ఆయన రోజూ 30 కిలోమీటర్లు గాల్లో తేలుతూ ఆఫీసుకు వెళతారు...

ఫొటో సోర్స్, FACEBOOK/TOM PRIDEAUX-BRUNE
- రచయిత, ఫిల్ క్లార్క్-హిల్
- హోదా, బీబీసీ వర్క్ లైఫ్
ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయి, ఆఫీసుకు టైమైపోతున్నప్పుడు.. హాయిగా గాల్లో ఎగురుతూ వెళ్తే ఎంత బాగుణ్ణో అని చాలామంది అనుకుంటారు.
ఇంగ్లండ్‌లోని ఒక పారామోటార్ గ్లైడర్ అక్షరాలా అదేపని చేస్తున్నారు. గాలిలో ప్రయాణిస్తూ ఆఫీసుకు చేరుకుంటున్నారు.
మైదానం మధ్యలో నిలబడిన టామ్ ప్రైడో-బ్రూన్ తన వీపుకు ఒక పెద్ద మెష్ రింగ్, దానికి పారామోటర్ గ్లైడర్ కలిపిన బెల్టులు కట్టుకుని ఉన్నారు.
ఆయన భుజంపై ఉన్న తాడును బలంగా లాగగానే, వెనక కట్టుకున్న మోటర్ స్టార్ట్ అయ్యింది. మోటార్ ఆన్ అవడంతోనే వీపుపై ఉన్న ఫ్యాన్ తిరగడం మొదలైంది.
ప్రైడో-బ్రూన్ మైదానంలో పరుగు మొదలుపెట్టారు. 10-12 అడుగులు వేయగానే ఆయన రెండు కాళ్లు గాల్లోకి లేచాయి.
పారామోటార్ గ్లైడర్ ఆయన్ను అప్పటికే గాల్లోకి లేపింది. అది ఆయన శరీరం మొత్తం బరువు మోస్తోంది.
అలా గాల్లో తేలుతూ ఆకాశమార్గంలో ఆయన ఆఫీస్ ప్రయాణం ప్రారంభమైంది.

గాల్లో ఆఫీసుకు ప్రయాణం
టామ్ ప్రైడో-బ్రూన్ ఆఫీస్ నైరుతి ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్‌లో ఉంది. వాతావరణం అనుకూలిస్తే, ఆయన ప్రతిరోజూ ఆఫీసుకు ఇలాగే వెళ్తుంటారు.
"ఒక పైలెట్‌లా నేను ప్రతిరోజూ ఉదయం లేవగానే కిటికీల కర్టెన్లు తీసి బయట వాతావరణం చూస్తుంటాను" అంటారు టామ్.
"ఈరోజు ఉదయం వాతావరణం చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. ఇది కారు నడపడం కంటే హాయిగా ఉంటుంది. దానికి నాది భరోసా" అంటారు టామ్.
ప్రైడో-బ్రూన్ సిటీలో బైక్‌పై వెళ్తుంటారు. లేదంటే నడిచి వెళ్లడాన్ని ఇష్టపడతారు. కానీ, గాల్లో ఎగరడం ఆయనకు చాలా థ్రిల్‌గా, సరదాగా ఉంటుంది.
షెర్‌బోర్న్‌లోని ఇంటి నుంచి డార్సెట్‌లో ఉన్న ఆఫీసుకు వెళ్లడానికి ఆయన గాల్లో రోజూ 30 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు.
పొలాలపై నుంచి ఎగురుతూ మాట్లాడిన టామ్ "మనం వీపుకు ఒక పెద్ద ఫ్యాన్ కట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని పారాగ్లైడర్‌కు జోడించాల్సుంటుంది" అన్నారు.
ఫ్యాన్‌కు జోడించిన ఇంజన్‌ను చూపిస్తూ "మనకు ఇలాంటి ఒక పెద్ద ఇంజన్ ఉంటుంది. అందులో నాలుగైదు లీటర్ల ఇంధనం నింపితే చాలు" అన్నారు.

పచ్చటి పొలాలపై పారాగ్లైడింగ్
టామ్ గంటకు దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో ఎగురుతారు. అయితే కొన్ని పారామోటార్ గ్లైడర్లతో అంతకంటే ఎక్కువ వేగంతో దూసుకువెళ్లచ్చు.
"గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటే, ప్రయాణంలో మజా వస్తుంది. గ్లైడర్ మరింత అడ్వాన్స్‌గా ఉంటే మనం దీనికి రెట్టింపు వేగంతో వెళ్లచ్చు" అని టామ్ చెప్పారు.
ఆయన గ్రామీణ ప్రాంతాల మీదుగా ఎగురుతూ వెళ్తారు. పైనుంచి పారాగ్లైడింగ్ చేస్తూ పచ్చటి పొలాలను చూడ్డానికి రెండు కళ్లూ చాలవనిపిస్తుంది.
దాని గురించి టామ్ "నేను గాల్లో ఎగురుతుంటే, పూర్తిగా ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. పైనుంచి కిందికి చూస్తే పచ్చటి పొలాలు కనిపిస్తాయి. ఒక రోజును ప్రారంభించడానికి అంతకంటే అద్భుతమైన దృశ్యం ఏముంటుంది"
ప్రైడో-బ్రూన్ ఆఫీస్ దగ్గరికి రాగానే తన వేగం తగ్గిస్తారు. మెల్లమెల్లగా కిందికి దిగుతారు. దిగేటప్పుడు కూడా ఆయన 10-15 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది.
ఆయన సింగిల్ ఇంజిన్ పారాగ్లైడర్ ఉపయోగిస్తున్నారు. టామ్ విల్ట్‌షైర్‌లో ఆఫీసుకు చేరుకోగానే తన ప్రయాణాన్ని ఆస్వాదించినట్లు కనిపిస్తారు.
"మనం ఆఫీసుకు చేరుకున్నా ఉత్సాహం, ఎనర్జీ అలాగే ఉంటుంది. మంచి ఆలోచనలు కూడా వస్తుంటాయి. మన రోజు కూడా చాలా బాగుంటుంది" అంటారు టామ్.

ఫొటో సోర్స్, FACEBOOK/TOM PRIDEAUX-BRUNE
ఎగిరే అనుభవం
టామ్ ప్రైడో-బ్రూన్ 'పైరాజెట్' ఇంటర్నేషనల్ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కంపెనీ ఈ పరికరాలనే తయారు చేసి అమ్ముతుంటుంది.
ఇంటి నుంచి ఆఫీసుకు గాల్లో వెళ్తున్న వ్యక్తి ఈయనొక్కరే కారు. టామ్ ఆఫీసులో పనిచేస్తున్న మరో 14 మంది పారామోటార్ ద్వారానే ఆఫీసుకు వస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది.
"మేం ఎగిరే అనుభవాన్ని షేర్ చేసుకుంటాం. ప్రజలను ప్రోత్సహించాలని అనుకుంటున్నాం. అప్పుడే వీలైనంత ఎక్కువమంది దీనిని ఉపయోగించడానికి ముందుకొస్తారు" అంటారు టామ్.
అధికారికంగా ఇది మూడు-నాలుగేళ్లు ముందే మొదలైంది. మొదట థ్రిల్ కోసం ఉపయోగించిన దీనిని తర్వాత ప్రజలకు ప్రయాణానికి సులభంగా ఉండేలా డిజైన్ చేశారు.
"ఇది అద్భుతంగా ఉంటుంది కాబట్టే మేం ఇందులో పనిచేస్తున్నాం. ఇందులో మనం అందరికంటే ముందుండాల్సిన అవసరం ఉంటుంది.

ఈ సాహసం ప్రమాదకరం
పారామోటరింగ్ సాహసంలో ప్రమాదాలు కూడా ఉన్నాయి.
"మేం చేసే దీనిలో ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అయితే దీన్ని చూసి అందరూ అనుకునేంత పెద్ద ముప్పేం ఉండదు. కానీ అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతాయి" అన్నారు ప్రైడో
గత ఏడాది ఆయన స్నేహితుడు వెళ్తున్న పారామోటార్ కరెంటు తీగలకు తగలడంతో అతడు ఎత్తు నుంచి నేలపై పడిపడి చనిపోయాడు.
"మేం తగిన శిక్షణ తీసుకోవడం వల్ల ప్రమాదాలు తగ్గించుకుంటాం. మంచి క్వాలిటీ మెషినరీ, సరైన పరిస్థితుల్లో ఎగిరే అనుభవం వల్ల ఎలాంటి ప్రమాదాలూ రావు"
ఎక్కువ ప్రమాదాలు ఎగిరేటప్పుడే జరుగుతున్నాయి. నీళ్ల పైనుంచి ఎగరవద్దని వీరు పారామోటర్ పైలెట్‌కు సూచిస్తున్నారు.
"పైలెట్లకు ఇందులో ఎదురయ్యే సమస్యలు తెలుసు. కానీ ఎగరాలనే థ్రిల్ కోసం వాళ్లు ఎలాంటి ప్రమాదాలకైనా ఎదురెళ్తున్నారు" అంటారు టామ్.

లండన్ ఉద్యోగులకు పనికిరాదు
కానీ, ఈ పారామోటరింగ్ లండన్‌లో ఉన్నవారికి ఉపయోగపడదు. ఇక్కడ ఉద్యోగాలు చేసేవారు ఆఫీసుకు వెళ్లడానికి పవర్ మోటార్ ఉపయోగించడం కుదరదు. ఎందుకంటే భారీ నిర్మాణాలు ఉండే ప్రాంతంలో ఇలాంటి వాటికి అనుమతి లేదు.
"నిజానికి దీనిని నగరాల్లో ఉపయోగించడం సాధ్యం కాదు. అక్కడ ఏవియేషన్ చట్టాలు ఇలాంటి పరికరాలతో ఎగరడంపై నిషేధం విధించాయి" అని టామ్ చెప్పారు.
కానీ గ్రామీణ ప్రాంతాల్లో దీనిపై ఎలాంటి నిషేధం లేదు. ప్రైడో-బ్రూన్ కంపెనీ నుంచి వీటిని కొనేవారు ఎక్కువగా ఇలాంటి ప్రాంతాల్లోనే ఉంటారు.
దీనిపై ప్రైడో "మనకు ఏవియేషన్ చట్టాలు కూడా బాగా తెలిసుండాలి. కానీ నాకు తెలిసి ఇంగ్లండ్‌లో 70 శాతం గగనతలంలో దీనిపై ఎలాంటి నిషేధం లేదు. అందుకే మాకు దీన్ని ఉపయోగించడానికి చాలా అవకాశాలు ఉంటాయి"
దీని కోసం సానుకూల వాతావరణం కూడా కావాలి. అందుకే పారామోటర్ గ్లైడింగ్ కోసం సిద్ధమయ్యేముందు వాతావరణ అంచనాలపై కూడా ఒక కన్నేసి ఉంచాల్సుంటుంది.
ఇవి కూడా చదవండి:
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- 'అమెజాన్ చాయిస్' లేబుల్ ఎలా ఇస్తారు?'
- జియో గిగా ఫైబర్: సూపర్ స్పీడ్ ఇంటర్నెట్.. టీవీ, ఫోన్ ఫ్రీ
- చైనా ఆట కట్టించాలంటే భారత్ ఏం చేయాలి
- కశ్మీరీ పండిట్లు: 'ఎన్నో మరణాలు, రక్తపాతాలు చూశాం. కానీ, ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు'
- ఆర్టికల్ 370 సవరణ: ‘కశ్మీర్లో అస్థిరత మరింత పెరిగే అవకాశం’
- కశ్మీర్ ప్రత్యేక హక్కును రద్దు చేయడం అక్రమం, రాజ్యాంగవిరుద్ధం: ఏజీ నూరాని
- 'ఆర్టికల్ 370 సవరణ': 'ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








