'ఆర్టికల్ 370 సవరణ' తర్వాత కశ్మీర్‌లో పరిస్థితి ఎలా ఉంది? స్థానికులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
'ఆర్టికల్ 370 సవరణ'కు ముందే కశ్మీర్ అంతటా భద్రతా బలగాలను మోహరించారు. ఇంటర్నెట్, ల్యాండ్ లైన్ సహా ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేశారు.
కానీ బీబీసీ ప్రతినిధి ఆమిర్ ఎక్కడో పనిచేస్తున్న ఒక ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్ రూపా ఝాకు కశ్మీర్లో పరిస్థితిని వివరించారు.
ఫోన్లో కశ్మీర్ పరిస్థితి గురించి జరిగిన సంభాషణ
రూపా ఝా: అమీర్ కశ్మీర్లో పరిస్థితేంటి.. ఉదయం నుంచీ అక్కడ ఏం జరుగుతోంది?
ఆమిర్: నిన్న సాయంత్రం వరకూ ఇంటర్నెట్ ఉంది, లాండ్ లైన్స్ కూడా పనిచేస్తున్నాయి. కానీ రాత్రి నుంచి మొదట మొబైల్ ఇంటర్నెట్, తర్వాత లాండ్ లైన్ కట్ అయిపోయాయి. అన్నీ బ్లాక్ అయ్యాయి.
ఉదయం అందరూ ఇళ్ల నుంచి బయటికొచ్చేసరికే పారామిలిటరీ ఫోర్సెస్, పోలీసులు అన్ని దారులూ బ్లాక్ చేశారు. నిన్న సాయంత్రం వరకూ దీని గురించి ఎలాంటి ప్రకటనా లేదు. దాంతో ఇది అప్రకటిత కర్ఫ్యూలా ఉంది.
కశ్మీర్లో ఏ రహదారిపై చూసినా భారీగా భద్రతా దళాలు కనిపిస్తున్నాయి. ఇంకా చాలా దళాలు వస్తున్నాయని చెబుతున్నారు.
కశ్మీర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ ఏమీ తెలీడం లేదు. ఎలాంటి కనెక్టివిటీ లేకపోవడం వల్ల, మొబైల్, ల్యాండ్ లైన్స్ అన్నీ ఆగిపోవడంతో ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నారు.
చరిత్రలో ఇప్పటివరకూ ఇలా ల్యాండ్ లైన్స్ కూడా ఆపేయడం ఎప్పుడూ జరగలేదు. ప్రభుత్వ అధికారులు అంటే.. పోలీసులు, ఇతర విభాగాల అధికారులకు కూడా శాటిలైట్ ఫోన్స్ ఇచ్చారు.
ప్రభుత్వ నుంచి అందుతున్న ఆదేశాలు, సమాచారం అంతా శాటిలైట్ ఫోన్స్ ద్వారానే జరుగుతోంది.
ఇక్కడ మెయిన్ స్ట్రీం పొలిటీషియన్స్, అంటే మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా లాంటి వారిని హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో జనాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఎప్పుడు, ఎక్కడ, ఏం జరుగుతోందో ఎవరికీ తెలీడం లేదు. ఎవరి మధ్యా ఎలాంటి కమ్యూనికేషన్ లేదు.

ఫొటో సోర్స్, EPA
ఇక్కడున్న చాలా మంది తమ పిల్లలు, కుటుంబాల క్షేమ సమాచారం తెలీక ఆందోళనలో ఉన్నారు.
మేం కొంతమంది టూరిస్టులను కూడా కలిశాం. టూరిస్టులంతా వెళ్లిపోడానికి ఈరోజే ఆఖరి రోజని వారి హోటల్‌కు కాల్ వచ్చిందని చెప్పారు.
మేం ఒక టూరిస్ట్ సెంటర్ దగ్గరికి వెళ్లినపుడు, అక్కడ టూరిస్టులు, బిహార్, యూపీలతోపాటు దేశంలోని మిగతా ప్రాంతాల వారు చాలా మంది కనిపించారు.
"మీకు మొదటే వెళ్లిపొమ్మని చెప్పారుగా, ఇంకా ఎందుకున్నారు" అని నేను బిహార్, యూపీ వాళ్లను అడిగాను.
కానీ వాళ్లు నాతో "మేం పనుల కోసం వచ్చాం, మా డబ్బు ఇక్కడున్న వాళ్ల దగ్గర ఇరుక్కుపోయింది, ఆ డబ్బు తీసుకోడానికే ఇక్కడున్నాం" అని చెప్పారు.
ఈ రోజు ఉదయం నుంచీ బస్సులు లేవు, ఐదారు గంటలుగా టూరిస్టులు, పనుల కోసం కశ్మీర్ వచ్చిన మిగతా ప్రాంతాల వారు అక్కడ వేచిచూస్తూ కనిపించారు.
రూపా ఝా: మీరు మాట్లాడుతున్న ఫోన్ లైన్ మాత్రం ఎలా పనిచేస్తోంది, మీరెక్కడ్నుంచి మాట్లాడుతున్నారు?
ఆమిర్: నేను ఎయిర్ పోర్ట్ దగ్గరున్న ఒక ధాబా నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక ల్యాండ్ లైన్ పనిచేస్తోంది. నాకు తెలిసి మొత్తం కశ్మీర్లో పనిచేస్తున్న ఒకే ఒక ఫోన్ ఇదే అయ్యుంటుంది.

ఫొటో సోర్స్, AFP
రూపా ఝా: స్థానికుల్లో ఎలాంటి ఆందోళన ఉంది, ఇళ్లలోనే ఉంటున్నారా, షాపులు మూసేసున్నాయా.. ఎలా ఉంది?
ఆమిర్: ఇక్కడ అంతా భయంభయంగా ఉన్నారు. అందరిలో భయాందోళనలు ఉన్నాయి. జనం ఇళ్లలోంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.
నిజానికి ఇంట్లో సరుకులు భారీగా నిల్వలు చేసుకున్న కొంతమంది నెలల తరబడి లోపలే ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. జనాలెవరూ ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. భారీగా ఉన్న భద్రతా దళాలను చూసి లోపలే ఉండిపోతున్నారు.
మాక్కూడా ఎక్కడైనా ఏదైనా జరిగిందా, ఏవైనా హింసాత్మక ఘటనలు జరిగాయా అనేది తెలీడం లేదు. ఎందుకంటే ఎవరూ ఎటూ వెళ్లలేని పరిస్థితి.
ఇక్కడ షట్‌డౌన్‌లా ఉంది. ఏం జరుగుతోందో ఎవరికీ తెలీడం లేదు.
రూపా ఝా: మీరక్కడ ఇన్నేళ్లుగా జర్నలిస్టుగా ఉన్నారు. ముందు ముందు అక్కడ ఏం జరగొచ్చని మీకు అనిపిస్తోంది? ఏం జరిగే అవకాశం ఉంది?
ఆమిర్: కశ్మీర్‌లో స్థానికుల మాటలను, మా అనుభవాలను బట్టి ముందు ముందు హింస, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగచ్చనిపిస్తోంది.
ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం హోదాను కాపాడుకోవాలని ఇక్కడ ప్రతి ఒక్కరూ, అంటే ప్రధాన రాజకీయ నాయకులు కూడా భావిస్తున్నారు. అందుకే ఈ షట్‌డౌన్ మరికొంత కాలం కొనసాగవచ్చు, జనం ఇళ్ల నుంచి బయటికొస్తే, హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం కూడా ఉంది.
ఇక్కడ కమ్యూనికేషన్స్.. ఇంటర్నెట్, ల్యాండ్ లైన్స్ మళ్లీ పునరుద్ధరించేవరకూ..మాక్కూడా ఏదైనా సమాచారం అందడం కష్టం.
రూపా ఝా: ఓకే, థాంక్స్ ఆమిర్..
ఇవి కూడా చదవండి:
- ఉన్నావ్ రేప్ బాధితురాలి కారు యాక్సిడెంట్‌పై అనుమానాలు
- "యోగి ఆదిత్యనాథ్‌ని యూపీ సీఎం చేస్తామంటే అంతా వద్దన్నారు, కానీ..."
- పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కినందుకు దళితుల సామాజిక బహిష్కరణ
- అనంతపురం: ఆలయంలో అడుగుపెట్టారని దళిత కుటుంబానికి జరిమానా
- కర్ణాటక ముఖ్యమంత్రి: అడ్వాణీకి వర్తించిన రూల్ యడ్యూరప్పకు వర్తించదా
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








