'దీపం' పథకాని'కి 20 ఏళ్ళు: ఆంధ్రప్రదేశ్ ఇంకా చీకట్లో ఎందుకున్నట్లు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్రవంతి చోరగుడి
- హోదా, బీబీసీ కోసం
'దీపం' పథకానికి 2019 జూలైతో 20 ఏళ్ళు పూర్తయ్యాయి. 1999 జూలై లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడుగు వర్గాల వారికి కాలుష్యరహిత వంట ఇంధనం - ఎల్పీజీని సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ముఖ్యంగా మహిళలకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చారు. వంట చెరకును సేకరించాల్సిన కష్టం నుంచి, వాటితో వంట చేయాల్సిన కష్టం నుంచి వారిని తప్పించడానికే కాక, వారి ఆరోగ్యాన్ని కాపాడడానికి, అడవులపై భారం పడకుండా చూడడానికి, మొత్తంగా పర్యావరణానికి మేలు కలిగించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
దీని కింద చమురు మార్కెటింగ్ కంపెనీకి చెల్లించాల్సిన కనెక్షన్ చార్జీలను లబ్దిదారుల తరఫున ప్రభుత్వమే చెల్లించి వారికి భారం లేకుండా చేసింది. ఈ ఏడాది (2019) మార్చి నాటికి 56.72 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను ఈ పథకం కింద పంపిణీ చేసింది.
ఎక్కువగా స్వశక్తి గ్రూపులలో ఉన్న మహిళలను లబ్దిదారులుగా ఎంచుకున్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాలకు శుభ్రమైన వంట ఇంధనం సరఫరా చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన తొలి పథకాల్లో ఇది ఒకటి. రెండు దశాబ్దాలు గడిచాయి కాబట్టి దీని పనితీరు ఎలా ఉందో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
సంతృప్తికరంగా లేదు
ఇంత సుదీర్ఘ కాలం అమల్లో ఉన్నా దీని పనితీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదనే చెప్పాలి. జాతీయ శాంపిల్ సర్వే (ఎన్.ఎస్.ఎస్.ఒ) గణాంకాల ప్రకారం 2014 లో కూడా ఆంధ్రప్రదేశ్ లో 62 శాతం గ్రామీణ కుటుంబాలు వంట ఇంధనం కోసం కాలుష్యకారక ఇంధనాలైన (మురికి అని కూడా అనొచ్చు) కట్టెలు, బొగ్గు, పేడ మీదే ఆధారపడుతున్నాయి. ఈ పరిస్థితి కొన్ని జిల్లాలలో అయితే మరింత ఘోరంగా ఉంది. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో 93 శాతం గ్రామీణ కుటుంబాలు ఇప్పటికీ వంట చెరకునే ప్రధాన ఇంధనంగా వాడుతున్నాయి.
విశాఖపట్నం జిల్లాలో ఈ సంఖ్య 79 శాతమైతే వై.ఎస్.ఆర్. కడప జిల్లాలో ఇది 71 శాతం. ఈ జిల్లాల పరిస్థితి పేద రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లతో సమానంగా ఉన్నాయి. ఇన్ని వేలు, లక్షల కుటుంబాలు ఇంకా వంట చెరుకు వాడుతున్నాయంటే దాని అర్ధం ఆ కుటుంబాలకు చెందిన స్త్రీలు, పిల్లలందరూ పొగ కాలుష్యానికి గురై ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదంలో ఉన్నారని, అయిదేళ్ళ లోపు పిల్లలు ఈ కాలుష్యం బారిన పడితే శ్వాస సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉండడమే కాదు, వారి ఆయుర్దాయం తగ్గిపోయే అవకాశం కూడా ఉంది.
2017 ఐ.సి.ఎం.ఆర్. (భారతీయ వైద్య పరిశోధనా మండలి) నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో స్త్రీలకు వస్తున్న పెద్ద జబ్బులలో క్రానిక్ పల్మనరీ డిజార్డర్ అనే శ్వాస కోశ వ్యాధి ఐదవ స్థానంలో ఉంది. ఇంటి లోపలి వాయు కాలుష్యమే దానికి కారణం. ఈ కాలుష్యం వలన వారి జీవిత కాలం 8 ఏళ్ళ వరకు కూడా తగ్గిపోతోంది.
ఎల్పీజీ కనెక్షన్ ఉన్నంత మాత్రాన దానిని అందరూ వాడతారనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే గ్యాస్ పొయ్యి కోసం అయ్యే ఖర్చు కన్నా గ్యాస్ బండ (రీఫిల్) ఖర్చే ఎక్కువ. 88 శాతం ఖర్చు దానికే అవుతుంది. పొయ్యి, కనెక్షన్, సరఫరా అన్నీ కలిపినా 20 శాతం లోపలే ఉంటుంది. కాబట్టి ఈ పథకం విజయవంతమవ్వాలంటే ఆ కుటుంబానికి రీఫిల్ కొనుక్కునే సామర్ధ్యం ఉండడం ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
‘రీఫిల్ కొనలేక’
ఇవి పేద కుటుంబాలు కావడం వల్ల సిలిండర్ ఖర్చు, సరఫరాలో జరిగే జాప్యం కారణంగా వారు ఒక్క వంట గ్యాస్ మీదే ఆధారపడకుండా ఇతర ఇంధనాలను కూడా ఉపయోగించక తప్పడం లేదు. ఆ ఇతర ఇంధనాలలో సులభంగా దొరికే కాలుష్యకారక ఇంధనాలే ఎక్కువ ఉంటాయి. దీని వల్ల వారికి తక్కువ ఖర్చుతో ఎల్పీజీ కనెక్షన్ ఇస్తున్న ఉద్దేశమే దెబ్బ తింటోంది. ఎన్.ఎస్.ఎస్.ఒ. సేకరించిన సమాచారం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో ఎల్పీజీ వాడుతున్నామని చెప్పిన కుటుంబాలే తమ వంట ఇంధన అవసరాలలో 72 శాతం వంట చెరకు నుండి పొందుతున్నామని చెప్పడం గమనార్హం.
దీని వల్ల ఎల్పీజీ వాడకం ద్వారా కలగవలసిన ఆరోగ్యం తదితర ప్రయోజనాలేమీ వారు పొందడం లేదు. రీఫిల్ కొనలేక వారు ఎల్పీజీ వాడకాన్ని మానేస్తే వాళ్ళు డబ్బు సంపాదించుకుని మళ్ళీ రీఫిల్స్ కొనగలిగే దాకా పాత పరిస్థితే కొనసాగుతుంది. వారు మొత్తానికీ మానేస్తే ఎల్పీజీ ప్రవేశపెట్టిన ఉద్దేశం పూర్తిగా దెబ్బ తిన్నట్టే. అందువల్ల ఇతర ఇంధనాల వాడకం వైపు వారు చూడకుండా చేయాల్సిన అవసరం కూడా ఉంది. రీఫిల్స్ ఖర్చు ఒక్కటే కాదు, కొన్ని ఇతర అంశాలు కూడా ఎల్పీజీ వాడాలా వద్దా అనే అంశాన్ని నిర్ణయిస్తాయి.
ఆరోగ్యం పట్ల పట్టింపు, స్త్రీలకు శ్రమ తగ్గించాలనే ఆలోచన, ఆమె మాటకు ఉండే విలువ (మరో రకంగా చెప్పాలంటే కుటుంబంలో ఆమె స్థాయి), చదువుతున్న పిల్లలు, వారి ఆరోగ్యం వగైరా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 'దీపం' పథకం విజయాన్ని బేరీజు వేసుకుని, దాని అమలును, లక్ష్యాలను పునఃనిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇటువంటి పథకాలు తమ విజయం తీసుకు రాగల దీర్ఘకాలిక మార్పును పూర్తిగా అంచనా వేసుకుని ముందుకు సాగాలి. ఎల్పీజీ లాంటి వంట ఇంధనం లభిస్తే దాని ప్రభావం ఒక స్త్రీ జీవితం మీద - అంటే ఆమె ఆరోగ్యం, ఉత్పాదకత లేదా ఆదాయ సామర్ధ్యం, పిల్లల సంరక్షణ, మొత్తంగా కుటుంబ శ్రేయస్సు, ఆ మాటకొస్తే సమాజ శ్రేయస్సు కూడా - గణనీయంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ పథకం రూపకల్పన, అమలులో డీలర్ షిప్ పెంపు, డిజిటలైజేషన్ వంటి అంశాల గురించి మాత్రమే ఆలోచించడం తగదు.
వివిధ రంగాలలో లభించగల బహుళ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పథకం లక్ష్యాలుగా వాటిని కూడా చేర్చాలి. అందుకు ఒక పద్ధతి - 'దీపం' పథకాన్ని ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జోడించడం. ముఖ్యంగా పరిశుభ్రమైన వంట ఇంధనాన్ని ప్రజారోగ్య వ్యవస్థలో భాగం చేయడం అవసరం. క్షయ నిర్మూలన, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ వంటి పెద్ద ఆరోగ్య పథకాల కింద దీన్ని కూడా చేర్చి తగు ప్రాధాన్యం, నిధులు సమకూర్చడం అవసరం. అలాగే పిల్లల చదువు, పౌష్టికాహార అవసరాలు చూసే పథకాలు కూడా 'దీపం' లాంటి పథకాలకు నిధులు ఇవ్వవచ్చు.
ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 'అమ్మ ఒడి' తీసుకోండి. తల్లిదండ్రులను ప్రోత్సహించి పిల్లలను స్కూల్ కు పంపేలా చేసేందుకు రూపొందించిన పథకం అది. వంట చెరకు సేకరించాల్సిన పని వల్లనే చాలామంది ఆడపిల్లలు గ్రామాల్లో స్కూల్ కు వెళ్ళలేకపోతున్నారనే విషయాన్ని ఆ పథకం పరిగణనలోకి తీసుకోవచ్చు. అలాగే మహిళా సంక్షేమ పథకాలు శుభ్రమైన వంట ఇంధనం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు వాటిని సమకూర్చుకోవడానికి సహాయపడవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇతర పథకాలతో జోడించాలి’
రీఫిల్స్ కు అవసరమయ్యే డబ్బు విషయంలో స్వశక్తి గ్రూపులను భాగస్వాములను చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే వై.ఎస్.ఆర్. గృహనిర్మాణ పథకం వంటి బడుగు వర్గాల హౌసింగ్ పథకాలన్నీ తాము కల్పించబోయే మౌలిక సదుపాయాలలో వంట ఇంధన సరఫరాను చేర్చడం గురించి కూడా ఆలోచించాలి. ఇప్పటివరకు 'దీపం' పథకం విడిగా పెద్దగా విజయవంతమవలేదు. అయితే అది చేయగల దీర్ఘకాలిక మేలును దృష్టిలో పెట్టుకుని, ఇతర పథకాలతో జోడిస్తే దాని పరిధి పెరగడమే కాక విజయవంతమయ్యే అవకాశాలు కూడా అధికమవుతాయి. అంతకన్నా ముఖ్యంగా మనం తరచూ మరిచిపోతున్న 'మురికి' ఇంధనాల సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
దేశ సమగ్ర ఆర్ధికాభివృద్ధి సాధనకు దోహదం చేసే వాటిలో శుభ్రమైన ఇంధనం కూడా ఒకటి. ఆ రంగంలో చెప్పుకోదగ్గ పెట్టుబడులు, కృషి రెండూ ఆర్ధిక వ్యవస్థకు కీలకమే. దానిని ఖజానాపై భారంగా చూడకూడదు. నిజానికి అది ఆరోగ్యకర, ఉత్పత్తిదాయక మానవ పెట్టుబడిని సృష్టింఛి అనేక దీర్ఘకాలిక ప్రయోజనాలను సమకూర్చగలదు. కట్టెలు, బొగ్గు వంటి ఇంధనాల దహనం కారణంగా జరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమైనప్పటికీ దానిని అత్యసర సమస్యగా గుర్తించి వెంటనే చర్యలు చేపట్టడం కూడా అవసరమే.
మంచి పథకాలను రూపొందించడంలో, వాటిని పకడ్బందీగా అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ కు చాలా అనుభవమే ఉంది. డ్వాక్రా వంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. 'దీపాన్ని' కూడా ఈ పథకాల కోవలోకి తీసుకురావాలి. రాష్ట్రాలు అమలు చేసిన తొలి మంచి ఇంధన పథకాలలో ఇది కూడా ఒకటని మొదటే చెప్పుకున్నాం. మోదీ ప్రభుత్వం 2016 లో ప్రారంభించిన 'ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన' పథకానికి స్ఫూర్తి ఇదే. దీన్ని పునరుద్ధరిస్తే శుభ్రమైన వంట ఇంధన సరఫరాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దేశానికే ఆదర్శప్రాయం కాగలవు.
(వ్యాసకర్త ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ సైన్స్, 'దివేచా సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్' రీసర్చ్ అసోసియేట్. ఇందులోని అభిప్రాయాలు ఆమె వ్యక్తిగతం)
ఇవి కూడా చూడండి:
- నగరంలో ఇల్లు కొనుక్కునే స్తోమతు లేదా? సగం ఇల్లు కొంటే ఎలా ఉంటుంది?
- అంతరిక్షంలోకి కొత్త జంటల ప్రేమ సందేశాలు
- #HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- కోలివింగ్: ఉద్యోగ రీత్యా నగరాలు మారే యువత కొత్త చాయిస్
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
- ఆ 132 గ్రామాల్లో అసలు ఆడపిల్లలే పుట్టలేదా...
- కార్గిల్ స్పెషల్: యుద్ధంలో పాక్ సైనికులకు ఆహారం అందించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు?
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








