ధోనీ కూడా రిటైర్మెంట్ విషయంలో సచిన్, కపిల్ దేవ్‌ల దారిలోనే వెళ్తున్నాడా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అభిజిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ఉపఖండంలో రిటైర్మెంట్ తీసుకునే విషయంలో క్రికెటర్లకు చాలా స్వేచ్ఛ ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా భావించాడు.
వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో న్యూజీలాండ్‌తో భారత్ ఓడిపోయిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ భవిష్యత్తు గురించి స్టీవ్ వాను ఒక ప్రశ్న అడిగారు.
స్టీవ్ వాను న్యూస్ ఏజెన్సీ పీటీఐ ప్రశ్నించింది.
ఆస్ట్రేలియా క్రికెట్ రిటైర్మెంట్ పాలసీ, 2004లో అతడి రిటైర్మెంట్ గురించి ప్రశ్నించినపుడు స్టీవ్ వా "ఆస్ట్రేలియా కచ్చితంగా అలా చేస్తుంది. ఎందుకంటే మనం ఎంత పెద్ద ఆటగాడైనా, అందులో పెద్ద తేడా ఉండదు. మనం తప్పుకోవాల్సిందే" అన్నారు.
అయితే భారత్, ఆస్ట్రేలియాలో ఆటగాళ్లను ఒకేవిధంగా చూడ్డం కూడా సరికాదని కూడా స్టీవ్ వా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"బహుశా భారత ఉపఖండంలో ఆటగాళ్లకు కాస్త స్వేచ్ఛ లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 140 కోట్ల మంది వారిని ఫాలో అవుతుంటారు. ఇక్కడ ఒక క్రికెటర్ మామూలు ఆటగాడిలా ఉండడు. అతడు ప్రముఖుడు అయిపోతాడు, దేవుడైపోతాడు. అలా అయ్యాక రిటైర్మెంట్ తీసుకోవడం అంటే అంత సులభం కాదు" అన్నాడు.
"ఒక నిర్ణీత వయసుకు చేరుకోగానే అది చాలా సవాలుగా మారుతుంది. మీరు చెబుతున్న మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికీ గొప్ప ఆటగాడు" అని స్టీవ్ వా చెప్పాడు.
ఇప్పుడు, భారత ఉపఖండంలో నిజంగా పెద్ద క్రికెటర్లకు రిటైర్మెంట్ గురించి చాలా స్వేచ్ఛ ఉందా, మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేందుకు సరైన సమయమా ఇదేనా అనే ప్రశ్న కూడా వస్తుంది.
మొదట ధోనీ విషయానికి వద్దాం. ఎందుకంటే వరల్డ్ కప్‌లో అతడు నెమ్మదిగా ఆడడంపై జనం ప్రశ్నలు సంధిస్తున్నారు. అతడు రిటైరయితే మంచిదని కూడా మాట్లాడేస్తున్నారు.
జులై 7న 38వ ఏట అడుగుపెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ ఐదేళ్ల ముందు 2014లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. కానీ వన్డే, టీ20ల్లో మాత్రం ఆడుతున్నాడు.
వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ కూడా ధోనీ రిటైర్మెంట్ గురించి తనకేం చెప్పలేదని అన్నాడు.

ఫొటో సోర్స్, AFP
ధోనీ టీ20ల్లో 98 మ్యాచ్‌లు ఆడి 1617 రన్స్ చేశాడు. ఈ ఫార్మాట్లో అతడి సగటు 37.60, స్ట్రైక్ రేట్ 126.13 ఉంది.
ఇక వన్డేల్లో 10,773 పరుగులు చేసిన ధోనీ సగటు 50.58 పరుగులు. స్ట్రైక్ రేట్ 87.56.
వరల్డ్ కప్ 2019లో పరుగుల విషయానికి వస్తే ధోనీ 27వ స్థానంలో నిలిచాడు. 272 పరుగులు చేసిన ధోనీ భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ(648), విరాట్ కోహ్లీ(443), లోకేశ్ రాహుల్(361) తర్వాత నాలుగో స్థానంలో నిలిచాడు.
ఇక వరల్డ్ కప్‌లో ధోనీ స్ట్రైక్ రేట్ స్ట్రైక్ రేట్ 87.78. కెప్టెన్ కోహ్లీ ఈ టోర్నీలో 94.06 స్ట్రైక్ రేటుతో ఆడాడు. ధోనీ ఓవరాల్ స్ట్రైక్ రేట్ కూడా 87.56 అనే విషయం ఇక్కడ చెప్పుకోవాలి.
గత కొంతకాలంగా ధోనీ ప్రదర్శన గమనిస్తే 2016లో అతడు 13 వన్డేల్లో 27.80 సగటుతో ఆడాడు. అదే 2018లో అతడి బ్యాటింగ్ సగటు 25.00 ఉంది.
కానీ 2017లో మాత్రం ధోనీ 60.62 యావరేజితో ఆడాడు. 2019లో ఇప్పటివరకూ అతడి బ్యాటింగ్ సగటు 60.00.
ధోనీ ప్రదర్శన గణాంకాలు చూస్తుంటే అతడి ఆటతీరు యావరేజి కంటే అంత ఘోరంగా లేదని మనం కచ్చితంగా చెప్పచ్చు. కానీ రిటైర్మెంట్ ప్రకటించేందుకు అతడు తన ప్రదర్శన మరింత పడిపోయేవరకూ వేచిచూడాలా అనే ప్రశ్న కూడా వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
మొదటి ఉదాహరణ: సచిన్ టెండూల్కర్
ఈ విషయంలో ధోనీ ముందున్న ఒక అతిపెద్ద ఉదాహరణ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. 2019 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవద్దని సచిన్ ధోనీని కోరుతున్నాడు.
సచిన్ తన క్రికెట్ కెరీర్లో 6 వరల్డ్ కప్‌లు ఆడాడు. ఆ సమయంలో ఎన్నో రికార్డులు సెట్ చేశాడు. రిటైర్ అయ్యాక మాట్లాడిన సచిన్ "2007 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకోవాలని అనుకున్నానని, కానీ వివియన్ రిచర్డ్స్ సలహాతో మనసు మార్చుకున్నానని" స్వయంగా చెప్పాడు.
2011 వరల్డ్ కప్‌లో భారత్ సొంతగడ్డపై చాంపియన్‌గా నిలిచింది. అది సచిన్ రిటైర్మెంట్ తీసుకోడానికి చాలా మంచి అవకాశం. కానీ తను అలా చేయలేదు.
2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడిన వన్డేలు, టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ ప్రదర్శన పడిపోతూ వచ్చింది.
ఆ సమయంలో అతడు 21 వన్డేల్లో 39.43 సగటుతో రన్స్ చేసాడు. 15 టెస్టుల్లో కేవలం 633 పరుగులే చేయగలిగాడు.

ఫొటో సోర్స్, Getty Images
రెండో ఉదాహరణ: కపిల్ దేవ్
భారత్‌కు మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను క్రికెట్ చరిత్రలో బెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకరని చెబుతారు. కానీ కేవలం ఒక్క రికార్డు కోసం అతడు కూడా సుదీర్ఘంగా జట్టును అంటిపెట్టుకున్నాడు. ఆ సమయంలో కపిల్ ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే కనిపించింది.
కపిల్ దేవ్ 1988లోనే వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ అయ్యాడు. కానీ టెస్టు మ్యాచుల్లో అప్పట్లో న్యూజీలాండ్ బౌలర్ రిచర్డ్ హాడ్లీ కూడా ఆడుతున్నాడు. వీరిద్దరి మధ్య ఇయాన్ బోథమ్ అత్యధిక వికెట్ల రికార్డును బ్రేక్ చేయాలనే పోటీ ఉండేది.
హాడ్లీ ఆ రికార్డును 1988లోనే బద్దలు కొట్టాడు. ఆ ఏడాది చివర్లో అతడి వికెట్ల సంఖ్య 391కి చేరింది. హాడ్లీ తర్వాత రెండేళ్లు ఆడాడు. 1990లో రిటైర్మెంట్ ప్రకటన సమయానికి హాడ్లీ వికెట్ల సంఖ్య 431కి చేరింది. అప్పటికి కపిల్ 365 వికెట్ల దగ్గరున్నాడు. అంటే తను రిచర్డ్ హాడ్లీ టెస్టు రికార్డుకు కేవలం 66 వికెట్ల దూరంలో ఉన్నాడు.
కానీ, హాడ్లీ రికార్డు బ్రేక్ చేయడానికి కపిల్‌కు మరో నాలుగేళ్లు పట్టింది. ఆ రికార్డు కోసం అతడు 35 టెస్టులు ఆడాడు.
ఆ సమయంలో కపిల్ దేవ్ ప్రదర్శన గురించి అతడి గణాంకాలే చెబుతాయి. కపిల్ తన చివరి 14 టెస్ట్ మ్యాచుల్లో కేవలం 27 వికెట్లు తీశాడు.
కపిల్ దేవ్ జట్టును అంటిపెట్టుకుని ఉండడంతో యువ బౌలర్ శ్రీనాథ్‌కు జట్టులో తన ప్లేస్ కన్‌ఫర్మ్ చేసుకోడానికి చాలాకాలం వేచిచూడాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
మియాందాద్ కూడా ఒక ఉదాహరణే
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పుడు, రిటైర్మెంట్ ప్రకటించేలా మీడియా తనపై చాలా ఒత్తిడి తెచ్చిందని చెప్పాడు.
1996 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత మియాందాద్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
1992 ప్రపంచకప్ మియాందాద్‌కు ఆరో వరల్డ్ కప్. ఈ టోర్నీలోనే పాకిస్తాన్ ప్రపంచ చాంపియన్ అయ్యింది. ఈ విజయంలో మియాందాద్ కూడా ఒక హీరోగా నిలిచాడు. ఫైనల్లో పాకిస్తాన్ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయినపుడు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్ హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు.
ఆ తర్వాత కూడా తన కెరీర్‌ను పొడిగించి తప్పు చేశానని మియాందాదే చెప్పుకున్నాడు. 1992లో రిటైర్మెంట్ తీసుకోడానికి తనకు మంచి అవకాశం వచ్చిందన్నాడు.
1992 ప్రపంచకప్‌లో జావేద్ మియాందాద్ 437 పరుగులు చేశాడు. జట్టు ప్రపంచ కప్ కూడా గెలుచుకుంది.
కానీ ఆ తర్వాత మియాందాద్ టెస్టు మ్యాచులు ఆడాడు. ఒక్క సెంచరీ కూడా లేకుండా 11 టెస్టుల్లో 32.11 సగటుతో 578 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
1992 తర్వాత మియాందాద్ ఒక్క వన్డే కూడా ఆడలేదు. కానీ అతడిని 1996 ప్రపంచ కప్ జట్టులో మళ్లీ ఎంపిక చేశారు. కానీ, ఆ టోర్నీలో జావేద్ మొత్తం పరుగులు 54 మాత్రమే.
ఇప్పుడు "పైన చెప్పిన క్రికెట్ దిగ్గజాల్లాగే రిటైర్ కావాలా", లేక లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్, ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బోథమ్, వెస్టిండీస్ సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్‌లా రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడతాడా అనేది ధోనీపైనే ఉంది. ఎందుకంటే ఈ దిగ్గజాలు క్రికెట్‌కు వీడ్కోలు పలికినపుడు "వాళ్లకు ఇంకా కొన్నేళ్లపాటు క్రికెట్ ఆడే సత్తా ఉందే" అని అందరూ చెప్పుకున్నారు.
ఇవి కూడా చదవండి.
- సూపర్ ఓవర్ నిబంధనలేంటి? బౌండరీలు కూడా టై అయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు...
- చంద్రునిపై కాలుమోపి 50 ఏళ్లు... మానవ జీవితంలో వచ్చిన 8 మార్పులు
- చెన్నై వాటర్‌మ్యాన్: ఆయన నల్లా తీసుకోరు... నీళ్ళు కొనుక్కోరు
- బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తున్నారా? అసలు వివాదం ఏమిటి? ఏపీ ప్రభుత్వ మౌనం ఎందుకు?
- గురు గోల్వల్కర్ : 'విద్వేష' దూతా లేక 'హిందూ జాతీయవాద' ధ్వజస్తంభమా...
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో జైపూర్
- ప్రపంచ కప్ 2019: సెమీస్ ఆడకుండానే టీమిండియా ఫైనల్ చేరుకోవచ్చా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








