'కశ్మీరీల మంచికే అయితే... మమ్మల్ని జంతువుల్లా బంధించడం ఎందుకు? - మెహబూబా ముఫ్తీ కుమార్తె సనా

ఫొటో సోర్స్, SANA MUFTI/EPA
జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370 నిబంధన రద్దు చేసిన తర్వాత సోమవారం సాయంత్రం శ్రీనగర్‌లో జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రభుత్వ అతిథి గృహం 'హరి నివాస్'లో ఉంచారు.
శ్రీనగర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఆదేశంలో "మెహబూబా ముఫ్తీ కార్యకలాపాల వల్ల దేశంలో శాంతికి విఘాతం కలిగే ప్రమాదం ఉంది. అందుకే ఆమెను ముందు జాగ్రత్తగా కస్టడీలోకి తీసుకుంటున్నాం" అని చెప్పారు.
దీనిపై మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా జావేద్(ఇంట్లో పేరు సనా) 'వాయిస్ నోట్స్' ద్వారా బీబీసీ ప్రతినిధి కులదీప్ మిశ్రాతో మాట్లాడారు.
మెహబూబా ముఫ్తీని శ్రీనగర్‌లో ఉన్న ఆమె ఇంటి నుంచి కస్టడీలోకి తీసుకున్నప్పుడు సనా ఆమెతోపాటు ఇంట్లోనే ఉన్నారు.

ఫొటో సోర్స్, EPA
ఒక కాగితం ఇచ్చి, సామాను తీసుకోడానికి టైమిచ్చారు
కశ్మీర్ రాజకీయ నేతలకు తమను గృహ నిర్బంధంలో ఉంచబోతున్నారనే విషయం ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాతే తెలిసిందని సనా ముఫ్తీ చెప్పారు.
"మొట్టమొదట ఉమర్(అబ్దుల్లా) సార్ ట్వీట్ చేశారు. తర్వాత మా అమ్మకు కూడా దాని గురించి తెలిసింది. సోమవారం సాయంత్రం వరకూ ఆమె గృహనిర్బంధంలో ఉన్నారు. తర్వాత సాయంత్రం 6 గంటలకు ఆమెను ముందు జాగ్రత్తగా కస్టడీకి తీసుకున్నారు. సుమారు 7 గంటలకు నలుగురైదుగురు అధికారులు, కలెక్టర్ కూడా వచ్చారు. వాళ్లు మా అమ్మకు ఒక ఆర్డర్ పేపర్ ఇచ్చారు. తనకు అవసరమైన కొన్ని వస్తువులు తీసుకోడానికి కొంత సమయం కూడా ఇచ్చారు" అని సనా చెప్పారు.
తల్లిని 'హరి నివాస్'లో ఉంచారని సనా బీబీసీకి చెప్పారు. అది వాళ్ల ఇంటి నుంచి 5-10 నిమిషాల దూరంలో ఉంటుంది. కానీ కుటుంబంలోని ఎవరికీ ఆమెతో మాట్లాడ్డానికి లేదా కలవడానికి అనుమతి ఇవ్వలేదు.
నేను కూడా మా అమ్మతోపాటూ అక్కడికి వెళ్లాలనుకున్నాను. కానీ అధికారులు దానికి అనుమతించలేదు అన సనా చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
ఎప్పటివరకూ అదుపులో ఉంటారో, ఏం తెలీదు
ఆమె కస్టడీ ఎప్పటివరకూ ఉంటారనే విషయం అసలు జమ్ము-కశ్మీర్ అధికారులకే తెలీదని సనా ముఫ్తీ చెప్పారు. వాళ్లు పైనుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నారన్నారు.
"ఇక్కడ రాజ్యాంగ అధిపతి గవర్నర్ గారికే రెండు రోజుల ముందు వరకూ ఏం జరుగుతోందో తెలీదు. అలాంటిది అధికారులకు ఈ విషయం తెలిసుంటుందని నేను అసలు అనుకోవడం లేదు. రేపో, ఎల్లుండో అమ్మను వదిలేస్తామని చెప్పారు. కానీ నాకు వాళ్లపై అసలు నమ్మకం లేదు. మా అమ్మ సురక్షితంగా ఉండాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా చేయవచ్చు" అన్నారు సనా.
మా తాతయ్య ( ముఫ్తీ మొహమ్మద్ సయీద్) చనిపోయినప్పటి నుంచి నేను మా అమ్మతోనే ఉండాలని ప్రయత్నించాను. ఆమె రాజకీయ ప్రయాణంలో, విజన్‌లో సాయం చేయాలనుకున్నాను.

ఫొటో సోర్స్, EPA
ఆగ్రహం ప్రదర్శించే అనుమతి కూడా లేదు
ఆర్టికల్ 370 ప్రకారం జమ్ము-కశ్మీర్‌కు లభించే ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించాలనే నిర్ణయం వల్ల కశ్మీర్ యువత చాలా కోపంగా, మోసం చేశారనే భావనలో ఉన్నట్లు సనా అనుకుంటున్నారు.
"మొదట అమర్‌నాథ్ యాత్రికులపై దాడులు జరిగే అవకాశం ఉందని, అందుకే వాళ్లను వెళ్లిపొమ్మని చెప్పామని అన్నారు. మాతో అబద్ధం చెప్పారు. ఇప్పుడు దొంగల్లా పార్లమెంటులో 370ని రద్దు చేయాలనే అక్రమ నిర్ణయం తీసుకున్నారు. యువతకు తమ కోపం ప్రదర్శించే అనుమతి కూడా లేదు. మీరు ఎంతకాలం ఇక్కడివారిని వారి ఇళ్లలో బంధించి ఉంచగలరు. ఈ నిర్ణయం కశ్మీరీల భవిష్యత్తు కోసమే అయితే, వాళ్లనిలా జంతువుల్లా ఎందుకు బంధించారు" అన్నారు సనా.
కశ్మీరీలు సెక్యులర్ ప్రజాస్వామ్య భారతదేశాన్ని ఎంచుకున్నారు. ఇది వారి పట్ల జరిగిన మోసం అంటున్నారు సనా. మహబూబా ముఫ్తీని కస్టడీలోకి తీసుకోవడంపై ఆమె "మా అమ్మ 2016 నుంచి 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకునేవరకూ పూర్తి నిజాయితీతో పనిచేశారు. కానీ ప్రధాన రాజకీయ నాయకులతోనే ఇలా వ్యవహరిస్తున్నారేంటి. వీళ్లు యాంటీ నేషనల్ కాదు కదా" అన్నారు.
"ఇలా బీజేపీ తన ఓటు బ్యాంకును సంతోషపెట్టాలని అనుకుంటోంది. మేం కశ్మీరీ నేతలను ఇలా శిక్షిస్తున్నాం చూశారా.. అని వారికి చూపించాలనుకుంటోంది" అని సనా అనుకుంటున్నారు.
ప్రధాన రాజకీయ నేతలకే ఇలా జరిగినప్పుడు, భారత్‌ను ఎవరు నమ్ముతారు అంటారు సనా.

ఫొటో సోర్స్, Reuters
అమ్మ మూడ్ మార్చాలని ప్రయత్నిస్తున్నా
"జమ్ము-కశ్మీర్‌లో భారీ స్థాయిలో భద్రతా దళాలను మోహరించగానే, ఏదో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారని అనుకున్నారు. ఆర్టికల్ 370కి సంబంధించి ఏదో నిర్ణయం తీసుకుంటారని వారం నుంచీ ఇంట్లో చాలా ఆందోళనగా ఉన్నారు" అని సనా చెప్పారు.
"అంత మాత్రాన మేం అలా ఉండిపోలేదు. నేను ఉదయం నుంచీ ఆమె మూడ్ సరిచేయాలని చాలా ప్రయత్నించాను. రెండు మూడు సార్లు ఆమెను నవ్వించే ప్రయత్నం కూడా చేశాను"
"అయితే, మా అమ్మ తన జీవితంలో చాలా సంఘర్షణలు చూశారు. ఆమెకు ఎలాంటి భయం లేదు. కానీ, కశ్మీరీల ఆత్మగౌరవంపై దెబ్బకొట్టినందుకు, కశ్మీరీల ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడేందుకు మనం ఎలాంటి సమాధానం ఇవ్వాలా అని ఆమె కచ్చితంగా ఆలోచిస్తారు" అని సనా ముఫ్తీ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA/str
అది మూడు కుటుంబాల వల్ల కాదు
హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రసంగించినపుడు ముఫ్తీ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారు. ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్లో మూడు కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరిందని అన్నారు.
బీజేపీ తన కుటుంబంపై చేసిన ఆరోపణలపై మాట్లాడిన సనా కేంద్ర ప్రభుత్వంలో ఎంతోమంది పెద్ద నేతల కొడుకులు, కూతుళ్లు ఉన్నారని చెప్పారు.
"మీరు మిగతావారికి సరళంగా చెప్పడానికి మూడు కుటుంబాల వల్ల ఇది నాశనం అయ్యిందని చెప్పారు. కానీ భారత ప్రభుత్వం ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇది వృథా అయ్యింది. మిగతా భారత దేశం అంతటా మీరు రాజకీయంగా బలోపేతం చేసుకోడానికి, కశ్మీరీల గొంతుపై ఎప్పుడూ కత్తి పెడుతూనే వచ్చారు".
"మా కుటుంబం అంత పెద్ద తప్పు చేసుంటే, మాతో కూటమి ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్‌ను మీ కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు చేర్చుకున్నారు" అన్నారు సనా.
ఇవి కూడా చదవండి:
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- కశ్మీర్ ఉద్రిక్తం: కొత్త సంక్షోభం రావచ్చన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్
- ‘పాకిస్తాన్... మీ జవాన్ల మృతదేహాలను తీసుకువెళ్ళండి‘ -భారత్
- కశ్మీర్: గృహనిర్బంధం తర్వాత మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ఎమన్నారు?
- కార్గిల్ స్పెషల్: 'వాళ్లను వదలద్దు...' ప్రాణాలు వదిలేస్తూ కెప్టెన్ మనోజ్ పాండే చెప్పిన చివరి మాట ఇదే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








