యడ్యూరప్ప: మొదట బీఏ.. తర్వాత ఇంటర్ పాసయ్యారు

యడ్యూరప్ప

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అఫ్రోజ్ ఆలం సహీల్
    • హోదా, బీబీసీ కోసం

కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మరికొన్ని గంటల్లో బీజేపీ నుంచి బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

అయితే, యడ్యూరప్ప ఎన్నికల అఫిడివిట్‌ను పరిశీలిస్తే ఆయన విద్యార్హతలు ప్రతీ ఎన్నికల వేళ మారుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

యడ్యూరప్ప

ఫొటో సోర్స్, AFROZ ALAM SAHIL/BBC

ఫొటో క్యాప్షన్, 2018 ఎన్నికల అఫడివిట్‌లో పీయూసీ చదివినట్లు పేర్కొన్న యడ్యూరప్ప

2013 ఎన్నికల అఫిడవిట్ (ప్రమాణపత్రం)‌లో బీఏ( బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్) చదివానని యడ్యూరప్ప పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో ఆయన కర్ణాటక జనతా పార్టీ నుంచి పోటీ చేశారు.

ఆ తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తాను 12వ తరగతి చదివానని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే విధంగా అఫిడవిట్ ఇచ్చారు.

యడ్యూరప్ప

ఫొటో సోర్స్, AFROZ ALAM SAHIL/BBC

ఫొటో క్యాప్షన్, 2014 లో తాను 12వ తరగతి పాసైనట్లు పేర్కొన్నారు.

2013 ఎన్నికల సమయంలో బెంగళూరు యూనివర్సిటీ నుంచి బీఏ చేసినట్లు అఫిడవిట్‌లో యడ్యూరప్ప పేర్కొన్నారు.

2014లో షిమోగ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు మాండ్య ప్రభుత్వ కాలేజీ నుంచి ఫ్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేసినట్లు తన ఎన్నికల అఫిడివిట్‌లో ఆయన తెలిపారు. (పీయూసీని ప్రస్తుతం ఇంటర్మీడియట్‌కు సమాన అర్హతగా పేర్కొంటారు.)

2018లో కూడా ఇదే విధంగా ఎన్నికల అఫడివిట్‌లో పేర్కొన్నారు.

కానీ, 2013 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫడివిట్‌లో మాత్రం బెంగళూరు యూనివర్సిటీ నుంచి బీఏ చదివినట్లు తెలిపారు.

యడ్యూరప్ప

ఫొటో సోర్స్, AFROZ ALAM SAHIL/BBC

ఫొటో క్యాప్షన్, 2013 ఎన్నికల ప్రమాణ పత్రంలో బెంగళూరు యూనివర్సిటీ నుంచి బీఏ చేసినట్లు యడ్యూరప్ప పేర్కొన్నారు.

ఆస్తుల్లోనూ అదే తీరు..

యడ్యూరప్ప ఆస్తులు కూడా ఎన్నికల అఫడివిట్‌లో పెరుగుతూ తరుగుతూ కనిపిస్తున్నాయి.

ఎన్నికల అఫిడవిట్‌లో యడ్యూరప్ప సమర్పించిన వివరాల ప్రకారం చూస్తే... 2008 ఎన్నికల సమయంలో ఆయన ఆస్తులు రూ.1.82 కోట్లు.

అయితే, 2013లో ఆయన ఆస్తుల విలువ రూ. 58 లక్షలకు తగ్గింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఆస్తుల విలువ రూ. 6.97 కోట్లకు పెరిగింది. 2018 ఎన్నికల వేళ ఆయన ఆస్తులు మళ్లీ తగ్గాయి.

ఎన్నికల ప్రమాణపత్రంలో పేర్కొన్నదాని ప్రకారం ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.48 లక్షలు.

ప్రస్తుతం శికారిపుర అసెంబ్లీ నియోజవర్గం నుంచి యడ్యూరప్ప ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.

2008లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్రానికి బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి కూడా యడ్యూరప్పనే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)