పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలోకి నీళ్లు.. వైఫల్యమా, ఘనతా?

పోలవరం స్పిల్ వే
    • రచయిత, వి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీల‌క‌మైన స్పిల్ వేలోకి నీటి ప్రవాహం వచ్చింది. తాజా వ‌ర‌ద‌ల కారణంగా కాఫ‌ర్ డ్యామ్‌కు గండిప‌డటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

రెండు రోజులుగా స్పిల్ వేలోకి వస్తున్న నీరు రివ‌ర్ స్లూయిజ్ గేట్ల ద్వారా దిగువకు ప్ర‌వ‌హిస్తోంది. ప్రస్తుతం ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు ఇంకా పునాదుల ద‌శ‌లోనే ఉన్నాయి.

ఆనకట్ట నుంచి నీటిని విడుదల చేసేందుకు నిర్మించే గేట్లతో కూడిన మార్గమే స్పిల్ వే. దీని ద్వారా నీటిని నియంత్రిస్తూ, అవసరమైనప్పుడు దిగువకు విడుదల చేస్తుంటారు.

ప్రాజెక్టులు కట్టేటప్పుడు నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా నదీ జలాలను మళ్లించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన కాఫర్ డ్యామ్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి కాగానే దీన్ని తొలగిస్తారు. పోలవరంలో ఇలాంటి కాఫర్ డ్యామ్‌లు రెండు ఉన్నాయి.

ఎగువ కాఫ‌ర్ డ్యామ్, దిగువ కాఫ‌ర్ డ్యామ్ నిర్మించేటప్పుడు న‌దికి ఇరువైపులా కొంత భాగం ఖాళీగా ఉంచారు. జ‌లాలు దిగువ‌కు వెళ్లేందుకు అనుగుణంగా ఈ ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది వ‌ర్షాభావం కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కూ త‌గిన స్థాయిలో ఇన్ ఫ్లో లేదు. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో ఎటువంటి ఆటంకాలు క‌నిపించ‌లేదు.

పోలవరం

పెరిగిన ప్రవాహం..

అయితే, జూలై చివ‌రి వారంలో కురిసిన వ‌ర్షాల కార‌ణంగా గోదావ‌రి ఉప‌న‌దులు ఉప్పొంగాయి. దాంతో న‌దీ ప్ర‌వాహం క్ర‌మంగా పెరుగుతూ పోల‌వ‌రం వ‌ద్ద నీటిమట్టం 26 అడుగుల‌కు చేరింది.

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ నుంచి జూలై 31 నాడు అత్య‌ధికంగా 7.9ల‌క్ష‌ల క్యూసెక్కుల మిగులు జ‌లాలు దిగువ‌కు వ‌దిలారు.

పోలవరం కాఫ‌ర్ డ్యామ్‌ వద్ద వ‌ర‌ద ప్ర‌వాహం పెరగడంతో, బ్యాక్ వాటర్‌తో ప‌లు గిరిజ‌న గ్రామాల్లోకి వ‌ర‌ద నీరు వచ్చింది. తూర్పు గోదావ‌రి జిల్లా దేవీప‌ట్నం మండ‌ల కేంద్రం స‌హా 16 గ్రామాల‌కు వ‌ర‌ద ముప్పు ఏర్ప‌డింది. రెండు రోజుల పాటు ఆయా గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి.

దేవీప‌ట్నంతో పాటుగా పోచ‌మ్మ‌గండి, గొందూరు, ఊట‌ప‌ల్లి, వీర‌వ‌రం తదితర గ్రామాలు నీటమునిగాయి. కొన్ని చోట్ల ఇళ్ల‌ల్లోకి కూడా వ‌ర‌దనీరు వచ్చింది. దీంతో ప‌లువురు నిర్వాసితులు సామాన్లు కూడా సర్దుకుని కొండ‌ల‌పైన ఆశ్రయం పొందారు.

వరద వల్ల కాఫ‌ర్ డ్యామ్‌కు న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉండటంతో, నీటి ప్ర‌వాహానికి అడ్డు తొల‌గించేందుకు స్పిల్ వేకి ఎగువ‌న అడ్డుక‌ట్ట‌ను అధికారులు కొంత‌మేర‌ తొల‌గించారు. ఆ త‌ర్వాత నీటి ప్ర‌వాహం కార‌ణంగా అది పెద్ద గండిగా మారింది. దీంతో ల‌క్ష‌కు పైగా క్యూసెక్కుల వ‌ర‌ద నీరు స్పిల్ వేకి చేరింది. నిర్మాణంలో ఉన్న స్పిల్ వే 5వ గేటు నుంచి 15వ గేటు మ‌ధ్య‌లో రివ‌ర్ స్లూయిజ్‌ల ద్వారా ఈ నీరు దిగువ‌కు విడుద‌లవుతోంది. దీంతో పోల‌వ‌రం ప్రాజెక్ట్ చ‌రిత్ర‌లో తొలిసారిగా స్పిల్ వే నుంచి నీరు ప్ర‌వ‌హించిన‌ట్లైంది.

పోలవరం స్పిల్ వే
ఫొటో క్యాప్షన్, పోలవరం స్పిల్ వే (పాత చిత్రం)

మళ్లీ తగ్గింది

ఆగ‌స్టు 1 నుంచి నీటిమ‌ట్టం క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టింది. 1వ తేదీ సాయంత్రానికి పోల‌వ‌రం వ‌ద్ద 14 అడుగుల‌కు చేరింది. దీంతో స్పిల్ వేకు కూడా నీటి తాకిడి త‌గ్గింది.

బ్యాక్ వాటర్ వెనక్కి వెళ్లడంతో ముంపునకు గురైన గ్రామాల వాసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి వాళ్ల వాళ్ల ఇళ్లకు చేరుకున్నారు.

అయితే కాఫ‌ర్ డ్యామ్ వల్ల 26 అడుగుల నీటిమ‌ట్టానికే ఈ ప‌రిస్థితి తలెత్తితే, ఇక ఈ సీజ‌న్ ముగిసే నాటికి మ‌రింత వ‌ర‌ద ఉధృతి వ‌స్తే తమ ప‌రిస్థితి ఏంటని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తూర్పు గోదావ‌రి జిల్లా వీర‌వ‌రం లంక గ్రామానిక చెందిన పొందూరి వీర‌య్య బీబీసీతో మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నట్లు చెప్పారు.

''గ‌తంలో మూడో ప్ర‌మాద హెచ్చ‌రిక స్థాయికి వ‌ర‌ద నీరు చేరిన‌ప్పుడు మాత్ర‌మే గ్రామంలోకి వ‌ర‌ద నీరు వ‌చ్చేది. ఇప్పుడు మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక‌ను కూడా చేర‌న‌ప్ప‌టికీ వ‌ర‌ద వ‌చ్చేసింది. ఇది పెరిగితే ఏమ‌వుతుందోన‌ని బెంగ‌గా ఉంది. పున‌రావాస కాల‌నీ నిర్మించ‌లేదు. న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌లేదు. కానీ కాఫ‌ర్ డ్యామ్ తో మా ఇళ్లు ముంచేస్తున్నారు'' అని ఆయన వాపోయారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

70 శాతం చేశాం.. మిగతాది చేయండి: చంద్రబాబు

గోదావ‌రి న‌దీ జ‌లాలు పోలవరం స్పిల్ వే ని తాకడంపై మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించారు. ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయన పోల‌వ‌రం స్పిల్ వే వద్ద నీరు ప్రవహిస్తున్న వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.

''పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదన్న వాళ్ళు, ఈరోజు స్పిల్ వేలో ఉండే రివర్స్ స్లుయీజ్ గేట్ల ద్వారా 2లక్షల క్యూసెక్కుల వరద నీటిని మళ్లించారు. అవహేళనలని, ఆరోపణలని ఎదుర్కొంటూనే 70శాతం నిర్మాణం పూర్తిచేశాం. ఇంతాచేసినా మిగిలిన 30శాతం పూర్తి చేయకపొతే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుంది'' అని ట్వీట్ చేశారు.

పోలవరం

‘ఘనతగా చెప్పుకోవడం విడ్డూరం’

చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను ఏపీ రైతు మిష‌న్ ఉపాధ్య‌క్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి త‌ప్పుపట్టారు.

నీరు స్పిల్‌వేకి రావడం వైఫల్యమని, దాన్ని చంద్రబాబు ఘనతగా చెప్పుకోవడం విస్మయం కలిస్తోందని విమర్శించారు.

''పోల‌వ‌రం పూర్తి చేశామని, 2019లోనే నీళ్లిస్తామని చంద్రబాబు చెప్పిన మాటలకు, వాస్తవానికి పొంతన లేదు. నిర్వాసితుల‌కు న్యాయం చేయ‌కుండా గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదాల వ‌ల్ల ఇప్పుడు గిరిజ‌న గ్రామాలు నీటిపాల‌య్యాయి. కాఫ‌ర్ డ్యామ్‌కు గండి ప‌డ‌క‌పోయి ఉంటే మ‌రిన్ని గ్రామాలు వ‌ర‌ద‌లో మునిగిపోయేవి’’ అని నాగిరెడ్డి బీబీసీతో అన్నారు.

‘‘45.72 మీట‌ర్ల ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రిజర్వాయర్ లెవల్) ఉన్న ప్రాజెక్ట్‌లో 54 మీట‌ర్ల‌కు వరద నీరు షట్ట‌ర్ల వ‌ద్ద‌కు రావాలి. అలాంటిది 25.72 మీట‌ర్ల‌కే స్పిల్ వే వ‌ద్ద‌కు ఎందుకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. దాన్ని ఘనత అని చెప్పుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఎన్నిక‌ల ముందు హ‌డావిడిగా ఒక్క ష‌ట్ట‌ర్ ఏర్పాటు చేసి, బ‌స్సుల్లో అంద‌రినీ అక్క‌డికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత దాన్ని ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలి'' అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)