హత్యకేసులో జీవిత ఖైదు పడిన శరవణ భవన్ యజమాని గుండెపోటుతో మృతి

శరవణ భవన్ హోటల్

ఫొటో సోర్స్, AFP

శరవణ భవన్ హోటల్స్ యజమాని 71 ఏళ్ళ రాజగోపాల్ చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చనిపోయారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.

అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టుకు చేసిన అభ్యర్థన తిరస్కరణకు గురైన కొన్ని రోజులకే ఆయన తుది శ్వాస విడిచారు.

తన వద్ద పని చేసే ఉద్యోగి భార్యను పెళ్ళి చేసుకోవాలనుకుని, ఆ వ్యక్తిని చంపించాడనే కేసులో ఆయనకు కోర్టు జీవిత ఖైదు విధించింది.

ఆ తీర్పు మీద ఆయన సుదీర్ఘ కాలం న్యాయ పోరాటం చేశారు. కానీ, సుప్రీం కోర్టు 2019 మార్చి నెలలో మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పింది.

ఆయన మళ్ళీ జూలై 9న తనకు ఆరోగ్యం బాగా లేదంటూ కోర్టును అభ్యర్థించారు. కానీ, సుప్రీం కోర్టు ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

ఒక జ్యోతిష్కుడి సలహా మేరకు ఆయన తన వద్ద పని చేసే ఒక ఉద్యోగి భార్యను పెళ్ళి చేసుకోవాలని పథకం వేశాడు. అందుకోసం, ఆ ఉద్యోగిని అంతం చేయాలని ఆదేశించారనే కేసులో ఆయనకు శిక్ష పడింది.

ఈ కేసులో రాజగోపాల్‌తోపాటు, మరో 5మందికి 2009లో స్థానిక న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. న్యాయస్థానం తీర్పుపై నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

దోశ

ఫొటో సోర్స్, AFP

అసలేం జరిగింది...

ప్రపంచవ్యాప్తంగా శరవణ భవన్‌కు 80 శాఖలు ఉన్నాయి. వేలసంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. దోశ కింగ్‌గా పేరుపడిన రాజగోపాల్ ఒక జ్యోతిష్కుడి సలహా ప్రకారం, తన దగ్గర పని చేసే ఓ ఉద్యోగి భార్యను పెళ్లిచేసుకోవాలని భావించారు.

ఆ ఉద్యోగి 2001లో అదృశ్యమయ్యాడు. అప్పుడు, ఆ ఉద్యోగి భార్య రాజగోపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ ప్రారంభించిన పోలీసులకు, ఆ ఉద్యోగి మృతదేహం ఓ అటవీప్రాంతంలో లభించింది. అతడిని చితకబాది, హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు.

2003లో తనపై కేసు పెట్టిన సదరు ఉద్యోగి భార్యకు లంచం ఇస్తూ, ఆమె కుటుంబాన్ని బెదిరించి, ఆమె సోదరుడిపై దాడి చేశాడన్న వివాదం కూడా రాజగోపాల్ మెడకు చుట్టుకుంది.

స్థానిక కోర్టు.. రాజగోపాల్‌ను దోషిగా పరిగణించి, 2004లో పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ, చెన్నైలోని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది.

హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు విచారిస్తున్న సందర్భంగా, రాజగోపాల్‌కు వైద్యం అవసరమని, అతడి తరపు లాయర్ వాదించడంతో, 2009లో సుప్రీం కోర్టు రాజగోపాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అప్పటికి రాజగోపాల్.. 11 నెలల జైలు జీవితం గడిపాడు.

తాజాగా మార్చి 29, శుక్రవారం.. రాజగోపాల్ తిరిగి జైలుకు వెళ్లాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)