నరేంద్ర మోదీ: ఆర్ఎస్ఎస్ సాధారణ కార్యకర్త నుంచి ‘అసాధారణ బ్రాండ్’గా ఎలా మారారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇది 2014 పార్లమెంటు ఎన్నికల ముందు నాటి విషయం. ఒక ఎన్నికల సభలో నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేస్తున్న ములాయం సింగ్ యాదవ్ "ఉత్తర ప్రదేశ్‌ను గుజరాత్‌లా మార్చేంత దమ్ము మోదీకి లేదు" అన్నారు.
తర్వాత రోజు రెండో ఎన్నికల సభలో నరేంద్ర మోదీ దానికి అదే టోన్‌లో సమాధానం ఇచ్చారు. "నేతాజీ ఉత్తరప్రదేశ్‌ను మరో గుజరాత్‌గా మార్చే దమ్ము మోదీకి లేదు అంటున్నారు. ఇంకో గుజరాత్ రూపొందించడానికి అత్యంత ముఖ్యంగా ఏది కావాలో మీకు తెలుసా. దానికి 56 అంగుళాల ఛాతీ ఉండాలి" అన్నారు.
ఈ ఒక్క మాట ఆ ఎన్నికల్లో మోదీకి తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ మాటతో హిందూ పౌరుషానికి ప్రభావితం అయ్యే ఓటర్లను ఆయన తనవైపు ఆకర్షించారు.
ఆయన జీవితచరిత్ర రాసిన నిలంజన్ ముఖోపాధ్యాయ అహ్మదాబాద్‌లో మోదీ టైలర్ 'జేడ్ బ్లూ' పేరుతో షాపు నడిపే బిపిన్ చౌహాన్‌ను "మోదీ చాతీ కొలత నిజానికి ఎంత?" అని అడిగితే, ఆయన మొదట మౌనంగా ఉన్నారు, తర్వాత 56 అంగుళాలైతే కాదన్నారు. అది వేరే విషయం
తర్వాత భీంరావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధికారులకు నరేంద్ర మోదీ జాకెట్ కుట్టించే బాధ్యతలు ఇచ్చినపుడు వారి టైలర్ నరేంద్ర మోదీ చాతీ కొలత 50 అంగుళాలని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బాల్యం నుంచీ వాదించే అలవాటు
చదువుకునే రోజుల్లో మోదీ ఒక సగటు విద్యార్థిగా ఉండేవారు.
బీఎన్ హైస్కూల్లో ఆయన అప్పటి ఉపాధ్యాయుడు ప్రహ్లాద్ భాయి పటేల్‌తో మాట్లాడిన నిలంజన్ ముఖోపాధ్యాయ తన 'నరేంద్ర మోదీ-ద మెన్, ద టైమ్స్' పుస్తకంలో "నరేంద్ర ఆ రోజుల్లో చాలా వాదించేవాడు. ఒకసారి నేను అతడిని నీ హోంవర్క్ క్లాసు మానిటర్‌కు చూపించమని చెప్పాను. దానికి మోదీ నేను చేసింది చూపిస్తే టీచరుకు చూపిస్తా, లేదంటే ఎవరికీ చూపించను అన్నాడు" అని ప్రహ్లాద్ చెప్పారని రాశారు.
మోదీ మొసళ్లున్న సరస్సును దాటినప్పుడు
మోదీకి ఎంత పెద్ద ప్రత్యర్థులైనా ఆయనలో ఆత్మవిశ్వాసానికి లోటు లేదని అంగీకరిస్తారు.
మోదీ జీవితచరిత్ర రాసిన మరో రచయిత ఎండీ మరీనో తన పుస్తకం నరేంద్ర మోదీ ఎ పొలిటికల్ బయోగ్రఫీలో మోదీ చిన్నప్పుడు శర్మిష్టా సరస్సు దగ్గర ఒక ఆలయం ఉండేది. పవిత్ర దినాల్లో దానిపై ఉన్న జెండాను మార్చేవాళ్లు. ఒకసారి భారీ వర్షం రావడంతో ఆ జెండాను మార్చాల్సి వచ్చింది.
నరేంద్ర మోదీ తను సరస్సును దాటి ఆ జెండాను మార్చాలని నిర్ణయించుకున్నారు. సరస్సులో అప్పుడు చాలా మొసళ్లుండేవి. ఒడ్డున నిలబడిన వాళ్లంతా మొసళ్లను భయపెట్టడానికి ఢోల్ వాయిస్తుంటే నరేంద్ర మోదీ ఒంటరిగా సరస్సులో ఈదుతూ దాన్ని దాటారు. ఆలయంపై జెండాను మార్చారు. ఆయన తిరిగి ఇవతలకు రాగానే జనం ఆయన్ను తమ భుజాలపైకి ఎత్తుకున్నారు.
అయితే కొంతమంది ఇది నిజం అని నమ్మడం లేదు. అలా ఎప్పుడూ జరగలేదని అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
తండ్రి టీ దుకాణంలో సాయం
నరేంద్ర మోదీ మొదట్నుంచీ ఇంటి పనుల్లో సాయం చేసేవారు. స్కూల్ అయిపోగానే పరిగెత్తుకుని వడనగర్ స్టేషన్ దగ్గర వాళ్ల నాన్న నడిపే టీ షాపుకు చేరుకునేవారు.
నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటారు.
ఒకసారి అసోంలో టీ కూలీల గురించి మాట్లాడుతూ "అందరికీ మీ అసోం టీ తాగిస్తూ తాగిస్తూ నేను ఈ స్థాయికి చేరుకున్నాను" అని మోదీ చెప్పారు.
మోదీ జీవితచరిత్ర రాసిన వారిలో చాలా మంది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని అంగీకరించే వారు కూడా ఉన్నారు. వారు నరేంద్ర మోదీ వడనగర్, అహ్మదాబాద్‌లో టీ అమ్మిన, ఆ రోజుల గురించి వివరంగా రాశారు.
కొన్ని మీడియా కథనాలు మోదీ వడనగర్ రైల్వే స్టేషన్ దగ్గర టీ అమ్మిన తర్వాత తన మామతోపాటు పనిచేసేవారని చెప్పాయి. ఆయన అహ్మదాబాద్ గీతా మందిర్ దగ్గర ఉన్న బస్ స్టాప్‌లో క్యాంటిన్ నడిపేవారు.

ఫొటో సోర్స్, Getty Images
కరస్పాండెన్స్ ద్వారా పొలిటికల్ సైన్స్ డిగ్రీ
నరేంద్ర మోదీ మనసులో ప్రైమరీ స్కూల్ తర్వాత జామ్‌నగర్ సైనిక స్కూల్లో చేరాలనే ఒక కోరిక ఉండేది. కానీ ఆయన కుటుంబ ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. దాంతో ఆయన అక్కడ చేరలేకపోయారు.
మరోవైపు చదవడం కోసం మోదీని బయటకు పంపించడం ఆయన తండ్రికి కూడా ఇష్టం లేదు. మోదీ ఒక స్థానిక డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ కూడా తీసుకున్నారు. కానీ అటెండన్స్ తక్కువై ఆయన ఆ కాలేజీ వదలాల్సి వచ్చింది.
తర్వాత ఆయన కరస్పాండెన్స్ ద్వారా మొదట దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ చేశారు, తర్వాత గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ చేశారు.
ఆర్టీఐ కింద కొంతమంది మోదీ ఎంఏ డిగ్రీ వివరాలు తెలుసుకోవాలని అనుకున్నారు. దాంతో గుజరాత్ విశ్వవిద్యాలయం ఆయన 1983లో ప్రథమ శ్రేణిలో ఎంఏ పాస్ అయ్యారని చెప్పింది.
తర్వాత గుజరాత్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయంతీభాయ్ పటేల్ "మోదీ డిగ్రీలో ఏయే సబ్జెక్టుల గురించి చెప్పారో, అవన్నీ ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులోనే లేవని" చెప్పి వివాదం సృష్టించారు.
గుజరాత్ విశ్వవిద్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది.

ఫొటో సోర్స్, Getty Images
జశోదా బేన్‌తో వివాహం
మోదీకి 13 ఏళ్లు వచ్చేసరికి ఆయన కుటుంబం 11 ఏళ్ల జశోదా బేన్‌తో ఆయనకు వివాహం చేసింది. కొన్ని రోజులు ఆమెతో ఉన్న తర్వాత మోదీ తన ఇల్లు వదిలి వెళ్లిపోయారు.
2014 లోక్‌సభ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో దాని గురించి ప్రస్తావించినపుడు ప్రపంచానికి మోదీ వివాహం గురించి మొదటిసారి తెలిసింది. అయితే గుజరాత్ రాజకీయ సర్కిళ్లలో ఈ విషయం గురించి లోలోపలే చర్చించుకునేవారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత జశోదా బేన్‌కు ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ సెక్యూరిటీ అందించినపుడు ఆమె దానిని ఒక వింత పరిస్థితిలో ఉన్నట్టు భావించారు.
ఫస్ట్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తను ఆర్టీసీ బస్సులో వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ పోలీస్ జీప్ ఆ బస్సు వెనక వచ్చేదని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీని ఆరెస్సెస్ లో చేర్చిన 'వకీల్ సార్'
మోదీని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లోకి తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా ఇవ్వాలి అంటే, అది లక్ష్మణ్‌రావ్ ఇనామ్‌దర్ అలియాస్ వకీల్ సారుకే దక్కుతుంది.
అప్పట్లో వకీల్ సార్ గుజరాత్‌లో ఆరెస్సెస్ ప్రాంతీయ ప్రచారకులుగా ఉండేవారు.
ఎమ్వీ కామత్ కాలిందీ రండేరీ తన 'నరేంద్ర మోదీ: ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎ మోడ్రన్ స్టేట్' పుస్తకంలో ఆ విషయం రాశారు. "ఒకసారి మోదీ దీపావళికి ఇంటికి రాకపోయేసరికి ఆయన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఆరోజు వకీల్ సార్ ఆయన్ను ఆరెస్సెస్ సభ్యత్వం ఇప్పించే పనిలో ఉన్నారు" అని చెప్పారు
1984 వకీలు గారు మృతిచెందారు. కానీ మోదీ ఆయన్ను ఎప్పటికీ మరచిపోలేకపోయారు. తర్వాత మోదీ మరో ఆరెస్సెస్ కార్యకర్త రాజాభాయి నేనేతో కలిసి వకీల్ గారిపై 'సేతుబంధ్' అనే ఒక పుస్తకం రాశారు.
మోదీలో మిగతావారిని ఆకర్షించిన అత్యంత ముఖ్యమైన లక్షణం, క్రమశిక్షణ.
సీనియర్ జర్నలిస్ట్ సంపత్ "మోదీ పెద్దన్న సోమాభాయి ఆయన చిన్నప్పటి నుంచీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరాలని అనుకునేవారని చెప్పారు. ఎందుకంటే ఆ శాఖలో ఒక వ్యక్తి ఆదేశాలు ఇస్తే ప్రతి ఒక్కరూ దాన్ని పాటించడం అనే విషయం ఆయన్ను బాగా ఆకట్టుకుంది" అన్నారు.
ఒకప్పుడు మోదీతో సన్నిహితులు, తర్వాత ప్రత్యర్థిగా మారిన శంకర్ సింగ్ వాఘేలా "మోదీకి మొదట్నుంచీ ఏదైనా ప్రత్యేకం అనిపించేలా చేయాలనే ధోరణి ఉండేది. మేం పొడవు చేతులున్న చొక్కాలు వేసుకుంటే, ఆయన పొట్టి చేతుల చొక్కాలో కనిపించేవారు. మేం ఖాకీ ట్రౌజర్స్ వేసుకుంటే, మోదీ తెల్లటి ట్రౌజర్లు ఇష్టపడేవారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వాజ్‌పేయి నుంచి మొబైల్ కాల్
2001 అక్టోబర్ 1న, మోదీ విమాన ప్రమాదంలో మరణించిన ఒక జర్నలిస్ట్ స్నేహితుడి అంత్యక్రియల్లో ఉన్నారు. అప్పుడే ఆయన మొబైల్ ఫోన్ రింగ్ అయ్యింది.
ఆ వైపు ప్రధాన మంత్రి వాజ్‌పేయి ఉన్నారు. ఆయన "మీరెక్కడున్నారు" అని అడిగారు. సాయంత్రం వాజ్‌పేయిని కలవడానికి వెళ్లాలని మోదీ నిర్ణయించుకున్నారు.
సాయంత్రం మోదీ 7 రేస్‌కోర్స్ రోడ్ చేరుకునేసరికి వాజ్‌పేయి ఆయనతో తమాషాగా "మీరు కాస్త ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నట్టున్నారే, దిల్లీలో మీరు కాస్త ఎక్కువగానే గడుపుతున్నట్టుంది. పంజాబీ వంటలు తిని తిని మీ బరువు పెరిగిపోతోంది. మీరు గుజరాత్ వెళ్లండి అక్కడ పనులు చూసుకోండి" అన్నారు.
ఎండీ మరీనో దాని గురించి రాశారు. "మోదీ బహుశా తనను పార్టీ కార్యదర్శిగా గుజరాత్ పంపిస్తున్నారేమో అనుకున్నారు. అంటే నేను ఏ రాష్ట్రాలను చూస్తున్నానో వాటిని ఇక చూడలేనా అని అమాయకంగా అడిగారు. వాజ్‌పేయి ఆయనతో కేశూభాయ్ పటేల్ తర్వాత నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి అవుతావని అన్నప్పుడు, ఆయన ఆ పదవి తీసుకోడానికి నిరాకరించారు".
"మోదీ గుజరాత్‌లో పార్టీని చక్కదిద్దడానికి నెలకు పది రోజులు పని చేయగలనని, కానీ ముఖ్యమంత్రి కాలేనని చెప్పారు. వాజ్‌పేయి ఆయనకు నచ్చజెప్పారు. కానీ మోదీ ఒప్పుకోలేదు. తర్వాత అడ్వాణీ ఆయనకు ఫోన్ చేయాల్సి వచ్చింది. "అందరూ మీ పేరే చెబుతున్నారు. వెళ్లండి వెళ్లి ప్రమాణ స్వీకారం చేయండి" అన్నారు. వాజ్‌పేయి ఫోన్ వచ్చిన ఆరో రోజు 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు."

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్ అల్లర్లతో చెడ్డపేరు
నాలుగు నెలల తర్వాత అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకుల కోచ్‌కు గోధ్రాలో మంటలు అంటుకుని, 58 మంది మృతి చెందినపుడు మోదీ నాయకత్వానికి మొదటి పరీక్ష ఎదురైంది.
తర్వాత రోజు విశ్వ హిందూ పరిషత్ మొత్తం రాష్ట్రమంతటా బందుకు పిలుపునిచ్చింది. హిందూ, ముస్లిం అల్లర్లు జరిగాయి. వాటిలో 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
పరిస్థితులను అదుపు చేయడానికి మోదీ వెంటనే చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి.
మోదీ మీడియా సమావేశంలో "ప్రతి చర్యకు వ్యతిరేకంగా సమానమైన ప్రతిచర్య ఉంటుంది" అని చాలా వివాదాస్పదమైన ప్రకటన చేశారు.
ఒక రోజు తర్వాత ఆయన ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో "చర్య, ప్రతి చర్య అనే చెయిన్ నడుస్తూనే ఉంటుంది. చర్యలు గానీ, ప్రతిచర్యలు గానీ ఉండకూడదనే మేం కోరుకుంటున్నాం" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాజ్‌పేయి అభిప్రాయం
కొన్ని రోజుల తర్వాత ఆయన అల్లర్ల బాధిత శిబిరాల్లో ఉండే ముస్లింలపై మరో కఠిన వ్యాఖ్య చేశారు. ఆయన "మేం ఐదుగురం, మాకు పాతిక మంది" అన్నారు.
తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో మోదీ "సహాయ శిబిరాల్లో ఉన్న వారి గురించి కాదు, దేశంలో ఉన్న జనభాను ప్రస్తావిస్తూ అలా అన్నానని" చెప్పారు.
ఏళ్ల తర్వాత ఒక జర్నలిస్ట్ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన కార్యదర్శిగా ఉన్న బ్రజేష్ మిశ్రాను "వాజ్‌పేయి మోదీని గుజరాత్ అల్లర్ల కోసం ఎందుకు పదవి నుంచి తప్పించలేదు" అని అడిగినప్పుడు, ఆయన "వాజ్‌పేయి మోదీనే రాజీనామా ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఆయన ప్రభుత్వానికే పెద్ద, పార్టీకి కాదు. బీజేపీ మోదీని పదవి నుంచి దింపేయాలని కోరుకోలేదు. దాంతో వాజ్‌పేయి పార్టీ అభిప్రాయానికి తలవంచాల్సి వచ్చింది. బీజేపీ కాంగ్రెస్‌లా ఉండదు, ఇప్పటికీ అలా లేదు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టోపీ పెట్టుకోడానికి నిరాకరించారు
ఒకసారి మౌలానా సయ్యద్ ఇమామ్ ఆయన ధరించడానికి ఒక జాలీ టోపీ ఇచ్చినపుడు ఆయన "అది పెట్టుకోవడం వల్ల ఎవరూ సెక్యులర్ అయిపోరని" చెబుతూ దాన్ని తిరస్కరించారు. 2014లో ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన సిక్కుల తలపాగాతోపాటు చాలా రకాల టోపీలు ధరించారు. అది వేరే విషయం.
'మియా ముషారఫ్, షహజాదే'
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తన ఎన్నికల ప్రసంగాల్లో ఎవరిని టార్గెట్ చేసుకుంటారో వారి పేర్లకు ముందు ఆయన 'మియా ముషారఫ్', 'మియా అహ్మద్ పటేల్' లాంటి ముస్లిం విశేషణాలు జోడించేవారు.
2014 ఎన్నికల్లో ఆయన రాహుల్ గాంధీని హేళన చేసినప్పుడు ఆయన ఈజీ పదం అయిన 'యువరాజు' అనడానికి బదులు 'షహజాదే' అనే ఉర్దూ పదం ఉపయోగించారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ స్వతంత్ర భారత చరిత్రలో ముస్లిం ఎంపీని ఎన్నుకోకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి పార్టీగా నిలిచింది.
తర్వాత మోదీ మంత్రిమండలిలో ముగ్గురు ముస్లిం మంత్రులను తీసుకున్నారు. వీరిలో ఒక్కరు కూడా లోక్‌సభ సభ్యులు కారు.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్ మోడల్
ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో జరిగిన గుజరాత్ ఆర్థికాభివృద్ధికి 'షోకేజ్'గా మార్చిన నరేంద్ర మోదీ గుజరాత్ అల్లర్లతో పాడైన ఇమేజ్‌ను తుడిచేయడానికి ప్రయత్నించారు.
దీనికి గుజరాత్ మోడల్ అనే పేరు పెట్టారు. ఇందులో ప్రైవేటు రంగాలను ప్రోత్సహించి, పబ్లిక్ రంగ కంపెనీల మెరుగైన నిర్వహణతో 10 శాతం ఆకట్టుకునే వృద్ధి రేటు సాధించారు.
2008లో పశ్చిమ బంగాల్ సింగూరులో టాటా మోటార్స్ ప్లాంటుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తినపుడు జరిగినప్పుడు మోదీ వెంటనే, ముందుకు వచ్చి కంపెనీ గుజరాత్‌లో ప్లాంట్ పెట్టడానికి ఆహ్వానించడమే కాదు, వారికి భూములు, పన్ను మినహాయింపులు, ఇతర సౌకర్యాలు కల్పించారు.
రతన్ టాటా దానికి ఎంత సంతోషపడిపోయారంటే ఆయన మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. కానీ ఆ గుజరాత్ మోడల్‌ను చాలా ప్రాంతాల్లో విమర్శించారు.
ప్రముఖ జర్నలిస్ట్ రూతమ్ బోరా హిందూలో ప్రచురించిన ఒక వ్యాసంలో "వైబ్రంట్ గుజరాత్ 8 సంస్కరణల్లో 84 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. కానీ వీటిలో ఎక్కువ భాగం పూర్తి కాలేదు" అని రాశారు.
తలసరి ఆదాయంలో గుజరాత్ భారత్‌లో ఐదో స్థానంలో ఉంది. కానీ, నరేంద్ర మోదీ రాక ముందు నుంచే, గుజరాత్ భారత్‌లోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటూ వచ్చింది.

ఫొటో సోర్స్, BBC Sport
తననే బ్రాండ్‌గా మలిచిన మోదీ
ఏ నరేంద్ర మోదీ గురించి భారత్‌లోనే కాకుండా ప్రపంచస్థాయిలో ఇంత ప్రచారం జరుగుతోందో ఆయనకు అమెరికా వీసా ఇవ్వలేదంటే, పార్లమెంటులో ఏ చర్చ జరిగినా అది మోదీ, గుజరాత్ అల్లర్ల అంశం లేకుండా ముగిసేది కాదంటే ఆశ్చర్యం వేస్తుంది. అయినప్పటికీ మోదీకి ఇంత భారీగా ప్రజల మద్దతు ఎలా లభించింది.
మోదీపై వచ్చిన మరో జీవిత చరిత్ర "సెంటర్ స్టేజ్-ఇన్‌సైడ్ మోదీ మోడల్ ఆఫ్ గవర్నెన్స్" రచయిత ఉదయ్ మాహుర్కర్ మాట్లాడుతూ "మోదీ అనే బ్రాండ్ రూపొందించడానికి నరేంద్ర దామోదర్ మోదీ చాలా శ్రమించారు. మాటిమాటికీ వేళ్లతో వీ అనే గుర్తు చూపించినా, ఆత్మవిశ్వాసంతో ఠీవిగా నడిచినా, తన ట్రేడ్‌మార్క్ పొట్టి చేతుల కుర్తా, బిగుతుగా ఉండే చుడీదార్ పైజామా ధరించినా- ఆయన ప్రతి శైలీ బాగా ఆలోచించి రూపొందించుకున్నదే" అన్నారు.
ప్రపంచం ముందు కనిపించే మోదీ చిత్రం ఒక ఆధునిక వ్యక్తిది. ఆయన ల్యాప్-టాప్ ఉపయోగిస్తారు. ఆయన చేతిలో ఒక బిజినెస్ పేపర్, డీఎస్ఎల్ఆర్ కెమెరా ఉంటుంది. ఆయన ఒక్కోసారి ఒబామా జీవితచరిత్ర చదువుతుంటే, మరోసారి ట్రాక్ సూట్ ధరించి కనిపిస్తారు, ఇంకోసారి ఆయన తలపై కౌబాయ్ హ్యాట్ పెట్టుకుని ఉంటారు.

మోదీ జీవవశైలి
మోదీ ముడతలు పడిన ఖద్దరు ధరించే ఒక టిపికల్ సోషలిస్టు రాజకీయ నేతలా ఉండరు. ఖాకీ ప్యాంట్ వేసుకుని, చేతిలో లాఠీ పట్టుకునే ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కూడా కాదు.
ఆయన ఖరీదైన 'బల్‌గారీ' రిమ్‌లెస్ కళ్లజోడు ధరిస్తారు. ఆయన జేబులో తరచూ 'మాంట్ బ్లాంక్' పెన్ ఉంటుంది. చేతికి లెదర్ స్ట్రాప్ ఉన్న లగ్జరీ 'మొబాడో' గడియారం కట్టుకుంటారు.
తన గొంతుపై ప్రభావం పడుతుందని ఆయన ఎప్పుడూ చల్లటి నీళ్లు తాగరు. ఆయన జేబులో ఎప్పుడూ ఒక దువ్వెన పెట్టుకుంటారు. చెదిరిన జుట్టుతో ఇప్పటివరకూ ఆయన్ను ఎవరూ ఒక్క ఫొటో కూడా తీయలేకపోయారు.
ఆయన ప్రతి రోజూ వేకువజామున నాలుగు గంటలకు లేస్తారు. యోగా చేశాక తన ఐ-ప్యాడ్‌లో వార్తలు చదువుతారు. ఆయన గత రెండు దశాబ్దాలుగా ఒక్క సెలవు కూడా తీసుకోలేదు.
ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ కె జోస్ కార్వా పత్రికలో రాసిన తన వ్యాసం 'ద ఎంపరర్ అన్‌క్రౌన్డ్: ద రైజ్ ఆఫ్ నరేంద్ర మోదీ'లో "నాటకీయతలో మోదీని మించిన పండితులు ఎవరూ ఉండరు. ఆయన గట్టిగా మాట్లాడతారు. దృఢంగా ఉంటారు. ఆత్మివిశ్వాసం తొణికిసలాడుతుంది. నేను ఉంటే చాలు ప్రతి ఒక్కటీ అదుపులో ఉంటుందని తన అనుచరుల్లో నమ్మకం కలిగేలా చేసే ఒక నేతలా కనిపిస్తారు".
"మోదీ కాగితం అవసరం లేకుండా అవతలివారి కళ్లలోకి చూసి మాట్లాడగలరు. ఆయన ప్రసంగం మొదలైతే జనంలో నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఎవరైనా తమ మొబైల్లో మాట్లాడ్డం ఆపేస్తారు. చాలా మంది నోరు తెరిచి అలాగే చూస్తుండిపోతారు".

ఫొటో సోర్స్, Getty Images
అయినవారు లేరు, అవినీతీ లేదు
ప్రముఖ సోషియాలజీ ప్రొఫెసర్ ఆశిష్ నందీ నరేంద్ర మోదీ వ్యక్తిత్వం గురించి 'ప్యొరిటేనికల్ రిజిడిటీ' అనే పదం ఉపయోగించారు.
దీనిని వివరంగా చెప్పడానికి ఆయన ఆయన ఎలాంటి సినిమాలూ చూశారు. మద్యం తాగరు. సిగరెట్ తాగరు. ఆయన మసాలాలు లేని ఆహారం తీసుకుంటారు. అవసరమైతే మామూలు కిచిడీ తింటారు. అది కూడా ఒంటరిగా. ప్రత్యేక సందర్భాల్లో ఉపవాసం ఉంటారు. ముఖ్యంగా నవరాత్రి సందర్భంగా ఆయన రోజుకు నిమ్మ రసం లేదా ఒక కప్పు టీ మాత్రమే తాగుతారు.
నందీ తర్వాత.. మోదీ ఒంటరిగా ఉంటారు, తన తల్లి, నలుగురు సోదరులు, ఒక సోదరితో అప్పుడప్పుడూ మాట్లాడతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు. తన ప్రభుత్వ నివాసంలో ఆమెను వీల్ చెయిర్‌లో తిప్పడం కూడా చూశారు. ఆయన తన జీవితంలోని ఈ కోణాన్ని యదార్థంగా చూపిస్తారు.
ఒకసారి హిమాచల్ ప్రదేశ్ హమీర్‌పూర్ ఎన్నికల సభలో మాట్లాడిన మోదీ "నాకు ఎలాంటి కుటుంబ సంబంధాలు లేవు. నేను ఒంటరి వాడిని. నేను ఎవరికోసం అవినీతి చేయాలి. నా మనసు, నా శరీరం పూర్తిగా ఈ దేశానికే అంకితం" అన్నారు.
'సరిగ్గా ప్రశంసించడమూ రాదు'
బహిరంగంగా మోదీ నారీ శక్తిని పొగుడుతూ కనిపిస్తుంటారు.
అయితే, ఓ సారి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురించి ఆయన చేసిన ప్రశంసలు చర్చనీయాంశమయ్యాయి.
మహిళ అయినప్పటికీ (డిస్పైట్ ఆఫ్ బీయింగ్ వుమన్) హసీనా, ధైర్యంగా ఉగ్రవాదంపై పోరాడుతున్నారని మోదీ అన్నారు.
ఈ వ్యాఖ్యల తర్వాత ట్విటర్‌లో 'డిస్పైట్ ఆఫ్ బీయింగ్ ఉమన్' అన్న పదం ట్రెండ్ అయ్యింది.
మోదీకి ప్రశంసించడం కూడా సరిగ్గా తెలియదంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక చురక అంటించింది.
ఉద్యోగాల కల్పనలో విఫలం
2014 లోక్‌సభ ఎన్నికలను నరేంద్ర మోదీ ప్రధానంగా రెండు హామీలపై గెలిచారు.
ఒకే ఏడాదిలో ఒక కోటి ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇచ్చారు. అంటే నెలకు 8.4 లక్షల ఉద్యోగాలు.
దీన్ని నెరవేర్చుకోవడంలో కనీసం ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారని మోదీ సమర్థుకులే వ్యాఖ్యానిస్తుంటారు.
భారత్‌లో విద్యావంతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
130 కోట్ల జనాభా కలిగిన దేశంలో ప్రతి నెలా 5 లక్షల కొత్త ఉద్యోగాలు ఏర్పడటం అవసరం. ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోవడాన్ని మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యంగా భావించవచ్చు.
ఇటీవలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.8% వృద్ధిని నమోదు చేసింది. అభివృద్ధి చెందిన చాలా దేశాల కన్నా ఇది ఎక్కువే అయినప్పటికీ, గత ఐదేళ్లలో చూసుకుంటే భారత్‌కు ఇదే అత్యల్పం.
'బాలాకోట్' సంజీవని
మోదీ పాలన పట్ల దేశంలోని రైతులు కూడా సంతోషంగా కనిపించలేదు.
సమస్యల గళం వినిపించేందుకు వారు దిల్లీ వరకూ కవాతు చేసి కూడా చాలా రోజులేమీ కాలేదు.
ఇటీవల జరిగిన కొన్ని అసెంబ్లీల ఎన్నికల్లో మోదీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా, బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో మరోసారి మోదీ కేంద్రంలో అధికారం రాగలరా అని సందేహాలు తలెత్తాయి.
కానీ, కశ్మీర్‌లో జరిగిన ఓ మిలిటెంట్ దాడి, దాని వల్ల పాకిస్తాన్‌తో భారత్‌కు మధ్య ఓ వారంపాటు నడిచిన ఉద్రిక్తతలు, బాలాకోట్‌లో భారత వాయుసేన వైమానిక దాడులు.. మోదీ ఆదరణ తగ్గకుండా అడ్డుకున్నాయి.
'అదే సువర్ణ అవకాశం'
పాకిస్తాన్‌లోని మిలిటెంట్ స్థావరాలపై భారత వాయసేన దాడులు చేసిందా లేక గురితప్పిందా? భారత యుద్ధ విమానాన్ని పాక్ నేల కూల్చిందా? అన్న విషయాలు ఓటర్లకు అవసరం లేదు.
దేశంపై జరిగిన దాడికి మోదీ వెంటనే బదులు చెప్పారన్నదే వారు పట్టించుకుంటారు.
''ఏడు సముద్రాల లోతుల్లో దాక్కున్నా, వారిని బయటకు తీస్తా. లెక్క సరిచేయడం నా స్వభావం'' అని మోదీ వ్యాఖ్యానించినప్పుడు జనాలు చప్పట్లు కొట్టి, స్వాగతించారు.
పాక్‌తో ఉద్రిక్తతల రూపంలో మోదీకి ఓ సువర్ణ అవకాశం వచ్చిందని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ డైరెక్టర్ మిలన్ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు.
''దేశ భద్రతకు సంబంధించిన అంశంలో నిర్ణయాలను, నాయకత్వ లక్షణాలను ప్రజలు బాగా గమనిస్తారు. తప్పైనా, ఒప్పైనా తనకు నాయకత్వ లక్షణాలకు కొదవ లేదని చెప్పుకోవడంలో మోదీ సఫలమయ్యారు'' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వైసీపీ మెజారిటీకి ప్రజాశాంతి పార్టీ గండికొట్టిందా? ఒకే పేరుతో నిలబెట్టిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లెన్ని?
- వైసీపీ జోరు.. టీడీపీలో లోకేశ్ సహా మంత్రులు సైతం వెనుకంజ.. పవన్ సహా జనసేన అభ్యర్థులు డీలా
- మోదీ ఎన్నికల మంత్రం: ‘దేశ భద్రత - హిందుత్వ సమ్మేళనం’తో... సామాజిక, ఆర్థిక సమస్యలు బలాదూర్
- రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలే అంతిమ పోరాటమా...
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: కొత్త తరం నాయకుల ప్రతినిధి
- సెప్టెంబర్ 17: విలీనమా? విమోచనా?... 1948లో జరిగిన హైదరాబాద్ విలీనాన్ని ఎలా చూడాలి?- అభిప్రాయం
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- ఐన్‌స్టీన్ దృష్టిలో అద్భుతమైన గణిత మేధావి ఎవరో తెలుసా?
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- ‘ఉద్యోగాల లోటు లేదు, ఉత్తర భారతీయుల్లో వాటికి అర్హులు లేరు’ - కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్
- 11 తరాలుగా ఈ ఆలయంలో అర్చకులంతా దళితులే.. వివక్షను పారదోలిన ఉప్పులూరు చెన్నకేశవ ఆలయం ప్రత్యేకతలివీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








