మీ కారు, టూ వీలర్ టైర్ల తయారీకి ముందు జరిగిన దారుణ రక్త చరిత్ర గురించి మీకు తెలుసా?

ఫొటో సోర్స్, ANTI-SLAVERY INTERNATIONAL
- రచయిత, టిమ్ హార్ఫోర్డ్
- హోదా, ప్రెజెంటర్ - 50 థింగ్స్ దట్ మేడ్ ది మాడ్రన్ ఎకానమీ
హెచ్చరిక: ఈ కథనంలో పాఠకులను ఆందోళనకు గురిచేయగల ఫొటో ఉంది.
ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఒక వ్యక్తి ఓ చెక్క బల్ల మీద కూర్చుని, రెండు వస్తువులను చూస్తూ ఉండటం కనిపిస్తుంది. అవేమిటనేది మొదట అర్థం కాదు. ఫొటోలో కొన్ని తాటిచెట్లు కనిపిస్తాయి. మరో ఇద్దరు వ్యక్తులు బాధగా చూస్తూ కనిపిస్తారు.
ఈ ఫొటోను 1904లో నాటి కాంగో ఫ్రీ స్టేట్ (నేటి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో) లోని బరింగా మిషనరీ క్షేత్రంలో తీశారు. (ఈ ప్రాంతాన్నే హార్ట్ ఆఫ్ డార్క్‌నెస్ అనే ప్రఖ్యాత నవలలో చిత్రీకరించారు.) ఆ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఎన్సాలా.
అలైస్ సీలీ హారిస్ ఆ ఫొటో తీయటానికి కొద్దిసేపటి ముందు....ఎన్సాలా భార్యా పిల్లలను చంపేశారు. అతడి అయిదేళ్ల కూతురు బోలీ చెయ్యి, పాదాలను నరికి అతడి ముందు పెట్టారు.
వాటిని అతడు నిర్వేదంగా చూస్తుండగా అలైస్ తీసిన ఈ ఫొటో యూరప్‌లో దుమారం రేపింది.

ఫొటో సోర్స్, ANTI-SLAVERY INTERNATIONAL
అలైస్ తీసిన ఇటువంటి భయానక ఫొటోలను కరపత్రాలలో ముద్రించి పంచారు. బహిరంగ సభల్లో ప్రదర్శించారు. ప్రపంచంలో తొలిసారి ఫొటోలతో మానవ హక్కుల ఉద్యమం సాగింది.
ఆ ఉద్యమంతో వచ్చిన ప్రజా ఒత్తిడి.. బెల్జియం పాలకుడు కింగ్ లియోపాల్డ్-2 - రాణి విక్టోరియా కజిన్ - కాంగో ఫ్రీ స్టేట్ వలస ప్రాంతం మీద తన పట్టు సడలించటానికి కారణమైంది.
అయితే, లియోపాల్డ్ పాలనలోని కాంగోలో అంతటి భయానక పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి?
ఈ ప్రశ్నకు సమాధానం కోసం రబ్బర్ చరిత్రను తెలుసుకోవాలి.
1904 కన్నా 70 ఏళ్ల ముందుకు.. 1834 నాటి న్యూయార్క్‌కు వెళదాం. ఒక నిరుపేద యువకుడు చార్లెస్ గుడ్‌ఇయర్. అనారోగ్యంతో ఉన్నా ఆశాభావంతో ఉన్నాడు. రాక్స్‌బరీ ఇండియా రబ్బర్ కంపెనీ తలుపు తట్టాడు.
అప్పటికి అతడి కుటుంబ వ్యాపారం దివాలా తీసింది. అప్పుల వలలో చిక్కుకున్నాడు. కానీ, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కటానికి ఓ కొత్త ఆవిష్కరణ మీద దృష్టి పెట్టాడు.

ఫొటో సోర్స్, Getty Images
అతడి తాజా ఆలోచన ఏమిటంటే... గాలితో నింపగలిగే రబ్బర్ లైఫ్ జాకెట్లకు మెరుగైన గాలి బిరడా. ఈ కొత్త వాల్వ్.. ఆ కంపెనీ మేనేజర్‌కు చాలా బాగా నచ్చింది. కానీ చార్లెస్ దురదృష్టం.. తమ కంపెనీ కూడా కుప్పకూలేపరిస్థితిలో ఉందని చెప్పాడా మేనేజర్.
అతడొక్కడే కాదు, అమెరికా అంతటా పెట్టుబడిదారులు ఈ అద్భుత కొత్త పదార్థంలో డబ్బులు గుమ్మరించారు. మెత్తగా, సాగుతూ, గాలి చొరబడని, నీటిలో తడవనివ్వని పదార్థమది. రబ్బర్. కానీ అంతలోనే అంతా తల్లకిందులైంది.
నిజానికి రబ్బర్ అప్పటికి కొత్తదేమీ కాదు. దక్షిణ అమెరికా వాసులకు అది చాలా కాలంగా తెలుసు. అక్కడి ఆదివాసీలు.. ఓ రకం చెట్ల బెరడుకు కోత పెడితే వచ్చే పాల నుంచి ఒక రకమైన లక్కను తయారు చేశారని 1490ల్లోనే యూరోపియన్లు తొలిసారిగా రాశారు. ఆ పాలే రబ్బరు పాలు.
ఆ కాలంలో ఆసక్తి కొద్దీ కొంత రబ్బరును 1700 దశాబ్దంలో ఒక ఫ్రాన్స్ యాత్రికుడు యూరప్‌కు తీసుకువచ్చారు. స్థానిక భాషలో దాని పేరు 'కోట్‌చౌక్'. దాని అర్థం 'విలపించే చెట్టు'. అయితే, ఈ పదార్థం పేపర్ మీద పెన్సిల్ రాతలను చెరిపేస్తుందని గుర్తించిన జోసెఫ్ ప్రెస్లీ అనే శాస్త్రవేత్త.. దానికి రబ్బర్ అని నామకరణం చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
1820ల నాటికి బ్రెజిల్ నుంచి ప్రపంచమంతా రబ్బర్ ఎగుమతులు పెరిగాయి. కోట్లు, టోపీలు, షూలతో పాటు.. లైఫ్ జాకెట్ల తయారీలో దానిని ఉపయోగించారు. అప్పుడు ఒక వేసవిలో ఎండలు తీవ్రమయ్యాయి. రబ్బర్‌తో చేసిన తమ ఉత్పత్తులు కరిగిపోతూ దుర్వాసనతో కూడిన జిగురుగా మారిపోతుండటం చూసి అందులో పెట్టుబడులు పెట్టిన వారు నిశ్చేష్టులయ్యారు.
ఇక్కడే తనకు మంచి అవకాశం ఉందని చార్లెస్ గుడ్‌ఇయర్ భావించాడు.
ఈ రబ్బర్ వేడికి కరిగిపోకుండా.. చలికి చిట్లిపోకుండా తట్టుకునే విధంగా మార్చగల మార్గాన్ని కనిపెట్టినవారికి అపార సంపద ఎదురుచూస్తోంది.
చార్లెస్‌కు రసాయనశాస్త్రం తెలియదు. అతడి దగ్గర డబ్బులు కూడా లేవు. అయినా అతడి ఆలోచనలు, ప్రయత్నాలు ఆగలేదు.
అతడు తన భార్యా పిల్లలతో ఊరూరూ తిరిగాడు. చాలీ చాలని ఇళ్లలో అద్దెకున్నాడు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వరుసగా తాకట్టుపెట్టాడు. అప్పుల చిట్టా పెంచుకుంటూ పోయాడు.
అతడి భార్య క్లారిసా పిల్లలకు వండి వడ్డించే సమయంలో మినహా వంట పాత్రల్లో రబ్బరు వేసి అందులో తనకు తోచిన పదార్థాలు కలుపుతూ ప్రయోగాలు చేసేవాడు. మాగ్నీసియం, లైమ్, కార్బన్ బ్లాక్ వంటి పదార్థాలన్నీ కలిపేవాడు.
చివరికి అతడికి పరిష్కారం దొరికింది. సల్ఫర్‌తో రబ్బర్‌ను వేడిచేయటం. ఈ ప్రక్రియనే ఇప్పుడు మనం వల్కనైజేషన్ (గంధకీకరణం) అంటున్నాం.

ఫొటో సోర్స్, Getty Images
విచారకరమైన విషయం ఏమిటంటే, తన పేటెంట్లను కాపాడుకోవటానికి చార్లెస్ కోర్టు కేసుల కోసం మరిన్ని అప్పులు చేశాడు. చివరికి చనిపోయాడు. అప్పుడతని భార్య క్లారిసాకు మిగిలింది రెండు లక్షల డాలర్ల అప్పులు.
కానీ, చార్లెస్ మొండి పట్టుదలతో.. రబ్బర్ దశ మారిపోయింది. పారిశ్రామిక ఆర్థికవ్యవస్థలో అది గుండెకాయగా మారింది. బెల్టులు, మూతలు, గ్యాస్కెట్లు అన్నిటిలోనూ సీల్ చేయటానికి, ఇన్సులేట్ చేయటానికి, షాక్‌లను తట్టుకోవటానికి దీనిని ఉపయోగించారు.
1880ల చివర్లో స్కాట్లండ్ పరిశోధకుడు జాన్ డన్‌లప్.. అప్పటికి కొన్ని దశాబ్దాల కిందటే రూపొందించినా అంతగా విజయవంతం కాని రబ్బరు టైరును సరికొత్తగా ఆవిష్కరించి గాలి టైరును తయారు చేశాడు.
డన్‌లప్ ఒక పశువైద్యుడు. తన కొడుకు ట్రైసికిల్ మీద ప్రయోగాలు చేశాడు. దానిని నడుపేటపుడు కాస్త మెత్తగా ఉండే మార్గం కనిపెట్టాలన్నది అతడి ప్రయత్నం. అలా రబ్బర్‌తో గాలి టైర్లను రూపొందించాడు.
బైక్ తయారీదారులు వెంటనే ఈ కొత్త రబ్బర్ టైర్ల ప్రయోజనాలను గుర్తించారు. అప్పుడు మొదలవుతున్న కార్ల పరిశ్రమ కూడా దీనిని అందిపుచ్చుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
రబ్బర్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. యూరప్ వలస సామ్రాజ్య శక్తులు.. ఆసియాలో విస్తారమైన అడవులను చదునుచేసి హెవియా బ్రాసిలీన్సిస్ చెట్లు - అంటే రబ్బరు చెట్ల తోటలు పెంచటం ప్రారంభించారు.
అయితే.. కొత్తగా వేసిన రబ్బరు తోటలు పెరగటానికి చాలా సమయం పడుతుంది. అదీగాక.. కొన్ని వందల రకాల ఇతర మొక్కల నుంచి కూడా వేర్వేరు మోతాదుల్లో రబ్బరు పాలు ఉత్పత్తి అవుతాయి - చివరికి గడ్డి చామంతి (డాండోలియన్) మొక్కల్లో కూడా.
కాంగోలోని వర్షపు అడవిలో ఒక రకం తీగ మొక్కల నుంచి కూడా రబ్బరు పాలు వస్తాయి. ఆ పాలను సేకరించటం ద్వారా రబ్బర్ డిమాండ్‌ను తక్షణం తీర్చవచ్చు.
కానీ, ఆ రబ్బరును అతి త్వరగా అత్యధిక మోతాదులో సేకరించటం ఎలా?
విలువలు, భయాలు లేనప్పుడు ఒక సులభమైన భయంకర సమాధానం. సాయుధ బలగాలను ఓ గ్రామానికి పంపించటం. అక్కడి మహిళలు, పిల్లలను అపహరించి బందీలుగా ఉంచుకోవటం. మగవాళ్లు తగినంత రబ్బరు తీసుకు రాలేకపోతే వారి భార్యలు, పిల్లల చేతులూ కాళ్లూ నరికివేయటం. లేదంటే ఒక కుటుంబాన్ని చంపేయటం.

ఫొటో సోర్స్, ANTI-SLAVERY INTERNATIONAL
అలైస్ తీసిన ఎన్సాలా ఫొటో ఆ భీతావహ చరిత్రకు సాక్ష్యం. ఆ ఫొటో వెలుగుచూసినప్పటి నుంచి నేటికి చాలా పరిస్థితులు మారిపోయాయి.
ఇప్పుడు ప్రపంచంలో ఉపయోగిస్తున్న రబ్బరులో సగానికన్నా ఎక్కువ వీపింగ్ వుడ్ నుంచి కాకుండా.. చమురు నుంచి వస్తోంది.
సహజమైన రబ్బరుకు ప్రజాదరణ పెరిగి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఉధృతమవటంతో.. సింథటిక్ రబ్బర్ తయారీ ముమ్మరమైంది. ఆసియా నుంచి సరఫరా దారులు దెబ్బతినటంతో ప్రత్యామ్నాయాలు రూపొందించేలా ఈ పరిశ్రమను అమెరికా ప్రభుత్వం ప్రోత్సహించింది.
కానీ, కొన్ని ఉపయోగాలకు రబ్బరు చెట్ల నుంచి వచ్చే రబ్బరుకు దీటైనది లేదు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే రబ్బరు పంటలో మూడొంతులు.. భారీ వాహనాల టైర్లలోకే వెళుతోంది.
కార్లు, ట్రక్కులు, విమానాల తయారీ పెరిగేకొద్దీ.. వాటి చక్రాల కోసం మరింత ఎక్కువగా రబ్బరు అవసరం. అంత రబ్బరును ఉత్పత్తి చేయటం కష్టం.
పైగా రబ్బరు చెట్టుకు దాహమెక్కువ. దీంతో.. ఆగ్నేయాసియా ఉష్ణమండల వర్ష అడవులను చదును చేసి భారీ రబ్బరు తోటలు వేస్తుండటంతో.. వాటివల్ల నీటి కొరత, జీవ వైవిధ్య సమస్యల విషయంలో పర్యావరణవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆఫ్రికాలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్సాలాను అలైస్ కలిసిన బారింగాలోని వర్ష అడవి గుండా 1,000 కిలోమీటర్లు పశ్చిమోత్తర దిశగా పయనిస్తే.. కామెరూన్‌లోని మేయోమెసాలా వస్తుంది. అది.. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద ప్రాంతమైన జా పానాల్ రిజర్వు అడవిలో భాగం.
ఆ సమీపంలోనే ప్రపంచంలో అతిపెద్ద రబ్బరు శుద్ధి సంస్థ హాల్సియాన్ అగ్రి.. తన సుడ్కామ్ రబ్బరు తోట కోసం వేలాది హెక్టార్లను చదును చేస్తోంది.
ఈ ప్రాంతంలో అడవిని చదును చేయటం వల్ల సంభవించే దుష్పరిణామాల పట్ల గ్రీన్‌పీస్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్రీ రీసెర్చ్ వంటి పర్యావరణ బృందాలు ఆందోళనలు లేవనెత్తాయి. కొందరు గ్రామస్తులు తాము కోల్పోయిన భూములకు సరైన పరిహారాలు కూడా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.
దీనికి జవాబుగా హాల్సియాన్ అగ్రి 2018లో కొత్త సుస్థిర సరఫరా విధానాన్ని ప్రకటించింది. కామెరూన్‌లో తను చేస్తున్న పనిని కలుపుతూ సుస్థిరత కమిషన్ ఒక దానిని ప్రారంభించింది.
కార్మికుల పని పరిస్థితులను పరిష్కరిస్తామని.. బాధ్యతాయుత భూసేకరణ, వినియోగం, పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ, నైతిక విధానాలను పాటిస్తామని హామీ ఇచ్చింది.
ఆధునిక జీవనానికి కీలకమైన ముడి పదార్ధానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చటం కొనసాగిస్తూనే.. పర్యావరణం మీద ప్రభావాన్ని కనీస స్థాయికి తగ్గించటంలో తన పాత్ర, బాధ్యతను అర్థంచేసుకున్నామని పేర్కొంది.
హాల్సియాన్ అగ్రి అనేది.. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సీనోకెమ్ అనే సంస్థకు అనుబంధ సంస్థ. కాబట్టి.. బలమైన విదేశీ శక్తి నుంచి రబ్బర్ కోసం వస్తున్న డిమాండ్ ఇప్పుడు కూడా ఆఫ్రికాలో వివాదానికి కారణమవుతోంది. కాకపోతే ఇప్పుడు ఆ వివాదం.. స్త్రీలు, పిల్లల చేతులు నరకటం మీద కాదు.. చెట్లను నరకటం మీద.
ఇది ఒక రకంగా పురోగతే.
ఈ వ్యాస రచయిత ఫైనాన్షియల్ టైమ్స్‌లో అండర్‌కవర్ ఎకానమిస్ట్ కాలమ్ రాస్తున్నారు.50 థింగ్స్ దట్ మేడ్ ద మోడర్న్ ఎకానమీ కార్యక్రమం బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో ప్రసారమవుతోంది.
ఇవి కూడా చదవండి:
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- చరిత్ర: "నన్ను మీరు మభ్య పెట్టలేరు, నేను ఆయన శరీరంలో 34 బుల్లెట్లు దించాను"
- అమెరికాకు ఆ పేరు పెట్టిన మధ్యయుగాల నాటి మ్యాప్ ఇదే
- సంక్రాంతి ముగ్గుల చరిత్ర: మొదటి ముగ్గు ఎవరు వేశారు? రంగవల్లి ఎలా పుట్టింది?
- చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు. ఆ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలు తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








