'ఈద్ సంగతి తర్వాత... ముందు కశ్మీర్‌లో మా వాళ్లెలా ఉన్నారో తెలుసుకోవాలి'

ఈద్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి, శ్రీనగర్ నుంచి

తెల్లటి మేఘాల మధ్య వెళ్తున్న విమానం కిందకు దిగుతున్నప్పుడు కిటికీలోంచి పచ్చదనం, చెట్లు నిండిన పర్వతాలు, పచ్చటి పొలాలు, ఖాళీగా ఉన్న రహదారులు కనిపించాయి.

ఆకాశం నుంచి చూస్తుంటే అన్నీ ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది.

కానీ, విమానం లోపల చూస్తే ఆందోళన నిండిన ముఖాలు కనిపిస్తున్నాయి. కిందకు దిగిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్లకు తెలీదు.

దిల్లీ నుంచి వెళ్తున్న విమానం శ్రీనగర్‌లో రన్‌వేను తాకబోతోంది. సొంతవారిని కలవడానికి ఆతృతగా ఉన్న వారికి ఒకటింపావు గంట కూడా చాలా సుదీర్ఘంగా అనిపిస్తోంది.

నా హ్యాండ్ బ్యాగేజ్‌లో పప్పులున్నాయి. తినే వస్తువులు, మందులున్నాయి. ఎలాంటి గిఫ్టులూ లేవు. నేను నాతోపాటూ తినే వస్తువులు మాత్రం తీసుకెళ్తున్నాను.

నేను ఎవరితోనూ మాట్లాడలేకపోయాను. నా భార్యతో, పిల్లలతో, అమ్మనాన్నలతో, చిన్నాన్నతో, కశ్మీర్ లోయలో ఎవరినీ కలవలేకపోయాను.

నిజం చెప్పాలంటే, నేను ఈద్ కోసమని వెళ్తున్నా. మా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారో చూడ్డానికి వెళ్తున్నా. నేను బాగున్నాను అని వాళ్లకు చెప్పడానికి వెళ్తున్నా. ఎందుకంటే కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోయింది. మనం ఇప్పటి రోజుల్లో కాదు, ఏదో డార్క్ ఏజ్‌లో వెళ్తున్నట్టుంది.

అక్కడ అందరూ ఎలా ఉన్నారో, ఏమో అనే దిగులు మనసు తొలిచేస్తోంది. అందుకే మేం పనికూడా సరిగా చేయలేకపోతున్నాం. మనసంతా టెన్షన్. అలా ఉంటే మన మనసులో ఏదేదో చెడు ఆలోచనలు వస్తుంటాయి. అంతా బాగానే ఉంటుందనే అనుకుంటున్నా. కానీ, అక్కడ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు. మా ఇంట్లో వాళ్లు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని మాకందరికీ చాలా ఆతృతగా ఉంది.

శ్రీనగర్ పరిస్థితి

నేను వేల సార్లు ఫోన్ చేసుంటాను. నంబర్ కొడితే స్విచాఫ్ వస్తుంది. అందరి నంబర్లూ ఒకేసారి ఎందుకు పనిచేయవు. ఏదైనా జరగరానిది జరిగిందేమో అని, మనసులో పదే పదే అనిపిస్తోంది.

ఆసిఫ్ కూడా దిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ నుంచి శ్రీనగర్ విమానం ఎక్కారు. దిల్లీలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న ఆయన గత కొన్ని రోజుల నుంచీ కంటినిండా నిద్రపోలేదు, కడుపునిండా తినలేదు.

అలసట, ఆందోళన ఆన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. దిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న విమానంలో ఉన్న వారి ముఖాల్లోకి చూస్తుంటే అందరిలో ఒక ఆందోళన, భయం కనిపిస్తుంది.

భారత ప్రభుత్వం గత సోమవారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించింది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కూడా విభజించింది.

ఆ ప్రకటనకు ముందు అన్నిరకాల బయటి సంబంధాలను కట్ చేశారు. ఇంటర్నెట్ ఆపేయడంతోపాటు మొబైల్, ల్యాండ్ లైన్ ఫోన్ సేవలు కూడా నిలిపివేశారు.

శ్రీనగర్ పరిస్థితి

హర్యానాలోని ఒక మెడికల్ కాలేజీలో చదివే నలుగురు కశ్మీరీ విద్యార్థులు మరో నెలలో జరగబోయే పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంది. ఇప్పుడు వాళ్లు హడావిడిగా తిరిగి సొంత ఇళ్లకు బయల్దేరారు.

"త్వరలో పరీక్షలు. వాటిపై ఫోకస్ పెట్టాలి. కానీ కమ్యూనికేషన్స్ లేవు. ఇంట్లో వాళ్లతో మాట్లాడలేకపోతున్నాం. మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాం. చాలా ఆందోళనగా ఉంది. చదవలేకపోతున్నాం, క్లాసులకు కూడా వెళ్లలేకపోతున్నాం, మేం ఈద్ కోసం వెళ్లడం లేదు. ఇంట్లోవాళ్లు ఎలా ఉన్నారో చూడ్డానికి వెళ్తున్నాం" అన్నారు.

"భారత మీడియాలో కశ్మీర్ పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ప్రభుత్వం తరఫున కూడా సరైన సమాచారం అందడం లేదు. అసలు అక్కడ ఏం జరుగుతోందో మాకు ఏం తెలీడం లేదు" అంటున్నారు.

శ్రీనగర్ పరిస్థితి

భయంతో నిండిన వాతావరణం

దిల్లీలోని జామియా యూనివర్సిటీలో లా చదివే షఫురా లగేజ్, హ్యాండ్ బేగ్‌లో కూడా తినడానికి, తాగడానికి అవసరమైన సామాన్లే ఉన్నాయి. ఆమె నాతో "నేను బేబీ ఫుడ్, మందులు తీసుకొచ్చాను. నాలుగు రోజుల ముందు కాసేపు మా ఇంట్లో వాళ్లతో చాట్ చేశాను. కానీ ఆ తర్వాత నుంచి ఎలాంటి కాంటాక్ట్ లేదు. అసలు వాళ్లు ప్రాణాలతో ఉన్నారో, లేదో కూడా నాకు తెలీదు" అన్నారు.

ఒక భయం లాంటి వాతావరణం ఉందని ఆమె చెప్పారు. "ప్రభుత్వం ఈ చేసేదేదో వేరేలా కూడా చేసుండచ్చు. గత ఏడాదిగా మేం కేంద్ర ప్రభుత్వ పాలనలోనే ఉన్నాం. వేరే ఎన్నో రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. వాళ్లు అక్కడ్నుంచి మొదలు పెట్టి కశ్మీర్ వరకూ వచ్చుంటే జనం బహుశా అంగీకరించేవాళ్లేమో. కానీ అసలే కేంద్రాన్ని తక్కువ నమ్మే కశ్మీరులో అలా చేశారు. దానివల్ల ఈ నిర్ణయంపై అనుమానాలు వస్తాయి" అన్నారు.

శ్రీనగర్ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత ఇంటి వరకూ ఎలా చేరుకోవాలో షపురాకు కూడా తెలీదు. ఆమె మాత్రమే కాదు, బయట నుంచి శ్రీనగర్ చేరుకుంటున్న ఎవరూ తమ ఇంట్లో వాళ్లకు తామొస్తున్న సమాచారాన్ని ఇవ్వలేకపోయారు.

కేంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకునే ఒక విద్యార్థిని శ్రీనగర్ ఎయిర్ పోర్టు బయట దిగులుగా నిలబడి ఉంది. కన్నీళ్లతో ఆమె దుపట్టా తడిచిపోయుంది. ఆమె సోపార్ చేరుకోవాలి. కానీ వెళ్లడానికి ఎలాంటి సౌకర్యాలూ లేవు. ఆమె ఎంత అడిగితే అంత డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ ట్యాక్సీ వాళ్లెవరూ వెళ్లడానికి సిద్ధంగా లేరు.

శ్రీనగర్ పరిస్థితి

కుప్వారా వెళ్లడానికి వెయిట్ చేస్తున్న కొందరు యువకులు ఆమె బాధపడుతుండడం చూసి, నిన్ను మాతో పాటూ తీసుకెళ్తాం అని చెప్పారు. కానీ ముందుకు వెళ్లేకొద్దీ ఎలా వెళ్లాలో వాళ్లకు కూడా తెలీలేదు.

భద్రతాపరంగా ఇంత ఆందోళనకర పరిస్థితుల్లో కూడా వాళ్లు ఇళ్లకు ఎందుకు తిరిగి వెళ్తున్నారు? సమాధానంగా "మా ఇంట్లో వాళ్లు ప్రాణాలతో ఉన్నారో, లేదో మాకు తెలీదు. మేం వాళ్ల గురించి తెలుసుకోవాలని అన్నీ వదులుకుని ఎలాగోలా ఇక్కడికి చేరుకున్నాం. వాళ్లతోనే ఉంటాం" అన్నారు.

వాళ్లు ఈద్ జరుపుకోడానికి వస్తున్నారా? ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఈద్ ఎలా జరుపుకోగలరు? అంటే, "మాకు ఈద్ ముఖ్యం కాదు, మా ఇంట్లో వాళ్ల భద్రతే మాకు ముఖ్యం" అన్నారు.

చండీగఢ్ నుంచి వచ్చిన ఒక విద్యార్థిని కళ్లు కూడా చెమర్చాయి. ఆమె వణికిపోతున్న గొంతుతో "కాలేజ్, పీజీ వాళ్లు చాలా సపోర్ట్ చేశారు. కానీ నా మనసు కుదుటపడలేదు. అమ్మనాన్న గురించి ఏ విషయం తెలీలేదు. నేను మా అమ్మతో మాట్లాడకుండా ఉండలేను. ఇప్పుడు పరిస్థితులు కుదుటపడిన తర్వాతే మళ్లీ కాలేజ్ వెళ్తాను. నా చదువు దూరమైనా ఫర్వాలేదు" అన్నారు.

ఆమె స్నేహితుడు కూడా దిల్లీ నుంచి వచ్చాడు. అతడు తనతో మందులు తెచ్చాడు. అతడు కూడా ఆమె లాగే ఆందోళనలో ఉన్నాడు. "మా నాన్న డయాబెటిక్. నేను దిల్లీ నుంచి నాతోపాటూ మందులు తీసుకొచ్చాను. ఇలాంటి పరిస్థితిలో ఎన్నిరోజులుంటామో నాకు తెలీదు" అన్నాడు.

శ్రీనగర్ పరిస్థితి

శ్రీనగర్‌లో ఈద్ ఏర్పాట్లు

ఐదు రోజుల నుంచీ పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉన్న శ్రీనగర్‌లో శనివారం కాస్త సెక్యూరిటీ సడలించారు. అక్కడ గల్లీ గల్లీలో ఇండియన్ ఆర్మీ సాయుధ జవాన్లు గస్తీ కాస్తున్నారు.

అక్కడ రోడ్డుపై ఆర్మర్డ్ వెహికల్స్, స్నైపర్లు, ముళ్ల కంచెలు, వస్తూపోతున్న సైనిక వాహనాల మధ్య అక్కడక్కడా సామాన్యుల వాహనాలు కూడా కనిపించాయి.

బక్రీద్ కోసం గొర్రెలు అమ్మే ఒక యువకుడు "ఇది ఈద్ కాదు విషాదం. రెండు రోజులు కాస్త బయటికొచ్చాం. మేం ఈద్ తర్వాత మా 370 తిరిగి సాధించుకుంటాం. మేం మా భూమిని, ఎవరినీ తీసుకోనివ్వం" అన్నాడు.

"ముస్లింలకు ఎప్పుడు పెద్ద పండగ వచ్చినా,ఏదో ఒక కష్టం వచ్చిపడుతుంది. వారికి పవిత్రమైన రోజు, అలా చేయకూడదని భారత్ అనుకోవాలి. రెండు రోజుల తర్వాత ఇక్కడేం జరుగుతుందో మీరే చూడండి" అన్నారు.

శ్రీనగర్ పరిస్థితి

మరో కశ్మీరీ యువకుడు "మా ఈద్‌కు ముందు అన్నీ మూసేశారు. వేరే వాళ్లకు ఈద్ ముబారక్ కూడా చెప్పలేనప్పుడు ఇది పండుగెలా అవుతుంది" అన్నాడు.

అదే లోయలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన చాలా మంది పశువుల కాపరులు నగరం భద్రతా దళాల పహరాలో ఉండడంతో ఏదీ అమ్ముకోలేకపోతున్నారు. దాంతో వారికి పొట్టపోసుకోవడం కూడా కష్టమైపోతోంది.

అలాంటి ఒక పశువుల కాపరి.. "ఈసారీ పనిలేదు. చూస్తే గొర్రెలు కూడా అమ్ముడయ్యేలా లేవు. అన్నీ మూతపడ్డాయి. ఉదయం నుంచీ ఆకలితో ఉన్నాం" అన్నాడు.

శ్రీనగర్ పరిస్థితి

ఉద్రిక్తత మధ్య తెరుచుకున్న దుకాణాలు

కర్ఫ్యూ సడలించగానే కొంతమంది బండ్ల వాళ్లు కూరగాయలు, పండ్లు అమ్ముకోడానికి వచ్చారు. వారిని ఫొటోలు తీయాలని ప్రయత్నిస్తే వాళ్లలో ఒకరు నన్ను అడ్డుకుంటూ.. "మీరు ప్రపంచానికి ఏం చూపించాలనుకుంటున్నారు. శ్రీనగర్‌లో అంతా బాగానే ఉంది. కశ్మీరీలు పండ్లు, కూరగాయలు కొంటున్నారని చెబుతారా?" అని ప్రశ్నించాడు.

అతడి మాటలు పూర్తయ్యేలోపే, అక్కడ ఒక రాయొచ్చి పడింది. రాళ్లు రువ్వుకుంటున్నారనే అరుపులు వినిపించాయి. బండి వాడు తన బండి తోసుకుని వెళ్లిపోయాడు.

ఒక పెద్దాయన తన బలమంతా కూడదీసుకుని ఒక బండి నెడుతున్నాడు. చూస్తుంటే లోయలో ఉద్రిక్తతల భారమంతా వయసైన ఆయన భుజాలపైనే పడినట్టు అనిపించింది.

అక్కడ నుంచి దాల్ వైపు వెళ్తుంటే, భారీగా మోహరించిన సైనికుల మధ్య వాతావరణం కాస్త మామూలుగానే ఉన్నట్టు అనిపించింది. చాలా ప్రాంతాల్లో వాహనాలు రోడ్లపైకి భారీగా వచ్చిపోతుండడం కూడా కనిపించింది.

కానీ సాయుధ జవాన్లు కనిపించని ప్రాంతం ఎక్కడా లేదు.

శ్రీనగర్ పరిస్థితి

కశ్మీర్‌ను జైలులా మార్చారు

దాల్ తీరంలో కూచున్న కొంతమంది యువకులు అక్కడి పరిస్థితి గురించి చర్చించుకుంటున్నారు. సుమారు 30 ఏళ్లున్న ఒక యువకుడు "ఇద్దరు కశ్మీర్‌ను ఒక జైలుగా మారుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి కశ్మీర్‌ను ఎప్పుడూ చూళ్లేదు. ఇప్పటికీ జనం ఇళ్లలోనే ఉన్నారు. వారంతా ఇళ్ల నుంచి బయటికొచ్చినపుడు కశ్మీరీలు ఈ నిర్ణయం గురించి ఎలా అనుకుంటున్నారు అనేది, ప్రపంచానికి తెలుస్తుంది" అన్నాడు.

"అంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కశ్మీర్ ప్రజల విశ్వాసాలు పట్టించుకోరా. కశ్మీరీలు ఏం చెబుతున్నారనేది మీకు అవసరం లేదా. మేం ఎన్నుకున్న నేతలను కూడా నిర్బంధించారు" అన్నాడు.

"మోదీ మేం పండుగలను గౌరవిస్తాం అన్నారు. ప్రజలను వాళ్ల ఇళ్లలో బంధించి గౌరవిస్తున్నాం అంటున్నారు. మీ ఇళ్లలోనే ఈద్ జరుపుకోండి అని మాకు చెబుతున్నారు. స్నేహితులు, బంధువులను కలవకుంటా ఈద్ ఎలా జరుపుకోగలం. బయట ప్రపంచానికి అంతా మామూలుగానే ఉందని చూపిస్తున్నారు. మీకు ఏదైనా మామూలుగా అనిపిస్తోందా" అన్నాడు.

శ్రీనగర్ పరిస్థితి

దిగులుగా ఉన్న మరో యువకుడు "కశ్మీరీల ఇళ్లకు లాక్ ఉంది. వారి మనసులకు కూడా లాక్ ఉంది. కశ్మీరీల దగ్గర ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయం లేదు. నేను పుట్టినప్పటి నుంచీ ఇదే చూస్తున్నా. కర్ఫ్యూ. బంద్. గొడవలు, ఇక్కడ ప్రశాంతత ఎప్పుడూ చూళ్లేదు" అన్నాడు.

"తుపాకీ చూపించి ప్రభుత్వం ఏమైనా చేయగలదు. భూమిని కూడా లాక్కోగలదు. ఇక్కడ జరుగుతోంది తుపాకీ బలంతో జరుగుతోంది. ఈ భూమిని లాక్కోగలరు, కొనుక్కోలేరు. కానీ దీనిని సామాన్యుల కోసం చేయడం లేదు. ఎవరి డబ్బుతో భారత ప్రభుత్వాలు నడుస్తాయో, దీనిని వారి కోసమే చేయాలనుకుంటున్నారు. దీనివల్ల కశ్మీరీ ప్రజలకు, భారత్‌లోని సామాన్యులకు ఒరిగేదేమీ ఉండదు"

శ్రీనగర్ పరిస్థితి

తుపాను ముందు ప్రశాంతత

కొంతమంది యువకులు దాల్ దగ్గర ప్రశాతంగా ఉన్న నీళ్లలో చేపలు పడుతున్నారు. "శాంతి తిరిగొస్తోందా?" అని అడిగితే వాళ్లు, "ఇది తుపాను ముందు ప్రశాంతత. కశ్మీర్లో తుఫాన్ రాబోతోంది. ఈద్ పోనివ్వండి. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు" అన్నాడు.

"మేం సుదీర్ఘ లాక్‌డౌన్ కోసం సిద్ధంగా ఉన్నాం. ఇదిప్పుడు మా జీవితంలో భాగం. కానీ, మేం కశ్మీర్‌ను వేరే వారికి ఇవ్వడానికి సిద్ధంగా లేం. అలా ఎప్పటికీ జరగదు కూడా. కశ్మీర్ మా స్వర్గం. మేం దానిని ఏం చేయనివ్వం".

ఎంతమంది కశ్మీరీలతో మాట్లాడినా వారిలో చాలామంది భారత నేతలు కశ్మీరీ అమ్మాయిల పెళ్లిళ్ల గురించి మాట్లాడ్డంపై మండిపడ్డారు.

"భారత్ ప్రజలు మా భూములు తీసుకోవడం, మా అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం గురించి చెప్పుకుంటున్నారు. అలా చేస్తుంటే, మేం చేతులు ముడుచుకుని కూచుంటామా" అన్నారు.

ఒక మహిళ "నేను నా చెల్లెలి పరిస్థితి తెలుసుకోడానికి వెళ్తున్నాను. ఆమె ఏ పరిస్థితిలో ఉందో, ఇంట్లో తినడానికి ఏదైనా ఉందో, లేదో కూడా నాకు తెలీదు" అన్నారు.

శ్రీనగర్ పరిస్థితి

ఎయిర్ పోర్ట్ వరకూ లిఫ్ట్ అడిగిన ఒక కశ్మీరీ యువకుడు చెన్నైకి టికెట్ తీసుకోడానికి వెళ్తున్నట్టు చెప్పాడు. అతడు ప్రస్తుత పరిస్థితులను చూసే శ్రీనగర్ నుంచి బయటికి వెళ్లిపోతున్నాడా?

దానికి అతడు "నేను వ్యాపారం కోసం వెళ్తున్నాను. కశ్మీర్లో నా అవసరం వస్తే, తిరిగి వస్తాను. కశ్మీర్ మా ప్రాణం. దీనికోసం మేం మా ప్రాణాలైనా ఇస్తాం" అన్నాడు.

ఎయిర్ పోర్టు సెక్యూరిటీలో ఉన్న ఒక ఆర్మీ అధికారి నన్ను "నగరం పరిస్థితి మీకు ఎలా అనిపించింది" అన్నారు

"శ్రీనగర్‌లో ఈద్ కోసం కర్ఫ్యూ సడలించారు. కానీ, ప్రజా రవాణా సేవలు ప్రారంభించలేదు. తమ వాళ్లను కలవాలని అనుకుంటున్నవారు నడిచే వెళ్తున్నారు" అని నేను ఆయనకు చెప్పాను.

శ్రీనగర్ పరిస్థితి

శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లాన్‌లో ఒక యువతి తన లగేజ్‌తో వేచిచూస్తోంది. ఆమె ఏదో ఎయిర్ లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్.

"నేను 12 గంటలకు ఇక్కడ దిగాను. ఇంటికి ఎన్ని గంటలకు చేరుకుంటానో ఇంకా తెలీడం లేదు. నేను పుల్వామాకు వెళ్లాలి. పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, పోలీస్ కమిషనర్, ఆస్పత్రులకు అన్నిటికీ ఫోన్ చేశాను. కానీ ఒక్కరితోకూడా మాట్లాడలేకపోయాను" అన్నారు.

"మేం కర్ఫ్యూ మధ్యే పుట్టి పెరిగాం. కానీ ఇలాంటి పరిస్థితులు మొదటిసారి చూస్తున్నాను. కాంటాక్ట్స్ పూర్తిగా కట్ చేసేశారు. ఇక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. అయినా నేను వచ్చాను. ఎందుకంటే నా కుటుంబం పరిస్థితి తెలీక, నేను ఏ పనీ చేయలేకపోయాను, అందుకే ఇంత ప్రమాదానికి తెగించా" అన్నారు.

కశ్మీరీ యువతుల గురించి వస్తున్న వార్తలపై ఆ యువతి అభ్యంతరం వ్యక్తం చేశారు. "నేను ఆ మీమ్స్ చూశాను. అందుల కశ్మీరీ హాట్ గాళ్స్‌ను పెళ్లి చేసుకోవడం గురించి చెబుతున్నారు. అది చదివిన తర్వాత దిల్లీ మెట్రోలో ప్రయాణిస్తుంటేనే ఇబ్బందిగా అనిపించింది" అన్నారు.

"మేం ఒక సున్నితమైన పరిస్థితిలో ఉన్నామనే విషయాన్ని మిగతా ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు మాపై వ్యాఖ్యలు చేయడానికి బదులు మాకు అండగా నిలవాలి. వీళ్లు కూడా మా గురించి ఆలోచిస్తున్నారు అని మాకు అనిపించాలి. కానీ అది ఎక్కడా కనిపించడం లేదు".

శ్రీనగర్ పరిస్థితి

పని వదిలి వెళ్తున్న కార్మికులు

శ్రీనగర్ నుంచి దిల్లీ వచ్చే విమానాల్లో ఎక్కువగా లోయలో పనిచేసే కార్మికులు ఎక్కుతున్నారు. వారికి రెండు వైపులా దెబ్బ తగిలింది. పనిపోవడంతోపాటు విమాన ఛార్జీల భారం పడింది.

ప్రభుత్వం ఎయిర్ లైన్స్ చార్జీలును పరిమితంగా ఉంచాలని చెప్పింది. కానీ కూలీలు ఎయిర్ టిక్కెట్ల కోసం చాలా డబ్బు పెట్టాల్సి వస్తోంది. నాతోపాటూ దిల్లీ వస్తున్న బిహార్ వ్యక్తి సాదికుల్ ఆలం దిల్లీకి 6 వేలు పెట్టి టికెట్ కొన్నాడు.

ఆయన కంటే కొన్ని గంటల ముందే టికెట్ కొన్న మరో కూలీకి అదే టికెట్ 4200కు దొరికింది.

"ఇంటర్నెట్ ఆగిపోవడం వల్ల మాలాంటి వాళ్లు కౌంటర్ నుంచే టికెట్ తీసుకోవాల్సి వస్తోంది. దాని ధర టైంతోపాటూ పెరుగుతోంది. నేను రెండు టికెట్లు కొన్నాను. ఇది నా ఒక నెల సంపాదనకు సమానం. ఇప్పుడు పనిపోయింది. పొదుపు చేసిన డబ్బు కూడా అయిపోయింది" అన్నాడు.

శ్రీనగర్ పరిస్థితి

శ్రీనగర్ నుంచి గాల్లోకి లేవగానే విమానం మళ్లీ తెల్లటి మేఘాల పైకి వెళ్లింది. అవి శాంతికి ప్రతీకగా కనిపిస్తున్నాయి. కానీ ఆ శాంతి అక్కడ నేలపై మాత్రం కనిపించడం లేదు, ప్రశాంతంగా అనిపించడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)