గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది

గాంధీతో మనూ గాంధీ

ఫొటో సోర్స్, DINODIA

ఫొటో క్యాప్షన్, గాంధీతో మనూ గాంధీ
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1948 జనవరి 30 సాయంత్రం. దిల్లీలో తాను బస చేస్తున్న భారత వ్యాపారి నివాసంలోంచి మహాత్మా గాంధీ బయటకు వచ్చి గార్డెన్‌లో ప్రార్థనా సమావేశంలో పాల్గొనేందుకు నడుస్తూ వెళ్తున్నారు. ఎప్పట్లాగే మనవరాళ్లు మనూ, ఆభా ఆయన వెంట ఉన్నారు.

78 ఏళ్ల గాంధీ ప్రార్థనా సమావేశ వేదిక మెట్లు ఎక్కుతుండగా, ఖాకీ దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి గుంపులోంచి బయటకు వచ్చాడు. మనూను పక్కకు తోసి, తుపాకీని బయటకు తీసి గాంధీ ఛాతీలో, ఉదరభాగంలో మూడు తూటాలు కాల్చాడు. గాంధీ నేలకొరిగారు. రాముడి పేరును ఉచ్చరించి, మనూ చేతుల్లో తుది శ్వాస విడిచారు. గాంధీ జీవిత చరమాంకంలో, క్లిష్టమైన దశలో ఆయనకు మనూ నమ్మకస్తురాలిగా, సంరక్షకురాలిగా చేదోడువాదోడుగా ఉన్నారు.

గాంధీ మరణానికి ఏడాది కన్నా లోపు 1947 మేలో మనూతో ఆయనో మాట చెప్పారు. తన అంతిమ ఘడియల్లో ఆమెను ఓ 'సాక్షి'గా ఉండాలన్నారు.

14 ఏళ్ల వయసులో మనూ జైలుకు వెళ్లారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అతిపిన్న వయసులో జైల్లో నిర్బంధించినవారిలో ఆమె ఒకరు. భారత్‌లో బ్రిటిష్ పాలనకు ముగింపు పలకాలని గాంధీ డిమాండ్ చేసిన తర్వాత ఆయన్ను బ్రిటిష్ పాలకులు జైల్లో పెట్టారు. అప్పుడు మనూ కూడా జైలుకు వెళ్లారు. 1943-44 మధ్య దాదాపు ఏడాది కాలంపాటు మనూ జైలు జీవితం గడిపారు.

ఆమె డైరీ రాయడం మొదలుపెట్టారు. తర్వాత నాలుగేళ్లపాటు విస్తృతంగా రాశారు.

గాంధీ జీవిత చరమాంకంలో ఆయనకు మనూ నమ్మకస్తురాలిగా, సంరక్షకురాలిగా చేదోడువాదోడుగా ఉన్నారు.

ఫొటో సోర్స్, DINODIA

ఫొటో క్యాప్షన్, గాంధీ జీవిత చరమాంకంలో ఆయనకు మనూ నమ్మకస్తురాలిగా, సంరక్షకురాలిగా చేదోడువాదోడుగా ఉన్నారు.

భారత ఆర్కైవ్స్‌లో మనూగాంధీ డైరీల పన్నెండు సంపుటాలను భద్రపరిచారు. రూల్డ్ నోట్ పుస్తకాల్లో గుజరాతీలో ఇవి రాసి ఉన్నాయి. ఇందులో మనూ సొంతంగా రాసుకున్నవి, గాంధీ ప్రసంగాలు (ఆయన మాట్లాడుతుండగా మనూ వీటిని రాశారు), ఆయన లేఖలు, మనూ ఇంగ్లిష్ వర్క్ బుక్ ఉన్నాయి.

రచయిత, గాంధీ స్కాలర్ త్రిదీప్ సుహ్రుద్ వీటిని తొలిసారిగా ఇంగ్లిష్‌లోకి అనువదించి, ప్రచురించారు.

1948 జనవరి 30న గాంధీపై కాల్పులు జరిగినప్పుడు ఆమె చేతిలోని డైరీ కింద పడిపోయింది. ఆ తర్వాతి నుంచి ఆమె 'జర్నల్‌'లా రాయడం ఆపేశారు. అప్పట్నుంచి 1969లో 42 ఏళ్ల వయసులో తాను చనిపోయేవరకు ఆమె గాంధీ గురించి పుస్తకాలు రాశారు, ప్రసంగాలు చేశారు.

మనూ తొలి దశ డైరీలను చూస్తే ఆమెకు వయసుకు మించిన ఆలోచనా శక్తి, పరిశీలనా శక్తి ఉన్నాయని అర్థమవుతుంది. జైలు నిర్బంధంలో రోజువారీ జీవితం గురించి ఆమె సునిశితంగా రాశారు.

గాంధీ భార్య కస్తూర్బా బాగోగులను నిరంతరం చూసుకున్నానని ఆమె డైరీల్లో రాశారు. కస్తూర్బా ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తున్న సమయంలో మనూ ఆమెకు సేవ చేశారు.

మనూ తొలినాళ్లలో రాసినవి చదివితే, పరిస్థితి నిరుత్సాహపూరితంగా ఉండేదని అర్థమవుతుంది.

జైల్లో కూరగాయలు తరగడం, ఆహారం సిద్ధం చేయడం, కస్తూర్బాకు మసాజ్ చేయడం, ఆమె జుట్టుకు నూనె పట్టించడం, దారం వడకడం, ప్రార్థన చేయడం, అంట్లు తోమడం లాంటి పనులు ఆమె దినచర్యలో భాగంగా ఉండేవి.

అప్పుడు మనూ, గాంధీ, ఆయన భార్య, ఆయన సన్నిహితులు జైల్లో ఉన్నారనే విషయాన్ని మరచిపోకూడదని, ఖైదీలుగా నిబంధనల ప్రకారం వారికి కొన్ని విధులు ఉంటాయని సుహ్రుద్ నాతో చెప్పారు. మనూకు జీవితం నిస్సారంగా అనిపించి ఉండొచ్చని, కానీ గాంధీ ఆచరించిన ఆశ్రమ జీవన విధానాన్ని ఆమె అప్పుడు అలవర్చుకొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

మనూ చదువుకోలేదు అంటే ఆమె సాధారణ పద్ధతిలో విద్యాభ్యాసం సాగించలేదు. గాంధీ మార్గదర్శకత్వంలో ఆమె ఇంగ్లిష్ వ్యాకరణం, రేఖాగణితం, భౌగోళికశాస్త్రం చదివారు. టీనేజర్‌గా ఉండగానే పురాణాలు, హిందూ గ్రంథాలు చదవడం మొదలుపెట్టారు.

జైల్లో గాంధీ వద్ద మనూ రేఖాగణితం నేర్చుకున్నారు.

ఫొటో సోర్స్, DINODIA

ఫొటో క్యాప్షన్, జైల్లో గాంధీ వద్ద మనూ రేఖాగణితం నేర్చుకున్నారు.

మ్యాప్ బుక్ చూసి ఎక్కడ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోందో ఆమె గుర్తించగలిగేవారు. కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ గురించి కూడా ఆమె చదివారు.

మనూ చదివేటప్పుడు చాలా వరకు సమయాన్ని వ్యాకరణం నేర్చుకోవడానికే వెచ్చించేవారు. "ఈ రోజు నేను డిక్లైనబుల్, ఇన్‌డిక్లైనబుల్ అడ్జెక్టివ్స్, ప్రిడికేటివ్, సబ్-ప్రిడికేటివ్ అడ్జెక్టివ్స్ గురించి నేర్చుకున్నాను" అని ఆమె ఓ పాఠం గురించి డైరీలో రాసుకున్నారు.

కస్తూర్బాతో క్యారమ్ ఆడేవారు

గాంధీ, ఆయన అనుచరులతో మనూ జైలు జీవితం పూర్తిగా అనిశ్చితంగా ఏమీ లేదు. ఆమె గ్రామఫోన్‌లో సంగీతం వినేవారు. సుదూర వ్యాహ్యాళికి వెళ్లేవారు. గాంధీతో పింగ్ పాంగ్(టేబుల్ టెన్నిస్) ఆడేవారు. కస్తూర్బాతో క్యారమ్ ఆడేవారు. చాక్లెట్ తయారీ విధానాన్ని నేర్చుకున్నారు.

ఫ్యాన్సీ-డ్రెస్ తరహా కార్యక్రమానికి సిద్ధమయ్యేందుకు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్(అమెరికా), విన్‌స్టన్ చర్చిల్(బ్రిటన్), మేడమ్ చియాంగ్ కాయ్-షెక్(చైనా) మాదిరి వస్త్రధారణకు గాంధీ సన్నిహితులు ఎలా ప్రణాళిక వేశారో మనూ వివరించారు. 'ఇలాంటి నాటకాలు' అంటే నచ్చని గాంధీ ఈ ప్రణాళికను తోసిపుచ్చారు.

మనూ రాసిన అంశాల్లో ఎంతో విషాదం కూడా ఉంది. గాంధీని తీవ్ర క్షోభకు గురిచేసిన రెండు మరణాలే ఈ విషాదాన్ని తెచ్చాయి. ఈ ఇద్దరిలో ఒకరు గాంధీ అత్యంత సన్నిహితుడు మహదేవ్ దేశాయ్, మరొకరు కస్తూర్బా.

1944 ఫిబ్రవరిలో కస్తూర్బా మరణానికి ముందు రోజుల గురించి మనూ రాసిన విషయాలు మనసును కలచివేస్తాయి.
ఫొటో క్యాప్షన్, 1944 ఫిబ్రవరిలో కస్తూర్బా మరణానికి ముందు రోజుల గురించి మనూ రాసినవి మనసును కలచివేస్తాయి.

1944 ఫిబ్రవరిలో కస్తూర్బా మరణానికి ముందు రోజుల గురించి మనూ రాసిన విషయాలు మనసును కలచివేస్తాయి.

ఒక రోజు రాత్రి గాంధీతో కస్తూర్బా మాట్లాడుతూ- తనకు చాలా బాధగా ఉందని, ఇవే తన చివరి ఘడియలని చెప్పారు. గాంధీ స్పందిస్తూ- "ప్రశాంతంగా కన్నుమూయి. నీకు ఇప్పుడు అలా లేదా" అని అడిగారు.

కస్తూర్బా చివరి క్షణాల్లో ఆమె తలను గాంధీ తన ఒడిలో పెట్టుకున్నాడు. "గాంధీ కళ్లు మూసుకొని ఆయన నుదుటిని ఆమె నుదుటిపై పెట్టారు, ఆమెను దీవిస్తున్నట్లుగా."

"వాళ్లు తమ జీవితాలను పంచుకున్నారు. ఆమె నుంచి చివరి క్షమాపణను ఆయన కోరుకొంటున్నారు. ఆమెకు తుది వీడ్కోలు పలుకుతున్నారు. అప్పుడు ఆమె నాడి ఆగిపోయింది. ఆమె తుది శ్వాస విడిచారు" అని మను రాశారు.

టీనేజర్‌గా ఉన్నప్పుడు డైరీ రాయడం మొదలుపెట్టిన మనూ యువతి అయ్యాక డైరీల రాతలు పెరిగాయి. అవి మరింత ఆలోచనాత్మకంగా మారాయి.

మనూ, గాంధీ

ఫొటో సోర్స్, DINODIA

ఫొటో క్యాప్షన్, గాంధీ చనిపోయిన తర్వాత మనూ జర్నల్ రాయడం ఆపేశారు.

గాంధీ చేసిన అత్యంత వివాదాస్పద, అర్థంకాని ప్రయోగం గురించి మనూ దాపరికం లేకుండా రాశారు.

1946 డిసెంబరులో మనూను తనతో కలిసి మంచంపై పడుకోవాలని గాంధీ కోరారు. తాను లైంగికవాంఛను జయించానో, లేదో పరీక్షించుకోవడానికి, లేదా మరింతగా పరీక్షించుకోవడానికి గాంధీ ఈ ప్రయోగం చేశారని బయోగ్రాఫర్ రామచంద్ర గుహ తన పుస్తకంలో రాశారు. (గాంధీ 13 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత 38 ఏళ్ల వయసులో ఉండగా, ఇకపై బ్రహ్మచర్యం పాటిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.)

ఈ ప్రయోగం రెండు వారాలు కొనసాగింది. దీనిపై తీవ్రమైన విమర్శలు, అభ్యంతరాలు వచ్చాయి.

ఈ ప్రయోగం గురించి మనూ ఏమనుకున్నారనేది ఆమె డైరీలకు సంబంధించిన తదుపరి సంపుటాలు వెలువడ్డాక తెలుస్తుంది.

మనూ గాంధీ తన వయసుకు మించిన పరిణతి, వివేకం కలిగిన దృఢమైన వ్యక్తని, నాడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, ప్రజాకర్షణగల నాయకుల్లో ఒకరైన గాంధీ ముందు పూర్తి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగల వ్యక్తి అని ఆమె డైరీలను బట్టి స్పష్టమవుతోంది.

గాంధీ జీవిత చరమాంకంలో ఆయనతోపాటు ఉండటం అంత తేలిక కాదని సుహ్రుద్ అభిప్రాయపడ్డారు. "అప్పుడు గాంధీ వృద్ధాప్యంలో ఉన్నారు. పరిస్థితులు బాగోలేవు. ఆయన భార్య చనిపోయారు. ఆయన సన్నిహితులు చనిపోయారు. గాంధీ చివరి రోజులను మనం అర్థం చేసుకోవడంలో మనూ పాత్ర ఎంతో ఉంది. ఆమె రికార్డు నిర్వాహకురాలు, చరిత్రకారిణి" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆయన మాటలో నిజముంది.

"తనకు అతిపెద్ద శత్రువు నేనేనని చర్చిల్‌కు అర్థమైంది" అని 1944లో ఒక సందర్భంలో మనూతో గాంధీ చెప్పారు. "నన్ను జైలు బయట ఉంచితే దేశాన్ని అణచివేయలేనని, నియంత్రించలేనని ఆయన అనుకొంటున్నారు. నన్ను జైల్లో ఉంచినా వాళ్లు(బ్రిటన్) దేశాన్ని అణచివేయలేరు. ప్రజలకు ఒక్కసారి ఆత్మవిశ్వాసం వచ్చిందంటే ఇక వెనక్కు తగ్గరు. నేను చేయాల్సింది ఇంకా ఉంది" అని ఆయన వివరించారు.

మూడేళ్ల తర్వాత భారత్ స్వాతంత్ర్యం సాధించింది. నాడు దేశ విభజనలో పెద్దయెత్తన రక్తపాతం చోటుచేసుకొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)