పాకిస్తాన్ కుల్‌భూషణ్ జాధవ్ మరణశిక్షను ఎలా సమీక్షిస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
కుల్‌భూషణ్ జాధవ్‌కు విధించిన మరణ శిక్షను రద్దు చేసి ఆయనను విడుదల చేయాలని భారతదేశం చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజే) ఆమోదించలేదు. కానీ, ఆ శిక్ష మీద పునర్విచారణ జరిపించాలని, జాధవ్‌కు భారత దౌత్య సిబ్బందిని కలిసే అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలోని ఈ న్యాయస్థానం బుధవారం నాడు ఈ కేసులో తన తీర్పును ప్రకటిస్తూ పాకిస్తాన్ లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చింది. అంతేకాదు, పాకిస్తాన్ వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36ను ఉల్లంఘించిందని కూడా ఆక్షేపించింది.
కుల్‌భూషణ జాధవ్ 2016 మార్చిలో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో అరెస్టయ్యారు. ఆ ప్రాంతం చాలా కాలంగా వేర్పాటువాద పోరాటాలతో అట్టుడికిపోతోంది.

ఫొటో సోర్స్, AFP
సమీక్ష ఎలా ఉండవచ్చు?
అంతర్జాతీయ న్యాయస్థానం తన తీర్పులో జాధవ్‌ను విడుదల చేయాలనే భారతదేశ అభ్యర్థనను తోసిపుచ్చినప్పటికీ, ఈ కేసును మళ్ళీ విచారించాలని పాకిస్తాన్‌ను కోరింది.
ఐసీజే చెప్పిన 'ప్రభావవంతమైన సమీక్ష' అంటే ఏమిటో నిర్వచించే విషయంలో పాకిస్తాన్ న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అక్కడి సీనియర్ లాయర్, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు హమీద్ ఖాన్, జర్నలిస్ట్ ఇబాద్ ఉల్ హక్‌తో మాట్లాడుతూ, సమీక్ష అన్నది ఆ శిక్షను విధించిన కోర్టే చేయాల్సి ఉంటుందన్నారు.
"చాలా దేశాల్లో మరణశిక్షపై నిషేధం ఉండడం వల్ల ఈ శిక్షను సమీక్షించాలని పాకిస్తాన్‌ను అడిగారు" అని ఆయన వివరించారు.
ఆయన వాదన ప్రకారం, "సాధారణ పౌర కోర్టు కాకుండా, ఆయనకు ఆ శిక్ష విధించిన కోర్టులోనే పునర్విచారణ చేయాలి." అంటే, కుల్‌భూషణ్ జాధవ్‌కు మరణ శిక్ష విధించిన మిలటరీ కోర్టే మళ్ళీ విచారణ చేపట్టాలన్నది హమీద్ ఖాన్ విశ్లేషణ.
పాకిస్తాన్ మిలటరీ కోర్టును ఐసీజే గుర్తించిందని, ఆ కోర్టు చేసిన విచారణపై అది ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని హమీద్ ఖాన్ గుర్తు చేశారు. అయితే, ఈ విషయంలో పాకిస్తాన్ సుప్రీం కోర్టును సంప్రతిస్తే పరిస్థితి మారిపోతుందని కూడా ఆయన చెప్పారు.
అంతర్జాతీయ న్యాయ వ్యవహారాల నిపుణులు అహ్మర్ బిలాల్ సూఫీ అభిప్రాయం మరోలా ఉంది. ప్రభావవంతమైన సమీక్ష అన్నది అంతర్జాతీయ న్యాయవ్యవహారాల నిపుణుల వేదిక మీద, లేదా స్థానిక చట్టాల నిపుణులతో కూడిన వేదిక మీద చేపట్టవచ్చని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, PAKISTAN FOREIGN OFFICE
అయితే, పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి బారిస్టర్ అలీ జఫర్, "పాకిస్తానీ కోర్టులు ప్రభావవంతమైన సమీక్ష చేయవచ్చు. ఐసీజే కూడా పాకిస్తానీ కోర్టుల పట్ల విశ్వాసం వ్యక్తం చేసింది. పెషావర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అది ఉటంకించింది" అని అన్నారు.
బారిస్టర్ అలీ జఫర్, అహ్మద్ బిలాల్ సూఫీ ఇద్దరూ కూడా పాకిస్తాన్ ఒక బాధ్యతాయుత దేశంగా అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించే ఏ దేశమైనా అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదించాలని, ఆ తీర్పులను అమలు చేయాలని బిలాల్ సూఫీ, జర్నలిస్ట్ ఫర్హాట్ జావెద్‌తో అన్నారు.
అయితే, అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పులను గతంలో కొన్ని దేశాలు తిరస్కరించిన సందర్భాలున్నాయని, అలాంటప్పుడు ఆ తిరస్కారానికి కారణాలేమిటన్నది ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలి సమీక్షిస్తుందని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రెండు వందల రూపాయల అప్పు తీర్చడానికి 30 ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ
- వయసులో ఉన్న స్త్రీలు గర్భసంచులను ఎందుకు తీయించుకుంటున్నారు
- చంద్రునిపై కాలుమోపి 50 ఏళ్లు... మానవ జీవితంలో వచ్చిన 8 మార్పులు
- అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏమిటి? దీని మీద వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








