ఐఎన్‌ఎఫ్ అణు ఒప్పందం: ఉన్న ఒప్పందం నుంచి బయటకొచ్చేసి కొత్తది కావాలంటున్న ట్రంప్

ట్రంప్, పుతిన్

ఫొటో సోర్స్, gettyimages/Chris McGrath

రష్యా, అమెరికాల మధ్య కీలక అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో ప్రపంచ దేశాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం అమెరికా, రష్యా, చైనా వంటి పెద్ద దేశాల మధ్య ఆయుధ పోటీకి దారి తీసి ప్రపంచాన్ని యుద్ధం ముంగిట నిలుపుతుందన్న ఆందోళన వినిపిస్తోంది.

కాగా రష్యాతో గతంలో చేసుకున్న కీలక అణ్వస్త్ర నిరోధక ఒప్పందం 'ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (ఐఎన్‌ఎఫ్)' నుంచి అమెరికా వైదొలిగిన వెంటనే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి.

కొత్త అణు ఒప్పందం జరగాలని, దానిపై రష్యా, చైనాలు సంతకాలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. దీనిపై ఆ రెండు దేశాలతో ఇప్పటికే మాట్లాడగా వారు ఎంతో ఉత్సుకత చూపారని ఆయన అనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

9ఎం729 మిసైల్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 9ఎం729 మిసైల్

ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కుదిరిన ఐఎన్ఎఫ్ ప్రకారం 500 నుంచి 5,500 కిలోమీటర్ల రేంజ్ క్షిపణులు నిషేధం. రష్యా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ క్రూయిజ్ మిసైల్‌ను మోహరించిందని ఆరోపిస్తూ అమెరికా శుక్రవారం ఒప్పందం నుంచి వైదొలగింది. అయితే, రష్యా ఈ ఆరోపణలను ఖండించింది.

అమెరికా వైదొలగడంతో ఐఎన్ఎఫ్ ఒప్పందం ఉనికి కోల్పోయిన నేపథ్యంలో అణ్వస్త్ర పరుగు మళ్లీ మొదలు కానుందా అన్న విలేకరుల ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ... రష్యాతో కొత్త ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నామని, దానివల్ల వారు కొన్ని, తాము కొన్ని ఆయుధాలను వదిలించుకుంటామని అన్నారు. ఇందులో ఏదో ఒక సందర్భంలో చైనానూ చేరుస్తామన్నారాయన.

అలాంటి ఒప్పందం జరిగితే అది ప్రపంచానికి చాలా మంచిదని.. అలాంటి ఒప్పందం కుదురుతుందన్న నమ్మకం ఉందని ట్రంప్ అన్నారు.

మైక్ పాంపియో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మైక్ పాంపియో

ఇంతకీ రష్యాతో ఒప్పందం నుంచి అమెరికా ఎందుకు వైదొలగింది?

రష్యా తన వద్ద ఉన్న 9ఎం729 రకం క్షిపణులు (నాటో దేశాలకు ఎస్‌ఎస్‌సీ-8గా తెలుసు) పెద్దసంఖ్యలో మోహరించిందని ఆరోపిస్తూ అమెరికా ఐఎన్ఎఫ్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసింది. నాటో దేశాలు అమెరికా ఆరోపణలకు మద్దతు పలికాయి.

ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడానికి ముమ్మాటికీ రష్యాయే కారణమని అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియో శుక్రవారం ప్రకటించారు.

ఈ విషయంలో అమెరికా, దాని నాటో మిత్ర దేశాల డిమాండ్లకు రష్యా అంగీకరించనట్లయితే ఆగస్టు 2 నాటికి ఒప్పందం నుంచి బయటకు వచ్చేయాలని ఫిబ్రవరిలోనే ట్రంప్ గడువు పెట్టారు. అనుకున్నట్లే ఆగస్టు 2న ఒప్పందం నుంచి బయటకు వచ్చేశారు.

అణ్వస్త్రాల వివరాలు

అమెరికా వైదొలగితే ప్రపంచం ఎందుకు ఆందోళన చెందుతోంది?

రష్యా 9ఎం729 క్షిపణుల మోహరింపుతో నాటో మిత్ర దేశాల భద్రతకు కలిగే ముప్పును దృష్టిలో పెట్టుకుని అట్లాంటిక్ కూటమి దేశాలు నిర్ణీత రీతిలో బాధ్యతాయుతంగా స్పందిస్తాయని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టాల్టెన్‌బర్గ్ తెలిపారు.

కొత్తగా ఆయుధ పోటీని నాటో దేశాలు కోరుకోవడం లేదని ఆయన ఉద్ఘాటించారు. భూతల అణ్వస్త్ర క్షిపణులను మోహరించే ఆలోచనేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

రష్యా క్షిపణులకు అణ్వస్త్ర సామర్థ్యం ఉందని.. వాటిని గుర్తించలేమని.. అవి నిమిషాల్లో ఐరోపా దేశాల నగరాలను చేరుకోగలవని స్టాల్టెన్‌బర్గ్ గత నెల బీబీసీతో మాట్లాడినప్పుడు చెప్పారు.

ఇది ప్రమాదకరమైన పరిస్థితి అని... దశాబ్దాలుగా ఆయుధ నియంత్రణకు ఐఎన్‌ఎఫ్ ఒప్పందం ఉపయోగపడిందని, ఇప్పుడు ఆ ఒప్పందానికి రష్యా మరణశాసనం రాయడాన్ని చూస్తున్నామని ఆయన అన్నారు.

అణ్వస్త్ర యుద్ధాల నిరోధానికి ఐఎన్‌ఎఫ్ అమూల్యమైన సాధనంగా ఉండేదని.. ఇప్పుడది పోయిందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు.

అంతర్జాతీయంగా ఆయుధ నియంత్రణకు తక్షణం మరో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన కోరారు.

మరోవైపు చారిత్రక ఐఎన్ఎఫ్ మనుగడ కోల్పోవడంతో రష్యా, చైనా, అమెరికాల మధ్య ఆయుధ పోటీ మొదలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

''ఒప్పందం కథ ముగిసింది.. ఇకపై కొత్త ఆయుధాలను అభివృద్ధి చేయడం, మోహరించడం వంటివి చూస్తాం'' అని ఏఎఫ్‌పీ వార్తా ఏజెన్సీతో రష్యా సైనిక విశ్లేషకుడు పావెల్ ఫెల్గనార్ అన్నారు.

1987లో ఐఎన్‌ఎఫ్‌పై సంతకాలు చేస్తున్న అప్పటి రష్యా, అమెరికా అధ్యక్షులు గోర్బచేవ్, రోనాల్డ్ రీగన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 1987లో ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందంపై అప్పటి రష్యా, అమెరికా అధ్యక్షులు మిఖాయిల్ గోర్బచేవ్, రోనాల్డ్ రీగన్ సంతకం చేశారు

ఇంతకీ ఐఎన్‌ఎఫ్ ఒప్పందంలో ఏముంది?

ఈ ఒప్పందంపై అమెరికా, రష్యాలు 1987లో సంతకాలు చేశాయి. సముద్రతల క్షిపణులు మినహా అన్ని రకాల మధ్య, స్వల్ప శ్రేణి అణు, అణ్వేతర క్షిపణులన్నిటినీ నిషేధిస్తూ ఈ రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.

దీని ప్రకారం 1991 నాటికి రెండు దేశాల్లో 2,700 క్షిపణులను నాశనం చేశారు.

ఈ ఒప్పందాన్ని అనుసరించి అమెరికా, రష్యాలు ఒకరి దేశంలో మరొకరు క్షిపణులకు సంబంధించి తనిఖీలు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)