కండలు పెంచే ప్రయత్నంలో సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోతున్నారు - అధ్యయనం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గాళ్లఘర్
- హోదా, బీబీసీ హెల్త్, సైన్స్ ప్రతినిధి
కండలు మెలితిరిగిన శరీరంతో ఆకర్షణీయంగా కనిపించే ప్రయత్నంలో పురుషులు, తమ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కండలు నున్నగా, ఉబ్బెత్తుగా కనిపించడం కోసం, బట్టతల రాకుండా వుండటం కోసం పురుషులు వాడే స్టెరాయిడ్స్ వల్ల ఈ ప్రమాదం పొంచివుందని చెబుతున్నారు.
ఈ పరిణామాన్ని తొలుత గుర్తించిన ఇద్దరు శాస్త్రవేత్తల పేరున, దీన్ని 'మాస్‌మ్యాన్-పేసీ పారడాక్స్' అని పిలుస్తున్నారు. దీనివల్ల, సంతానోత్తి కోసం ప్రయత్నిస్తున్న జంటల్లో గుండెనొప్పి వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
''సంతానోత్పత్తి గురించి పరీక్షల కోసం కొందరు పురుషులు వస్తుంటారు. వారిలో ఇలాంటి సమస్యతో బాధపడుతున్నవారు అధికం'' అని అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన డా.జేమ్స్ మాస్‌మ్యాన్ అన్నారు.
సంతానోత్పత్తిపై స్టెరాయిడ్స్ ప్రభావాన్ని కనుగొన్నపుడు ఈయన ఇంగ్లండ్‌లో తన డాక్టరేట్ కోసం చదువుతుండేవారు.
''కండలు పెంచడానికి చేసే ప్రయత్నంలో పురుషులు ఈ సమస్య బారిన పడుతున్నారు. సెక్స్ సమయంలో వారిలో వీర్యం ఉండటం లేదు’’ అని మాస్‌మ్యాన్ అన్నారు.
పురుష శరీరంలో టెస్టోస్టీరాన్ పనితీరును 'అనబాలిక్ స్టెరాయిడ్' అనుకరిస్తుంది. ముఖ్యంగా బాడీబిల్డర్లు, కండలు పెంచడం కోసం ఈ స్టెరాయిడ్‌ను వాడతారు.
''చాలామంది పురుషులు అమ్మాయిలను ఆకర్షించేందుకు జిమ్‌కు వెళ్లి కండలు పెంచుతున్నారు. అవగాహన లేకపోవడం వల్ల చివరకు వంధ్యత్వం బారిన పడుతున్నారు. చిత్రంగా లేదూ..'' అని యూనివర్సిటీ ఆఫ్ షెఫ్ఫీల్డ్‌కు చెందిన ప్రొఫెసర్ ఆల్లన్ పేసీ అన్నారు.
అనబాలిక్ స్టెరాయిడ్స్ వాడకం వల్ల, వృషణాల్లో వీర్యం అధికంగా చేరుతోంది. మెదడులోని పిట్యుటరీ గ్రంధి భ్రమిస్తుంది. దీంతో, వీర్యం ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే ఎఫ్.ఎస్.హెచ్, ఎల్.హెచ్. అనే హార్మోన్ల ఉత్పత్తిని పిట్యుటరీ గ్రంధి నిలిపివేస్తుంది.
బట్టతల బారిన పడకుండా వాడే కొన్నిరకాల మందుల వలన కూడా ఇలాంటి సమస్యే తలెత్తుతుందని అధ్యయనకారులు చెబుతున్నారు.
‘ఫినస్టెరాయిడ్’ అనే డ్రగ్ శరీరంలో టెస్టోస్టీరాన్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఇది వాడటం వల్ల జుట్టురాలడం తగ్గినా, సెక్స్ సామర్థ్యం తగ్గిపోడం, సంతానోత్పత్తిపై ప్రభావం చూపడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
''అనబాలిక్ స్టెరాయిడ్ వాడేవారిలో 90 శాతం మందికి పైగా వంధ్యత్వం బారినపడే అవకాశం ఉంది. ఇది మీరు ఊహించేదానికంటే ఎక్కువ. బట్టతల నివారణకు వాడే డ్రగ్స్ విషయంలో కూడా ఇంతే. కానీ అమ్మకాలు ఆకాశాన్నంటుతున్నాయి. వీరిలో కూడా వంధ్యత్వం కామన్ ప్రాబ్లమ్‌గా మారింది'' అని పేసీ బీబీసీతో అన్నారు.

ఆకర్షించాలంటే సంతానోత్పత్తిని కోల్పోవాలా?
ఇలాంటి స్టెరాయిడ్స్ వల్ల మీరు మరింత ఆకర్షణీయంగా కనిపించొచ్చుకానీ, మానవ పరిణామాత్మక ప్రక్రియలో మిమ్మల్ని అశక్తులను చేస్తుందని డా.మోస్‌మ్యాన్ చెబుతున్నారు.
సాధారణంగా మగ నెమలి, తన అందమైన ఈకలతో ఆడ నెమలిని ఆకర్షించి, భవిష్యత్ తరాలకు తన జన్యువులను వ్యాపింపచేస్తుంది. కానీ అమ్మాయిలను ఆకర్షించడానికి కండలు పెంచి, కొత్త సమస్యలు తెచ్చుకోవడం అలా కాదుగా..
సంతానోత్పత్తిని త్యాగం చేసే జీవులు కూడా ఈ ప్రకృతిలో ఉన్నాయి. కొన్నిరకాల పక్షిజాతులు, సహకార పద్దతిలో సంతతిని వృద్ధి చేసుకుంటాయి. తమ బంధువుల పిల్లలను పెంచడం కోసం, తాము పిల్లలను కనకుండా త్యాగం చేస్తాయి.
''ఆకర్షించడానికి అందంగా కనిపించాలని అనుకోవడం సాధారణమేకానీ, అందుకోసం సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోవటం మనుషులకే చెల్లింది!'' అని డా.మాస్‌మ్యాన్ అన్నారు.
''ఈ విషయం యువకులకు సరిగా అర్థం కావడం లేదు. ఈ కాస్త సమాచారం వాళ్లకు చేరితే, చాలా ఉపయోగం కదా..'' అని ప్రొ.పేసీ బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి
- భవిష్యత్ బాగుండాలంటే ప్రజాస్వామ్యాన్ని మార్చాల్సిందేనా?
- తెలుగుదేశం పార్టీ: గత వైభవాన్ని తీసుకురాగల నాయకుడెవరు
- వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- మహిళలు మద్యం తాగితే సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బ తింటుందా...
- కొందరు ఆడవారి శరీరం నుంచి వచ్చే వాసనకు మగవారు ఎందుకు ఆకర్షితులవుతారు?
- ఈ దేశాల్లో పిల్లల్ని ఎందుకు తక్కువగా కంటున్నారు?
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- సైక్లింగ్‌తో లైంగిక సామర్థ్యానికి ముప్పుందా?
- ఎండోమెట్రియాసిస్: మహిళలకు మాత్రమే వచ్చే చికిత్స లేని ఈ నెలసరి రోగం ఏమిటి?
- గర్భనిరోధక మాత్రలు వాడితే మహిళకు మగ లక్షణాలు వస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








