క‌ృష్ణా పడవ ప్రమాదం: ఎవరిని కదిలించినా కన్నీటి కథలే!

మనస్విని
ఫొటో క్యాప్షన్, ‘భోజనం చేశావా? బాగా చదువుకుంటున్నావా? అమ్మ నాతో చెప్పిన చివరి మాటలివి’
    • రచయిత, బళ్ళ సతీశ్, సంగీతం ప్రభాకర్
    • హోదా, బీబీసీ తెలుగు

కృష్ణమ్మ అలలపై బోటు కదులుతుంటే.. చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి వారు మురిసిపోయారు. కానీ రెండే రెండు నిమిషాలు వారి ఆనందాన్ని విషాదంగా మార్చేశాయి. పవిత్ర సంగమమే.. మృత్యు సంగమంగా మారింది. తలకిందులైన బోటు 22 మంది జీవితాలను జలసమాధి చేసింది. వారి ఆత్మీయులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

గత ఆదివారం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ వద్ద జరిగిన బోటు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

వీడియో క్యాప్షన్, కృష్ణా నదిలో జరిగిన బోటు ప్రమాదం మనస్విని తల్లి మరణించడంతో ఆమె అనాథగా మారారు.

ఎప్పుడూ అడ్డు చెప్పని తల్లి ఈసారి వెళ్లొద్దని వారించినా వినకుండా వెళ్లిన వాళ్లు కొందరు.. నీళ్లంటే భయపడుతూనే పడవ ఎక్కి, చివరి మజిలీ చేరుకున్నది ఇంకొకరు. పక్కింటి వాళ్ల మాట విన్నా ఇప్పుడీ బాధ ఉండేది కాదని మరొకరు.. ఇలా ఎవర్ని కదిలించినా కన్నీటి కథలే.

పడవ ప్రమాదంలో మరణించిన ఒంగోలు వాసుల బంధువులను బీబీసీ పలకరించింది. ఆనాడు ఏం జరిగింది.. ఈ దుర్ఘటన ఎలా తెలిసింది వంటి విషయాలను బీబీసీకి వివరించారు.

కృష్ణమ్మ మిగిల్చిన కన్నీరు
ఫొటో క్యాప్షన్, కుటుంబాల్లో విషాదం నింపిన బోటు ఇదే

ప్రమాదంలో అమ్మ.. మరణవార్త విని అమ్మమ్మ మృతి

పడవ ప్రమాదంలో లీలావతి అనే మహిళ జలసమాధి అయ్యారు. పుట్టెడు దుఖంలో ఉన్న ఆ ఇంటో మరో విషాదం చోటుచేసుకుంది. లీలావతి మృతదేహాన్ని చూసి ఆమె తల్లి లక్ష్మికాంతమ్మ గుండెపోటుతో చనిపోయింది. ఒకేసారి తల్లి, అమ్మమ్మలను కోల్పోయిన లీలావతి కూతురు మనస్విని మనసు మూగబోయింది.

బీబీసీ ప్రతినిధులు వెళ్లిన సమయంలో తన ఇంటి మొదటి అంతస్తులో చుట్టాలు, స్నేహితుల మధ్య కూర్చుని ఉంది మనస్విని. ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న మనస్వినికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తల్లి, అమ్మమ్మ కూడా ఆమెను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయారు. వారం రోజులు గడుస్తున్నా ఆ చేదు జ్ఞాపకం నుంచి ఆమె ఇంకా బయటకు రాలేకపోతోంది.

"నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా కజిన్ ఫోన్ చేశాడు. శుభలేఖ ఇవ్వడానికి వచ్చాం. కానీ అమ్మ ఫోన్ కలవడం లేదు అని చెప్పాడు. నేను ట్రై చేస్తే నాట్ రీచబుల్ వచ్చింది. మామూలుగా అమ్మ ఫోన్ ఎప్పుడూ స్విచాఫ్ అవ్వదు. నేను 2 గంటలు ట్రై చేశా. కలవలేదు. ఇంతలో మా కజిన్ వాట్సప్‌లో ఫోటో పెట్టాడు. అమ్మను నీళ్ల నుంచి తీస్తున్న ఫోటో అది. నేను బతికే ఉందనుకున్నా. తరువాత మా కజిన్ వచ్చి తీసుకెళ్లాడు. కార్లో వస్తున్నప్పుడు తెలిసింది అమ్మ నన్ను వదిలేసి వెళ్లిపోయిందని".

"మా అమ్మకు నీళ్లంటే చాలా భయం. నాకు తెలిసి తను బోట్‌లో వెళ్లడం అదే ఫస్ట్ టైమ్. ఆ రోజు ఎందుకు వెళ్లిందో తెలియదు. భయానికే చనిపోయి ఉంటుంది. అమ్మ చాలా పూజలు చేస్తుంది. దేవుణ్ణి బాగా నమ్ముతుంది. కానీ అమ్మను ఏ దేవుడూ కాపాడలేదు. నాకు రెండేళ్లున్నప్పుడు డాడీ చనిపోయాడు. నాన్న ఎలా ఉంటాడో కూడా గుర్తులేదు. అమ్మే అన్నీ. ఇద్దరు పేరెంట్సూ ఉన్నా అంత బాగా చూడలేరు. ఏం చెప్తాం అమ్మ గురించి? ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ లైఫ్ నాకిచ్చి వెళ్లిపోయింది".

ఎన్ని రోజులు ఏడిస్తే నా బాధ తగ్గుద్ది?

నాకు అమ్మ, అమ్మకు నేను తప్ప ఇంకెవరూ లేరు. ఆ ఒక్కరోజు వెళ్లుండకపోతే నాకు ఈ రోజు ఇంకోలా ఉండేది. ఇంత కంటే హార్ట్ బ్రేక్ ఏముంటుంది. ఏడుపు రాదు నాకింక. ఆరోజు మధ్యాహ్నం చాలా బాగా మాట్లాడింది. ఊరొచ్చినప్పుడు బస్టాండ్‌కొచ్చి నవ్వుతూ మాట్లాడింది. జాగ్రత్తలు చెప్పింది. తిరిగివచ్చేసరికి శవం అయిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం చివరిసారి ఫోనులో మాట్లాడింది అమ్మ. భోజనం చేశావా? పరీక్షలకు చదువుకుంటున్నావా? అని అడిగింది".

"ఇప్పుడు ఎవరైనా చూసుకుని ఎక్కాలి కదా అనొచ్చు. కానీ, తప్పు వాళ్లకు (బోటు వాళ్లకు) తెలియాలి. అలా ఎలా ఎక్కించేస్తారు? తప్పు కదా? 10 మంది పట్టే బోట్లో 40 మందిని ఎలా ఎక్కిస్తారు? వాళ్లకు తెలియాలి కదా. కచ్చితంగా తప్పే కదండి? వాళ్ల నిర్లక్ష్యం కారణంగా నేను జీవితాంతం అమ్మను గుర్తు చేసుకుని బాధపడాలి. నాన్న లేడని ఒక్కరోజు ఫీలవ్వలేదు. ఎన్ని రోజులు ఏడిస్తే నా బాధ తగ్గుద్ది? కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి".

ఎవర్ని కదిలించినా కన్నీటి కథలే!
ఫొటో క్యాప్షన్, బోటు ప్రమాదంలో అల్లుడు-కూతుర్ని కోల్పోయిన పుష్పవతి

అమ్మ మాట వినుంటే బతికేవాళ్లు!

ఒంగోలుకు చెందిన పసుపులేటి సీతారామయ్య, అంజమ్మ దంపతులు కూడా పడవ ప్రమాదంలో చనిపోయారు. తల్లి మాట వినుంటే వీళ్లు బతికి ఉండేవాళ్లు. వెళ్లొద్దని వారించినా, అరిచినా, తల్లి మాట వినకుండా యాత్రకు వెళ్లారు. శవమై తిరిగొచ్చారు.

పసుపులేటి సీతారామయ్య, అంజమ్మ దంపతులకు తీర్థయాత్రలు చేయడం హాబీ. సీతారామయ్య ఆర్ఎంపీ డాక్టరు. దాదాపుగా దేశంలోని అన్ని యాత్రలూ చుట్టేశారీ దంపతులు. తాజా యాత్ర నిర్వహణలో, వాకర్స్ క్లబ్‌లో చురుకైన పాత్ర పోషించారు సీతారామయ్య. ఈ యాత్రకు వెళ్లేటప్పుడు అంజమ్మ, తన తల్లి పుష్పవతిని కూడా పిలిచారు. కానీ ఆమె కూతురిపై చిరాకు పడ్డారు.

"యాత్రకు వెళ్లే ముందు అంజమ్మ మా ఊరు వచ్చింది. అమరావతి వెళ్తున్నాం రా అమ్మా అని అడిగింది. నేను రాలేను కాళ్ల నొప్పులు అన్నాను. అయినా, ఎప్పుడూ పనీ పాటల్లేకుండా తిరుగుతారు? మీకు పనుల్లేవా? బాధ్యతల్లేవా? అని అరిచాను. నువ్వు రాకపోతే మానేయ్ కానీ, మేం వెళ్లి వస్తాం కదా అంది. అంతా సోమవారం వెళతారు. మీరేంటీ ఆదివారం వెళుతున్నారు అని అడిగా.. ఆదివారం ఇంకా మంచి రోజు అని చెప్పింది. అయినా నువ్వు రావచ్చు కదా అమ్మా అంది. ఏందమ్మా.. ఏం అమరావతి.. పోతానే ఉంటారు. వస్తానే ఉంటారు. ఇంట్లో పనులెట్టా సాగుతాయ్ అన్నా. ఇంట్లో పనులు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాంలే, మాకేమన్నా వ్యవసాయమా? ఇంటి పనేగా అంది. మీ ఆయనేంటి ఇంకా అయ్యప్ప మాల వేయలేదు అని అడిగా. ఈ యాత్రకు వెళ్లొచ్చి, తిరుపతి వెళ్లాక వేస్తారులే అంది" అంటూ కూతురితో తన చివరి సంభాషణ గుర్తు చేసుకుంది పుష్పావతి.

కూతురు, అల్లుడితో కలసి చాలా యాత్రలు చేసింది ఆమె. వాళ్లు ఎప్పుడు యాత్రలకు వెళ్లినా ఇలా వారించలేదు. కానీ మొదటిసారి యాత్రల గురించి కూతురిపై చిరాకు పడింది పుష్పవతి. సీతారామయ్య, అంజమ్మలు ఎక్కడికి వెళ్లినా మనవరాలిని కూడా తీసుకెళ్తారు. ఆరేళ్ల ఉజ్వలసాయి ఈ ఘటనలో క్షేమంగా బయటపడింది.

మా ఇతర కథనాలు:

ఎవర్ని కదిలించినా కన్నీటి కథలే!
ఫొటో క్యాప్షన్, పడవ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన చిన్నారి ఉజ్వలసాయి

అనుమానం వచ్చి అడిగితే నిజం చెప్పారు

పడవ ప్రమాదంలో అత్తమామలు చనిపోయిన విషయం ఆయన స్నేహితుల ద్వారా తెలిసిందని చెప్పారు సీతారామయ్య కోడలు హేమలత.

"ఆరోజు సాయంత్రం ఆయన ఇంటికి హడావుడిగా వచ్చి డబ్బు, ఆధార్ కార్డులు తీస్తున్నారు. నేను అడిగితే పని ఉందని, ఫ్రెండ్స్‌తో వెళ్తున్నాననీ అబద్దం చెప్పారు. నాకు అనుమానం వచ్చి అడిగినా నిజం చెప్పలేదు. పాప కార్టూన్స్ చూస్తూ ఛానల్ మార్చనివ్వకపోతే, టీవీ చూడడం కుదరలేదు. ఇంతలో మా అక్క కాల్ చేసి, మీ అత్తమామలతో మీ అమ్మాయి వెళ్లిందా అని అడింది. నేను లేదు అని చెప్పాను. వాస్తవానికి మా అమ్మాయి వాళ్లతో వెళ్లింది. నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పక్కనే మా రెండో అమ్మాయి ఉందని అలా చెప్పాను. తనను పంపలేదని రెండో పాప గొడవ చేస్తుందని నా భయం. నా సమాధానం విని అక్క ఇంకేమీ మాట్లాడలేదు. ఈలోపు మా మామాగారి స్నేహితులు వచ్చి ఫోన్ నంబర్లు అడిగారు. నాకు అనుమానం వచ్చి అడిగితే విషయం చెప్పారు".

మా ఇతర కథనాలు:

ఎవర్ని కదిలించినా కన్నీటి కథలే!
ఫొటో క్యాప్షన్, మా అత్తమ్మ నన్ను కూతురు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేది-హేమలత

అత్తమ్మ కాదు.. అమ్మకంటే ఎక్కువ

"పెళ్లై ఏడేళ్లయింది. అత్తాకోడళ్ల మధ్య గొడవలుంటాయంటారు. మా అత్తతో గొడవలు కాదు కదా.. కనీసం నాపై అరిచేది కూడా కాదు. నేను చిన్నపిల్లాడితో ఉంటే, తనే స్కూలుకు క్యారేజ్ పట్టుకెళ్లేది. ఆవిడే వంట చేసేది. నాకు పని చేప్పేది కాదు. ఎవరైనా నేను పనిచేయడం లేదని అన్నా, నన్ను వెనకేసుకొచ్చేది. మా కోడలికి పిల్లలతోనే సరిపోతుందని బయటి వారికి సర్దిచెప్పేది. నేను పురుడుకి వెళ్లినప్పుడు నా ఇద్దరు పిల్లలనీ ఆమే చూసుకుంది. మామగారు తండ్రిలా చూసుకునేవారు. అమ్మాయి అని పిలిచేవారు. మా ఆయనకు ఏమీ తెలీదు. ఒక్కడే కొడుకు అని చాలా గారాబంగా పెంచారు. ఏం కావాలన్నా ఆయనే చూసుకునేవారు. చిన్న పిల్లల్లా ఆడుకుంటారు. మా ఇద్దర్నీ ఒంటరి చేసేసి వాళ్లు వెళ్లిపోయారు" అంటూ హేమలత కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎవర్ని కదిలించినా కన్నీటి కథలే!
ఫొటో క్యాప్షన్, నేను వెళ్లే సరికే నాన్నను ఐస్‌బాక్స్‌లో పెట్టేశారు-సతీశ్ కుమార్

టీవీలో చనిపోయిన అమ్మ ఫొటో చూశా

సీతారామయ్య-అంజమ్మ కుమారుడు సతీశ్‌ కుమార్ ఆ విషాదం నుంచి ఇంకా తేరుకోలేదు. స్నేహితులు ఫోన్ చేసి చెప్పినా.. తమవాళ్లు అయి ఉండరులే అనుకున్నారు. కానీ టీవీలో చూసి షాక్‌కు గురయ్యారు.

‘‘ఆ రోజు నేను మా అమ్మాయిని తీసుకుని బీచ్‌కి వెళ్లా. మా గురుస్వామి ఫోన్ చేసి ఎవరెవరు వెళ్ళారు యాత్రకి అని అడిగితే చెప్పా. బోట్ ప్రమాదం జరిగింది అన్నారు. మనది కాదులెండి అని చెప్పి, నేను పట్టించుకోలేదు. కాసేపాగితే ఒంగోలు వాసులు అన్నారు. టీవీ చూడగానే అమ్మ ఫోటో కనిపించింది. అమ్మ చనిపోయింది. నాన్నకు ఎలా ఉందో తెలీదు. వెంటనే విజయవాడ వెళ్లాం. నేను వెళ్లే సరికే నాన్నను ఐస్ బాక్సులో పెట్టేశారు. నాన్న నీటి నుంచి వచ్చినప్పుడు బతికే ఉన్నారు. ఐసియులో ఉండగా మరణించారు. చిన్నప్పటి నుంచీ ఏ కష్టం తెలియకుండా పెంచారు. ఏ కార్యక్రమం జరిగినా నాన్న ముందుంటారు. ఆయన లేకపోవడం పెద్దలోటు. అమ్మా నాన్న ఇద్దరూ లేకపోవడంతో ఏం చేయాలో తెలియడం లేదు’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు సతీశ్ కుమార్.

మా ఇతర కథనాలు:

ఎవర్ని కదిలించినా కన్నీటి కథలే!
ఫొటో క్యాప్షన్, మా అబ్బాయి వెళ్ళను అన్నాడు. నేనే బలవంతంగా టూర్‌కి పంపించా-శ్రీలక్ష్మి

‘వెళ్ళనంటే నా కొడుకును బలవంతంగా పంపా’

వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శాయని కోటేశ్వరరావు కూతురు శ్రీలక్ష్మిది విచిత్ర పరిస్థితి. ప్రమాదంలో తల్లీ తండ్రీ ఇద్దరూ పోయారు. కానీ కొడుకు బతికాడు. ఈ యాత్ర నిర్వహణలో కోటేశ్వరరావుది చురుకైన పాత్ర. ఆయన భార్య వెంకాయమ్మ, మనవడు సాయితో కలిసి వెళ్లారు. కానీ సాయి ఒక్కడే బతికాడు.

‘‘నేను పెళ్లయ్యాక చదువుకుని ఉద్యోగం సంపాయించా. దీంతో నా పిల్లలను అమ్మానాన్నే చూసుకునేవారు. అమ్మానాన్న యాత్రలకు వెళుతుంటారు. ఒకట్రెండు రోజుల టూర్ అయితే పిల్లలను కూడా పంపుతాను. వాళ్లకు ఆటవిడుపు ఉండాలి అని నా ఉద్దేశం. వీలుంటే నేను కూడా వెళ్తాను. ఈసారి మా అబ్బాయి వెళ్లను అన్నాడు. నేనే బలవంతంగా పంపాను’’.

ఎవర్ని కదిలించినా కన్నీటి కథలే!
ఫొటో క్యాప్షన్, జల గండం నుంచి బయటపడిన సాయి అక్షర నివాస్

‘‘నాన్న చాలా చురుగ్గా ఉండేవారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువ. రిటైర్ అయి పదేళ్లు అయినా ఎప్పుడూ ఎవరో ఒకరికి ఏదో ఒక పని చేసి పెడుతూనే ఉంటారు. ఈ మధ్యే వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయ్యాక అక్కడ పనులు కోసం తిరుగుతున్నారు. అవన్నీ నీకెందుకు అన్నా వినేవారు కాదు’’.

ఎవర్ని కదిలించినా కన్నీటి కథలే!

‘‘నాన్నకు ఎప్పుడూ చుట్టూ చుట్టాలుండాలి. ఈ మధ్యే నాన్నకు షష్ఠిపూర్తి చేసుకోవాలని ఆశ కలిగింది. ఆ వంకతోనైనా చుట్టాలంతా ఒక చోట చేరతారని ఆయన కోరిక. వాకింగ్‌ ప్రాంతానికి చుట్టుపక్కలే మా బంధువుల ఇళ్లున్నాయ్. రోజుకొకరి ఇంటికి వెళ్లి పలకరిస్తారు. ఆరోజు అమరావతి నుంచి ఫోన్ చేశారు. స్నానాలు చేశామని చెప్పారు. సాయంత్రం అయ్యేసరికి నాకు ఫోన్లు వచ్చాయి. టీవీ చూసి కన్ఫామ్ చేసుకున్నాను’’ అంటూ ఆ రోజును తల్చుకుని బాధపడ్డారు.

మా ఇతర కథనాలు:

ఎవర్ని కదిలించినా కన్నీటి కథలే!

అందరూ ముసలోళ్లే.. అందుకే వెళ్లనన్నా: సాయి

తాతయ్య-అమ్మమ్మలతో పాటు వెళ్లిన కోటేశ్వర రావు మనవడు సాయి గండం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. తాను వెళ్లనన్నా బలవంతంగా పంపించారని ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు సాయి.

‘‘యాత్రకు వెళ్లడం నాకిష్టం లేదు. అందరూ ముసలోళ్లే వెళ్లనన్నా. అమ్మ బలవంతంతో వెళ్లా. అమరావతి-విజయవాడ బస్సులో వెళ్లాం. ముందు గవర్నమెంట్ స్టీమర్ అడిగాం. కానీ అందులో సీట్లు అయిపోయాయి అన్నారు. దీంతో ప్రైవేటు బోట్ ఎక్కాం. ఒడ్డుకు చేరేటప్పుడు పడిపోయింది. అలలకి కంట్రోల్ తప్పింది. దిమ్మ తగిలి షేక్ అయి పడవ సడెన్‌గా ఒరిగింది. అందరూ ఒకవైపు వచ్చేసరికి పడిపోయింది. అందరూ మునిగిపోయారు. ఎలాగోలా నేను పైకి వచ్చి ఊచలు పట్టుకుని ఉన్నాను. చేపలు పట్టే వాళ్ళు వచ్చి నన్ను ఒడ్డుకు చేర్చారు’’ అంటూ ఆ దుర్ఘటన క్షణాలను గుర్తు చేసుకున్నాడు.

పడవ ప్రమాద మృతుల బంధువులను ఎవర్ని పలకరించినా ఇలాంటి కన్నీటి కథలే వినిపించాయి. ఈ ప్రమాదం వీరి జీవితాల్లో అంతులేని విషాదం మిగిలింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)