ఆర్టికల్ 370 సవరణ: 'కశ్మీర్‌కు భారత్ ద్రోహం చేసింది, పాకిస్తాన్‌ను కాదని భారత్‌లో విలీనమై మేం తప్పు చేశాం'- మెహబూబా ముఫ్తీ

మెహబూబా ముఫ్తీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెహబూబా ముఫ్తీ

ఈ రోజు (ఆగస్టు 5) భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి రోజని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌కు భారత్ ద్రోహం చేసిందని, పాకిస్తాన్‌ను కాదని భారత్‌లో విలీనమై తాము తప్పు చేశామనిపిస్తోందని చెప్పారు.

భారత్‌ కశ్మీర్ భూభాగాన్ని కోరుకొంటోందిగాని, కశ్మీర్ ప్రజల గురించి ఆలోచించట్లేదని మెహబూబా విమర్శించారు. భారత్, కశ్మీర్ మధ్య రాజ్యాంగ సంబంధం తెగిపోయిందని, రాజ్యాంగ సంబంధం కాస్తా కశ్మీర్‌లో భారత దురాక్రమణగా మారిపోయిందని వ్యాఖ్యానించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 సవరణ, జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజన తదితర అంశాలపై బీబీసీ కోసం జర్నలిస్టు ఆతిష్‌ తాసి‌ర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెహబూబా స్పందించారు.

ప్రశ్న: భారత ప్రభుత్వ తాజా చర్యలపై మీ స్పందన ఏమిటి?

మెహబూబా: నేను దిగ్భ్రాంతి చెందాను. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. భారత ప్రజాస్వామ్యంలో ఈ రోజు అత్యంత చీకటి రోజని అనిపిస్తోంది.

ఎంతో గొప్ప ఆశతో కశ్మీర్ ప్రజలతోపాటు కశ్మీర్ నాయకత్వం భారత్ పక్షాన నిలిచింది. ద్విజాతి సిద్ధాంతాన్ని(టూ-నేషన్ థియరీని) వ్యతిరేకించింది. పాకిస్తాన్‌ను కాదని భారత్‌ వైపు మొగ్గు చూపి మేం తప్పు చేశామనిపిస్తోంది.

భారత్‌లో పార్లమెంటే ప్రజాస్వామ్య దేవాలయం. ఇది కూడా మమ్మల్ని నిరాశపరుస్తోంది. భారత్ కశ్మీర్ భూభాగాన్ని కోరుకొంటోంది, కశ్మీర్ ప్రజల గురించి ఆలోచించడం లేదు. మేం ఎవరిని ఆశ్రయించాలి?

న్యాయం కోసం ఐక్యరాజ్యసమితికి వెళ్లినవాళ్లు చేసిందే సరైన పనని, భారత రాజ్యాంగం పట్ల విశ్వాసమున్న మేం చేసింది తప్పని ఇప్పుడు రుజువైంది. మేం విలీనమైన దేశమే మమ్మల్ని నిరాశపరిచింది.

నాకు దిగ్భ్రాంతి కలిగింది. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియడం లేదు. భారత ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం మొత్తం భారత ఉపఖండంలోనే తీవ్రమైన విపరిణామాలకు దారితీస్తుంది.

అమిత్ షా

ఫొటో సోర్స్, RSTV

ఫొటో క్యాప్షన్, "భారత్‌లో పార్లమెంటే ప్రజాస్వామ్య దేవాలయం. ఇది కూడా మమ్మల్ని నిరాశపరుస్తోంది" అని మెహబూబా ముఫ్తీ చెప్పారు.

ప్రశ్న: ఆర్టికల్ 370 సవరణ వెనక అసలు ఉద్దేశం ఏమిటి? కశ్మీర్‌ లోయలో భారత ప్రభుత్వం ఏంచేయాలనుకొంటోంది?

మెహబూబా: దీని వెనక దురుద్దేశముంది. అందులో సందేహమే లేదు. కశ్మీర్‌ జనసంఖ్యలో వర్గాల వారీ మార్పులు రావాలని వారు కోరుకొంటున్నారని అనిపిస్తోంది.

ముస్లిం మెజారిటీ ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌ మత ప్రాతిపదికన విభజనను వ్యతిరేకించింది. కానీ నేడు ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మత ప్రాతిపదికన విభజించింది. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించి మరో విభజన కూడా తీసుకొచ్చింది.

కశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించి ముస్లిం మెజారిటీ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల మాదిరిగా చేయాలి, ఇక్కడ మెజారిటీలైన ముస్లింలను మైనారిటీలుగా మార్చాలి అనే వ్యూహం వారికి ఉందన్నది సుస్పష్టం. మమ్మల్ని పూర్తిగా అశక్తుల్ని చేయాలన్నది వారి వ్యూహం.

సైనిక సిబ్బంది

ఫొటో సోర్స్, BBC/MOHIT KANDHAR

ప్రశ్న: తాజా పరిణామాలపై కశ్మీర్ ప్రజలు ఎలా స్పందిస్తారు? కశ్మీరియత్ భవిష్యత్తు ఏమిటి? కశ్మీర్‌ లోయ ప్రత్యేకత ఏంకానుంది?

మెహబూబా: ఇది 'కశ్మీరియత్‌'పై జరిగిన దాడి. కశ్మీర్ నమ్మేవాటిపై జరిగిన దాడి. కశ్మీరీలు ఎలా స్పందిస్తారు? కశ్మీర్‌ను ఒక 'ఓపెన్ ఎయిర్ జైలు'గా మార్చేశారు. ఇప్పటికే ఉన్న భద్రతాదళాలకు అదనంగా పెద్దసంఖ్యలో బలగాలను మోహరించారు. మా వ్యతిరేకతను వ్యక్తంచేసే హక్కును కూడా మా నుంచి లాక్కున్నారు.

ఇప్పటివరకు మాకున్న ప్రత్యేక వెసులుబాటు మాకు బహుమతిగా ఇచ్చిందేమీ కాదు. జమ్మూకశ్మీర్ ప్రజలకు ఇదే భారత పార్లమెంటు ఇచ్చిన రాజ్యాంగ హామీలకు సంబంధించినది ఇది. పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదే.

వాళ్లు (భారత ప్రభుత్వం) కశ్మీరీలను భారత్‌కు మరింత దూరం చేశారనిపిస్తోంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు కశ్మీర్‌ను మరో గాజా స్ట్రిప్‌గా మార్చాలనే దురుద్దేశం వాళ్లకు ఉంది.

పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్నపనే కశ్మీర్‌లో వాళ్లు చేయాలనుకొంటున్నారు. కానీ వాళ్ల ప్రయత్నం ఫలించదు.

వియత్నాంలో అమెరికాకు ఎలాంటి అనుభవం ఎదురైంది? వియత్నాం నుంచి అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది. భారత్ పక్షాన నిలిచిన, భారత్‌ను నమ్మిన నా లాంటి వాళ్లను నిస్సహాయ స్థితిలోకి నెట్టేశారు.

జమ్మూకశ్మీర్‌కే కాదు, భారత్‌కు, మొత్తం ఉపఖండానికే భవిష్యత్తు నిరాశాపూరితంగా ఉంటుంది.

మెహబూబా ముఫ్తీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెహబూబా ముఫ్తీ

ప్రశ్న: తాజా పరిణామాలు భారత ముస్లింలను భారత్‌కు దూరం చేస్తాయా? వారిపై ప్రభావం ఎలా ఉండొచ్చు?

మెహబూబా: ఈ చర్యలు భారత ముస్లింలను మరింత దూరం చేయడమే కాదు, వారికి భయభ్రాంతులు కలిగిస్తాయి. ప్రతీ భారతీయ ముస్లింకు ఒక హెచ్చరికగా పనిచేస్తాయి. "మా మాట వినకపోతే, నీకు కనీస గౌరవం లేకుండా చేస్తాం" అనేదే ఆ హెచ్చరిక.

ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో ఎన్ని మూక హత్యలు జరిగాయో తెలుసా? ముస్లిం మెజారిటీ రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌తోనే మొదలుపెట్టారు.

భారత ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చే పని ఇప్పటికే చేస్తున్నారు. ముస్లిం మెజారిటీ రాష్ట్ర ప్రజలకే తమ అసమ్మతిని, అభిప్రాయాన్ని వ్యక్తంచేసే అవకాశాన్ని నిరాకరించిన తరుణంలో దేశంలోని మిగతా ముస్లింల పరిస్థితి ఏమిటన్నది తెలియడం లేదు.

భారతీయ ముస్లింలు మా కంటే నిస్సహాయ స్థితిలో ఉన్నారనిపిస్తోంది. భారత్‌ను 'ముస్లిం ముక్త్ భారత్‌'గా చేయాలనే ఉద్దేశం వాళ్లకు ఉన్నట్లుంది. కొన్ని ప్రత్యేక ఏర్పాట్లతో జమ్మూకశ్మీర్ భారత్‌లో విలీనమైంది. వాటిని ఇప్పుడు తొలగిస్తున్నారు.

వాళ్లు సీసాలోంచి భూతాన్ని బయటకు తీశారు. దాన్ని తిరిగి లోపలకు ఎలా పంపించాలో వాళ్లకు తెలియదు.

వాళ్ల పని పర్యవసనాలు మున్ముందు ఉంటాయి. అప్పుడు ఎలా పరిష్కరించాలో వాళ్లకు తెలియదు. ఈ విషయాన్ని వాళ్లే గ్రహిస్తారు.

ఇలాంటి అంశాల వల్లే ముస్లిం మిలిటన్సీ, ఉగ్రవాదం మొదలయ్యాయి. మన దేశానికి ఈ పరిస్థితి ఎదురుకానుంది.

ఆందోళనకారుడు

ఫొటో సోర్స్, Reuters

ప్రశ్న: పరిస్థితుల్లో అసాధారణ మార్పులు వచ్చిన నేపథ్యంలో మీ పాత్ర, మీ నాయకత్వం ఎలా ఉండాలనుకొంటున్నారు?

మెహబూబా: మేం నమ్మకం ఉంచిన వ్యవస్థలే మాకు నిలువునా ద్రోహం చేశాయి. జమ్మూకశ్మీర్‌లోని అత్యధిక ప్రజల మనోభీష్టానికి, ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించాయి.

ఏంచేయాలనేదానిపై ఇప్పుడే ఆలోచన చేయలేం. అయితే కశ్మీర్‌తో ముడిపడిన అందరూ అంటే రాజకీయ పార్టీలు, మత పక్షాలు, ఇతర పార్టీలు అంతా కలసి ఉమ్మడిగా పోరాడాల్సి ఉంది.

తాజా చర్యలతో కశ్మీర్ సమస్య మరింత జటిలం అయ్యింది. కశ్మీర్‌కు ఏం జరుగుతోందో అంతర్జాతీయ సమాజం తెలుసుకొనేందుకు ఇది అవకాశాన్ని కూడా కల్పించింది.

భారత్, కశ్మీర్ మధ్య ఉన్న రాజ్యాంగ సంబంధం ఇప్పుడు తెగిపోయింది. రాజ్యాంగ సంబంధం కాస్తా కశ్మీర్‌లో భారత దురాక్రమణగా మారిపోయింది. దీనిపైనే మేం పోరాడబోతున్నాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)