వరల్డ్ కప్ 2019: ఈసారీ బరిలో 10 జట్లే ఎందుకు, బీసీసీఐ అత్యాశే కారణమా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆబిద్ హుస్సేన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇంగ్లండ్‌లో ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ జరుగుతుంటే, దానికి పక్కనే ఉండికూడా ఈ టోర్నీలో ఆడలేకపోతున్న స్కాట్లాండ్ ప్లేయర్ల మనసంతా ఇప్పుడు అక్కడే ఉండుంటుంది.
వారికి 2018 మార్చి 21న జరిగిన ఘటనే గుర్తొస్తుంటుంది. ఆరోజు చెత్త అంపైరింగ్, వర్షం వల్ల స్కాట్లాండ్ ప్రపంచకప్ కలలు కల్లలయ్యాయి.
వరల్డ్ కప్‌లో క్వాలిఫై అయ్యేందుకు వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచ్‌లో ఆ జట్టు 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. మెగా టోర్నీకి దూరమైంది.
దీనిపై బీబీసీతో మాట్లాడిన ఆ జట్టు ఆటగాడు సఫ్యాన్ షరీఫ్... "వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ టోర్నీని చాలా బాగా నిర్వహించారు. కానీ అందులో డీఆర్ఎస్‌లో లోపం ఉంది. చిన్న చిన్న విషయాలు లెక్కలోకి తీసుకోవడం వల్ల టీమ్స్ తలరాత, ఫలితం తారుమారైపోయాయి" అన్నాడు.
క్వాలిఫయర్ టోర్నీలో మెరుగైన బౌలింగ్ చేసిన సఫ్యాన్ షరీఫ్ ఐసీసీ 2015లో తీసుకున్న ఒక నిర్ణయం గురించి ఈ వ్యాఖ్యలు చేశాడు.
అప్పుడు వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను తగ్గించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దానివల్ల ఎక్కువగా స్కాట్లాండ్, నెదర్లాండ్, కెన్యా లాంటి అసోసియేట్ దేశాలే నష్టపోయాయి.

ఫొటో సోర్స్, Reuters
పెద్ద దేశాల అత్యాశే కారణమా
ఐసీసీ క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తుంది. వీటిలో చాంపియన్స్ ట్రోఫీ, టీ-20 వరల్డ్ కప్, వరల్డ్ కప్ లాంటి మ్యాచ్‌ల ప్రసార హక్కుల వల్లే దానికి ఎక్కువ ఆదాయం వస్తుంది.
వచ్చిన ఆ ఆదాయాన్ని ఐసీసీ సభ్య దేశాలన్నీ పంచుకుంటాయి.
2007 నుంచి 2015 మధ్య ప్రసార హక్కుల ద్వారా వచ్చిన ఈ ఆదాయం బిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది. దాన్నుంచి ఐసీసీ తమ శాశ్వత సభ్యులకు ఐదేసి కోట్ల డాలర్లు, మిగతా మొత్తం దేశాలన్నిటికీ కలిపి 12 కోట్ల డాలర్లు పంచింది.
కానీ ఆ సమయంలో ఐసీసీకి వచ్చిన ఆదాయంలో 80 శాతం భారత్ ఆడిన మ్యాచ్‌ల వల్లే వచ్చిందనేది చాలా కీలకం.

ఫొటో సోర్స్, Reuters
ఐసీసీపై ఒత్తిడి తెచ్చిందెవరు
2015 నుంచి 2023 వరకూ ప్రసార హక్కుల వల్ల వచ్చిన మొత్తం దాదాపు రెండున్నర బిలియన్ డాలర్ల వరకూ ఉంది. బీసీసీఐ తమ పలుకుబడి ఉపయోగించి ఎక్కువ మొత్తం కావాలని అడిగింది. దాంతో 2017 జూన్‌లో ఐసీసీ నుంచి 40 కోట్ల డాలర్ల మొత్తం దానికి ఇచ్చారు.
బీసీసీఐకి 40 కోట్ల డాలర్లు ఇవ్వడానికి ఐసీసీ శాశ్వత సభ్యుల కోటాలో మూడు కోట్ల డాలర్లకు పైగా, అసోసియేట్ దేశాల కోటా నుంచి 4 కోట్ల డాలర్ల మొత్తాన్ని తగ్గించింది.
"పది జట్లతోనే వరల్డ్ కప్ నిర్వహించాలని ఏ క్రికెట్ బోర్డు ఒత్తిడి తెచ్చుంటుందో, కారణం ఏమయ్యుంటుందో అర్థం చేసుకోవడం కష్టమేం కాదు" అని భారత వార్తా పత్రిక 'ది మింట్' 2018 ఏప్రిల్‌లో ప్రచురించిన ఒక కథనంలో రాసింది.
ఇక్కడ 2019 వరల్డ్ కప్‌లో ప్రతి జట్టూ మిగతా అన్ని జట్లతో ఆడుతోంది అనే విషయం గుర్తుంచుకోవాలి. అంటే భారత్.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి బలమైన ప్రత్యర్థులతో, తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో కచ్చితంగా మ్యాచ్‌లు ఆడుతుంది. అంటే దాని ఆదాయం కూడా పెరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ కప్‌లో ఎప్పుడు ఎన్ని దేశాలు ఆడాయి
1975 నుంచి 2015 వరకు టెస్ట్ మ్యాచ్‌లు ఆడే జట్లకే కాకుండా అసోసియేట్ దేశాల జట్లకు కూడా వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం లభించేది.
మొదటి నాలుగు ప్రపంచకప్ టోర్నీల్లో ఎనిమిదేసి జట్లు వివిధ ఫార్మాట్లలో ఆడాయి. ఆ తర్వాత 1992 వరల్డ్ కప్‌లో మొట్ట మొదటిసారి 9 జట్లు ఆడాయి.
20 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్‌కు ఐసీసీ శాశ్వత సభ్యత్వం లభించింది.
ఆ తర్వాత 2003 వరల్డ్ కప్‌లో పది శాశ్వత సభ్య దేశాలతోపాటు 4 అసోసియేట్ దేశాలకు కూడా ఆడే అవకాశం లభించింది. అంటే ఆ ప్రపంచ కప్‌లో మొత్తం 14 టీమ్స్ ఆడాయి.
2007లో వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 16 జట్లు బరిలో దిగాయి.
2011, 2015లో 14 టీమ్స్ పాల్గొన్నాయి. ఇప్పుడు 2019 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం మాత్రం కేవలం 10 జట్లకే లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ నిర్ణయంపై స్పందన
భవిష్యత్తులో క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని, 2019లో దానికి శ్రీకారం చుట్టామని ఐసీసీ తన వెబ్‌సైట్‌లో చెప్పింది.
నాలుగేళ్ల ముందున్న జట్ల సంఖ్యను తగ్గించడంపై మాట్లాడిన ఐసీసీ చీఫ్ డేవ్ రిచర్డ్‌సన్.. "వరల్డ్ కప్ క్రికెట్ అతిపెద్ద టోర్నమెంట్. ఇందులో పాల్గొనే టీమ్స్ కూడా ఒకే స్థాయిలో ఉండాలి" అన్నారు.
"ఐసీసీ టీమ్స్ తగ్గించాలనే నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కాలేదు, దానివల్ల చిన్న దేశాల జట్లకు తీరని నష్టం జరిగింది" అని జింబాబ్వే ఆటగాడు, ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ టోర్నీలో అత్యుత్తమ ఆటగాడి అవార్డ్ అందుకున్న సికందర్ రజా బీబీసీతో అన్నాడు.
"ప్రపంచంలో ఏ పెద్ద ఆటను చూసినా నిర్వాహకులు దానిని వ్యాప్తి చేయాలని ప్రయత్నిస్తుంటారు. క్రికెట్‌లో మాత్రం అలా ఎందుకు చేయడం లేదు. ఒక సమర్థుడైన ఆటగాడికి పెద్ద క్రికెట్ టోర్నీలో ఆడే అవకాశం లభించకపోతే, అతడు ఆ ఆటకే దూరం అయ్యే ప్రమాదం ఉంది" అన్నాడు.
"ఐసీసీ నిర్ణయం విషాదకరం. మాకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. టీమ్స్ సంఖ్య కూడా పెంచాలి" అని సఫ్యాన్ షరీఫ్ అన్నాడు.
తమ జట్టు ముందు ముందు చాలా వన్డే మ్యాచ్‌లు ఆడబోతోందని, కానీ, పెద్ద టోర్నీల్లో ఆడే అవకాశం కూడా ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆటగాడు అహ్మద్ రజా అన్నాడు.
"మనం క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో ఎందుకు చేర్చడం లేదు. క్రికెట్‌ను ప్రపంచమంతా వ్యాపించేలా చేయాలంటే దానిని కూడా ఫుట్‌బాల్ లాగే పాపులర్ చేయాలి" అని రజా అన్నాడు.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు...
- కండలు పెంచే ప్రయత్నంలో సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోతున్నారు
- ‘పీరియడ్ పేదరికం’: బహిష్టు సమయంలో పాత గుడ్డలకు ఈ కప్పులే సమాధానమా?
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- వైఎస్ జగన్: ‘చిన్నప్పుడు క్రికెట్ కెప్టెన్.. ఇప్పుడు రాష్ట్రానికి కెప్టెన్’
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








