

ఫొటో సోర్స్, AFP
పునర్విచారణ ఎందుకు?
అయితే, ఈ తీర్పుపై హెర్నాండెజ్ తరపు న్యాయవాదులు అప్పీల్ చేశారు. శిశువు తన మలాన్ని తానే తినడం వల్ల చనిపోయినట్లు ఫోరెన్సిక్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, ఇది గర్భంలో ఉండగా లేదా ప్రసవం జరిగిన వెంటనే జరిగేందుకు అవకాశముందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
హెర్నాండెజ్ అబార్షన్ కోసం ప్రయత్నించలేదని, సహజంగానే శిశువు మరణించిందనే డిఫెన్స్ లాయర్ వాదనను కోర్టు అంగీకరించింది.
2019 ఫిబ్రవరిలో ఎల్ సాల్వడార్ సుప్రీంకోర్టు దీనిపై పునర్విచారణకు ఆదేశించింది.
దీంతో హెర్నాండెజ్ జైలు నుంచి విడుదలయ్యారు. జులైలో పునర్విచారణ ప్రారంభమైంది.
ఆమెకు మరింత కఠినంగా, 40ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది.
ప్రాసిక్యూషన్ వాదనను ప్రో-చాయిస్ ప్రచారకర్త మోరెనా హెరీరా తప్పుబట్టారు. ఘటన జరిగినప్పుడు ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఇలా వాదించడం సరికాదని వ్యాఖ్యానించారు.

ఈ కేసుకు ఎందుకంత ప్రాముఖ్యం?
దేశంలోని కఠిన అబార్షన్ చట్టాల కారణంగా కనీసం మరో 17మంది మహిళలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారని ఎల్ సాల్వడార్‌లోని హక్కుల పోరాట సంస్థలు చెబుతున్నాయి.
గత దశాబ్ద కాలంలో తగిన సాక్ష్యాలను సేకరించడం ద్వారా దాదాపు 30మందికి వీరు శిక్షనుంచి విముక్తి కల్పించారు.
జూన్‌లో నయీబ్ బుకేలే దేశాధ్యక్షుడయ్యాక పునర్విచారణ జరిగిన తొలి కేసు హెర్నాండెజ్‌దే. దీంతో ఆయన ఈ దిశగా మరిన్ని చర్యలు తీసుకోవచ్చని మహిళా సంఘాలు భావిస్తున్నాయి.
అబార్షన్లను తాను వ్యతిరేకిస్తానని, కానీ అదే సమయంలో మహిళల బాధలను కూడా అర్థం చేసుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు.
"ఓ పేద మహిళకు గర్భస్రావమైతే ఆమె కావాలనే ఆ పని చేసుకుందని అనుమానిస్తారు. ఇక్కడే సామాజిక అసమానతల పాత్ర మొదలవుతోంది" అని ఆయన తన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి.
- అబార్షన్ పిల్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజూ 10 మంది మృతి
- అర్జెంటీనా: అబార్షన్ హక్కు కోసం పోరాడుతున్న మహిళలు
- కశ్మీర్ విషయంలో నెహ్రూ పాత్రేమిటి.. విలన్ ఆయనేనా
- "కశ్మీర్ పరిస్థితి ఏ రాష్ట్రానికైనా రావొచ్చు.. కేంద్రం చర్యకు ప్రతిఘటన కొరవడటం ఆందోళనకరం"
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- ఆయన రోజూ 30 కిలోమీటర్లు గాల్లో తేలుతూ ఆఫీసుకు వెళతారు...
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో బ్లాక్ అండ్ వైటా.. కలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









