కాళేశ్వరం: ఈ ప్రాజెక్టు తెలంగాణను మాగాణం చేస్తుందా?

ఫొటో సోర్స్, meilteam.in/facebook
- రచయిత, రిపోర్ట్: బళ్ల సతీశ్
- హోదా, షూట్ & ఎడిట్: నవీన్ కుమార్
తెలంగాణలో గోదావరి నదిని గంగ అని పిలుచుకుంటారు. పెద్ద పెద్ద ఉపనదులను కలుపుకుంటూ... అడవులు, ఇసుక తిన్నెల మీదుగా దక్కన్ పీఠభూమి అగ్రభాగాన ప్రవహిస్తుంది గోదావరి.
బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం ఈ నదీ తీరాన ఉన్నాయి. మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి వంటి ఉప నదులు ఉన్నాయి. ఎల్లంపల్లి, మానేరు, శ్రీరాంసాగర్, దేవాదుల, ఇచ్చంపల్లి, దుమ్ముగూడెం వంటి సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి.
కానీ, తమ సంస్కృతిలో గోదావరి పాత్రకు దక్కిన గుర్తింపు గురించీ, తమ మాగాణాలకు పారాల్సిన గోదావరి నీళ్ల గురించీ ఇక్కడి ప్రజల్లో ఆవేదన, ఆక్రోశం ఉన్నాయి. గోదావరి ఒడ్డున పుణ్యక్షేత్రాలకు, పుష్కరాలకు ప్రాధాన్యత దక్కలేదన్న ఆవేదన సాంస్కృతిక పరమైనదైతే, ఈ సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణ రైతుకు నికరంగా నీళ్లివ్వలేకపోయాయన్నది ఆర్థికపరమైనది.
శతాబ్దాల పాటూ ఇక్కడి వ్యవసాయాన్ని నడిపించిన చెరువులు చెదిరిపోయాయి. చెరువులు ఎండిపోయి, బోర్లలో నీళ్లు రాక, గోదారిలో ఎగువ నుంచి నీరు పారక కరవుతో విలవిల్లాడారు తెలంగాణ రైతులు.
"చెరువుల్లో నీళ్లు లేవు. దాంతో, చాలా మంది బోర్లు వేస్తున్నారు. ఆ బోర్లలో నీళ్లు రాక ఎంతోమంది అప్పుల పాలవుతున్నారు" అని జగిత్యాల జిల్లా ఎర్దండి గ్రామానికి చెందిన బెల్లాల నరేశ్ చెప్పారు.
గోదావరి నీటిని తెలంగాణ మాగాణాలకు మళ్లించేందుకు చేపట్టిన మొదటి భారీ పథకం శ్రీరాం సాగర్ ప్రాజెక్టు. జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన ఆ ప్రాజెక్టు నిర్మాణం దశాబ్దాల పాటూ సాగింది. తెలంగాణలో సాగునీటి రంగం ప ట్ల అప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయనడానికి ఆ ప్రాజెక్టును ఒక ఉదాహరణగా చూపారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులు. ఎట్టకేలకు 1980లలో శ్రీరాం సాగర్ కాలువల ఫలితాన్ని రుచి చూశాయి ఉత్తర తెలంగాణ పల్లెలు.

గోదావరి నదిపై ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో చాలా ప్రాంతాలకు నీరు అందినా అది నికరంగా సాగలేదు. అందుకే సాగునీరు అంశం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత, పరిస్థితి క్రమంగా మారుతోంది. ఈ నది నీటిని ఎత్తి కాలువల్లోకి పోసి ఉత్తర తెలంగాణతో పాటూ, కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణకు కూడా నీరు పారించే ప్రయత్నంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
"2005లో పనికోసం గల్ఫ్‌కు వెళ్లాం. 2015లో వెనక్కి వచ్చాం. ప్రాజెక్టులు పూర్తయ్యి వ్యవసాయానికి ఇక్కడ నీళ్లు వస్తే, ప్రస్తుతం బయటి దేశాల్లో ఉంటున్న కార్మికుల్లో 99 శాతం మంది మా లాగే సొంతూళ్లకు వచ్చేస్తారు" అని జగిత్యాల జిల్లా రామాయంపేట గ్రామవాసి కళ్లెం తిరుపతి రెడ్డి అన్నారు.
కాళేశ్వరంతో పాటూ గోదావరిపై మరికొన్ని ప్రాజెక్టులూ అంతే చురుగ్గా కదులుతున్నాయి.

అయితే, దేశంలో ఏ రాష్ట్రమూ పెట్టనంత ఖర్చును ఒకే సాగునీటి ప్రాజెక్టుపై పెడుతోన్న ప్రభుత్వం, నిర్వాసితుల విషయంలో మాత్రం అంత ఉదారంగా లేదని విమర్శలు వచ్చాయి. ఏళ్ల తరబడి ఆందోళన చేసిన మల్లన్నసాగర్ నిర్వాసితులే ఇందుకు ఉదాహరణ.
"మాకు కొద్దిపాటి డబ్బులు మాత్రమే ఇచ్చారు. ఇంత వరకూ ఇల్లు కట్టివ్వలేదు. పునరావాసం పేరెత్తడం లేదు" అని వేముల ఘాట్ సర్పంచి చెప్పారు.
కరెంటు ఖర్చులు, నిర్వాసితుల సమస్యలపై చర్చలన్నీ గోదావరి ప్రవాహంలో కలిసిపోయాయి. వాటిని పట్టించుకునే ఆసక్తి ఇప్పుడు ఎవరికీ లేదు. గోదావరి నదిని తెలంగాణ అంతా పారించే ప్రయత్నాలు మాత్రమే వడివడిగా సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఏడీఆర్ సర్వే: కేసీఆర్ పాలనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన రేటింగ్ ఎంత?
- బాయ్ ఫ్రెండ్ కోసం భార్య గొంతునులిమి చంపిన భర్త
- మీడియా ద్వారా కుట్రలు కూడా చేయొచ్చా?
- శవాన్ని ఎరువుగా మారిస్తే ఇలా ఉంటుంది
- తెలంగాణ: 'కోతుల బాధితుల సంఘం'... పొలం కాపలాకు లక్ష జీతం
- 'నా అనారోగ్యం వల్ల నా భార్యకూ నరకం కనిపిస్తోంది' -ఉద్దానం బాధితుడి ఆవేదన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









