కశ్మీర్ ఎన్నికలు: ఒకప్పుడు పాకిస్తాన్ వెళ్లి శిక్షణ పొందిన మిలిటెంట్.. నేడు బీజేపీ అభ్యర్థి

ఫారూఖ్ ఖాన్

కశ్మీర్లో 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత మున్సిపల్ ఎన్నికలు అక్టోబర్ 16వ తేదీ మంగళవారం జరిగాయి. శ్రీనగర్ నగరపాలక సంస్థ పాలక వర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహమ్మద్ ఫారూఖ్ ఖాన్ గతంలో పాకిస్తాన్ వెళ్లి మిలిటెంట్లతో కలిసి శిక్షణ పొందిన వ్యక్తి. మిలిటెంట్ సంస్థల హెచ్చరికల్ని లెక్కచేయకుండా ఎన్నికల బరిలో నిలిచిన ఈ మాజీ మిలిటెంట్ తన గతం, వర్తమానాల గురించి ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే... ఆమీర్ పీర్జాదా అందిస్తున్న కథనం.

నియంత్రణ రేఖను దాటి, పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడి మిలిటెంట్ల క్యాంపుల్లో ఆయుధాల వాడకంలో శిక్షణ పొందిన వేలాది మంది కశ్మీరీ యువకుల్లో మహ్మద్ ఫారూఖ్ ఖాన్ ఒకరు.

ఆయన 1991లో సరిహద్దు దాటి తిరిగొచ్చాక అరెస్టయ్యారు. ఎనిమిదేళ్ల పాటు భారతీయ జైలులో గడిపారు. ఒకసారి అరెస్టయ్యాక తన సముదాయంలోనే తాను గౌరవం కోల్పోయానని ఖాన్ అంటారు.

ఖాన్ ఇప్పుడు బీజేపీలో చేరారు.. శ్రీనగర్ మున్సిపల్ సంస్థకు జరిగిన ఎన్నికల్లో ఆయన అభ్యర్థిగా నిలబడ్డారు. కశ్మీరీ వేర్పాటువాదులు తనను చేరదీయకపోవడం వల్లనే తాను బీజేపీలో చేరానని అంటారు ఫారూఖ్ ఖాన్.

అయితే ఆర్టికల్ 370, 35ఏ వంటి వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యానించడానికి ఖాన్ నిరాకరించారు.

కశ్మీర్‌ మున్సిపల్ ఎన్నికల్లో 200 మందికి పైగా అభ్యర్థులు పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి.

వీడియో క్యాప్షన్, వీడియో: ‘బీజేపీ వాళ్లే నయం.. నాపై నమ్మకం పెట్టుకున్నారు’

చీఫ్ ఏజెంట్‌గా పని చేశా..

1988లో నేను లీపా లోయ గుండా సరిహద్దు దాటి వెళ్లాను.

నేను పాకిస్తాన్‌లోని పీఓకేకు వెళ్లాను. మాది మొట్టమొదటి బృందం.

నేను ఏకే-47 ఉపయోగించగలను. ఆర్‌పీజీల్ని కూడా ప్రయోగించడం తెలుసు.

ఎంఎంజీలను ఉపయోగించడం కూడా తెలుసు నాకు. ఎల్ఎంజీ తెలుసు.

గ్రెనేడ్లు విసరడం కూడా తెలుసు నాకు.

1986లో కశ్మీర్‌లో ఎన్నికలు జరిగాయి.

ఆ ఎన్నికల్లో మహ్మద్ యూసుఫ్ మౌల్వీ షా పాల్గొన్నారు.

ఎస్‌పీ కాలేజిలో చదివే కొంత మంది యువకులం ఆయనకు మద్దతునిచ్చాం.

ఆ తర్వాత ఆయనకు నేను చీఫ్ ఏజెంట్‌గా పని చేశాను.

అయితే దురదృష్టవశాత్తు ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు.

రాత్రి 12 గంటల వరకూ ఆయన గెలవబోతున్నాడనే మాకు తెలుసు.

12.30 గంటలకు నన్ను ఇంట్లోంచి పట్టుకెళ్లారు.

నన్ను రాజ్ బాగ్ ఇంటరాగేషన్ సెంటర్‌కు తీసుకెళ్లారు.

అక్కడ ఎన్నో చిత్రహింసలు పెట్టారు.

కొంత మంది దోస్తులం కలిసి పాకిస్తాన్‌కు వెళ్లాలనే నిశ్చయించుకున్నాం. వారిలో నేనూ ఒకణ్ని.

కశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి

బీజేపీ వాళ్లే నయం.. నాపై నమ్మకం పెట్టుకున్నారు..

బుర్హాన్ వనీ మృతి చెందాడు.

ఆయన అంత్యక్రియల్లో 8 లక్షల మంది పాల్గొన్నారు.

చనిపోకుండా అరెస్టయి ఉంటే అతడు కూడా నాలాగే ఇక్కడుండే వాడు. మీ ఎదురుగా నిలబడేవాడు.

అన్నిటికన్నా కష్టమైన విషయం ఏంటంటే... చనిపోయినవాళ్లను అమరవీరులంటారు.

బతికిపోయిన వాళ్లను ఇన్‌ఫార్మర్లు, ప్రభుత్వ ఏజెంట్ లేదా ఐబీ ఏజెంట్ అని అంటారు.

నేను ఇక్కడికి చేరుకోవడానికి కారణాలేంటో మీరు అర్థం చేసుకోండి.

గిలానీ గానీ, మీర్వాయిజ్ గానీ నన్ను చేరదీసి ఉంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాణ్ని కాదు.

నేను వాళ్లను కలిశాను కూడా.

వాళ్లకంటే బీజేపీ వాళ్లే నయం. నాపై వాళ్లు అంత నమ్మకం పెట్టుకున్నారు.

బీజేపీలో హంతకులున్నారనీ, వాళ్లున్నారనీ, వీళ్లున్నారనీ జనాలు రకరకాలుగా అంటుంటారు.

అయితే వాళ్లెవరూ ఇక్కడికి వచ్చి చూడలేదు.

ఎలాగైనా సరే నేను వాళ్లతో కలిసి పని చేస్తాను. నబీ పరమతానికి చెందిన వ్యక్తిని అక్కున చేర్చుకున్నాడు. అతన్ని ప్రేమించాడు.

నేను కూడా వాళ్లను ప్రేమిస్తాను. వాళ్లతో కలిసి పని చేసే ప్రయత్నం చేస్తాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)