ఆసియా క్రీడలు: కబడ్డీలో భారత ఆధిపత్యం కొనసాగేనా?

భారత పురుషుల కబడ్డీ జట్టు కెప్టెన్ అజయ్ ఠాకుర్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, భారత పురుషుల కబడ్డీ జట్టు కెప్టెన్ అజయ్ ఠాకుర్
    • రచయిత, శివకుమార్ ఉలగనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారి భారత కబడ్డీ ఆటగాళ్లు బంగారు పతకం లేకుండా తిరిగొచ్చారు.

భారత పురుషుల జట్టు గురువారం ఇరాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 18-27 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.

ఇక మహిళల జట్టు ఆ మరుసటి రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అదే ఇరాన్ చేతిలో 24-27 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో యేటా ఇండియాకు రావడం ఆనవాయితీగా మారిన ఆసియా క్రీడల కబడ్డీ బంగారు పతకం ఈసారి మొహం చాటేసింది.

బీజింగ్‌లో 1990లో జరిగిన ఆసియా క్రీడల్లో తొలిసారి పురుషుల విభాగంలో కబడ్డీని చేర్చారు. అప్పటి నుంచి వరుసగా ఏడు ఆసియా క్రీడల్లోనూ భారత పురుషుల జట్టు బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం కాంస్యంతో సరిపెట్టుకుంది.

మహిళల విభాగంలో కబడ్డీని 2010 ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టారు. భారత మహిళల కబడ్డీ జట్టు కూడా అప్పటి నుంచి వరుసగా బంగారు పతకమే సాధిస్తోంది. ఈసారి వారు కూడా పురుషుల జట్టు మాదిరిగానే స్వర్ణం వేటలో విఫలమై, రజత పతకం సాధించారు.

దీంతో కబడ్డీ ప్రేమికుల్లో ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలయ్యాయి.. ఆ ఆటలో భారత్ ఆధిపత్యానికి చెక్ పడుతోందా అన్న సందేహాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బీబీసీ పలువురు కబడ్డీ ఆటగాళ్లు, కోచ్‌లతో మాట్లాడింది. వారేమంటున్నారో చూడండి.

2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన జట్టు

‘‘ఒక్క ఓటమితోనే నిర్ణయించలేరు’’

ఆసియా క్రీడల్లో భారత్ వైఫల్యంపై జట్టు కోచ్ రణ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ.. అనుభవం, నైపుణ్యం ఉన్న ఆటగాళ్లున్నప్పటికీ ముందస్తు వ్యూహం ప్రకారం ఆడలేకపోయారని, అందుకే ఓటమి తప్పలేదని అన్నారు.

''అజయ్ ఠాకుర్, దీపక్ హుదా, సందీప్ వంటి సీనియర్ ఆటగాళ్లున్నా కూడా మా వ్యూహం పనిచేయలేదు'' అన్నారాయన.

అయితే.. ఈ పరాజయంతో కబడ్డీలో భారత్ ఏకఛత్రాధిపత్యానికి తెరపడినట్లు భావించవచ్చా అన్న ప్రశ్నకు సమాధానంగా.. ''ఒకట్రెండు పరాజయాలతో ఈ ఆటలో భారత్‌కు ఉన్న ప్రతిష్ఠేమీ తగ్గిపోదు. మా అనుభవం, నైపుణ్యంతో జట్టును మళ్లీ విజయపథాన నడిపిస్తాం'' అని చెప్పారు.

''ప్రో కబడ్డీ పోటీల నిర్వహణ వల్ల విదేశీ ఆటగాళ్లు ఇక్కడ ఆడుతూ మెలకువలు నేర్చుకునేందుకు సహాయపడిందా?'' అని ప్రశ్నించగా... ఈ పోటీల వల్ల భారత ఆటగాళ్లు కూడా విదేశీ ఆటగాళ్ల నుంచి మెలకువలు నేర్చుకోగలుగుతారని.. అలాగే విదేశీ ఆటగాళ్లూ నేర్చుకుంటారని చెప్పారు. ఈ పోటీలు ఆట సార్వజనీనం కావడానికి సహకరిస్తుందే తప్ప ఈ ఓటమికి కారణం కాదని అన్నారు.

కబడ్డీ

ఫొటో సోర్స్, Getty Images

2016 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన జట్టులో సభ్యుడైన చేరలతన్ దీనిపై మాట్లాడుతూ.. లీగ్ దశలో దక్షిణ కొరియాతో ఓడిపోయాక మరింత జాగ్రత్త పడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. భవిష్యత్ టోర్నీల కోసం భారత ఆటగాళ్లు మరింత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

''సెమీ ఫైనల్‌లో కీలక సమయంలో కెప్టెన్ ఠాకుర్ గాయపడ్డాడు. ఇది ఫలితంపై తీవ్ర ప్రభావం చూపింది'' అని ఆయన విశ్లేషించారు.

అంతేకాదు.. పురుషుల, మహిళల జట్లు రెండింటిలోనూ రైడర్లు, డిఫెండర్లు పలు మ్యాచ్‌ల్లో కీలక సమయాల్లో పొరపాట్లు చేశారని ఆయన అన్నారు.

ఇరాన్, భారత్ మధ్య పోటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత మహిళల జట్టు ఇరాన్ చేతిలో ఓడిపోయింది.

మాజీ క్రీడాకారిణి తేజస్విని మాట్లాడుతూ.. ఈ టోర్నీ కోసం మహిళల జట్టు బాగా సిద్ధమైనప్పటికీ కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో అనుకున్న వ్యూహాలను అమలు చేయలేకపోయిందని అన్నారు.

మరో కబడ్డీ ప్లేయర్ థామస్.. ''భారత పురుషుల జట్టు సెమీఫైనల్‌లోనే కాదు లీగ్ దశలోనూ ఓడిపోయింది.. అంతేకాదు, ప్రపంచకప్‌లోనూ ఓడిపోయింది'' అని గుర్తు చేశారు.

మిగతా దేశాలన్నీ ఈ ఆటలో రాటుదేలుతున్న నేపథ్యంలో.. భారత్ స్వీయవిశ్లేషణ చేసుకుని లోపాలు సవరించుకోవాలని, లేని పక్షంలో ఆధిపత్యం కోల్పోవాల్సిన పరిస్థితి రావొచ్చని థామస్ అన్నారు.

కాగా పలువురు క్రీడాభిమానులు హాకీతో కబడ్డీని పోల్చి జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందని హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్న భారత హాకీ జట్టు 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తరువాత మళ్లీ ఇంతవరకు పతకం సాధించలేకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు.

ఒకట్రెండు పరాజయాలతో భారత్ కథేమీ ముగిసిపోకపోయినా భారత్ తమ ఆటను విశ్లేషించుకుని, ప్రత్యర్థి జట్ల వ్యూహాలను అర్థం చేసుకుని ముందుకెళ్తే మళ్లీ పూర్వ వైభవం దక్కించుకోవడం ఖాయమంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)