కశ్మీరీ యువతి డైరీలో ఆ అయిదు రోజులు

డైరీలో ఐదు రోజులు

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, మిస్బా రేషీ
    • హోదా, దిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని

ఘర్షణలు జరుగుతున్న ప్రాంతంలో మనం ఉన్నప్పుడు మనకు ఫేక్ న్యూస్ బలం ఏమిటో, అది ఎంత వేగంగా వ్యాపిస్తుందో తెలిసొస్తుంది.

హింస, నమ్మకద్రోహం లాంటివి రెండూ ఉన్న చోట మనకు ఏదైనా సమాచారం తెలిసినా, అది నిజమని నమ్మలేం.

కశ్మీర్లో అదనపు బలగాలు మోహరించారని, యాత్రికులు, కశ్మీరేతరులు కశ్మీర్ వదిలి వెళ్లిపోవాలని చెబుతున్నారని శుక్రవారం నుంచి సోమవారం సాయంత్రం వరకూ మేం చాలామంది నుంచి రకరకాల వార్తలు వింటూ వచ్చాం. కానీ, మాకు దాని గురించి ఎలాంటి సమాచారం లేదు.

కొంతమంది రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజిస్తున్నారని అంటే, ఇంకొందరు కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చవచ్చని, జమ్మూకు రాష్ట్ర హోదా ఇవ్వొచ్చని, ఆర్టికల్ 370, 35-ఎ తొలగించొచ్చని చెప్పారు. యాసిన్ మాలిక్ చనిపోయాడనే పుకార్లు కూడా వచ్చాయి. ప్రతి ఒక్కరూ తాము చెబుతున్న వాటిపై పందాలు కూడా కడుతున్నారు.

సోమవారం కర్ఫ్యూ విధించారనే వదంతులు వచ్చాయి. ఈసారీ కర్ఫ్యూ కఠినంగా, ఎక్కువ రోజులు ఉంటుందని భయపడ్డారు. నేను లాల్ బజార్ నుంచి నాడ్ కడాల్‌లో ఉన్న మా ఇంటికి బయల్దేరాను. దారిలో చాలామంది హడావుడిగా పరుగులు తీస్తూ కనిపించారు. ఏటీఎం ముందు పొడవాటి క్యూలు ఉన్నాయి. సరుకుల దుకాణాల ముందు పదుల సంఖ్యలో కార్లున్నాయి. పెట్రోల్ పంపులు నిండుకున్నాయి. శుక్రవారం రాత్రే భారీగా వచ్చిన జనాలు వాటిని ఖాళీ చేశారు.

"పెట్రోల్ ఉంది. కానీ సామాన్య ప్రజలెవరికీ ఇవ్వకుండా దానిని సీఆర్పీఎఫ్, పోలీసులకు రిజర్వ్ చేసి ఉంచామని" ఒక పెట్రోల్ పంపు వాళ్లు చెప్పినట్లు మా కజిన్‌ నాతో అన్నాడు.

నా కజిన్‌కు ఆగస్టులో పరీక్షలున్నాయి. తను చదువుకుంటున్నాడు. అదే రోజు సాయంత్రం కశ్మీర్ యూనివర్సిటీ పరీక్షలను రద్దు చేసిందనే సమాచారం వచ్చింది. నేను నా ఫ్రెండుకు రాత్రి పదిన్నరకు ఎస్ఎంఎస్ కూడా పంపించాను. కానీ అది డెలివర్ కాలేదు.

నా ఇంటర్నెట్ ఆ టైంలో కూడా పనిచేస్తోంది. అందుకే నేను కంప్లీట్ షట్‌డౌన్ అయ్యుంటుందని అనుకోలేదు. మా అమ్మనాన్నలు దిల్లీలో ఉండడంతో మా అమ్మకు టెక్ట్స్ మెసేజ్ పంపించి, నిద్రపోయాను.

డైరీలో ఐదు రోజులు

సోమవారం

సోమవారం ఉదయం నేను లేవగానే కిచెన్‌లో నిశ్శబ్దంగా ఉంది. మామూలుగా ఉదయాన్నే గులిస్తా చానల్లో వచ్చే ఉదయం కార్యక్రమాలతో నా రోజు ప్రారంభం అవుతుంది.

కానీ సోమవారం అందరూ నిశ్శబ్దంగా టిఫిన్ చేస్తున్నారు.

మా ఇంటి బయట ఉదయం నాలుగు గంటల నుంచీ ఆర్మీ జవాన్లు ఉన్నారని ఎవరో చెప్పారు. టీవీ, ల్యాండ్‌ లైన్, మొబైల్ ఫోన్ ఏదీ పనిచేయడం లేదు.

కర్ఫ్యూ ఉన్నప్పుడు ఒక్కోసారి బీఎస్ఎన్ఎల్ ఫోన్లు పనిచేసేవి. కానీ ఈసారీ అవి కూడా మూగబోయాయి.

మేం భోజనం ఎలాగా, అని కంగారు పడ్డాం. షాపులు మూసేసున్నాయి. షాపుల వాళ్లెవరూ కనిపించడం లేదు. మా అంకుల్ కూరగాయలు తేవడానికి బయటికెళ్లారు. కానీ ఆయన్ను జవాన్లు అడ్డుకున్నారు. మీ అంతట మీరు బయటికొచ్చి రిస్క్‌లో పడుతున్నారని చెప్పారు. దాంతో, ఆయన వట్టి చేతులతో ఇంటికొచ్చారు.

కానీ ఆంటీ అప్పటికే వేరే ఏర్పాట్లు చేసుంచారు. ఇదే ఏడాది ఫిబ్రవరిలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు, ఏం చేశారో మా ఆంటీ నాకు గర్వంగా చెబుతున్నారు.

ఆమె "నేను అప్పుడు రెండు నెలల సరుకులు, మిగతా వస్తువులు నిల్వ చేసుంచాను" అన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఆమె వారాంతంలో వాటిని కొనేసి ఉంచారు.

వీడియో క్యాప్షన్, శ్రీనగర్‌లో కర్ఫ్యూపై ప్రభుత్వం మాటేంటి? పోలీసులు ఏం చెప్పారు?

కశ్మీర్‌కు ఏం జరుగుతోందో ఏం తెలీడం లేదు. ఇంట్లోని పురుషులందరూ మసీదుకు వెళ్లి వచ్చాక ఏం జరగచ్చో తెలిసింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తారనే విషయం మధ్యాహ్నం ఇంట్లో అందరికీ చేరింది.

మేమంతా అది మరో వదంతి కావచ్చని కొట్టిపారేశాం. నేను నా కజిన్‌తో "రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, అది కూడా కేసు కోర్టులో ఉన్నప్పుడు వాళ్లు దాన్ని ఎందుకు రద్దు చేస్తారు" అని వాదించాను.

ఆ విషయం నుంచి మనసు మళ్లించడానికి అందరం ల్యాప్‌టాప్‌లో సినిమా చూశాం. సాయంత్రం మాకు కొన్ని చానళ్ల ప్రసారానికి అనుమతించినట్లు తెలిసింది.

చూస్తే, దూరదర్శన్ చానళ్లలో మాత్రం ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. మిగతా చానళ్లేవీ రావడం లేదు.

రాజ్యసభలో జమ్ముకశ్మీర్ పునర్వవస్థీకరణ బిల్లు పాస్ అయినట్లు డీడీ వార్తల ద్వారా తెలిసింది. కశ్మీర్, జమ్ము ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాలయ్యాయి. లద్దాక్ మరో కేంద్ర పాలిత ప్రాంతం అయ్యింది. ఆర్టికల్ 370, 35-ఎ తొలగించారు.

ముందు ముందు ఇక్కడ ఏమేం జరగచ్చు అనేది తలుచుకుని ఒంట్లో సన్నటి వణుకొచ్చింది. తర్వాత 15 నిమిషాలపాటు మేం మాట్లాడకుండా అలా కూర్చుండిపోయాం.

ఆరు, తొమ్మిదేళ్ల వయసులో ఉన్న నా కజిన్స్ బోరు కొడుతోందని చెప్పడంతో వాళ్లను తీసుకుని ఇంట్లోనే ఉన్న తోటలోకి వెళ్లాం. మేం 'ఐస్ వాటర్' ఆట ఆడుతుండగా మా తోటలో టియర్ గ్యాస్ షెల్ వచ్చి పడింది. పిల్లల్లో ఒకరికి దగ్గొచ్చింది. దాంతో, నేను వాళ్లను బలవంతంగా లోపలికి తీసుకెళ్లిపోయాను. గ్యాస్ పొగ ఇంట్లోకి రాకుండా తలుపులు మూసేశాను.

డైరీలో ఐదు రోజులు

ఫొటో సోర్స్, Getty Images

మంగళవారం

నా దగ్గర దిల్లీ తిరిగెళ్లడానికి గురువారం టికెట్ ఉంది. ఎయిర్ పోర్టు వరకూ సురక్షితంగా వెళ్లడం సాధ్యమేనా అని కంగారుగా ఉంది. బుధవారం ఉదయం అంకుల్ ఇంటి నుంచి బయల్దేరి ఎయిర్ పోర్ట్‌కు దగ్గరగా చేరుకోవాలని ప్లాన్ వేశాం.

మంగళవారం మధ్యాహ్నానికి అన్ని టీవీ చానళ్ల ప్రసారాలూ మొదలయ్యాయి. కానీ టీవీ చానళ్లలో వస్తున్న వార్తలు చూసి మేం తట్టుకోలేకపోయాం. ఎందుకంటే వాటిలో సంబరాలు చేసుకున్నట్లు చూపిస్తున్నారు. మేం ఇక్కడ మా ఇళ్లలో బంధీగా ఉన్నాం, ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాం. మా భవిష్యత్తుపై ప్రభావం పడేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసమ్మతి, కోపం చూపించే అవకాశం కూడా లేదు.

మంగళవారం సాయంత్రం మా ఇల్లు మరోసారి టియర్ గ్యాస్‌తో నిండిపోయింది. మా బంధువు ఒకరు శ్రీనగర్‌లో ఉంటారు. ఆయన ఇంటి దగ్గర కూడా రాళ్లు రువ్వినవారిపై జవాన్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పిల్లలు భయపడిపోయారు. దాంతో ఆయన ఆ ఇల్లు వదిలి వేరే ఇంటికి వెళ్లిపోవాలనుకున్నారు.

మా ఇంటి పైన హెలికాప్టర్లు తిరిగే శబ్దాలు వస్తున్నాయి. పైన వాటి శబ్దం, కింద టియర్ గ్యాస్ ప్రయోగం చూస్తుంటే, మాకు ఏదో యుద్ధ పరిస్థితుల్లో ఉన్నామా అనిపిస్తోంది. కొంతమంది యువకులు చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని చెబుతున్నారు. కానీ ఏదీ కన్ఫర్మ్ కావడం లేదు.

మంగళవారం రాత్రి నా కజిన్ కటారాలోన్ తన యూనివర్సీటీ నుంచి తిరిగొచ్చాడు. వాళ్ల కాలేజీలో కశ్మీరీలందరినీ క్యాంపస్ వదిలి వెళ్లిపోవాలన్నారని చెప్పాడు. యూనివర్సిటీ క్యాంపస్‌లో, బయట నీ భద్రతకు మేం గ్యారంటీ ఇవ్వలేమని వాళ్లు అన్నట్లు తను నాతో అన్నాడు.

నా కజిన్ వాళ్ల ఇంటికి చేరుకోడానికి 24 గంటలు పట్టింది. ఇంటికి చేరే లోపు చాలా మంది పోలీసులు, జవాన్ల సాయం కోరాల్సి వచ్చింది. సొంత ఇంటికి చేరుకోడానికి అనుమతి అడగాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి మేమందరం ఇది ఎప్పుడు ముగుస్తుందా అని ఆలోచిస్తూ ఉండిపోయాం.

డైరీలో ఐదు రోజులు

ఫొటో సోర్స్, Getty Images

బుధవారం

ఉదయం ఐదు గంటలకే లేచాను. ఎయిర్ పోర్ట్ దగ్గరున్న పీర్ బాగ్ బయల్దేరాను. మా ఆంటీకి కన్నీళ్లతో గుడ్‌బై చెప్పాను, ఆమె నాతో దుబాయిలో ఉంటున్న తన కొడుకుతో ఒకసారి మాట్లాడమని చెప్పారు. ఆదివారం రాత్రి అతడితో మాట్లాడలేకపోయానని బాధ పడ్డారు. "బిడ్డతో మళ్లీ ఎప్పుడు మాట్లాడతానో, ఏమో" అన్నారు. ఆమె కొడుకు వరకూ ఆ సందేశం చేర్చే ఏకైక మార్గం నేనే.

బయట రోడ్లపై బ్యారికేడ్లు, ముళ్ల కంచెలు ఉన్నాయి. మేం కారు వెళ్లే ఒక మార్గాన్ని వెతికాం. ఉదయం కావడంతో మమ్మల్ని ఎవరూ ఆపలేదు. పీర్ బాగ్ చేరగానే అక్కడ కూడా మాకు చాలా బ్యారికేడ్లు కనిపించాయి. చిన్న గల్లీల్లో వెళ్లడాన్ని కూడా నిషేధించారు. దాంతో తిరిగి వచ్చేశాం.

బాగా పొద్దుపోయాక మా ఆంటీ వచ్చారు. టియర్ గ్యాస్ పొగ వల్ల తన కజిన్ పిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చిందని, కారులో పెట్రోల్ లేక, వేరే రవాణా వ్యవస్థలు కూడా లేకపోవడంతో మందులు కూడా తీసుకురాలేకపోయానని చెప్పారు.

డైరీలో ఐదు రోజులు

ఫొటో సోర్స్, Getty Images

గురువారం

దిల్లీకి వెళ్లడం చాలా కష్టంగా అనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా మా అమ్మనాన్నలతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. వాళ్లు చాలా కంగారు పడుతుంటారని నాకు తెలుసు. కానీ కశ్మీర్లో ఉన్న నా కుటుంబానికి ఎలా గుడ్‌బై చెప్పాలో నాకు తెలీడం లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్లను అలా వదిలేసి నేను సాధారణ జీవితం వైపు ఎలా రాగలను అనిపించింది.

కానీ నేను ఒక బాధ్యతతో అక్కడి నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నాను. "కశ్మీర్‌లో మీ అమ్మనాన్నలను కలిసి వచ్చాను, వాళ్లు సురక్షితంగా ఉన్నారు" అని నా కజిన్స్ అందరికీ చెప్పాలనుకున్నాను.

"అక్కడ మీ ఇంట్లో కొన్ని నెలలకు సరిపడా నిత్యావసరాలు, సరుకులు ఉన్నాయి" అనే విషయాన్ని కూడా నేను వాళ్లకు చెప్పాను. ఎంత నిరాశలో, నిస్సహాయ స్థితిలో ఈద్ చేసుకున్నామో, ఆ భావన మా జీవితాలపై ఎంత సుదీర్ఘ ప్రభావం చూపబోతోందో.. దాని గురించి కూడా నేను వాళ్లతో మాట్లాడాను.

(మిస్బా ఢిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫీ గ్రాడ్యుయేషన్ చేశారు. క్యాంపస్ లా సెంటర్లో లా చదువుతున్నారు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)