డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అని ఆరోపించిన కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు?

ఫొటో సోర్స్, Getty / Reuters /EPA
అమెరికా ప్రతినిధుల సభలోని నలుగురు మహిళలు తమతమ స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ ఆ దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ట్రంప్ పేర్కొన్న మహిళలు అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్(ఏఓసీ), ఇల్హాన్ ఒమర్, రషీదా తలీబ్, అయానా ప్రెస్లీ నలుగురూ అమెరికా పౌరులే. తమపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఒక జాత్యహంకారి అని వారు ఆరోపిస్తున్నారు.
ట్రంప్ తన వ్యాఖ్యల్లో ఎవరి పేర్లూ స్పష్టంగా చెప్పనప్పటికీ ఆయన మాటలు, చెప్పిన ఉదాహరణలను బట్టి ఈ నలుగురు మహిళలనే ఆయన లక్ష్యంగా చేసుకున్నట్లు అర్థమవుతోంది.
తాజా వివాదం నేపథ్యంలో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నలుగురు మహిళల వివరాలివీ..

ఫొటో సోర్స్, Getty Images
అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్
ఏఓసీగా పిలిచే అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీల ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు జో క్రోలీని ఓడించి సంచలనం సృష్టించారు.
గత ఏడాది నవంబరులో జరిగిన మిడ్ టెర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ఆంథోనీ పప్పాస్‌ను ఓడించి అమెరికా కాంగ్రెస్‌లో అడుగుపెట్టిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు.
న్యూయార్క్‌లో బ్రాంక్స్‌లో పుట్టిపెరిగిన ఏఓసీ తల్లిదండ్రులు ప్యూర్టోరికా సంతతికి చెందినవారు. బోస్టన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు చదువుకున్నారమె. రాజకీయాల్లోకి రావడానికి ముందు కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా, బార్‌టెండర్‌గా పనిచేశారామె.
అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైనప్పటి నుంచి రిపబ్లికన్లకు ఆమె కంటిలో నలుసులా మారారు. నిత్యం ప్రధాన స్రవంతిలో ఉంటూ, సోషల్ మీడియా వేదికగా ఇమిగ్రేషన్, జాతి విద్వేషం, పేదరికం వంటి అంశాలపై స్పందిస్తూ రిపబ్లికన్లపై విరుచుకుపడుతున్నారు.
ట్విటర్‌లో 50 లక్షల మంది ఫాలోవర్లున్న ఏఓసీ రిపబ్లికన్లకు కంటిలో నలుసులా మారారు.
అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించడంలోనూ ఆమెది ముందు వరుసే. ప్రతినిధుల సభకు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ట్రంప్ జాత్యహంకారి అనడంలో ఎలాంటి సందేహం లేదని కుండబద్ధలుగొట్టారు. ''తరతరాలుగా ఉన్న శ్వేత దురహంకారానికి నిదర్శనం ట్రంప్ మాటలు. జాత్యహంకారం ఆయనతోనే మొదలు కాలేదు, కానీ.. దానికి ఆయన బలమైన గొంతుకనిస్తున్నారు'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇల్హాన్ ఒమర్
గత నవంబరులో ప్రతినిధుల సభకు మిన్నెసోటా నుంచి ఎన్నికైన ఇల్హాన్ ఒమర్.. సోమాలియా సంతతికి చెందిన మొట్టమొదటి అమెరికా లెజిస్లేటర్.
యూఎస్ కాంగ్రెస్‌కు మొట్టమొదటిసారి ఎన్నికైన ఇద్దరు ముస్లిం మహిళల్లో ఇల్హాన్ ఒకరు. సోమాలియాకు చెందిన ఆమె కుటుంబం శరణార్థిగా అమెరికాకు వలస వచ్చింది. యూఎస్ కాంగ్రెస్‌లో తలకు హిజాబ్ ధరించి హాజరయ్యే మొట్టమొదటి మహిళ కూడా ఇల్హానే. ఆమె పోరాటం వల్లే 181 ఏళ్లుగా అమెరికా కాంగ్రెస్‌లో హిజాబ్‌పై ఉన్న నిషేధం ఎత్తివేశారు.
యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికై కొద్ది కాలమే అయినప్పటికీ నిత్యం వార్తల్లో నానుతున్నారామె.

ఫొటో సోర్స్, Getty Images
రషీదా తలీబ్
గత ఏడాది నవంబరులో రషీదా తలీబ్ కూడా అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన మొట్టమొదటి పాలస్తీన-అమెరికన్ ఈమె. మిషిగన్ నుంచి డెమొక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు.
డెట్రాయిట్‌లో పుట్టి పెరిగిన తలీబ్ తల్లిదండ్రులు ఏళ్ల కిందట పాలస్తీనా నుంచి అమెరికాకు వలస వచ్చారు. ఆమె నాయనమ్మ ఇప్పటికీ పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌లోనే ఉంటున్నారు.
తలీబ్ తన ప్రమాణ స్వీకార సమయంలో పాలస్తీనా సంప్రదాయ వస్త్రధారణలో వచ్చారు.
తలీబ్ తల్లిదండ్రులకు 14 మంది సంతానం కాగా అందరిలోనూ ఆమె పెద్దది.
ప్రతినిధుల సభలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె ట్రంప్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధ్యక్షుడి అభిశంసనకు పట్టుపడుతూ చేసిన వ్యాఖ్యల సందర్భంగా ఆమె ఉపయోగించన భాష వివాదాస్పదమైంది.

ఫొటో సోర్స్, Getty Images
అయానా ప్రెస్లీ
మసచూషెట్స్ నుంచి అమెరికన్ కాంగ్రెస్‌కు ఎన్నికైన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ అయానా ప్రెస్లీ(45). సిన్సినాటీలో పుట్టి ఓహియోలో పెరిగిన అయానా బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. జోసెఫ్ కెనడీ-2, జాన్ కెర్రీల వద్ధ సీనియర్ సహాయకురాలిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 2009లో ఆమె తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు.
డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీల ఎన్నికలో ఆమె 10 సార్లు గెలిచిన సీనియర్ నేత మైఖేల్ కాప్యుయానోను ఓడించారు.
లైంగిక దాడి నుంచి బయటపడిన బాధితురాలిగా ఆమె తనలాంటి బాధితుల పక్షాన నిత్యం మాట్లాడుతుంది. ''వేదన అనుభవించినవారు అధికారాన్ని దక్కించుకోవాలి'' అని ఆమె తన వెబ్‌సైట్‌లో రాశారు.
ఇవి కూడా చదవండి:
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- ఆ పొలం నిండా కుళ్లిపోతున్న మృతదేహాలు.. వాటి మీద శాస్త్రవేత్తల పరిశోధనలు
- గ్యాంగ్‌లో గుర్తింపు రావాలంటే మనుషుల్ని చంపుతూనే ఉండాలి
- ఐసీసీ సూపర్ ఓవర్ నిబంధనలేంటి? బౌండరీలు కూడా టై అయితే గెలిచే జట్టు ఏది?
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?
- శ్రీలంక: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
- శాండ్విచ్ జనరేషన్ అంటే ఏమిటి? మీరు ఈ కోవలోకి వస్తారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








