జింబాబ్వేను సస్పెండ్ చేసిన ఐసీసీ.. క్రికెట్‌లో రాజకీయ జోక్యంతో జాతీయ జట్టుపై నిషేధం

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ క్రీడను నిర్వహించడంలో ప్రభుత్వ జోక్యం ఉండకుండా చూడటంలో విఫలమైందంటూ జింబాబ్వేను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెండ్ చేసింది. లండన్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో జింబాబ్వేకు ఐసీసీ నుంచి నిధులు ఆగిపోయాయి. అలాగే, ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో జింబాబ్వే జట్టు ఆడేందుకు ఇక అవకాశం ఉండదు.
ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగనున్న టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీలో జింబాబ్వే పాల్గొనాల్సి ఉంది.
‘‘రాజకీయ జోక్యం నుంచి మన క్రీడను మనం కాపాడుకోవాలి’’ అని ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ అన్నారు.
‘‘జింబాబ్వేలో ఐసీసీ రాజ్యాంగానికి తీవ్రమైన ఉల్లంఘన జరిగింది. ఇలాంటివి జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేం’’ అని ఆయన చెప్పారు.
జింబాబ్వే క్రికెట్ బోర్డును ప్రభుత్వ స్పోర్ట్స్, రిక్రియేషన్ కమిషన్ గత నెల రద్దు చేసింది. క్రికెట్ బోర్డు స్థానంలో ఒక మధ్యంతర కమిటీని ఏర్పాటు చేసింది.
అక్టోబర్‌లో జరుగనున్న బోర్డు సమావేశంలో తమ నిర్ణయం (జింబాబ్వేను రద్దు చేయడం)పై సమీక్షిస్తామని ఐసీసీ తెలిపింది.
జట్టు కెప్టెన్ హీత్ స్ట్రీక్‌పై వేటు వేయడంతో 15 మంది క్రికెటర్లు జట్టు నుంచి తప్పుకున్న నేపథ్యంలో 2004 జూన్‌లో జింబాబ్వే జట్టు టెస్టు హోదాను ఐసీసీ రద్దు చేసింది.
2005లో ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. తర్వాత ఎనిమిది టెస్టు మ్యాచ్‌లు ఆడిన జింబాబ్వే జట్టు 2011 తర్వాత మళ్లీ టెస్టు ఆడలేదు.
ఈ ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీకి జింబాబ్వే జట్టు అర్హత సాధించలేకపోయింది.
ఈ ఏడాది మార్చిలో జింబాబ్వే క్రికెట్ మాజీ డైరెక్టర్ ఎనోక్ ఇకోపెపై ఐసీసీ పదేళ్లు నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధక నిబంధనలను ఇకోపె ఉల్లంఘించినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
2018 మార్చిలో ఒక మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించారనే కేసులో జింబాబ్వే క్రికెట్ అధికారిగా పనిచేసిన రాజన్ నాయర్‌పై ఐసీసీ 20 ఏళ్లు నిషేధం విధించింది.
కాగా, ఐసీసీ ప్రమాణాలను పాటించలేకపోతున్నాయంటూ.. క్రొయేషియా క్రికెట్ ఫెడరేషన్, జాంబియా క్రికెట్ యూనియన్‌లను కూడా ఐసీసీ సస్పెండ్ చేసింది. అలాగే మొరాకన్ రాయల్ క్రికెట్ ఫెడరేషన్‌ను బహిష్కరించింది.
కెప్టెన్‌పై సస్పెన్షన్ నిబంధన మార్పు
ఓవర్లు ఆలస్యంగా వేసిన సందర్భాల్లో కెప్టెన్‌పై సస్పెన్షన్ వేటు వేస్తున్న నిబంధనను ఐసీసీ సవరించింది. స్లో ఓవర్ రేట్‌కు కెప్టెన్‌తో పాటు జట్టులోని ఆటగాళ్లంతా సమాన బాధ్యత తీసుకుంటారు కాబట్టి కెప్టెన్‌తో పాటు వారికీ సమానంగా జరిమానా విధించాలని నిర్ణయించింది.
వేయాల్సిన దానికన్నా తక్కువ ఓవర్ రేటు ఉన్న జట్లకు.. ఆ మ్యాచ్ ముగిసే సమయానికి ఉన్న పరిస్థితిని బట్టి ఒక్కో ఓవర్ ఆలస్యానికి జట్టుకు ఇచ్చే రెండేసి పాయింట్లు కోత విధించాలని, రాబోయే నెలలో ప్రారంభం కానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ నుంచి ఈ నిబంధన అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది.
అలాగే, ఎవరైనా ఆటగాడు గాయపడినా, అపస్మారక స్థితికి చేరినా అతని స్థానంలో మరొకరికి చోటు కల్పించే నిబంధనను కూడా ఐసీసీ ఆమోదించింది.
ఇవి కూడా చదవండి:
- సరిగ్గా 36 ఏళ్ల క్రితం భారత్ ప్రపంచ కప్ గెలిచిన రోజున దిల్లీలో ఏం జరిగింది..
- కపిల్ దేవ్: భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పిన హరియాణా హరికేన్
- డక్‌వర్త్ లూయిస్: అసలు ఈ రూల్ ఎలా పుట్టింది... విజేతను ఎలా నిర్ణయిస్తారు...
- వరల్డ్ కప్‌లో 10 జట్లే ఉండటానికి బీసీసీఐ అత్యాశే కారణమా
- బాల్ ట్యాంపరింగ్: పాకిస్తాన్ ఆటగాళ్లపైనే ఆరోపణలెక్కువ!
- జింబాబ్వేతో భారత్‌కున్న బంధమేంటి?
- ముగాబే దిగిపోయారు, ఇక జింబాబ్వే మారిపోతుందా?
- జింబాబ్వే కరెన్సీ సంక్షోభం: నో క్యాష్, నో కేఎఫ్‌సీ
- భారతదేశంలో సైనిక తిరుగుబాటు ఎందుకు సాధ్యం కాదు?
- ఇకపై టెస్టు మ్యాచ్ నాలుగు రోజులేనా?
- కర్ణాటక అసెంబ్లీ: ఒకపక్క గవర్నర్, మరోపక్క సుప్రీం కోర్టు.. మధ్యలో అవిశ్వాస తీర్మానం
- ప్రపంచ బ్యాంక్ రుణం తిరస్కరించిన తర్వాత అమరావతి పరిస్థితి ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









