కృష్ణా, గోదావ‌రి ప‌ర‌వ‌ళ్లు.. ద‌శాబ్దం త‌ర్వాత మ‌ళ్లీ నిండుకుండ‌ల్లా ప్రాజెక్టులు

శ్రీశైలం ప్రాజెక్టు.. తెరుచుకున్న గేట్లు
    • రచయిత, వి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఈ ఏడాది ఖ‌రీఫ్ ఆరంభంలో వ‌ర్షాభావంతో క‌రవు ఛాయ‌లు అల‌ముకోవ‌డంతో రైతుల్లో ఆందోళ‌న క‌నిపించింది. ఆలస్యమైనా ఇప్పుడు వర్షాలు పుష్కలంగా కురుస్తుండడంతో న‌దుల‌న్నీ క‌ళ‌క‌ళలాడుతున్నాయి.

గోదావరి, దాని ఉప నదుల పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో గత రెండు వారాలుగా గోదావరి నది నిండుకుండ‌లా మారింది.

మరోవైపు కృష్ణాన‌దీ పోటెత్తుతోంది. వరద నీరు దిగువకు ప్రవహిస్తుండడంతో ప్రాజెక్టుల‌ు జ‌ల‌క‌ళ సంత‌రించుకుంటున్నాయి.

మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌ల్లో కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ఆల్మ‌ట్టి డ్యామ్ నిండింది. అక్క‌డి నుంచి దిగువ‌కు మిగులు జ‌లాలు విడుద‌ల చేయ‌డంతో నారాయ‌ణ‌పూర్, జూరాల‌, ప్రాజెక్టుల‌కూ వ‌ర‌ద తాకిడి క‌నిపిస్తోంది.

ఈ నెల 8న ఆల్మ‌ట్టి నుంచి 3.9 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేశారు. దాంతో నారాయ‌ణ‌పూర్‌లో 37 టీఎంసీల గ‌రిష్ఠ నీటిమ‌ట్టానికి గాను నీటి నిల్వ 22 టీఎంసీల‌కు చేరింది. ఎగువ నుంచి భారీగా వ‌ర‌ద నీరు వచ్చే సూచనలుండడంతో దిగువ‌న జూరాలకు 4.28ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని వ‌దులుతున్నారు.

జూరాల గ‌రిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలలు కాగా గురువారం సాయంత్రానికి అక్క‌డ 6.49 టీఎంసీల నీరు చేరింది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.34 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దాంతో శ్రీశైలం వ‌ద్ద గురువారం సాయంత్రానికి 162 టీఎంసీల నీటి ల‌భ్య‌త న‌మోదైంది. శ్రీశైలం ప్రాజెక్ట్ గరిష్ఠ నీటి నిల్వ సామ‌ర్థ్యం 215 టీఎంసీలు.

బిరబిరా కృష్ణమ్మ

గ‌త ద‌శాబ్ద కాలం రికార్డులు ప‌రిశీలిస్తే 2009లో కృష్ణానదికి అత్య‌ధికంగా వ‌ర‌ద జ‌లాలు వ‌చ్చాయి. ఆ న‌ది చ‌రిత్ర‌లోనే అత్య‌ధికంగా 2009 అక్టోబ‌ర్ 5న ఏకంగా 25ల‌క్ష‌ల క్యూసెక్కుల మిగులు జ‌లాలు విడుద‌ల చేశారు.

అనంతరం ఈ ఏడాది అత్య‌ధికంగా నీటి ల‌భ్య‌త న‌మోద‌య్యే సూచనలున్నాయని ఇరిగేష‌న్ అధికారులు చెబుతున్నారు. రిజ‌ర్వాయ‌ర్‌లోకి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంటకు అందిన స‌మాచారం ప్ర‌కారం 3,59,867 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 879.30 అడుగులకు చేరింది.

శుక్ర‌వారం నుంచి నీటి విడుద‌లకు ఏర్పాట్లు చేశారు. ఏపీ జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మూడు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయ‌డంతో కృష్ణ‌మ్మ వ‌డివ‌డిగా నాగార్జునసాగ‌ర్ వైపు ప‌రుగులు తీస్తోంది.

కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు విద్యుత్కేంద్రం ద్వారా 32,272 క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 1351 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 20,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్ కు 735 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు.

విద్యుదుత్ప‌త్తి కూడా..

ప్రాజెక్టులకు నీరు వచ్చి చేరుతుండడంతో జల‌ విద్యుదుత్పాదన కూడా పెరిగింది. ప్రాజెక్టు నిండుకుండ‌ను త‌లపిస్తుండ‌డంతో కుడి, ఎడ‌మ గ‌ట్టుల‌పై ఉన్న విద్యుత్కేంద్రాల నుంచి గ‌రిష్ఠ స్థాయికి విద్యుదుత్పాద‌న చేరింద‌ని శ్రీశైలం హైడ‌ల్ ప‌వ‌ర్ స్టేష‌న్ అధికారులు ప్ర‌క‌టించారు.

ఇక నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద కూడా విద్యుదుత్పాదన ప్రారంభ‌మైంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలకు గానూ.. ప్రస్తుత నీటి నిల్వ 142.08 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్ కు ఇన్‌ఫ్లో 64,136 క్యూసెక్కులు వస్తుండగా..9,271 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.

వరద

న‌దీ జ‌లాల స‌ద్వినియోగానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం

చాలాకాలం త‌ర్వాత రాష్ట్రంలోని రెండు ప్ర‌ధాన న‌దుల్లో నీరు పెర‌గ‌డం సంతోష‌క‌రంగా ఉంద‌ని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ అన్నారు. ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘న‌దీ జ‌లాల స‌ద్వినియోగం కోసం మా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. పోల‌వ‌రం పూర్తి చేయ‌డం. కృష్ణా-గోదావ‌రి నదుల అనుసంధానం ద్వారా రాయ‌ల‌సీమ‌కు నీటి అవ‌స‌రాలు తీర్చ‌డం మా క‌ర్త‌వ్యం. దానికి అనుగుణంగా ఇప్ప‌టికే అడుగులు వేశాం. ఈసారి కృష్ణా నీరు కూడా పుష్క‌లంగా ల‌భ్యం అవుతుండ‌డంతో తొలుత తాగునీటి అవ‌స‌రాలు తీర్చేందుకు దృష్టి పెట్టాం. ఇప్ప‌టికే సాగ‌ర్ కుడికాలువ ద్వారా ప్ర‌కాశం, గుంటూరు జిల్లా వాసుల‌కు తాగునీటిని విడుద‌ల చేస్తున్నాం. 10వేల క్యూసెక్కుల నీటిని త‌ర‌లిస్తున్నాం. రాయ‌ల‌సీమ అవ‌స‌రాల‌కు అనుగుణంగా జ‌లాల వినియోగం జ‌రుగుతుంది’’ అంటూ చెప్పుకొచ్చారు.

తుంగ‌భ‌ద్ర

తుంగభద్ర జలాశయానికీ వరద ప్రవాహం కొనసాగుతోంది. తుంగభద్ర పూర్తిస్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా..ప్రస్తుతం నీటి నిల్వ 60.72 టీఎంసీలుగా ఉంది. తుంగభద్రకు ఇన్ ఫ్లో 1,42,114 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,089 క్యూసెక్కులుగా ఉంది. తుంగ‌భ‌ద్ర నుంచి అవుట్ ఫ్లో పెరిగితే రాయ‌ల‌సీమ‌లో ప్ర‌ధానంగా క‌ర్నూలు జిల్లాలో తాగునీటి స‌మ‌స్య అధిగ‌మించే అవ‌కాశం ఉంటుంది. అందుకు అనువుగా ప‌రిస్థితులు ఉన్నాయ‌ని అధికారులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

సీఎం జగన్‌ను కలిసిన తమిళనాడు ప్రతినిధులు
ఫొటో క్యాప్షన్, సీఎం జగన్‌ను కలిసిన తమిళనాడు ప్రతినిధి బృందం

చెన్నై తాగునీటి అవ‌స‌రాలు తీర్చేందుకు

ఇటీవ‌ల తాగునీటి కొర‌త‌తో తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న చెన్నై అవ‌స‌రాలు తీర్చేందుకు ఏపీ ప్ర‌భుత్వం అంగీక‌రించింది. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా న‌దీ జ‌లాలు త‌ర‌లించాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చేసిన విన‌తికి ఏపీ ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది.

దాంతో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం త‌రఫున ప‌లువురు మంత్రులు ఏపీ సీఎం జ‌గ‌న్‌ని క‌లిసి విన‌తిప‌త్రం అందించారు. వెంట‌నే త‌గు చ‌ర్య‌లు తీసుకోవాలంటూ సీఎం జ‌గ‌న్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 90ల‌క్ష‌ల మంది చెన్నై వాసుల దాహార్తి తీర్చేందుకు నీటిని త‌ర‌లించ‌డానికి అంగీక‌రించిన ఏపీ ప్ర‌భుత్వానికి తమిళనాడు ప్రతినిధులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

రెండు వారాలుగా శాంతించ‌ని గోదావ‌రి

జులై నెలాఖ‌రు నుంచి గోదావ‌రిలో వ‌ర‌ద ప్ర‌వాహం క‌నిపిస్తోంది. రెండు వారాలుగా వ‌ర‌ద‌ల తాకాడితో న‌దీ తీరంలోని ప‌లు గ్రామాలు నీటిలో నానుతున్నాయి. తాజాగా భ‌ద్రాచ‌లం వ‌ద్ద 48 అడుగుల‌కు నీటిమ‌ట్టం చేరింది. ఈ సీజ‌న్ లో ఇదే అత్య‌ధికం. దాంతో రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక‌ను జారీ చేశారు. దిగువ‌న పోల‌వ‌రం వ‌ద్ద కాఫ‌ర్ డ్యామ్ కార‌ణంగా బ్యాక్ వాట‌ర్ లో తూర్పు గోదావ‌రి జ‌ల్లా ఏజ‌న్సీ గ్రామాలు చిక్కుకున్నాయి. జులై 30 నుంచి నేటికీ వ‌ర‌ద నీటిలో విల‌విల్లాడుతున్నాయి. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోని 56 గ్రామాల‌కు రాక‌పోక‌లు స్తంభించాయి. నిత్యావ‌స‌రాల‌కూ పడ‌వ‌ల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌స్తోంది.

గోదావ‌రి వ‌ర‌ద‌ల‌తో ఇప్ప‌టికే పోల‌వ‌రం స్పిల్ వే దాదాపుగా నీటిమ‌యమైంది. దిగువ‌న ధ‌వ‌ళేశ్వ‌రం క్యాట‌న్ బ్యారేజ్ వ‌ద్ద శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంటల స‌మ‌యానికి రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక స్థాయికి చేరువ‌లో న‌దీ ప్ర‌వాహం సాగుతోంది. 14.5 అడుగుల‌కు నీటిమ‌ట్టం చేరుకుంది. 13.8ల‌క్ష‌ల క్యూసెక్కుల మిగులు జ‌లాలు స‌ముద్రంలోకి విడుద‌ల చేస్తున్నారు. ఈ నీటి కార‌ణంగా దిగువ‌న కోన‌సీమ లంక‌ల్లో వ‌ర‌ద చేరింది. ప‌లు గ్రామాలు జ‌ల‌దిగ్బంధంలో ఉన్నాయి. అదికారిక అంచ‌నాల ప్ర‌కారం ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో క‌లిపి 9వేల‌ హెక్టార్ల‌లో పంట‌ల‌కు న‌ష్టం వాటిల్లింది.

ఏపీ ముఖ్య‌మంత్రి ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు. వ‌ర‌ద బాధితుల స‌హాయ చ‌ర్య‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)