కుల్‌భూషణ్ జాధవ్: "ఐసీజే ఉత్తర్వును పాకిస్తాన్ గౌరవించకపోతే ఐరాస ఆంక్షలకు ప్రయత్నిస్తాం" -హరీశ్ సాల్వే

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)కు భారత్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని కుల్‌భూషణ్ జాధవ్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే చెప్పారు. కుల్‌భూషణ్ జాధవ్ విషయంలో ఐసీజే ఆదేశాలు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచాయన్నారు.
ఐసీజే ఉత్తర్వును పాకిస్తాన్ గౌరవించకపోతే పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆంక్షలు విధింపజేసే అంశాన్ని భారత్ పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. అయితే పాకిస్తాన్ అంతదూరం వెళ్తుందని తాను అనుకోవడం లేదన్నారు. ఐసీజే ఉత్తర్వును పాకిస్తాన్ గౌరవించకపోతే, తదుపరి చర్యలకు భారత్‌కు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
"పాకిస్తాన్ రాజ్యాంగం నిష్పాక్షిక విచారణకు హామీ ఇస్తుందని పాకిస్తాన్ అటార్నీ జనరల్ చెప్పారని ఐసీజే స్పష్టం చేసింది. నిష్పాక్షిక విచారణ కోసం తగిన చట్టపరమైన చర్యలు సహా చేయగలిగినదంతా పాకిస్తాన్ చేయాలని ఐసీజే ఆశిస్తోంది. పాకిస్తాన్ చర్యలను అందరూ గమనిస్తున్నారు. నిష్పాక్షిక విచారణకు పాకిస్తాన్ హామీ ఇవ్వకపోతే, మేం మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం. విచారణకు ప్రస్తుత చట్టాలు సరిపోతాయన్న పాక్ వాదనకు ఆమోదం లభించలేదు" అని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ రాజ్యాంగానికి అనుగుణంగా నిష్పాక్షిక విచారణ జరపాల్సి ఉందని సాల్వే తెలిపారు.
ఇదివరకు బయటి న్యాయవాదులను అనుమతించకుండా, ఆధారాలు ఇవ్వకుండా, భారత కాన్సులేట్ అధికారులను కలవనీయకుడా విచారణ సాగించారని, ఇప్పుడు కేసు తిరిగి పాకిస్తాన్ సైనిక కోర్టుకు వెళ్లి, అదే నిబంధనల ప్రకారం విచారణ సాగితే అది ప్రమాణాల(స్టాండర్డ్స్)కు అనుగుణంగా ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. అలా చేస్తే పాకిస్తాన్ నిష్పాక్షిక విచారణ జరపనట్లే అవుతుందని, తమ చర్యను సవాలు చేసే అవకాశాన్ని పాకిస్తానే కల్పించినట్లు అవుతుందని తెలిపారు.

"ఇది చట్టబద్ధ పాలన విజయం"
ఈ కేసులో విజయం 'చట్టబద్ధ పాలన' సాధించిన విజయమని సాల్వే మీడియా సమావేశంలో బీబీసీ ప్రతినిధి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదో పెద్ద విజయమన్నారు.
ఈ తీర్పుతో జాధవ్‌ను భారత కాన్సులేట్ అధికారులు కలిసేందుకు, సహాయ సహకారాలు అందించేందుకు వీలవుతుందని ఆయన చెప్పారు. జాధవ్ కుటుంబ సభ్యులు అడ్డంకులు లేకుండా ఆయన్ను కలుసుకొనేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
విచారణ నిష్పాక్షికంగా జరిగితే, సరైన న్యాయ సహాయం అందిస్తే జాధవ్‌ను పాకిస్తాన్ నుంచి విడిపించగలమని సాల్వే విశ్వాసం వ్యక్తంచేశారు. విచారణ నిష్పాక్షికంగా జరగకపోతే తాము మళ్లీ ఐసీజేను ఆశ్రయించగలమని తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
హరీశ్ సాల్వే ఇంకా ఏమన్నారంటే...
జాధవ్ ప్రాణాలు కాపాడేందుకు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు దోహదం చేస్తాయి.
వియన్నా ఒప్పందం ప్రకారం జాధవ్‌ను కలుసుకునేందుకు భారత కాన్సులేట్ అధికారులకు అనుమతి ఉండాలి. కానీ పాకిస్తాన్ దీనికి అంగీకరించలేదు. వీటన్నింటినీ మేము ఐసీజేలో సవాలు చేశాం.
జాధవ్‌పై నిర్వహించిన విచారణను భారత్‌పై ఆరోపణలు చేసేందుకు పాకిస్తాన్ ఉపయోగించుకుంది. జాధవ్ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుంది. జాధవ్‌కు ఈ పాస్‌పోర్టు ఎలా వచ్చిందో చెప్పాలంటూ భారత్‌ను ప్రశ్నించింది.
ఐసీజే ఈ విషయంపై స్పందించింది.
"జాధవ్ జాతీయతపై ఉన్న అనుమానాలను ఈ పాస్‌పోర్టు నివృత్తి చేస్తోంది. అతడు ఏ దేశస్తుడు అనే అనుమానం మీకు అవసరం లేదు. మీరు స్వాధీనం చేసుకున్న పాస్‌పోర్టుతో అతడు భారతీయుడేనని స్పష్టమవుతోంది" అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, EPA
భారత్ అనేక సందర్భాల్లో తమకు జాధవ్‌ను కలిసే అవకాశం ఇవ్వాలని పాక్‌ను కోరింది. కానీ ఆ దేశం ఒప్పుకోలేదు.
విచారణకు భారత్ ఏమాత్రం సహకరించలేదని, అవసరమైన సాక్ష్యాలను అందించలేదని, అందువల్ల వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఫిర్యాదు చేసే అర్హత భారత్‌కు లేదని పాకిస్తాన్ వాదించింది. ఈ వాదనను ఐసీజే తిరస్కరించింది.
తన తీర్పులో భాగంగా కోర్టు పాకిస్తాన్‌ను తప్పుబట్టింది. అంతర్జాతీయంగా ‘తప్పుడు చర్యలు’ కొనసాగిస్తూనే ఉందని, అలాంటి వాటిని తక్షణం ఆపాలని సూచించింది.
భారత వాదనలను కోర్టు అంగీకరించడం సంతోషాన్నిస్తోంది.
"జాధవ్‌కు రాయబారులను కలిసేందుకు అనుమతించాలి. అతడికి న్యాయవాదిని నియమించుకునేందుకు, సాక్ష్యాలు, ఆధారాలపై విచారణకు చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ జరిగితేనే దాన్ని నిష్పాక్షిక విచారణ అని భావించాల్సి ఉంటుంది" అని అంతర్జాతీయ న్యాయస్థానం తన తీర్పులో వ్యాఖ్యానించిందని హరీశ్ సాల్వే తెలిపారు.
ఇది జాధవ్‌కు సాయం చేయడానికి, ఆయనకు న్యాయం చేయడానికి భారత్‌కు ఉపయోగపడే చర్య అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టు ఏమని తీర్పునిచ్చింది?
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ అరెస్టు చేసిన భారత పౌరుడు కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఏప్రిల్ 10న విధించిన మరణ శిక్షను నిలిపివేస్తున్నట్లు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం తీర్పు చెప్పింది.
నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలోని 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారతదేశానికి అనుకూలంగా తీర్పు చెప్పారు. ఈ కేసులో జాధవ్ తఫును న్యాయవాదిని నియమించుకునే హక్కు కూడా భారత్‌కు ఉందని ఐసీజే స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో భారతదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సరైనదేనని, ఇది ఐసీజే పరిధిలోకి వస్తుందని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
మొత్తం 16 మంది న్యాయమూర్తులలో 15 మంది భారదేశానికి అండగా నిలిస్తే, పాకిస్తాన్‌కు చెందిన అడ్‌హాక్ జడ్జి జిలానీ మాత్రమే వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ అభ్యంతరాలన్నింటినీ మెజారిటీ న్యాయమూర్తులు తోసిపుచ్చారు. అయితే, కుల్‌భూషణ్ జాధవ్‌ను నిర్దోషిగా ప్రకటించి, విడుదల చేయాలని, స్వదేశానికి పంపించాలని భారతదేశం చేసిన విజ్ఞాపనకు కోర్టు అంగీకరించలేదు.
ఈ కేసులో తీర్పును వెలువరిస్తూ ఐసీజే మరో కీలక వ్యాఖ్య కూడా చేసింది. అదేమంటే, ఇన్నేళ్ళుగా కుల్‌భూషణ్ జాధవ్‌కు న్యాయపరమైన సహకారం ఇవ్వకుండా పాకిస్తాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కోర్టు ఆక్షేపించింది.
జాధవ్‌కు విధించిన మరణశిక్షపై మళ్ళీ విచారణ జరపాలని సూచించింది.

అసలు ఈ కేసులో ఏం జరిగింది?
భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాధవ్‌ను పాకిస్తాన్‌లోని ఒక సైనిక కోర్టు భారత నిఘా ఏజెన్సీ కోసం గూఢచర్యం, తీవ్రవాదం కేసులో దోషిగా చెప్పింది. అతడికి మరణశిక్ష విధించింది.
భారత్ పాకిస్తాన్ వాదనను కొట్టిపారేస్తోంది. జాధవ్‌ను 2016 మార్చి 3న బలూచిస్తాన్ ప్రాంతంలో అరెస్టు చేశారు. జాధవ్‌ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేశారని భారత్ చెబుతోంది. అక్కడ అతడికి ప్రైవేటు వ్యాపారం ఉందంటోంది.
జాధవ్‌ను 'కాన్సులర్ యాక్సెస్' అంటే భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడే హక్కును ఇవ్వకుండా పాకిస్తాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో వాదించింది.
అయితే, పాకిస్తాన్ మాత్రం గూఢచర్యం కేసుల దోషులైనవారికి 'కాన్సులర్ యాక్సెస్' ఇవ్వడం ఉండదని చెబుతోంది.
జాధవ్ మరణశిక్షను రద్దు చేయాలని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని భారత్ అంతర్జాతీయ కోర్టులో అపీల్ చేసింది. జాధవ్ విచారణలో నిర్ధారిత ప్రక్రియలో కనీస ప్రమాణాలు కూడా పాటించలేదని ఆరోపించింది.

ఫొటో సోర్స్, PAKISTAN FOREIGN OFFICE
జాధవ్ దోషి అని చెప్పడానికి పాకిస్తాన్ దగ్గర 'బలవంతంగా చేయించిన ప్రకటన' తప్ప వేరే ఎలాంటి ఆధారాలూ లేవని విచారణ సమయంలో భారత వకీల్ హరీష్ సాల్వే వాదించారు.
పాకిస్తాన్ అంతర్జాతీయ విచారణ నుంచి దృష్టి మళ్లించడానికి కులభూషణ్ జాధవ్‌ను పావుగా ఉపయోగిస్తోందని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ సైనిక కోర్టు గురించి ప్రస్తావించిన సాల్వే ఏ దేశమూ తమ చట్టాలను ప్రస్తావిస్తూ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదని తెలిపారు.
2017 డిసెంబర్‌లో జాధవ్ తల్లి, భార్య ఆయన్ను కలవడానికి పాకిస్తాన్ వెళ్లారు. ఆ తర్వాత భారత్ ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి విశ్వసనీయత లేదని చెప్పింది. వారు కలిసినప్పుడు అక్కడి వాతావరణం బెదిరింపుల్లా ఉందని చెప్పింది.
ఆ సమయంలో జాధవ్ తల్లి, భార్య వేసుకువచ్చిన బట్టలను బలవతంగా మార్పించారని, వారు మాతృభాషలో మాట్లాడ్డానికి కూడా అనుమతించలేదని, జాధవ్ భార్య చెప్పులు కూడా తిరిగివ్వలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ కుల్‌భూషణ్ జాధవ్?
కుల్‌భూషణ్ 1970 ఏప్రిల్ 16న మహరాష్ట్రలో జన్మించారు. ఆయన తండ్రి సుధీర్ జాధవ్ రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్.
కుల్‌భూషణ్ 1987లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశించి, తర్వాత భారత నేవీలో చేరారు.
పాకిస్తాన్ విడుదల చేసిన కుల్‌భూషణ్ వాంగ్మూలం ప్రకారం.. ''భారత నేవీ ఇంజినీరింగ్ విభాగంలో కుల్‌భూషణ్ పని చేసేవాడు. హుస్సేన్ ముబారిక్ పటేల్ అనే మారుపేరుతో భారత్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారు'' అని ఉంది.
కుల్‌భూషణ్.. 14 ఏళ్లపాటు ఉద్యోగం చేశాక, కమాండర్ హోదాలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం ఇరాన్‌లో వ్యాపారం ప్రారంభించారు.
అయితే.. 2010-2012 మధ్యలో తాను ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తానంటూ కుల్‌భూషణ్ పలుమార్లు 'రా'ను సంప్రదించినట్లు సమాచారం ఉందని, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక పేర్కొంది.
కానీ జాధవ్ ప్రతిపాదనలను రా అధికారులు తిరస్కరించారని, జాధవ్ వల్ల తమ సంస్థకు ప్రమాదం అని అధికారులు భావించారని ఆ పత్రిక కథనం.
2016 మార్చి నెలలో పాకిస్తాన్ అధికారులు బెలూచిస్తాన్‌లో కుల్‌భూషణ్‌ను అరెస్ట్ చేశారు.
కుల్‌భూషణ్ ఏమన్నారు?
''2013 చివర్లో ఆర్.ఎ.డబ్ల్యూ (రా) అధికారులు నన్ను నియమించారు. అప్పటినుంచి బెలూచిస్తాన్, కరాచిలో పలురకాల కార్యక్రమాలు చేయాలంటూ నాకు రా అధికారులు దిశానిర్దేశం చేశారు. కరాచిలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చెప్పారు'' అని కుల్‌భూషణ్ వాంగ్మూలం ఇచ్చినట్లు పాకిస్తాన్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా.. ఎవరూ రావొద్దని అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఎందుకు హెచ్చరించింది
- కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్
- అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...
- అంతర్జాతీయ న్యాయస్థానం: దేశాల మధ్య వివాదాలను ఎలా పరిష్కరిస్తుంది?
- ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది వలస.. 70 ఏళ్లలో ఇదే అత్యధికం - యుఎన్‌హెచ్‌సీఆర్
- యూరప్, అమెరికాలో ఆశ్రయం కోసం ప్రజలు ఎందుకు వెళుతున్నారు?
- అరబ్ దేశాల్లో మతాన్ని వదిలేసేవారు పెరుగుతున్నారు :బీబీసీ సమగ్ర సర్వే
- 'నందాదేవి' పర్వతారోహణలో చనిపోయినవారు తీసుకున్న చివరి వీడియో
- డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అన్న కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








