వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ‘అమరావతి ఒక సంచలన కుంభకోణం.. భూముల కొనుగోళ్లపై విచారణ జరుపుతాం’

ఫొటో సోర్స్, facebook/ysjagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతిస్తామని చెప్పారని ఏపీ కాబోయే ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయినట్లు చెప్పారు.
దిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసిన అనంతరం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
''రెండు రాష్ట్రాల మధ్య తొలిసారి స్నేహ బంధం బలపడింది. పోరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలి. అందులో ముఖ్యమైన తెలుగు రాష్ట్రం తెలంగాణ తో స్నేహ బంధం అవసరం. కేసీఆర్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తానే ఒక అడుగు ముందుకేసి సహకరిస్తామని హామీ ఇచ్చారు. విభజన చట్టంలోని హామీలను కలిసి సాదిద్దామని చెప్పారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు మీతో ఉంటారని పెద్దాయన(కేసీఆర్)స్పష్టం చేశారు'' అని జగన్ తెలిపారు.
ఏపీలో తమ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు, తెలంగాణలో అధికార పార్టీకి చెందిన 9 మంది ఎంపీలు.. మొత్తంగా 31 మంది ఎంపీలు ఒకరి కోసం ఒకరి ముందుకు వచ్చే పరిస్థితి ఉందని అన్నారు.
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు సీఎంలం కలిసి పని చేస్తామని తెలిపారు.
ఈనెల 30న తానొక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తానని, తర్వాత పది, పదిహేను రోజుల్లో పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, facebook/ysjagan
అందుకే మోదీని కలిశా
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం అని అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసినట్లు చెప్పారు.
''రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానికి వివరించా, రాష్ట్రానికి అన్నిరకాల సాయం అవసరమని కోరాను. ఈ విషయంలో ప్రధాని సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నా. ఎన్డీయే కూటమి 250 స్థానాలకే పరితమై ఉంటే ఇంతగా అవసరం తెలుగు రాష్ట్రాలకు ఉండేది కాదు. ఎన్డీయే బలం 250 దాటకూడదని దేవుణ్ని ప్రార్థించా. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలనే ఆతృత ఉంది. ఎన్డీయేకు పూర్తి బలం రాకుంటే ప్రత్యేక హోదాపై సంతకం పెట్టాకే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉండేది.'' అని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని జగన్ పేర్కొన్నారు. హోదా ఇచ్చే వరకూ ప్రధానిని అడుగుతూనే ఉంటామని చెప్పారు.
'అప్పుల ఊబిలో రాష్ట్రం'
చంద్రబాబు అయిదేళ్ల పాలనలో రాష్ట్రంపై 2.57 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం పడిందని జగన్ తెలిపారు.
''రాష్ట్రం విడిపోయేనాటికి 97వేల కోట్ల అప్పులు ఉన్నాయి, చంద్రబాబు అయిదేళ్ల పాలనలో 2.57 లక్షల కోట్లకు పైగా అప్పులు పెరిగాయి. ఇందులో అప్పుల మీద వడ్డీయే 20 వేల కోట్లు ఉంది. ఓవర్ డ్రాప్ట్ పై రాష్ట్ర పాలన సాగుతోంది. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తాం.’’ అని చెప్పారు.
‘‘2024 నాటికి మద్యాన్ని ఫైవ్‌స్టార్ హోటళ్లకు పరిమితం చేశాకే ఓట్లు అడుగుతాం. ఆరు నెలలు లేదా ఏడాదిలోగా ప్రభుత్వంలో నిర్మాణాత్మక మార్పులు చేస్తాం. మొత్తం వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తాం. అవినీతి అన్నది ఎక్కడా లేకుండా, పారదర్శక పాలన అందిస్తాం'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, facebook/ysjagan
రాజధాని భూముల్లో అతి పెద్ద కుంభకోణం
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసునని జగన్ అన్నారు. రాజధాని భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగిందని, ఇదో సెన్సేషనల్ స్కామ్ అని ఆరోపించారు.
''రాష్ట్ర విభజన అనంతరం ఎక్కడ రాజధాని వస్తుందో చంద్రబాబుకు ముందే తెలుసు. రాజధాని ఎక్కడ ఎక్కడో వస్తుందని ప్రజలను తప్పుదారి పట్టించి అమరావతిలో తన బినామీలతో చంద్రబాబు తక్కువ ధరకు భూములు కొనిపించారు. అమరావతిలో హెరిటేజ్ కంపెనీకి 14 ఎకరాల భూమిని కేటాయించుకున్నారు.’’ అని ఆరోపించారు.
‘‘ల్యాండ్ పూలింగ్‌లో తన బినామీలను వదిలేసి రైతుల భూములు చంద్రబాబు లాక్కున్నారు. రాజధాని భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగింది. తన వారికి తక్కువ ధరకు భూములు కేటాయించారు. ఇది మామూలు స్కాం కాదు, ఇదో సంచలన కుంభకోణం. భూముల కొనుగోళ్లపై విచారణ జరుపుతాం. చంద్రబాబు మీద నాకు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, YSRCP/FB
కుంభకోణం జరిగిందనే తెలిస్తే రివర్స్ టెండరింగ్
ఫలానా కాంట్రాక్టులో కుంభకోణం జరిగిందని తెలిస్తే దాన్ని గుర్తించి అక్కడి రివర్స్ టెండరింగ్ వేయిస్తామని జగన్ తెలిపారు.
తక్కువ కోట్ చేసిన వారికి టెండర్ వచ్చేలా చేసి, పాదర్శకత పాలన అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
''పోలవరం నిర్మాణం కేంద్ర బాధ్యత అంతకంటే ముందు పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రజలకు అవసరం. యుద్ధప్రాతిపదికన, నిర్ణీత కాలవ్యవధిలో పోలవరం నిర్మించాలి.ప్రాజెక్టు పనులు రద్దు చేసి
రివర్స్ టెండర్ చేయాలనుకుంటే చేస్తాం. కేంద్రంతో చేయించాలనుకున్నా ఇలానే చేయిస్తాం. పోలవరం నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలనేదే మా ప్రధాన ఎజెండా'' అని జగన్ పేర్కొన్నారు.
నాన్న సీఎంగా ఉన్నప్పుడు సెక్రటేరియట్‌లో అడుగుపెట్టలేదు
తన మీద ఎవరు కేసులు పెట్టారో అందరికీ తెలుసునని జగన్ పేర్కొన్నారు.
''మా నాన్న చనిపోయన తర్వాత, నేను కాంగ్రెస్‌ను వదిలిపెట్టాకే నా మీద కేసులు పెట్టారు. నాన్న సీఎంగా ఉన్నప్పుడు నేను సెక్రటేరియట్‌లోనే అడుగుపెట్టలేదు. కనీసం హైదరాబాద్‌లో కూడా ఉండేవాన్ని కాదు. బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చేవాడ్ని. నా మీద కేసులు పెట్టిన వారు ఎవరో అందరికీ తెలుసు అందుకే ప్రజలు మాకు ఇలాంటి తీర్పు ఇచ్చారు.’’ అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రధాని మోదీ, అమిత్ షాలతో జగన్ భేటీ
అంతకు ముందు ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోదీతో జగన్ దిల్లీలో భేటీ అయ్యారు.
తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని మోదీని ఆహ్వానించినట్లు జగన్ తెలిపారు.
అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కూడా కలిశారు. ‘దేశంలో అత్యంత పవర్‌ఫుల్ వ్యక్తుల్లో రెండో వ్యక్తి అమిత్ షా. ఆయన్ను కలిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని కలిశా’’ అని జగన్ మీడియాతో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఈవీఎంలో ఓట్లు ఎలా లెక్కిస్తారు?
- ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు
- ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...
- ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన ఆంధ్రా లీడర్
- పార్టీలు పెట్టారు.. కాపాడుకోలేకపోయారు
- జనసేన పార్టీ వైఫల్యానికి, పవన్ కల్యాణ్ ఓటమికి కారణాలేంటి?
- నరేంద్ర మోదీ: ఆర్ఎస్ఎస్ సాధారణ కార్యకర్త నుంచి ‘అసాధారణ బ్రాండ్’గా ఎలా మారారు?
- BBC Fact Check: ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








