కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం... కేసును పునః పరిశీలించాలని ఆదేశం

ఫొటో సోర్స్, Getty Images
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ అరెస్టు చేసిన భారత పౌరుడు కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఏప్రిల్ 10న విధించిన మరణ శిక్షను నిలిపివేస్తున్నట్లు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం తీర్పు చెప్పింది.
నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారతదేశానికి అనుకూలంగా తీర్పు చెప్పారు. ఈ కేసులో జాధవ్ తఫును న్యాయవాదిని నియమించుకునే హక్కు కూడా భారత్‌కు ఉందని ఐసీజే స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో భారతదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సరైనదేనని, ఇది ఐసీజే పరిధిలోకి వస్తుందని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
మొత్తం 16 మంది న్యాయమూర్తులలో 15 మంది భారదేశానికి అండగా నిలిస్తే, పాకిస్తాన్‌కు చెందిన అడ్‌హాక్ జడ్జి జిలానీ మాత్రమే వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ అభ్యంతరాలన్నింటినీ మెజారిటీ న్యాయమూర్తులు తోసిపుచ్చారు. అయితే, కుల్‌భూషణ్ జాధవ్‌ను నిర్దోషిగా ప్రకటించి, విడుదల చేయాలని, స్వదేశానికి పంపించాలని భారతదేశం చేసిన విజ్ఞాపనకు కోర్టు అంగీకరించలేదు.
ఈ కేసులో తీర్పును వెలువరిస్తూ ఐసీజే మరో కీలక వ్యాఖ్య కూడా చేసింది. అదేమంటే, ఇన్నేళ్ళుగా కుల్‌భూషణ్ జాధవ్‌కు న్యాయపరమైన సహకారం ఇవ్వకుండా పాకిస్తాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కోర్టు ఆక్షేపించింది.
జాధవ్‌కు విధించిన మరణశిక్షపై మళ్ళీ విచారణ జరపాలని సూచించింది.
స్థూలంగా చెప్పాలంటే భారతదేశం చేసిన వాదనల్లో చాలా వాటిని అంతర్జాతీయ కోర్టు సమర్థించింది. అందుకే, ఈ పరిణామాన్ని భారతదేశం సాధించిన విజయంగా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, SWATI PATIL/BBC
ఈ తీర్పు వచ్చిన తర్వాత కులభూషణ్ జాధవ్ గ్రామంలో అంటే మహారాష్ట్ర సతారా జిల్లాలోని అనావాడీలో సంబరాలు జరుపుకోవడం కనిపించింది.
భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ తీర్పును భారత విజయంగా వర్ణించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ తీర్పు వచ్చిన తర్వాత కులభూషణ్ జాధవ్ గురించి సోషల్ మీడియాలో స్పందనలు పెరిగాయి. భారత్ ట్విటర్ ట్రెండ్‌లో మొదటి నాలుగు టాప్ ట్రెండ్స్‌లో మూడు కులభూషణ్‌కు సంబంధించినవే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా దీనిపై సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ వాదనలు
భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాధవ్‌ను పాకిస్తాన్‌లోని ఒక సైనిక కోర్టు భారత నిఘా ఏజెన్సీ కోసం గూఢచర్యం, తీవ్రవాదం కేసులో దోషిగా చెప్పింది. అతడికి మరణశిక్ష విధించింది.
భారత్ పాకిస్తాన్ వాదనను కొట్టిపారేస్తోంది. జాధవ్‌ను 2016 మార్చి 3న బలూచిస్తాన్ ప్రాంతంలో అరెస్టు చేశారు. జాధవ్‌ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేశారని భారత్ చెబుతోంది. అక్కడ అతడికి ప్రైవేటు వ్యాపారం ఉందంటోంది.
జాధవ్‌ను 'కాన్సులర్ యాక్సెస్' అంటే భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడే హక్కును ఇవ్వకుండా పాకిస్తాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో వాదించింది.
అయితే, పాకిస్తాన్ మాత్రం గూఢచర్యం కేసుల దోషులైనవారికి 'కాన్సులర్ యాక్సెస్' ఇవ్వడం ఉండదని చెబుతోంది.

జాధవ్ మరణశిక్షను రద్దు చేయాలని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని భారత్ అంతర్జాతీయ కోర్టులో అపీల్ చేసింది. జాధవ్ విచారణలో నిర్ధారిత ప్రక్రియలో కనీస ప్రమాణాలు కూడా పాటించలేదని ఆరోపించింది.
జాధవ్ దోషి అని చెప్పడానికి పాకిస్తాన్ దగ్గర 'బలవంతంగా చేయించిన ప్రకటన' తప్ప వేరే ఎలాంటి ఆధారాలూ లేవని విచారణ సమయంలో భారత వకీల్ హరీష్ సాల్వే వాదించారు.
పాకిస్తాన్ అంతర్జాతీయ విచారణ నుంచి దృష్టి మళ్లించడానికి కులభూషణ్ జాధవ్‌ను పావుగా ఉపయోగిస్తోందని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ సైనిక కోర్టు గురించి ప్రస్తావించిన సాల్వే ఏ దేశమూ తమ చట్టాలను ప్రస్తావిస్తూ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదని తెలిపారు.
2017 డిసెంబర్‌లో జాధవ్ తల్లి, భార్య ఆయన్ను కలవడానికి పాకిస్తాన్ వెళ్లారు. ఆ తర్వాత భారత్ ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి విశ్వసనీయత లేదని చెప్పింది. వారు కలిసినప్పుడు అక్కడి వాతావరణం బెదిరింపుల్లా ఉందని చెప్పింది.
ఆ సమయంలో జాధవ్ తల్లి, భార్య వేసుకువచ్చిన బట్టలను బలవతంగా మార్పించారని, వారు మాతృభాషలో మాట్లాడ్డానికి కూడా అనుమతించలేదని, జాధవ్ భార్య చెప్పులు కూడా తిరిగివ్వలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది.

ఫొటో సోర్స్, AFP
పాకిస్తాన్ స్పందన
అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుపై స్పందిస్తూ పాకిస్తాన్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను విడుదల చేయాలని భారతదేశం చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ న్యాయస్థానం తిరస్కరించిందని అందులో తెలిపింది.
అంతర్జాతీయ సమాజంలో ఒక బాధ్యత కలిగిన దేశంగా పాకిస్తాన్ ఈ కేసులో మొదటి నుంచీ ఐసీజే ఎదుట హాజరవుతూ వచ్చింది. తీర్పు వెలువడిన నేపథ్యంలో పాకిస్తాన్ చట్ట ప్రకారమే నడుచుకుంటుందని స్పష్టం చేసింది..
అయితే, భారత నౌకాదళ కమాండర్ కుల్‌భూషణ్ జాధవ్ పాకిస్తాన్‌లోకి వీసా లేకుండా ప్రవేశించారని పాక్ తమ ప్రకటనలో తెలిపింది.
హుసేన్ ముబారక్ పటేల్ అనే పేరుతో భారతదేశం అధికారికంగా ఇచ్చిన నకిలీ పాస్‌పోర్టుతో వచ్చారు. ఆయన గూఢచర్యానికి, విద్రోహ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది.
పాకిస్తాన్ కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట జరిపిన విచారణలో ఆయన ఆ నేరాలను ఒప్పుకున్నాడు.
ఇది భారతదేశ ప్రభుత్వం తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తుందనడానికి ఈ కేసు ఒక స్పష్టమైన నిదర్శనం అని పాక్ తమ ప్రకటనలో చెప్పింది.

ఫొటో సోర్స్, EPA
కుల్‌భూషణ్ జాధవ్ ఎలా ఈ కేసులో చిక్కుకున్నారు...
పాకిస్తాన్ అధికారులు గూఢచర్యం, విద్రోహ చర్య కేసులో కుల్‌భూషణ్ జాధవ్‌ను 2016లో బెలూచిస్తాన్‌లో అరెస్టు చేశారు. పాకిస్తాన్ మిలిటరీ కోర్టు ఏప్రిల్ 10న కుల్‌భూషణ్‌కు మరణశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. కుల్‌భూషణ్ తమ గూఢచారి కాదని, ఆయన రిటైర్ అయిన నేవీ అధికారి అని భారత్ చెబుతోంది. భారత పౌరుడిని విచారించి తీర్పు ఇచ్చే అధికారం పాకిస్తాన్ కోర్టుకు లేదని.. భారతదేశం అదే ఏడాది మే8న అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ - ఐసీజే)ను ఆశ్రయించింది.
పాక్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్‌భూషణ్‌ను తమ దౌత్యాధికారులు కలవటానికి ఆ దేశం అనుమతించలేదని.. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని.. ఈ విషయంలో 'వియెన్నా కన్వెన్షన్' ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత్ ఆరోపించింది.
ఇరు దేశాలు తమ వాదనలు వినిపించాక మే 18న అంతర్జాతీయ న్యాయస్థానం.. కుల్‌భూషణ్ కేసులో పాక్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది.
ఈ కేసులో ఐసీజే బుధవారం ఇవ్వబోతున్న తీర్పు తీర్పు చాలా కీలకంగా మారనుంది. నిజానికి అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుకు సభ్యదేశాలు కట్టుబడి తీరాలి. అయితే.. పలు తీర్పులను సభ్యదేశాలు పట్టించుకోని ఉదంతాలు ఉన్నాయి. దీంతో ఇరు దేశాలూ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.

ఫొటో సోర్స్, PAKISTAN FOREIGN OFFICE
ఎవరీ కుల్‌భూషణ్ జాధవ్?
కుల్‌భూషణ్ 1970 ఏప్రిల్ 16న మహరాష్ట్రలో జన్మించారు. ఆయన తండ్రి సుధీర్ జాధవ్ రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్.
కుల్‌భూషణ్ 1987లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశించి, తర్వాత భారత నేవీలో చేరారు.
పాకిస్తాన్ విడుదల చేసిన కుల్‌భూషణ్ వాంగ్మూలం ప్రకారం.. ''భారత నేవీ ఇంజినీరింగ్ విభాగంలో కుల్‌భూషణ్ పని చేసేవాడు. హుస్సేన్ ముబారిక్ పటేల్ అనే మారుపేరుతో భారత్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారు'' అని ఉంది.
కుల్‌భూషణ్.. 14 ఏళ్లపాటు ఉద్యోగం చేశాక, కమాండర్ హోదాలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం ఇరాన్‌లో వ్యాపారం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, PAKISTAN FOREIGN OFFICE
అయితే.. 2010-2012 మధ్యలో తాను ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తానంటూ కుల్‌భూషణ్ పలుమార్లు 'రా'ను సంప్రదించినట్లు సమాచారం ఉందని, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక పేర్కొంది.
కానీ జాధవ్ ప్రతిపాదనలను రా అధికారులు తిరస్కరించారని, జాధవ్ వల్ల తమ సంస్థకు ప్రమాదం అని అధికారులు భావించారని ఆ పత్రిక కథనం.
2016 మార్చి నెలలో పాకిస్తాన్ అధికారులు బెలూచిస్తాన్‌లో కుల్‌భూషణ్‌ను అరెస్ట్ చేశారు.
కుల్‌భూషణ్ ఏమన్నారు?
''2013 చివర్లో ఆర్.ఎ.డబ్ల్యూ (రా) అధికారులు నన్ను నియమించారు. అప్పటినుంచి బెలూచిస్తాన్, కరాచిలో పలురకాల కార్యక్రమాలు చేయాలంటూ నాకు రా అధికారులు దిశానిర్దేశం చేశారు. కరాచిలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చెప్పారు'' అని కుల్‌భూషణ్ వాంగ్మూలం ఇచ్చినట్లు పాకిస్తాన్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్‌కు కునుకు లేకుండా చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎలా పుట్టింది
- గురు గోల్వల్కర్ : 'విద్వేష' దూతా లేక 'హిందూ జాతీయవాద' ధ్వజస్తంభమా...
- భగత్ సింగ్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ పోలీస్ స్టేషన్లోనే
- మోదీ, అమిత్ షాల తెగింపుకు అడ్డుకట్ట వేసి, వెనక్కు తగ్గేలా చేసిన నాథూరామ్ గాడ్సే
- భారత్ దాడులతో మూసేసిన గగనతలాన్ని మళ్ళీ తెరిచిన పాకిస్తాన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








