కశ్మీర్ ప్రత్యేక హక్కును రద్దు చేయడం అక్రమం, రాజ్యాంగవిరుద్ధం: ఏజీ నూరాని

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని తొలగించి, భారత పాలిత జమ్ము-కశ్మీర్ ప్రత్యేక హక్కులను రద్దు చేసింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధం, రాజ్యాంగవిరుద్ధం అంటున్నారు రాజ్యాంగ నిపుణులు ఏజీ నూరాని.
ఏజీ నూరానీతో బీబీసీ ప్రతినిధి ఇక్బాల్ అహ్మద్ సంభాషణ:
ప్రశ్న- మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయాలని నిర్ణయించింది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు?
సమాధానం- ఇది చట్టవిరుద్ధ నిర్ణయం. ఒక విధంగా ఇది మోసం. పాకిస్తాన్ వైపు నుంచి కశ్మీర్‌లో దాడులకు కుట్ర జరుగుతోందని, అందుకే భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని రెండు వారాల నుంచీ చెప్పడం మీరు విన్నారు. కానీ పాకిస్తాన్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉంటే, అమర్‌నాథ్ యాత్రికులను ఎందుకు వెనక్కి రమ్మన్నారో అర్థం కాలేదు. అంటే, మీరు పాక్ దాడులను అడ్డుకోలేనంత అసమర్థులా.
ఇది షేక్ అబ్దుల్లా( జమ్ము-కశ్మీర్ మొదటి ముఖ్యమంత్రి, అప్పట్లో ఆయన్ను ప్రధాన మంత్రిగా చెప్పేవారు)కు జరిగినట్లే ఉంది. ఆయన్ను 1953 ఆగస్టులో అరెస్ట్ చేశారు. అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఒక ఆర్మీ ఆపరేషన్‌తో ఆయన్ను తొలగించి, అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో బక్షీ గులామ్ మహమ్మద్‌ను రాష్ట్రానికి కొత్త ప్రధానమంత్రిగా చేశారు.
ఈసారీ కూడా అదే జరిగింది అందుకే కశ్మీర్‌లోని నేతలందరినీ అరెస్టు చేశారు. వేర్పాటువాదుల్లా వ్యతిరేకించకుండా, భారతదేశానికి పూర్తిగా సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశ్న- మోదీ ప్రభుత్వం నిర్ణయం తర్వాత ఆర్టికల్ 370 రద్దు అయినట్లే అనుకోవచ్చా?
సమాధానం - ఇది చట్టవిరుద్ధ, రాజ్యాంగ విరుద్ధ నిర్ణయం. ఆర్టికల్ 370 అంశం చాలా స్పష్టంగా ఉంది. దానిని ఎవరూ రద్దు చేయడం కుదరదు. అది రాజ్యాంగ సభ ద్వారా మాత్రమే సాధ్యం. కానీ రాజ్యాంగ సభను 1956లోనే రద్దు చేశారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం దానిని ముక్కలు చేసి అంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు చేస్తే, మీరు భారత్, కశ్మీర్ మధ్య లింకునే తెంపేస్తారు అని ఇద్దరు మాజీ మంత్రులు కూడా స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టు దీనిని చట్టవిరుద్ధం అనదని వారికి నమ్మకం ఉంది. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలీదు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ( జనసంఘ్ వ్యవస్థాపకుడు)కి ఎప్పుడూ ఎజెండాగా ఉన్న కశ్మీరును వీళ్లిప్పుడు ముక్కలు చేశారు.
ప్రశ్న- జమ్ము-కశ్మీర్ రాష్ట్రంలో రిజర్వేషన్ల గురించి తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి?
సమాధానం- కొంతమంది సానుభూతి పొందడం కోసం అలా చేశారు. నిజానికి దీని అవసరం వేరే ఉంది. జన్‌సంఘ్ ఏర్పడినప్పటి నుంచి ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయాలని అనుకుంటున్నారు.
ప్రశ్న - ఆర్టికల్ 35ఎ రద్దు చేయడంలో అర్థమేంటి?
సమాధానం - దీనికి అర్థం స్పష్టంగా తెలుస్తోంది. కశ్మీర్‌కు తనకంటూ ఉన్న ఒక ప్రత్యేక గుర్తింపు ఇప్పుడు పూర్తిగా అంతం అవుతుంది.

ఫొటో సోర్స్, Reuters
ప్రశ్న- ఆర్టికల్ 370లోని ఒక భాగం మిగిలి ఉంటుందని, మిగతా భాగాలు రద్దు అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. దీనికి అర్థం?
సమాధానం- అంటే, కశ్మీర్ యూనియన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఉంటుంది. కానీ మీరు ఏదైనా ఆర్టికల్‌లోని ఒక పార్ట్ తొలగించి, ఇంకోదాన్ని రద్దు చేస్తే అదెలా సాధ్యం.
ప్రశ్న- కశ్మీర్ గురించి ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానంపై, భారత ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏదైనా ప్రభావం ఉంటుందా?
సమాధానం- దీనివల్ల దానిపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఐక్యరాజ్యసమితి తీర్మానం అలాగే ఉంటుంది.
ప్రశ్న - జమ్ము-కశ్మీర్ అసెంబ్లీలో సర్వసమ్మతితో తీసుకున్న నిర్ణయం ప్రకారం పాక్ పాలిత కశ్మీర్‌ను భారత్‌లో ఒక భాగంగా భావిస్తారు. మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తర్వాత దానిపై ఏదైనా ప్రభావం ఉంటుందా?
సమాధానం- ఈ నిబంధన చట్టబద్ధమైనదే. కానీ దీనికి ఎలాంటి ఆధారం లేదు. "మీదగ్గర ఉన్నది మీరే ఉంచుకోండి. మా దగ్గర ఉన్నది మేమే ఉంచుకుంటాం" అని జవహర్ లాల్ నెహ్రూనే ఎప్పుడో చెప్పేశారు.

ఫొటో సోర్స్, EPA
ప్రశ్న - మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి రాజకీయ ప్రాధాన్యం ఉందా?
సమాధానం - దీనికి అర్థం స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ భారత్‌ను ఒక హిందూ దేశంగా మార్చాలనుకుంటోంది.
ప్రశ్న - ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తారా?
సమాధానం - తప్పకుండా సవాలు చేస్తారు. కానీ, సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తుందో దానికే తెలియాలి. కానీ ఇక తర్వాత దాడి అయోధ్యపై ఉంటుంది.
ప్రశ్న - ఈ మొత్తం అంశంపై మీ అభిప్రాయం ఏంటి?
సమాధానం - ఇదొక చట్టవిరుద్ధ చర్య. ఒకవిధంగా మోసం. కశ్మీర్ ప్రజలనే కాదు, ఇది మొత్తం భారత ప్రజల పట్ల జరిగిన మోసం. గత రెండు వారాలుగా వరుస అబద్ధాలు చెబుతూ వస్తున్నారు. దీని ప్రభావంతో ఈ ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోతుంది. ఇప్పుడు వారి మాటలు ఎవరూ నమ్మరు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్: శ్రీనగర్‌లో 144 సెక్షన్.. గృహ నిర్బంధంలో ప్రధాన నేతలు
- రబ్బర్ పరిశ్రమ... భయంకర రక్తచరిత్ర
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- దుబాయ్ యువరాణి.. భర్తను వదిలి లండన్ ఎందుకు పారిపోయారు?
- చైనా ముస్లింలు: పిల్లలను కుటుంబాలకు దూరం చేస్తున్నారు
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








