కశ్మీర్: "ఆర్టికల్ 370 రద్దుతో మా అస్తిత్వాన్ని లాగేసుకున్నారు" - కశ్మీరీ యువకుడి ఆగ్రహం

ఫొటో సోర్స్, Abid Bhat
కశ్మీర్‌లో సమాచార వ్యవస్థల నిలిపివేత, ఇతర భద్రతా చర్యలు ముందెన్నడూ లేనంత తీవ్రస్థాయిలో ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌కు దాదాపు 70 ఏళ్లుగా ఉన్న స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం ఈ నెల 5న తొలగించింది. బీబీసీ ప్రతినిధి గీతా పాండే ఈ ప్రాంతంలో రెండు రోజులపాటు పర్యటించి అందిస్తున్న కథనం ఇది.
తమకు భారత్ నమ్మకద్రోహం చేసిందనే భావన కశ్మీర్‌లో ఉంది. ఇది కొత్త ఘర్షణకు దారితీసే ముప్పుంది.
శ్రీనగర్ నడిబొడ్డున ఉండే ఖాన్యర్, భారత్ వ్యతిరేక ప్రదర్శనలకు పెట్టింది పేరు. రోజుకు దాదాపు 24 గంటలూ ఉండే కర్ఫ్యూ లాంటి పరిస్థితుల్లో, ఇక్కడికి చేరుకోవడానికి మేం ఆరు బారికేడ్లు దాటాల్సి వచ్చింది.
మరో బారికేడ్ రాగా, ఫొటోలు తీసేందుకు కారులోంచి దిగాం. తమ పరిస్థితిని చెప్పుకొనేందుకు కొందరు దగ్గర్లోని చిన్నదారిలోంచి మా వద్దకు వచ్చారు. పరిస్థితి సైనిక ముట్టడిలా ఉందని ఇక్కడ చాలా మంది భావిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత హింసాత్మకంగా, నేరపూరితంగా ఉందని మా దగ్గరకు వచ్చిన బృందంలో అధిక వయస్కుడైన ఒక వ్యక్తి ఆరోపించారు.

ఫొటో సోర్స్, Abid Bhat
పారామిలటరీ పోలీసులు మమ్మల్ని హడావుడిగా అక్కణ్నుంచి పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మాతో మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఏదో చెప్పేందుకు ప్రయత్నించారు. "మీరు మమ్మల్ని రాత్రింబవళ్లు నిర్బంధంలో ఉంచుతున్నారు" అంటూ ఆ వ్యక్తి భద్రతా దళాలకు వేలు చూపిస్తూ కోపంగా అరిచారు.
ఒక పారామిలటరీ పోలీసు స్పందిస్తూ- ఇక్కడ కర్ప్యూ ఉందని, మీరు లోపలకు వెళ్లాలని ఆ బృందానికి చెప్పారు. నిరసన తెలుపుతున్న ఆ పెద్దాయన అక్కణ్నుంచి కదల్లేదు. పోలీసుపై మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.
అప్పుడు అక్కణ్నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది నన్ను ఆదేశించారు. నేను అక్కణ్నుంచి కదిలేలోపే, తప్పటడుగులు వేసే వయసులో ఉన్న తన కొడుకును ఎత్తుకొని ఒక యువకుడు నా వద్దకు వచ్చారు. "భారత్‌పై పోరాటానికి తుపాకీ పట్టేందుకు వీడు సిద్ధంగా ఉన్నాడు" అని తన కొడుకును చూపిస్తూ ఆయన అన్నారు.
"వీడు నా ఒక్కగానొక్క కొడుకు. ఇప్పుడు చాలా చిన్నవాడు. కానీ భవిష్యత్తులో తుపాకీ పట్టేలా వీడిని నేను తయారుచేస్తా" అని ఆ యువకుడు చెప్పారు. ఇదంతా మాకు దగ్గర్లో నిలబడిన పోలీసులకు వినిపిస్తుందని తెలిసినా కూడా అనేశారు. అప్పుడు ఆయన అంత కోపంగా ఉన్నారు.
కశ్మీర్ లోయలో మెజారిటీ ప్రజలు ముస్లింలే. ఇక భద్రతా దళాల భయం నీడన బతకాలని తాము అనుకోవడం లేదని కశ్మీర్ లోయ వ్యాప్తంగా నాతో మాట్లాడిన మగవారు చెప్పారు.

ఫొటో సోర్స్, Abid Bhat
కశ్మీర్ లోయలో 30 ఏళ్లుగా ఇన్‌సర్జెన్సీ కొనసాగుతోంది.
ఎక్కడో దిల్లీ కేంద్రంగా పనిచేసే భారత ప్రభుత్వం ఇచ్చిన 'నిరంకుశ ఉత్తర్వే' వేర్పాటువాదానికి ఎన్నడూ మద్దతివ్వని వారినీ నిస్సహాయ స్థితిలోకి నెట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ ఉత్తర్వుతో కశ్మీర్‌కు, భారత్‌కు తీవ్ర పరిణామాలు తప్పవని వారు చెబుతున్నారు.
నేను లోయలో ఎక్కడికి వెళ్లినా, స్థానికుల్లో భయం, ఆందోళనలతో కూడిన కోపం, కేంద్ర ప్రభుత్వ చర్యను ప్రతిఘటించాలనే గట్టి పట్టుదల కనిపించాయి.
జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో దుకాణాలు, పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు అన్నీ మూసి ఉన్నాయి. నగరంలోని రోడ్లపై ప్రజా రవాణా లేదు.
తుపాకులు ధరించి వేల మంది భద్రతా బలగాలు నిర్మానుష్యమైన వీధుల్లో గస్తీ కాస్తున్నారు. వీధుల్లో రేజర్ వైర్‌తో బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానికులు ఇళ్లలోనే ఉంటున్నారు.
దాదాపు వారం రోజులుగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నిర్బంధంలో ఉన్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న మరో మాజీ ముఖ్యమంత్రి గృహ నిర్బంధంలో ఉన్నారు.
వందల సంఖ్యలో నిరసనకారులు, వ్యాపారవేత్తలు, ప్రొఫెసర్లను భద్రతా దళాలు నిర్బంధంలోకి తీసుకొని, తాత్కాలిక జైళ్లలో ఉంచాయి.
"కశ్మీర్ ఇప్పుడో జైలులా అనిపిస్తోంది, ఒక ఓపెన్ ఎయిర్ జైలులా" అని రిజ్వాన్ మాలిక్ అనే కశ్మీరీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Abid Bhat
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే భారత రాజ్యాంగ అధికరణ 370 సవరణ, జమ్మూకశ్మీర్ విభజన, ఇతర చర్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 5న పార్లమెంటులో ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడ్డాక 48 గంటల్లో రిజ్వాన్ దిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకున్నారు.
జమ్మూకశ్మీర్‌లో సమాచార వ్యవస్థలను ప్రభుత్వం నిలిపివేయడానికి కొన్ని గంటల ముందు ఈ నెల నాలుగో తేదీ రాత్రి తన తల్లిదండ్రులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
ఆ తర్వాత తన స్నేహితులతోగాని, బంధువులతోగాని తాను మాట్లాడలేకపోవడంతో, దిల్లీ నుంచి శ్రీనగర్ తిరిగి వచ్చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఎవ్వరితోనూ సమాచారం పంచుకొనే వీల్లేని పరిస్థితి జీవితంలో తమకు తొలిసారి ఎదురైందని రిజ్వాన్ శ్రీనగర్‌లో తమ తల్లిదండ్రుల నివాసంలో నాతో చెప్పారు.
జమ్మూకశ్మీర్ ప్రజలను సంప్రదించకుండానే ప్రత్యేక ప్రతిపత్తిని భారత్ రద్దుచేసిందని రిజ్వాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
వేర్పాటువాదాన్ని రిజ్వాన్ విశ్వసించరు. ఆయన ఎన్నడూ బయటకు వెళ్లి నిరసనల్లో పాల్గొని సైనికులపై రాళ్లు రువ్వలేదు.
రిజ్వాన్ వయసు పాతికేళ్లు. కెరీర్, భవిష్యత్తు గురించి ఎన్నో ఆకాంక్షలున్న యువకుడు. దిల్లీలో, అకౌంటెంట్‌గా స్థిరపడేందుకు అవసరమైన చదువు చదువుతున్నారు.
'ఇండియా' అనే భావనను తాను చాలా కాలంగా నమ్ముతున్నానని, ఇండియా ఆర్థిక విజయ గాథ దీనికి ఓ కారణమని ఆయన చెప్పారు.
"భారత్ ప్రజాస్వామ్య దేశమని మేం నమ్మాలని భారత్ అనుకొంటే, అది భారత్ అవివేకమే అవుతుంది. భారత్‌తో కశ్మీర్‌కు చాలా కాలంగా అసౌకర్యమైన బంధమే ఉంది. ప్రత్యేక ప్రతిపత్తి ఈ బంధాన్ని కలిపి ఉంచింది. ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం ద్వారా మా అస్తిత్వాన్ని లాగేసుకున్నారు. ఇది ఒక్క కశ్మీరీకి కూడా ఆమోదయోగ్యం కాదు" అని రిజ్వాన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
భద్రతా బలగాల మోహరింపును ఉపసంహరించాక, నిరసనకారులు వీధుల్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క కశ్మీరీ వాళ్లతో కలుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
"ప్రతి కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు వేర్పాటువాదులకు మద్దతిస్తే, మరొకరు భారత్‌కు మద్దతిస్తారని ఇక్కడ చెబుతారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ ఇద్దరినీ కలిపింది" అని రిజ్వాన్ వ్యాఖ్యానించారు.
ఆయన సోదరి రుష్కర్ రషీద్ కశ్మీర్ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ చదువుతున్నారు.
"పార్లమెంటులో హోం మంత్రి అమిత్ షా ప్రసంగం టీవీలో వింటున్నప్పుడు నా చేతులు వణకసాగాయి. నా పక్కనే కూర్చున్న మా అమ్మ ఏడ్చేసింది. ఇంతకంటే చావు మేలని చెప్పింది" అని 20 ఏళ్ల రుష్కర్ తెలిపారు.
భయాందోళనలతో నిద్రలో పదేపదే మెలకువ వస్తోందని ఆమె చెప్పారు. శ్రీనగర్‌లోనే బట్మాలూ ప్రాంతంలో ఉండే తమ అవ్వా-తాతా కశ్మీర్ అఫ్గానిస్తాన్‌గా మారిపోయిందని చెబుతున్నారని తెలిపారు.
అదనపు భద్రతా బలగాల మోహరింపు, అమర్‌నాథ్ యాత్ర ఆకస్మిక రద్దు, శ్రీనగర్ దాల్ సరస్సు వెంబడి ఉండే హోటళ్ల మూసివేత, జమ్మూకశ్మీర్ నుంచి వెళ్లిపోవాలని పర్యాటకులను ఆదేశించడం లాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టడంతో, ఏదో కీలక పరిణామం ఉండొచ్చని కశ్మీర్‌లోని అందరూ అనుకున్నారు.
భారత ప్రభుత్వం ఏకపక్షంగా రాజ్యాంగంలోని అధికరణ 370 సవరణ లాంటి భారీ చర్యను చేపడుతుందని నేను మాట్లాడిన స్థానికుల్లో ఎవరూ ఊహించలేదు. నేను పదుల సంఖ్యలో కశ్మీరీలతో మాట్లాడాను.

ఫొటో సోర్స్, Abid Bhat
సమాచార వ్యవస్థలను స్తంభింపజేయడంతో విశ్వసనీయమైన సమాచారం వ్యాప్తి కావడం చాలా కష్టం. ఏం జరుగుతోందనే సమాచారం ఒకరి నుంచి ఒకరికి మాటల రూపంలో చేరుతోంది.
శ్రీనగర్, ఇతర ప్రాంతాల్లో భద్రతా బలగాలపై నిరసనకారులు రాళ్లు రువ్వారనే సమాచారం రోజూ వస్తోంది.
భద్రతా బలగాలు వెంటపడటంతో నదిలో దూకిన ఒక నిరసనకారుడు ముగినిపోయాడనే సమాచారం వచ్చింది. పలువురికి గాయపడ్డారని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే సమాచారమూ ఉంది.
భారత ప్రభుత్వం మాత్రం కశ్మీర్‌లో అంతా బాగుందని చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది.
మిలిటన్సీ కేంద్ర స్థానంగా భారత మీడియా పిలిచే షోపియాన్ పట్టణంలోని ఓ వీధిలో ఈ నెల 7న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కొందరితో కలిసి భోజనం చేస్తున్నట్లు టీవీ చానళ్లు చూపించాయి.
కశ్మీర్ విషయంలో ప్రభుత్వ చర్యలకు కశ్మీర్‌లోనే అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో సైతం ప్రజామద్దతు ఉందని, శాంతి నెలకొందని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం ఇది.

ఫొటో సోర్స్, DD
కశ్మీరీలూ మాత్రం ఈ చర్యను ఒక స్టంట్‌గా కొట్టిపారేస్తున్నారు.
"ప్రజలు సంతోషంగా ఉంటే, కర్ఫ్యూ ఎందుకు విధించినట్టు? సమాచార వ్యవస్థలను ఎందుకు స్తంభింపజేసినట్టు" అని రిజ్వాన్ ప్రశ్నించారు.
శ్రీనగర్‌లో ప్రతీ చోట ఇళ్లల్లో, వీధుల్లో, సున్నితమైన పాత నగరం(డౌన్‌టౌన్)లో, సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఫిబ్రవరిలో ఆత్మాహుతి దాడి జరిగిన దక్షిణ ప్రాంత జిల్లా పుల్వామాలో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.
మేం కశ్మీర్‌లో ప్రయాణిస్తుండగా- రోడ్డు పక్కన ఉండే లేదా వాహనాల్లో వెళ్లే స్థానికులు, మాతో మాట్లాడేందుకు మా వాహనాన్ని ఆపారు. కశ్మీరీ గొంతులను అణిచేస్తున్నారని, తమ గళం వినాలని వారు అడిగారు.
తమకెంత కోపం ఉందో వారు చెప్పారు. రక్తపాతం తప్పదనే హెచ్చరికలూ చేశారు.
కశ్మీర్ సైనిక ముట్టడిలో ఉందని, దీని తీవ్రత తగ్గగానే, సమస్య మొదలవుతుందని పుల్వామాలో నివసించే న్యాయవాది జాహిద్ హుస్సేన్ దార్ నాతో అన్నారు.
"రాజకీయ నాయకులు, వేర్పాటువాద నాయకులు నిర్బంధం నుంచి లేదా గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యాక నిరసనలకు పిలుపునిస్తారు, అప్పుడు జనం వస్తారు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Abid Bhat
కశ్మీర్ లోయలో ఇప్పటివరకు భారీ నిరసన ప్రదర్శనలేవీ జరగలేదని, కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించినట్టేనని భారత మీడియాలో కొన్ని సంస్థలు చెబుతున్నాయి.
కానీ కశ్మీర్ చాలా ఆగ్రహంతో ఉన్నట్లు నాకు కనిపిస్తోంది. భారత పాలనకు వ్యతిరేకంగా కశ్మీర్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇన్‌సర్జెన్సీపై వార్తలు అందించేందుకు 20 ఏళ్లకుపైగా నేను ఇక్కడ పర్యటిస్తూనే ఉన్నాను. ఇప్పుడున్నంత ఆగ్రహం, వ్యతిరేకత ముందెన్నడూ లేవు.
ప్రభుత్వం తన ఉత్తర్వును ఉపసంహరించుకొని, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాల్సిందేనని, అది జరిగే వరకు పోరాడతామని, వెనక్కి తగ్గేదే లేదని చాలా మంది ప్రజలు చెబుతున్నారు.
కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధారణంగా తన నిర్ణయాలను ఉపసంహరించుకోదు. తాజా నిర్ణయాన్ని వ్యతిరేకించేవారిపై ప్రభుత్వం పెద్దయెత్తున బలప్రయోగానికి దిగుతుందనే భయం కశ్మీర్ లోయలో ఉంది. నిర్ణయాలను ఉపసంహరించుకోని మోదీ ప్రభుత్వ తీరు ఈ భయాన్ని పెంచుతోంది.
తమ వివాదాస్పద నిర్ణయాన్ని మోదీ ఈ నెల 8న సమర్థించుకున్నారు. కశ్మీర్‌లో కొత్త శకానికి ఇది నాంది అని, కశ్మీర్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రధాని చెప్పారు.
ప్రధాని హామీ ఇచ్చినప్పటికీ, కశ్మీర్‌లో చాలా మంది వెనక్కు తగ్గడం లేదు. ఇది కశ్మీరీలకుగాని, భారత్‌కుగాని మంచిది కాదు.
హైస్కూల్ విద్యార్థి ముస్కాన్ లతీఫ్ నాతో మాట్లాడుతూ- "ఇప్పుడు కశ్మీర్‌లో ఉన్నది తుపాను ముందు ప్రశాంతత. సముద్రం ప్రశాంతంగా ఉంది. కానీ సునామీ తీరాన్ని తాకబోతోంది" అని చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- గోదావరి: 12 రోజులుగా వరద ముంపులో ‘రామ్ చరణ్ రంగస్థలం’ గ్రామం
- కేరళ వరదలు: తొమ్మిది జిల్లాల్లో రెడ్ అలర్ట్.. ‘నలభై ఏళ్ల తర్వాత ఇంత విధ్వంసం చూస్తున్నాం’
- జమ్మూ కశ్మీర్ విభజన: ఏదో ఒక రోజు మళ్లీ రాష్ట్రం హోదా ఇస్తాం: అమిత్ షా
- కశ్మీర్ ఎన్నికలు: ఒకప్పుడు పాకిస్తాన్ వెళ్లి శిక్షణ పొందిన మిలిటెంట్.. నేడు బీజేపీ అభ్యర్థి
- ఇండియన్ ఆర్మీ: ‘‘కశ్మీర్ తల్లులారా... ఉగ్రవాదంలో చేరిన మీ పిల్లలను లొంగిపోమని చెప్పండి... లేదంటే తుపాకీ పట్టిన ప్రతి ఒక్కరూ చనిపోతారు’’
- మలేషియా అడవుల్లో మాయమైన ఆ టీనేజ్ అమ్మాయి ఎక్కడ?
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఎందుకు ఉంది? ఆ జెండా ప్రత్యేకత ఏమిటి?
- ‘కశ్మీర్ ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం రద్దు’
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- టార్డిగ్రేడ్స్: చందమామపై చిక్కుకుపోయిన వేలాది 'మొండి' జీవులు.. ముప్పై ఏళ్ల తర్వాత నీటి తడి తాకినా బతికేస్తాయి
- వైద్య పరీక్షల కోసం దానమిచ్చిన శవాన్ని ఏం చేస్తారు...
- ఏడేళ్ల వయసులో శరణార్థిగా వెళ్లిన బాలిక.. 60 ఏళ్లకు స్వదేశానికి అధ్యక్షురాలయ్యారు
- పాకిస్తాన్లో ‘అఖండ భారత్’ బ్యానర్లు.. ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








