కబడ్డీ: తొడ కొడుతున్న కబడ్డీ... హైదరాబాద్‌లో నేడే సీజన్ 7 ప్రారంభం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రవిశంకర్ లింగుట్ల
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత సంప్రదాయ క్రీడల్లో ఒకటైన కబడ్డీ ఆధునిక రూపంలో వాణిజ్య హంగులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-7 సమరానికి ఈ రోజు తెర లేస్తోంది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో శనివారం సాయంత్రం ఏడున్నరకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, యు ముంబా జట్లు తలపడతాయి.
ఇదే రోజు ఇదే వేదికలో సాయంత్రం ఎనిమిదిన్నరకు మొదలయ్యే రెండో మ్యాచ్‌లో- డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు బుల్స్ మూడుసార్లు విజేతగా నిలిచిన పట్నా పైరేట్స్ జట్టును ఢీకొంటుంది.
మొత్తం 12 జట్లు ఉన్నాయి. గతంలో 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి లీగ్ దశను నిర్వహించారు. ఈసారి గ్రూపులు లేవు.
డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ జరుగుతుంది. ప్రతి జట్టు మిగతా 11 జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది.
ఈ విధానంతో ప్లే ఆఫ్స్‌కు పోటీ మరింత ఆసక్తికరంగా ఉండే అవకాశముంది.

ఫొటో సోర్స్, twitter/@ProKabaddi
గ్రూపులు లేకపోవడం, డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతి వల్ల అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లే ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంటాయని గతంలో జాతీయ కబడ్డీ జట్టు కోచ్‌గా సేవలందించి ఇప్పుడు జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఎల్.శ్రీనివాస్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
ప్లే ఆఫ్స్ దశకు ఆరు జట్లు
జులై 20 నుంచి అక్టోబరు 19 వరకు మూడు నెలలపాటు ఈ లీగ్ సాగనుంది. అక్టోబరు 11 వరకు సాగే లీగ్ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు ఉంటాయి.
ఈ దశలో పాయింట్ల పట్టికలో మొదటి నుంచి ఆరో స్థానం వరకు నిలిచిన జట్లు 'ప్లే ఆఫ్స్' దశకు అర్హత సాధిస్తాయి.
అక్టోబరు 14న రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు, ఆనక 16న రెండు సెమీఫైనల్స్ ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఫైనల్ ఎప్పుడు?
ఎలిమినేటర్ 1లో- మూడో స్థానంలోని జట్టు ఆరో స్థానంలోని జట్టుతో తలపడుతుంది.
ఎలిమినేటర్ 2లో- నాలుగో స్థానంలోని జట్టు ఐదో స్థానంలోని జట్టుతో పోటీపడుతుంది.
సెమీఫైనల్ 1లో- మొదటి స్థానంలోని జట్టుతో ఎలిమినేటర్ 1 విజేత తలపడుతుంది.
సెమీఫైనల్ 2లో- రెండో స్థానంలోని జట్టుతో ఎలిమినేటర్ 2 విజేత పోటీపడుతుంది.
సెమీఫైనల్స్ విజేతలతో అక్టోబరు 19న ఫైనల్ జరుగుతుంది.
హైదరాబాద్, ముంబయి, పట్నా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె, జైపూర్, పంచకుల, గ్రేటర్ నోయిడా వేదికలుగా లీగ్ సాగనుంది.
హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జులై 20 నుంచి 26 వరకు జరుగనున్నాయి.
వరుసగా మూడు సార్లు ఆ జట్టే
2014లో పీకేఎల్ మొదలైనప్పటి నుంచి ఆరు సీజన్లలో మూడు జట్లు విజేతలుగా నిలిచాయి.
అత్యధికంగా పట్నా పైరేట్స్ మూడుసార్లు, అదీ వరుసగా విజేతగా అవతరించింది.
బలమైన జట్టు ఏది?
అన్ని జట్లూ బలంగానే ఉన్నాయని, సీనియర్ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో పేపర్‌పై తమిళ్ తలైవాస్ ఎక్కువ బలంగా కనిపిస్తోందని శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రొ కబడ్డీ లీగ్ బాగా ప్రాచుర్యం పొందుతోందని, ఆటగాళ్ల పారితోషికం పెరుగుతుండటమే దీనికి నిదర్శనమని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పీకేఎల్ ప్రభావంతో కబడ్డీకి ఆదరణ పెరుగుతోందని, మెట్రో నగరాల్లోనూ ఆటపై ఆసక్తి పెరుగుతోందని తెలిపారు. కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో కూడా కబడ్డీ ఆడిస్తున్నారని చెప్పారు.
పీకేఎల్ మ్యాచుల షెడ్యూలును ఈ లింక్‌లో చూడొచ్చు. ఎలిమినేటర్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచుల వేదికలు ఖరారు కావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- కబడ్డీలో భారత ఆధిపత్యం కొనసాగేనా?
- ఆంధ్రప్రదేశ్: కబడ్డీ క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు
- క్రికెట్ స్పోర్ట్ కాదు.. క్రీడగా గుర్తించేందుకు నిరాకరించిన ప్రభుత్వం
- ఆఫీస్‌లో టిక్‌టాక్ వీడియోలు తీసి పోస్ట్ చేసినందుకు 11 మంది ఉద్యోగులపై చర్యలు
- యడ్యూరప్ప: మొదట బీఏ.. తర్వాత ఇంటర్ పాసయ్యారు
- 1983 వరల్డ్ కప్ సెమీఫైనల్: స్టంప్ తీసి ప్రేక్షకులను బెదిరించిన అంపైర్
- ఈ 'భారత ఎడిసన్' గురించి ఎంతమందికి తెలుసు...
- కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








