క్రికెట్ వరల్డ్ కప్-1983 విజయానికి 40 ఏళ్ళు: కపిల్ దేవ్ నాయకత్వంలో ఆ మరపురాని గెలుపు ఎలా సాధ్యమైందంటే...

ఫొటో సోర్స్, DAVE CANNON/ALLSPORT
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1983, జూన్ 25.. లార్డ్స్ మైదానంలో క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మైదానం మధ్యలో భారత క్రికెటర్లు కపిల్ దేవ్, మదన్‌లాల్ మంతనాలు జరుపుతున్నారు.
ఆ చర్చలు ఆ ఫైనల్ మ్యాచ్ ఫలితాన్నే కాదు, భారత క్రికెట్ రూపురేఖలనే మార్చేశాయి.
వెస్టిండీస్ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ ఫోర్లతో విరుచుకుపడుతూ 33 పరుగులకు చేరుకున్నాడు. మదన్‌లాల్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు కొట్టాడు.
వేరే ఎవరికైనా బౌలింగ్ ఇవ్వాలా అని కపిల్‌దేవ్ ఆలోచిస్తున్నాడు. కానీ, తనకు ఇంకొక్క ఓవర్ ఇవ్వమని లాల్.. కపిల్‌ను అడిగాడు.
అయితే, అప్పుడు కపిల్ నుంచి మదనలాల్ బంతిని లాక్కున్నాడని కొందరు అంటుంటారు.
మదన్‌లాల్ మాత్రం ఈ విషయం నిజం కాదని చెప్పాడు.
''కపిల్‌ను అడిగే నేను బంతి తీసుకున్నా. అంతకుముందు మూడు ఓవర్లలో నేను 20-21 పరుగులు ఇచ్చా. కానీ మరొక ఓవర్ ఇవ్వాలని కపిల్‌ను కోరా. రిచర్డ్స్‌కు షార్ట్ పిచ్ బంతి వేయాలన్నది నా ఆలోచన. అంతకుముందు బంతుల కన్నా కాస్త వేగంగా బంతిని వేశా. రిచర్డ్స్ సరైన టైమింగ్‌తో కొట్టలేకపోయాడు. 20-25 గజాలు పరుగెత్తి కొనవేళ్లతో బంతిని కపిల్ క్యాచ్ పట్టాడు'' అని వివరించాడు.

ఫొటో సోర్స్, ADRIAN MURRELL/ALLSPORT/GETTY IMAGES
'చెత్త మ్యాచ్ అని చర్చలు'
ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు లార్డ్స్ మైదానంపై మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. క్లైవ్ లాయిడ్, కపిల్ దేవ్ టాస్ కోసం మైదానంలోకి రాగానే మబ్బులను చీల్చుకుంటూ సూర్యుడు వచ్చేశాడు. సంతోషంగా అభిమానులు చప్పట్లు కొట్టారు.
ఆ మ్యాచ్‌లో భారత్‌పై 'బుకీస్' ఆడ్స్ 50:1, 100:1 ఉన్నాయని ప్రముఖ క్రీడా పాత్రికేయుడు మిహిర్ బోస్ చెప్పారు. అంటే వారి దృష్టిలో భారత్ గెలిచే అవకాశాలు ఒకటి లేదా రెండు శాతమే.
భారత క్రికెట్ చరిత్రపై 'ద నైన్ వేవ్స్ - ద ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్' అనే పుస్తకాన్ని మిహిర్ బోస్ రాశారు.
''మ్యాచ్‌లో ఫేవరెట్ భారతే అంటూ జోక్ చేసేందుకు ఓ ఇద్దరు భారత అభిమానులు బ్యానర్ పట్టుకున్నారు. జట్టు అభిమానులు అక్కడ ఎక్కువ మంది లేరు. వెస్టిండీస్ అభిమానులు మూడో సారి కప్ గెలుస్తామంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రెస్ బాక్స్‌లోనూ భారత పాత్రికేయులు ఒకరిద్దరే ఉన్నారు. అప్పుడు నేను 'సండే టైమ్స్' పత్రిక కోసం పనిచేసేవాడిని. ఓ చెత్త ఫైనల్ జరగబోతోందంటూ ఇంగ్లిష్, ఆస్ర్టేలియన్ పాత్రికేయులు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇంగ్లాండ్ లేదా ఆస్ర్టేలియా వెస్టిండీస్‌కు ప్రత్యర్థిగా ఉండుంటే, పోటీ ఆసక్తికరంగా ఉండేదని చర్చించుకుంటున్నారు. తొలుత భారత్ బ్యాటింగ్ కూడా అంత బాగా చేయలేదు. వెస్టిండీస్ బ్యాటింగ్ మొదలయ్యాక.. 'మ్యాచ్ త్వరగానే ముగియడం కూడా మంచిదేలే. ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌లో షాపింగకు వెళ్లొచ్చు' అని గావస్కర్‌తో సందీప్ పాటిల్ మరాఠీలో అన్నాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ సాగుతున్నప్పుడు ఇంగ్లిష్, ఆస్ట్రేలియా పాత్రికేయుల మాటలు విని బాధ అనిపించి ప్రెస్‌బాక్స్ నుంచి బయటకు వచ్చేశా'' అని మిహిర్ బోస్ వివరించారు.

ఫొటో సోర్స్, ADRIAN MURRELL/ALLSPORT//GETTY IMAGES
'కొట్టాలి.. లేదంటే వచ్చేయాలి'
ఆ రోజు కపిల్ టాస్ ఓడాడు. లాయిడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
'బిగ్ బర్డ్'గా పేరుకెక్కిన జోయెల్ గార్నర్‌తో కలిసి ఆండీ రాబర్ట్స్ బౌలింగ్ ఆరంభించాడు.
భారత్ స్కోరు రెండు పరుగుల వద్ద ఉన్నప్పుడే రాబర్ట్స్ తొలి షాక్ ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో గావస్కర్ జెఫ్ దూజోన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
గావస్కర్ స్థానంలో మోహిందర్ అమర్‌నాథ్ ఓ వైపు నిలదొక్కుకున్నాడు. మరోవైపు శ్రీకాంత్ తుపాను బ్యాటింగ్ మొదలైంది. గార్నర్ బౌలింగ్‌లో మొదట ఫోర్ కొట్టిన అతడు, ఆ తర్వాత రాబర్ట్స్ బౌలింగ్‌లోనూ బంతిని బౌండరీ దాటించాడు. కొద్ది సేపయ్యాక ఓ హుక్ షాట్ ఆడి సిక్సర్ కొట్టాడు.
ఆ రోజు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏం ఆలోచిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ శ్రీకాంత్.. ''నా సహజ శైలిలోనే ఆడాలని అనుకున్నా. కొట్టాలనుకుంటే కొట్టాలి. లేదంటే క్రీజు వదలాలి'' అని సమాధానమిచ్చాడు.

ఫొటో సోర్స్, Getty Images
రాకెట్లలా వెస్టిండీస్ బౌలర్లు
శ్రీకాంత్ చాలా రిస్క్ తీసుకుంటూ బ్యాటింగ్ చేస్తున్నాడు.
లార్డ్స్ బాల్కనీలో కూర్చొన్న భారత ఆటగాళ్లు ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నారు.
లాయిడ్ మార్షల్‌ను బౌలింగ్ పంపాడు. అతడు వస్తూనే శ్రీకాంత్‌ను పెవిలియన్‌కు పంపాడు.
కానీ, 38 పరుగులు చేసిన శ్రీకాంతే ఆ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మోహిందర్, యశ్‌పాల్ శర్మ చాలా నెమ్మదిగా ఆడుతూ భారత్ స్కోరుకు మరో 31 పరుగులు జోడించారు.
వెస్టిండీస్ బౌలర్లు 'కంప్యూటరైజ్డ్ రాకెట్ల'లా దాడి చేస్తున్నారు. రాబర్ట్స్ తర్వాత మార్షల్, అతడు పోతే హోల్డింగ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. యశపాల్, మోహిందర్ వెంటవెంటనే ఔటయ్యారు.

ఫొటో సోర్స్, ADRIAN MURRELL/GETTY ALLSPORT
'మెదడు తలలో ఉందనుకున్నావా'
భారత్ 111 పరుగుల స్కోరుకే 6 వికెట్లు కోల్పోయింది. లార్డ్స్‌లో ఉన్న భారత అభిమానులు మ్యాచ్‌ను మౌనంగా చూస్తున్నారు. భారత్‌లో ఉన్న వారు కూడా రేడియోలు, టీవీలు కట్టేస్తున్నారు.
కానీ, ఆ తర్వాత నాలుగు వికెట్లకు మొత్తం 72 పరుగులు భారత బ్యాట్స్‌మెన్ జోడించగలిగారు. ఆఖరి బ్యాట్స్‌మన్‌గా వచ్చిన బల్విందర్ సంధు చాలా ధైర్యంగా ఆడాడు. మార్షల్ వేసిన ఓ బౌన్సర్ అతడి హెల్మెట్‌ను తాకింది.
అప్పుడు మరో ఎండ్‌లో బ్యాటింగ్‌లో ఉన్న సయ్యద్ కిర్మానీ ఆ సందర్భం గురించి వివరించారు.
''మా ఇద్దరి భాగస్వామ్యం అప్పుడే మొదలైంది. తొలి బంతికే మార్షల్ బౌన్సర్ వేశాడు. అది నేరుగా వచ్చి బల్విందర్ హెల్మెట్‌ను తాకింది. ఆ రోజుల్లో మార్షల్ ప్రపంచంలోనే వేగవంతమైన బౌలర్. ఆ బౌన్సర్ తాకడంతో బల్విందర్‌కు తల తిరిగిపోయింది. ఎలా ఉన్నాడో తెలుసుకునేందుకు అతడి వైపు పరిగెత్తా. బల్విందర్ హెల్మెట్‌ను చేత్తో రుద్దుతున్నాడు. 'హెల్మెట్‌ను ఎందుకు రుద్దుతున్నావు, దానికేమైనా దెబ్బ తగిలిందా?' అని అడిగా. టెయిల్ ఎండర్‌కు బౌన్సర్ వేయడమేంటని మార్షల్‌ను అంపైర్ మందలించాడు. మార్షల్ వచ్చి, బల్విందర్‌కు సారీ చెప్పాడు. అప్పుడు బల్విందర్ 'నా మెదడు తలలో ఉందనకుంటున్నావా? మోకాలులో ఉంది' అని అన్నాడు. మార్షల్ పగలబడి నవ్వాడు'' అని కిర్మానీ పాత విషయాలను గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, TREVOR JONES/GETTY IMAGES
183కే ఆలౌట్
భారత జట్టు 183 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. వరల్డ్ కప్ మాదే అన్నట్లుగా వెస్టిండీస్ ఆటగాళ్లు పెవిలియన్‌కు పరుగెత్తారు.
ఈ లక్ష్యాన్ని వెస్టిండీస్ ఓపెనర్లే ఛేదించేస్తారని అనుకున్నామని అప్పటి భారత జట్టు సభ్యుడు సయ్యద్ కిర్మానీ చెప్పాడు.
''రిచర్డ్స్ బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం కూడా రాదని భావించాం. కానీ, ఆశలు వదులుకోకుండా, సానుకూల దృక్పథంతో ఆడాలని మేమంతా నిర్ణయించుకున్నాం'' అని కిర్మానీ వివరించాడు.
అప్పుడు భారత ఆటగాళ్లకు ఊపు వచ్చింది
వెస్టిండీస్ ఓపెనర్లు గ్రీనిడ్జ్, హెయిన్స్ క్రీజులోకి వచ్చారు.
నాలుగో ఓవర్‌లో బల్విందర్ సంధు వేసిన బంతి దూరంగా వెళ్లుందని అనుకుని గ్రీనిజ్ బ్యాట్‌ను గాల్లోకి లేపాడు. బంతి నేరుగా లోపలికి వచ్చి, ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.
రిచర్డ్ కూడా ఔటయ్యాక, భారత ఆటగాళ్లకు ఊపు వచ్చింది.
బిన్నీ బౌలింగ్‌లో లాయిడ్ డ్రైవ్‌కు ప్రయత్నించి.. షార్ట్ మిడ్ వికెట్‌లో నిల్చున్న కపిల్‌దేవ్‌కు క్యాచ్ ఇచ్చాడు.

ఫొటో సోర్స్, DAVID JAMES BARTHO/FAIRFAX MEDIA VIA G
మోహిందర్ తెరదించాడు
గోమ్స్, బాక్స్ ఔట్ అయ్యాక దూజోన్, మార్షల్ క్రీజులోకి వచ్చారు. ఏడో వికెట్‌కు వాళ్లిద్దరూ 43 పరుగులు జోడించారు. మోహిందర్ దూజోన్ వికెట్ తీశాడు.
వెస్టిండీస్ ఆఖరి బ్యాట్స్‌మెన్ జోడీ గార్నర్, హోల్డింగ్ స్కోరును 140 పరుగుల వరకూ తీసుకువెళ్లారు. హోల్డింగ్‌ను మోహిందర్ ఎల్బీడబ్ల్యూ చేసి, వెస్టిండీస్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
ఆఖరి వికెట్ పడిన క్షణాల గురించి కీర్తి ఆజాద్ మాట్లాడుతూ.. ''ఆ దృశ్యం ఇప్పుడు జరుగుతున్నట్లే అనిపిస్తుంది. అప్పుడు నేను ఉద్వేగంతో వణుకుతూ పరిగెడుతున్నా. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అలాంటి అనుభవం జీవితంలో మరోసారి చూడలేను'' అని వివరించారు.
'నియమాలన్నీ అతిక్రమించాం'
టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిన సంబరాలు చేసుకుంటున్న సమయంలో లార్డ్స్‌లో ప్రముఖ నటుడు శశి కపూర్ కూడా ఉన్నారు. తన ఆత్మకథ 'స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్'లో కపిల్ దేవ్ ఆ విషయం గురించి రాశారు.
''డ్రెస్సింగ్ రూమ్ నుంచి మేం బయటకు రాగానే, 'సౌత్ హాల్' నుంచి బయటవచ్చిన కొందరు పంజాబీలు ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో ఒకరు శశి కపూర్ బయట నిల్చున్నారని, లోపలికి రావాలనుకుంటున్నారని నాకు చెప్పారు. ఇద్దరు జట్టు సభ్యులతో కలిసి ఆయన తీసుకురావడానికి వెళ్లా. ఆ రోజు లార్డ్స్ మైదానంలోని అన్ని నియమ నిబంధనలను మేం అతిక్రమించామనుకుంటా. లార్డ్స్ ప్రధాన రిసెప్షన్ రూమ్‌లోకి కోటు, టై లేకుండా ఎవరూ రాకూడదు. శశి కపూర్‌కు టై ఇచ్చాం కానీ, ఆయనకు మా కోట్లేవీ సరిపోవడం లేదు. దీంతో ఆయన కోట్‌ను భుజంపై వేసుకుని లోపలికి వచ్చేశారు. మాతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు'' అని కపిల్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయారు
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. భారత్ వరల్డ్ కప్ గెలిచిన సమయంలో కపిల్‌దేవ్, మదన్‌లాల్ జీవిత భాగస్వాములు లార్డ్స్ మైదానంలో లేరు.
''మే ఔట్ అవుతుండటం చూసిన వెంటనే నా భార్య రోమీ స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మదన్‌లాల్ భార్య అనూ కూడా వెళ్లిపోయారు. స్టేడియం నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తుండంతో వాళ్లు టీవీ ఆన్ చేసి చూశారు. అప్పుడు రిచర్డ్స్ క్యాచౌట్ టీవీలో వస్తుంది. ఆనందంతో వాళ్లు చేసిన చప్పుళ్లకు హోటల్ సిబ్బంది వచ్చి ప్రశ్నించారట. అయితే వాళ్లు హోటల్‌లో ఉన్నవిషయం నాకు తెలియదు. స్టేడియంలోనే ఉన్నారనుకుని, వారు ఉండే వైపు చూపిస్తూ, షాంపైన్ బాటిల్ తెరిచి ఊపుతున్నాం. మదన్‌లాల్ వచ్చి అనూ, రోమీ ఎక్కడా కనపడటం లేదని చెప్పాడు. తిరిగి వాళ్లిద్దరూ స్టేడియం కూడా రాలేకపోయారు. ఆ తర్వాత వాళ్లను కలిసినప్పుడు కూడా భారత్ వరల్డ్ కప్ గెలిచిన సమయంలో తాము స్టేడియంలో లేమని చెప్పే ధైర్యం వారు చేయలేదు'' అని కపిల్ వివరించారు.

ఫొటో సోర్స్, THE NINE WAVES/MIHIR BOSE
షాంపేన్ బాటిల్ వెస్టిండీస్ వాళ్లదే
కపిల్ దేవ్ తెరిచిన షాంపేన్ బాటిల్ కూడా వెస్టిండీస్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి తీసుకున్నదే.
కప్ గెలుస్తామని భారత ఆటగాళ్లు అనుకోలేదు. దీంతో టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక్క షాంపేన్ బాటిల్ కూడా పెట్టుకోలేదు.
''వెస్టిండీస్ కెప్టెన్‌తో మాట్లాడటానికి కపిల్ దేవ్ వారి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాడు. ఆ జట్టు ఆటగాళ్లంతా బాధలో ఉన్నారు. కొన్ని షాంపేన్ బాటిళ్లు కూడా అతడికి అక్కడ కనిపించాయి. వాటిని తీసుకువెళ్లొచ్చా అని కపిల్ లాయిడ్‌ని అడిగాడు. లాయిడ్ సరే అన్నాడు. ఇలా వెస్టిండీస్‌ను ఓడించడమే కాదు.. వాళ్ల షాంపేన్ బాటిళ్లను కూడా మనవాళ్లు సంపాదించారు'' అని మిహిర్ బోస్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘పెళ్లి వేడుకలా డ్రెస్సింగ్ రూమ్’
కప్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్ద వివాహ వేడుక జరుగుతున్న వాతావరణం కనిపించిందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజ్ సింగ్ గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
''పెళ్లిలో ఒకే పెళ్లి కొడుకు ఉంటాడు. కానీ, ఆ డ్రెస్సింగ్ రూమ్‌లో 11 మంది పెళ్లి కొడుకులు ఉన్నట్లుగా ఉంది. ఒక్క నలుగురు బౌలర్లు తప్ప వెస్టిండీస్‌కు చెందిన ఆటగాళ్లందరూ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు. ఆ అనుభవాన్ని నేనెప్పుడూ మరిచిపోలేను. ఆ నలుగురు బౌలర్లకు వారి బ్యాట్స్‌మెన్‌పై అలక. తాము అంతా బాగా బౌలింగ్ చేస్తే, బ్యాట్స్‌మెన్ 184 పరుగులు చేయలేకపోయారే అన్నబాధ'' అని రాజ్ సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇందిరా గాంధీ ఏమనుకుంటారోనని భయపడ్డాం’
టీమ్ ఇండియా ముంబయికి వచ్చాక, భారీ వర్షం పడుతున్నా వాంఖడే స్టేడియంలో దాదాపు 50 వేల మంది అభిమానులు వారికి స్వాగతం పలికారు.
దిల్లీలోని 'హైదరాబాద్ హౌజ్'లో జట్టును కలిసి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అభినందించారు.
అప్పుడు జరిగిన ఓ ఆసక్తకర విషయం గురించి కపిల్ దేవ్ తన ఆత్మకథలో రాశారు.
''శ్రీకాంత్‌కు మాటిమాటికి కళ్లు మిటకరించి, ముక్కు చీదుకునే అలవాటు ఉంది. ఇందిరా గాంధీ ముందు అతడలా కళ్లు మిటికరించడం బాగుండదని శ్రీకాంత్‌కు గావస్కర్ చెప్పాడు. గావస్కర్‌తో ఇందిరా గాంధీ మాట్లాడుతున్న సమయంలో తన అలవాటును నియంత్రించుకునేందుకు శ్రీకాంత్ విపరీతంగా కష్టపడుతున్నాడు. అయితే, ఇందిరా గాంధీకి కూడా కళ్లు మిటకరించే అలవాటుందని నేను అప్పుడే గమనించా. ఆమె తన ముందుకు రాగానే, శ్రీకాంత్ అప్పటివరకూ పాటించిన నియంత్రణను కోల్పోయి కళ్లు మిటకరించాడు. ఇందిరా గాంధీ కూడా కళ్లు మిటకరించి, ముక్కు చీదుకున్నారు. శ్రీకాంత్ తనను వెక్కిరిస్తున్నాడని ఇందిరా గాంధీ అనుకుంటారేమోనని మేమంతా భయపడిపోయాం'' అని కపిల్‌దేవ్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ విజయంతో పాక్, అమెరికా, ఇంగ్లండ్‌లో సంబరాలు చేసుకున్నారా?
- కందుకూరి వీరేశలింగం: సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు చేసిన సంస్కర్త
- తెలంగాణలో ‘నమో’ సునామీ: టీఆర్ఎస్ గుర్తించాల్సిన పాఠాలు
- తెలుగుదేశం పార్టీ: గత వైభవాన్ని తీసుకురాగల నాయకుడెవరు
- రాహుల్ గాంధీ: కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు ఇదే ముగింపా?
- మోదీ వాగ్ధానాల విలువ రూ.100 లక్షల కోట్లు.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
- పెళ్లి పేరుతో పాక్ అమ్మాయిలను వ్యభిచారంలో దించుతున్న చైనా అబ్బాయిలు
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- మోదీ చెప్పిన కెమిస్ట్రీ మేధావులకు ఎందుకు అర్థం కాలేదు..
- ‘పీరియడ్ పేదరికం’: బహిష్టు సమయంలో పాత గుడ్డలకు ఈ కప్పులే సమాధానమా?
- ప్రభుత్వ వ్యతిరేకత దరిచేరనివ్వని నేత.. ఐదోసారి సీఎంగా ప్రమాణం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









