భారతదేశంలో సైనిక తిరుగుబాటు ఎందుకు సాధ్యం కాదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ పనాగ్
- హోదా, బీబీసీ కోసం
జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను హరారేలోని ఆయన నివాసంలో నిర్బంధించారు. అక్కడ పాలన పగ్గాలు సైన్యం చేపట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గతంలో టర్కీ, వెనెజులాలో కూడా సైనిక తిరుగుబాటుకు విఫల యత్నం జరిగింది.
పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చిన కొద్దిరోజుల్లోనే అక్కడ తిరుగుబాటు జరిగింది. ఆ తర్వాత అక్కడది సర్వసాధారణంగా మారింది.
ఆఫ్రికా, లాటిన్ అమెరికా లేదా కొన్ని మధ్య ప్రాచ్య దేశాల్లోనూ సైనిక తిరుగుబాట్లు జరిగినా భారతదేశంలో మాత్రం ఇంతవరకు అలాంటి తిరుగుబాటు యత్నం జరగలేదు.
భారత ప్రజాస్వామ్య మూలాలు బలంగా ఉండడమే దీనికి కారణంగా భావించవచ్చు.
మా ఇతర కథనాలు:

ఫొటో సోర్స్, Getty Images
భారత సైన్యాన్ని బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేశారు. అందువల్ల అది పాశ్చాత్య తరహాలోనే నిర్మితమైంది.
పాశ్చాత్య ప్రజాస్వామిక దేశాల్లో ఇలాంటి సైనిక తిరుగుబాట్లు జరగలేదన్నది మనం గుర్తించాలి.
1857 సైనిక తిరుగుబాటు అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం సైనిక నియామకాల్లో చాలా మార్పులు తెచ్చింది. నాటి నుంచి భారతదేశం నలుమూలల నుంచి యువకులను సైన్యంలోనికి చేర్చుకోవడం ప్రారంభమైంది.
సైన్యంలో జాతులు, ప్రాంతాల ప్రాతిపదికన రెజిమెంట్లు ఏర్పాటు చేసినా, క్రమశిక్షణ, నియమాలు మాత్రం బ్రిటిష్ తరహాలోనే ఉండేవి.

ఫొటో సోర్స్, BBC world service
సైన్యంలో క్రమశిక్షణ
భారత సైన్యం క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది. లేకపోతే 1914లో మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగానే తిరుగుబాటు జరిగి ఉండేది.
ఆ సమయంలో అనేక రాజ్యాలు, సంస్థానాలు, ప్రాంతీయ, జాతిపరమైన రెజిమెంట్ల ఏర్పాటు కారణంగా సైన్యంలో ఐక్యత అంతగా లేదు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగింది. సుమారు 20వేల మంది ఐఎన్‌ఏలో చేరారు. సుమారు 40-50 వేలమంది భారతీయ సైనికులు ప్రత్యర్థుల చేతుల్లో బందీలుగా ఉన్నారు. అయినా సైన్యం మాత్రం క్రమశిక్షణను ఉల్లంఘించలేదు.
1946లో బాంబేలో నేవీ తిరుగుబాటు చేసింది. అప్పటికి భారతీయ సైనికుల సంఖ్య 25 లక్షలకు చేరింది. అందువల్ల దానిని తిరుగుబాటు అని కూడా చెప్పలేం. ఎందుకంటే దానిలో కేవలం 10 వేల మంది సైనికులు, అదీ కూడా నావికాదళానికి చెందిన వారు మాత్రమే పాల్గొన్నారు.
మా ఇతర కథనాలు:
నేవీ తిరుగుబాటు ప్రకంపనలు చాలా చోట్ల ప్రతిధ్వనించినా, భారత సైన్యం మాత్రం సంఘటితంగానే ఉంది.
1984లో కొన్ని సిక్కు యూనిట్లు స్వర్ణ దేవాలయంపై దాడికి నిరసనగా తిరుగుబాటు చేశాయి. అయినా సైన్యం మాత్రం ఐక్యంగా ఉండడంతో దానిని అణచివేశారు.
దేశంలో మొదటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పుడే ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ భారతీయ సైన్యం ప్రభుత్వం అదుపులో ఉండాలని ప్రతిపాదించారు.
ఒకానొక సమయంలో జనరల్ కరియప్ప ప్రభుత్వ ఆర్థిక విధానాలను విమర్శించారు. దాంతో ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ నెహ్రూ లేఖల ద్వారా, ప్రత్యక్షంగానూ ఆయన్ను హెచ్చరించారు.

ఫొటో సోర్స్, PHOTODIVISION
భారత సైన్యం ఆధునికీకరణ తర్వాత సైన్యం, నేవీ, వాయుసేనలకు సమాన ప్రాధాన్యం కల్పించారు. ప్రతి విభాగానికీ ప్రత్యేక చీఫ్‌ను నియమించారు. ఈ ముగ్గురూ రక్షణ మంత్రి పర్యవేక్షణలో తమ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
అలా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వమే సుప్రీం అన్న సందేశాన్ని స్పష్టం చేశారు.
దేశానికి ప్రజాస్వామ్యం ఎలాగైతే పునాదిగా మారిందో, అలాగే సైన్యం కూడా దానిలో భాగంగా మారింది.
ఆ తర్వాత పాకిస్తాన్ తరహాలో సైనిక తిరుగుబాట్లు జరిగే ప్రమాదం దాదాపు సమసిపోయింది. పాకిస్తాన్‌లోనైతే 1958లోనే సైనిక తిరుగుబాటు జరిగింది. అదే సమయంలో ఆఫ్రికా, కొన్ని దక్షిణ అమెరికా దేశాల్లో కూడా తిరుగుబాట్లు జరిగాయి.
భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలదొక్కుకుంటున్న సమయంలోనే అలాంటి తిరుగుబాటు ప్రమాదాలు తప్పాయి. దీనిలో రాజకీయ జోక్యం లేని సైన్యం, జనరల్ కరియప్పలు ప్రధాన పాత్ర పోషించారు.

తర్వాత కాలంలో జనరల్ సామ్ మానెక్ షాతో ఒక వివాదం ఉత్పన్నమైంది.
దిల్లీలో ఒక ప్రదర్శన జరుగుతుండగా, మానెక్ షా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఒక ఆర్మీ బ్రిగేడ్‌ను మోహరించారు. దానిపై విమర్శలు రాగా ఆయన అది తిరుగుబాటు కాదంటూ వాటిని తోసిపుచ్చారు.
మనదేశంలో మొత్తం ఏడు సైనిక కమాండ్‌లు ఉన్నాయి. ఏ సైనిక జనరల్ కూడా ఒకేసారి ఏడు కమాండ్‌లకూ ఆదేశాలు ఇవ్వలేడు. ఇచ్చినా నియమాలకు విరుద్ధంగా జారీ చేసిన ఆ ఆదేశాలను ఆ ఏడుగురూ కమాండర్లూ పాటించబోరు.

ఫొటో సోర్స్, Getty Images
తిరుగుబాటు ఎప్పుడు జరుగుతుంది?
నిజానికి ఏ దేశంలోనైనా రాజకీయంగా చాలా అస్థిరత ఉన్నపుడు, ప్రజాస్వామ్య సంస్థలు బలహీనంగా ఉన్నపుడు, దేశంలో గందరగోళం నెలకొన్నప్పుడే సైన్యానికి తిరుగుబాటు చేసే అవకాశం లభిస్తుంది.
భారతదేశంలో ఎన్నడూ అలాంటి పరిస్థితి లేదు. ఎమర్జెన్సీ కాలంలో కూడా భారత సాయుధ బలగాలు రాజకీయాలకు దూరంగా ఉన్నాయి. అయితే ఆ సమయంలో ముగ్గురు చీఫ్‌లు కలిసి ప్రధాని ఇందిరాగాంధీతో మాట్లాడి ఉండాల్సిందనే విమర్శ ఒకటి ఉంది.
భారత సైన్యం ఎల్లప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంది. బహుశా దాని పునాదుల్లో ఉన్న క్రమశిక్షణ, పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనే నియమాలే దీనికి కారణం కావచ్చు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









