రామ్ జెఠ్మలానీని వాజ్‌పేయి ఎందుకు రాజీనామా చేయమన్నారు

వాజ్‌పేయి, రాం జెఠ్మలానీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రసిద్ధ న్యాయవాది, భారత మాజీ న్యాయ మంత్రి రామ్ జెఠ్మలానీ (95) ఆదివారం దిల్లీలో కన్నుమూశారు.

న్యాయవాదిగా 78 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. ఇందిరా గాంధీ హత్య, జెస్సికా లాల్ హత్య, రాజీవ్ గాంధీ హత్య, లాలూప్రసాద్ యాదవ్ నిందితుడిగా ఉన్న దాణా కుంభకోణం, 2జీ కుంభకోణం వంటి ఎన్నో ప్రముఖ కేసుల్లో ఆయన నిందితుల తరఫున వాదించారు.

భారతదేశ రాజకీయాలకు, సమాజానికి కొత్త దిశను చూపిన దాదాపు ప్రతి కేసులోనూ ఆయన వాదనలు వినిపించారు.

జాతీయ స్థాయిలో రామ్ జెఠ్మలానీకి గుర్తింపు తెచ్చిన కేసుగా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే, నానావతి కేసు గురించే మాట్లాడుకోవాలి. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

క్రిమనల్ న్యాయవాదిగా ఎన్నో అత్యున్నత శిఖరాలను జెఠ్మలానీ అధిరోహించారు.

జెఠ్మలానీ కెరీర్‌ను చాలా దగ్గరగా గమనించినవారిలో న్యాయవాది దుష్యంత్ దవే ఒకరు.

''జెఠ్మలానీది చాలా గొప్ప వ్యక్తిత్వం. తనకు తెలిసిన అందరు న్యాయవాదులతో ఆయన ప్రేమగా, ఆప్యాయంగా ఉండేవారు. మానవ హక్కులను ఆయన గట్టిగా సమర్థించేవారు. గెలుపోటముల కోసం వాదించేవారు కాదు. కోర్టు ముందు చట్టాన్ని సరైన రీతిలో చూపాలన్న ఉద్దేశంతో ఉండేవారు'' అని దుష్యంత్ దవే చెప్పారు.

వాజ్‌పేయి

ఫొటో సోర్స్, Pti

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి బాగా దగ్గరి మిత్రుడని రామ్ జెఠ్మలానీకి పేరు ఉండేది.

వాజ్‌పేయి ప్రభుత్వంలో న్యాయ మంత్రిగా జెఠ్మలానీ పనిచేశారు కూడా.

కానీ, అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీతో జెఠ్మలానీకి ఓ వివాదం ఏర్పడింది. దీంతో, న్యాయమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఈ పరిణామం తర్వాత వాజ్‌పేయికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతుతో జెఠ్మలానీ ఎన్నికల బరిలోనూ నిలిచారు. కొంత కాలం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్‌ పార్టీ నుంచి ఆయన రాజ్యసభ ఎంపీగానూ ఉన్నారు.

కానీ, జెఠ్మలానీ హృదయపూర్వకంగా బీజేపీనే సమర్థించేవారని దుష్యంత్ దవే అభిప్రాయపడ్డారు.

''న్యాయవాద వృత్తిలో ఉన్నట్లే జెఠ్మలానీ రాజకీయాల్లోనూ నిక్కచ్చిగా ఉండేవారు. దీంతో పార్టీ ఆయన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది" అని ఆయన వివరించారు.

రామ్ జెఠ్మలానీ

ఫొటో సోర్స్, Getty Images

ఆ వివాదం ఏంటంటే..

జెఠ్మలానీ కేంద్ర న్యాయ మంత్రిగా ఉండగా, సోలీ సొరాబ్జీ అటార్నీ జనరల్‌గా ఉన్నారు. అదే సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్ ఉన్నారు.

కొన్ని న్యాయపరమైన విషయాలపై రామ్ జెఠ్మలానీ, ఎ.ఎస్.ఆనంద్‌ల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీని కారణంగా సోలీ సొరాబ్జీతోనూ జెఠ్మలానీకి విభేదాలు పెరిగాయి.

న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అగాధం ఏర్పడే స్థాయికి ఈ ఉద్రిక్తతలు పెరిగాయి.

దీంతో సొరాబ్జీతో కలిసి పనిచేయకూడదనే నిర్ణయానికి జెఠ్మలానీ వచ్చేశారు.

ఈ ఉద్రిక్తతలను ఆపేందుకు జెఠ్మలానీని రాజీనామా అడగాలని జస్వంత్ సింగ్‌కు వాజ్‌పేయి సూచించారు. జెఠ్మలానీ కూడా వెంటనే రాజీనామా చేశారు.

ఈ వివాదంపై ఒక్కో పక్షానిది ఒక్కో అభిప్రాయం.

అయితే, ఈ వివాదంలో జెఠ్మలానీదే తప్పని బీజేపీ రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యం స్వామి అన్నారు.

''న్యాయ మంత్రిగా ఉంటూ చీఫ్ జస్టిస్ గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదు. జెఠ్మలానీని అందరికన్నా ఎక్కువగా వాజ్‌పేయి ఉపయోగించుకున్నారు. ప్రభుత్వ చర్యల పట్ల జెఠ్మలానీ తీవ్ర కలత చెందారన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ, అప్పుడు తప్పు జెఠ్మలానీదే'' అని సుబ్రమణ్యం స్వామి వ్యాఖ్యానించారు.

రామ్ జెఠ్మలానీ

ఫొటో సోర్స్, Getty Images

సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షా తరఫున, జెస్సికా లాల్ హత్య కేసులో మను శర్మ తరఫున, దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ తరఫున జెఠ్మలానీ వాదించారు.

జెఠ్మలానీ ఇలా నిందితుల పక్షానే ఎందుకు వాదించారని చాలా మంది ప్రశ్నిస్తుంటారు.

జెఠ్మలానీ సహా ఏ న్యాయవాదికైనా కేసులను తీసుకునేటప్పుడు 'ధర్మం', 'సత్యం' గురించి మానసిక సంఘర్షణ ఉండదా అని అడుగుతుంటారు.

ఈ ప్రశ్నలకు దుష్యంత్ దవే బదులిచ్చారు.

''న్యాయవాదులు అలాంటి సంఘర్షణ ఎదుర్కొంటారని నేను అనుకోవట్లేదు. తన క్లయింట్‌ను రక్షించడం న్యాయవాది విధి. సత్యం ఏంటన్నది అంతిమంగా నిర్ణయించాల్సింది కోర్టు'' అని ఆయన అన్నారు.

''జెఠ్మలానీ చాలా ప్రత్యేకమైన న్యాయవాది. నిజాన్ని బయటకు తీయాలని, దాని కోసం పోరాడాలని ఆయన మనసులో ఎప్పుడూ ఉండేది'' అని దుష్యంత్ అభిప్రాయపడ్డారు.

కోర్టులో జెఠ్మలానీ వాదనలు చాలా బలంగా ఉండేవి. పదునైన ఆలోచనలతో, వెనువెంటనే బదులు చెబుతుండేవారు. కోర్టులో గంభీరమైన వాతావరణాన్ని కూడా ఆయన తేలికపరిచేవారు.

రామ్ జెఠ్మలానీ

ఫొటో సోర్స్, Getty Images

''క్రిమినల్ న్యాయవాదిగా సాటి లేదని జెఠ్మలానీకి పేరుంది. అందుకే హాజీ మస్తాన్, హర్షద్ మెహతా, సంజయ్ దత్, మను శర్మ, ఆశారాం బాపు, బాల్ ఠాక్రే, అమిత్ షా లాంటి వాళ్లందరూ ఆయన్నే ఆశ్రయించారు'' అని ప్రముఖ న్యాయవాది మనోజ్ మిత్తా అభిప్రాయపడ్డారు.

''మానవ హక్కులను కాపాడే విషయంలోనూ ఆయనది గొప్ప రికార్డు. 1984-సిక్కు వ్యతిరేక అల్లర్లపై పీవీ నరసింహారావు పాత్ర అంశం వచ్చినప్పుడు జెఠ్మలానీ న్యాయ సహకారం అందించారు. కానీ, 2002-గుజరాత్ అల్లర్ల అంశానికి మాత్రం దూరంగా ఉన్నారు'' అని మనోజ్ అన్నారు.

జెఠ్మలానీ వాదనలను సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ చాలాకాలం దగ్గరగా గమనించారు.

ఆమె జెఠ్మలానీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని బీబీసీకి చెప్పారు.

''పదేళ్ల క్రితం ఇది జరిగింది. జెఠ్మలానీ కోర్టులో వాదిస్తున్నారు. అప్పుడు జెఠ్మలానీని 'మీ వయసు ఎంత' అని న్యాయమూర్తి అడిగారు. 'నా వయసు 84 ఏళ్లు. కానీ, నా అవయవాల వయసు వేరేగా ఉంటుంది. నా హృదయం, మెదడు ఇప్పటికీ యవ్వనంలోనే ఉన్నాయి' అని జెఠ్మలానీ బదులిచ్చారు. తన హాస్య చతురతతో జెఠ్మలానీ కోర్టు వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చేవారు'' అని రెబెక్కా వివరించారు.

జెఠ్మలానీ వాదించిన కేసులన్నీ ఎప్పుడూ చర్చనీయాంశాలుగా ఉండేవి.

హర్షద్ మెహతా నుంచి పీవీ నరసింహారావు వరకు.. క్లయింటు ఎవరైనా వారి వకాల్తా పుచ్చుకోవడం తన కర్తవ్యమని జెఠ్మలానీ ఎప్పుడూ చెబుతుండేవారు.

భారత చట్టాలు, న్యాయవ్యవస్థ గురించి చర్చ వచ్చినప్పుడు రామ్ జెఠ్మలానీని, ఆయన నిజాయతీని, ఆయన చుట్టూ ఉన్న వివాదాలను గుర్తు చేసుకోకుండా ఉండలేమని చాలా మంది ప్రముఖ న్యాయవాదులు అంగీకరిస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)