‘అమరావతి రుణాన్ని తిరస్కరించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానిదే.. ప్రపంచ బ్యాంకుది కాదు’ - బీబీసీతో కేంద్ర ఎకనామిక్ అఫైర్స్ అధికారి

ఫొటో సోర్స్, AP Govt
- రచయిత, దీప్తి బత్తిని, బీబీసీ ప్రతినిధి
- హోదా, వి శంకర్, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణ ప్రాజెక్ట్ ఆసక్తికర మలుపు తిరిగింది. అప్పు అందించాల్సిన ప్రపంచ బ్యాంక్ దానికి నిరాకరించింది. దాంతో అమరావతి నగర భవితవ్యం చుట్టూ ఇప్పుడు చర్చ మొదలయ్యింది.
కాగా, అమరావతి నగరానికి రుణం ఇచ్చే ప్రతిపాదన విరమించుకోవాలని ప్రపంచ బ్యాంకును కోరింది కేంద్ర ప్రభుత్వమేనని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం అధికారి ఒకరు పేరు వెల్లడించకూడదనే షరతుపై బీబీసీకి చెప్పారు. అమరావతికి రుణం ఇవ్వకూడదని ప్రపంచ బ్యాంకు నేరుగా నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
రుణ మంజూరుకు సంబంధించి ప్రపంచ బ్యాంకు పలు అంశాలను లేవనెత్తిన నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు.
ప్రపంచ బ్యాంకు నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన జూలై 23వ తేదీన వెలువడుతుందని కూడా తెలిపారు.
ప్రపంచబ్యాంక్ ఏమి చెప్పింది?
ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో పలు ప్రాజెక్టులకు రుణం అందించిన ప్రపంచ బ్యాంక్ ఈసారి అమరావతికి రుణం ఇవ్వడం లేదంటూ స్పష్టం చేసింది. గడిచిన మూడేళ్లుగా సాగుతున్న చర్చలు, క్షేత్ర స్థాయి పరిశీలనల తర్వాత జూలై 18 నాడు తన వెబ్ సైట్ లో రుణ ప్రతిపాదన నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించింది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 715 మిలియన్ అమెరికన్ డాలర్లు(సుమారు రూ.4923 కోట్లు)గా అంచనాలు వేశారు. అందులో 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2065 కోట్లు) ప్రపంచ బ్యాంక్ రుణం కోసం గతంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది.
కానీ, అమరావతి సమీకృత మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు వ్యవస్థీకృత అభివృద్ధి ప్రాజెక్ట్ నుంచి ప్రపంచబ్యాంక్ వైదొలుగుతున్నట్లు తాజాగా ప్రకటించింది. వాస్తవానికి అమరావతి నగర నిర్మాణంలో ప్రభావితం అవుతున్న అంశాల విషయంలో వస్తున్న అభ్యంతరాలతోనే ప్రపంచ బ్యాంక్ వైదొలిగినట్టుగా చెబుతున్నారు. 4,923 కోట్ల రూపాయల ప్రాజెక్టులో 2,065 కోట్లు సహాయంగా అందించాల్సిన సంస్థ వైదొలగడంతో అమరావతి భవితవ్యం గందరగోళంగా మారే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.

30 వేల ఎకరాలు సేకరించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత రాజధాని నగర నిర్మాణం విషయంలో పలు ప్రతిపాదనలు వచ్చాయి. శివరామకృష్ణన్ కమిషన్ ను కేంద్రం నియమించి ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. అయితే ఆ కమిటీ సూచనలను తోసిపుచ్చి చంద్రబాబు ప్రభుత్వం 2014 డిసెంబర్ నెలలో అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మించబోతున్నట్టు ప్రకటించింది. ఆ వెంటనే ఆరు నెలలకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ని వీడి పాలనను అమరావతి ప్రాంతానికి తరలించారు. దానికి తగ్గట్టుగా సచివాలయం, అసెంబ్లీ వంటివి తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించారు. అదే సమయంలో రాజధాని కోసం ల్యాండ్ ఫూలింగ్ విధానంలో 30వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించారు.
తొలి నుంచి అభ్యంతరాలు
అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణంపై తొలి నుంచి పలు అభ్యంతరాలున్నాయి. కొందరు రైతులు, పర్యావరణ వేత్తలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా అమరావతి విషయంలో చంద్రబాబు ప్రభుత్వ తీరుని తప్పుబట్టాయి. అయినా కృష్ణా నదీ తీరంలో రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లింది. సీఆర్డీయే ని ఏర్పాటు చేసి నిర్మాణాలు కూడా ప్రారంభించింది. అయినా పలు సంస్థలు రాజధాని విషయంలో కోర్టులకు, గ్రీన్ ట్రిబ్యూనల్ కి కూడా ఫిర్యాదులు చేశాయి. వరద ముప్పు, వివిధ పంటలు పండించే ప్రాంతం, సామాజిక, పర్యావరణ కోణంలో జరిగే నష్టం వంటి అంశాలను ముందుకు తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, APCRDA
ప్రపంచ బ్యాంక్ కి ఫిర్యాదులు
ప్రభుత్వం రాజధాని విషయంలో ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళుతోందంటూ రాజధాని ప్రాంత రైతులు కొందరు 2017 మే 25 నాడు ప్రపంచబ్యాంక్ కి ఫిర్యాదు చేశారు. ప్రపంచబ్యాంక్ ప్రతినిధి బృందం స్వయంగా వచ్చి పరిశీలన చేయాలని కోరారు. అదే సంవత్సరం జూన్ 12నాడు ఫిర్యాదుని స్వీకరించిన ప్రపంచబ్యాంక్ బృందం 2017 సెప్టెంబర్ లో ఇండియాలో పర్యటించింది. ఆ సమయంలో ల్యాండ్ ఫూలింగ్ విధానంపై అభ్యంతరాలతో పాటు సమర్థిస్తున్న రైతులు కూడా ప్రపంచబ్యాంక్ ప్యానెల్ బృందాన్నికలిశారు. ఏపీ ప్రభుత్వ అధికారులు కూడా ప్రపంచబ్యాంక్ బృందం ముందు తమ వాదన వినిపించారు.
సమగ్ర విచారణ అవసరం అని తేల్చిన ప్రపంచబ్యాంక్ బృందం
ఇండియాలో పర్యటించి, పలు వాదనలు విన్న తర్వాత సమగ్ర విచారణ అవసరం అని ప్రపంచ బ్యాంక్ బృందం తేల్చింది. అమరావతి ప్రాజెక్ట్ కారణంగా ప్రభావితం అవుతున్న అంశాలు ప్రపంచ బ్యాంక్ విధానాలకు సానుకూలంగా ఉన్నాయా లేదా అన్నది పూర్తిగా పరిశీలించాలని తేల్చింది. అనంతరం జరిగిన పరిణామాలతో చివరకు తాజాగా ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రపంచ బ్యాంక్ తేల్చి చెప్పడం గమనార్హం.

ఫొటో సోర్స్, AP CRDA
ఆహ్వానించదగ్గదే..
రైతులకు ల్యాండ్ ఫూలింగ్ పేరుతో అన్యాయం చేస్తూ రాజధాని నిర్మాణం విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిన చంద్రబాబు ప్రభుత్వ తీరు వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని రాజధాని ప్రాంత రైతాంగ నాయకుడు అనుమోలు గాంధీ పేర్కొన్నారు. "చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వం వ్యవహరించింది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. పైగా రైతు ప్రతినిధులపై కక్షసాధింపు చర్యలకు కూడా పూనుకున్నారు. నదీ పరివాహక చట్టాల, పర్యావరణ చట్టాలు, భూసేకరణ చట్టాలు కూడా ఆచరణకు నోచుకోలేదు. చివరకు చట్టాలకు విరుద్ధంగా సాగుతున్న ప్రాజెక్టులో ప్రపంచ బ్యాంక్ రుణం అందించడానికి వెనకంజవేసింది. ఈ నిర్ణయం ఆహ్వానించదగ్గదే. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, చట్టబద్ధంగా నిర్మాణాలు సాగించేందుకు ఈ పరిణామం దోహదం చేస్తుందని" చెప్పుకొచ్చారు.
అభివృద్ధి కుంటుపడుతున్నట్టే...
అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు ఎంతో శ్రమించారని, అయినా వైసీపీ చేసిన ఫిర్యాదులతోనే ఇప్పుడు రాజధాని అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఏర్పడిందని టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూరాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. "గతంలోనే రైతుల పేరుతో ప్రపంచ బ్యాంక్ కి తప్పుడు మెయిల్స్ చేశారు. వాటిని మేము ప్రపంచ బ్యాంక్ బృందం దృష్టికి తీసుకెళ్లాము. అయినా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణంపై తగిన శ్రద్ధ పెడుతున్నట్టుగా లేదు. ప్రపంచ బ్యాంక్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడం అమరావతి నగర నిర్మాణం విషయంలో పెద్ద అవరోధం. ఇక ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ రుణం కూడా సందేహంగా మారుతోందని" ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారిక సమాచారం లేదు..
అమరావతి ప్రాజెక్ట్ విషయంలో ప్రపంచ బ్యాంక్ నుంచి ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం అందలేదని మంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు. సీఆర్డీయే కమిషనర్ పి లక్స్మీ నరసింహం కూడా ఇదే విషయం తెలిపారు. వెబ్ సైట్ లో వచ్చిన సమాచారం కన్నా అధికారికంగా తెలిస్తే కారణాల ఆధారంగా స్పందించే వీలుంటుందన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు అర్థం లేదన్నారు.
ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ వైదొలగడం, ఏడీబీ రుణం కూడా సందిగ్ధంలో పడుతుందనే వాదనల నేపథ్యంలో అమరావతి నగర నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోననే దానిపై చర్చ సాగుతోంది.
ఇవి కూడా చదవండి:
- ‘‘అమరావతి భూసేకరణ కేసుతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా’’
- ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతి నగర నిర్మాణం ఎంతవరకు వచ్చింది...
- అమరావతి ఫార్ములా వన్ రేసింగ్: విజేత అబుదాబి జట్టు
- ‘అమరావతి ఒక సంచలన కుంభకోణం.. భూముల కొనుగోళ్లపై విచారణ జరుపుతాం’
- ఏపీ సచివాలయానికి శంకుస్థాపన: అంత ఎత్తైన భవనాన్ని ఎలా నిర్మిస్తారు?
- కొత్త రాజధానిలో జనాలు కరవు
- నరేంద్ర మోదీ ఏపీకి చేస్తానని చెప్పిందేంటి.. వాస్తవంగా చేసిందేంటి?
- రాజధానుల ఎంపిక ఎలా జరుగుతుంది?
- ఈ రాజధాని నగరాలు... ఇటీవలి దశాబ్దాలలో వెలిసిన సరికొత్త అద్భుతాలు
- ‘ఇండోనేసియా దేశ రాజధానిని మారుస్తున్నారు’
- ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు... అతి చౌక నగరాలు
- ఈ 'భారత ఎడిసన్' గురించి ఎంతమందికి తెలుసు...
- ఆఫీస్‌లో టిక్‌టాక్ వీడియోలు తీసి పోస్ట్ చేసినందుకు 11 మంది ఉద్యోగులపై చర్యలు
- హత్యకేసులో జీవిత ఖైదు పడిన శరవణ భవన్ యజమాని గుండెపోటుతో మృతి
- కుల్‌భూషణ్ జాధవ్ మరణశిక్షను పాకిస్తాన్ ఎలా సమీక్షిస్తుంది...
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








