అంటార్కిటికా నుంచి విడిపోయిన భారీ మంచు ముక్క.. నౌకలకు ప్రమాదం తప్పదా

ఫొటో సోర్స్, COPERNICUS DATA/SENTINEL-1/@STEFLHERMITTE
అంటార్కిటికాలోని అమెరీ మంచు దిబ్బ నుంచి భారీ మంచు ఖండం వేరుపడింది.
విడిపోయిన ఈ భాగం విస్తీర్ణం సుమారు 1,636 చదరపు కిలోమీటర్లు. బరువు దాదాపు 31,500 టన్నులు.
గత 50 ఏళ్లలో అమెరీ నుంచి వేరుపడ్డ మంచు ముక్కల్లో ఇదే అతిపెద్దది. దీన్ని డీ28గా పిలుస్తున్నారు.
వేరుపడ్డ ఈ మంచు ముక్క వల్ల భవిష్యత్తులో నౌకాయానానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. అందుకే దీన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది.
1960ల్లో అమెరీ నుంచి 9 వేల చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న ఓ మంచు ముక్క వేరుపడింది.
అంటార్కిటికాలోని మంచు దిబ్బల్లో అమెరీ మూడో అతిపెద్దది. ఖండానికి తూర్పు భాగంలో ఇది ఉంటుంది.
దీని మీదుగా ఎన్నో హిమనీనదాలు ప్రవహించి సముద్రంలో కలుస్తుంటాయి.
పైభాగంలో వచ్చే మంచు ప్రవాహాన్ని సమతుల్యం చేసేందుకు ఈ ప్రాంతంలోని మంచు ముక్కలు సముద్రంలో కలుస్తుంటాయి.

ఫొటో సోర్స్, NASA
అమెరీలో ఈ ప్రాంతంలో మంచు ముక్క వేరుపడటం ముందు నుంచీ శాస్త్రవేత్తలు ఊహించిన పరిణామమే. అయితే, వాళ్లు డీ28కు తూర్పుగా ఉన్న భాగం వేరుపడుతుందని అనుకుంటూ వచ్చారు.
డీ28కి తూర్పుగా ఉన్న ఆ భాగాన్ని 'లూస్ టూత్ అంటుంటారు. శాటిలైట్ చిత్రాల్లో చూసినప్పుడు అది ఊడిపోయే బాల దంతంలా కనిపించడమే అందుకు కారణం. అమెరీలో లూస్ టూత్ ఒక భాగం.
కానీ, లూస్ టూత్ ఇంకా అమెరీకి అనుసంధానమయ్యే ఉంది.
లూస్ టూత్‌తో పోలిస్తే డీ28 దవడ దంతం లాంటిదని స్క్రిప్స్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రొఫెసర్ హెలెన్ ఫ్లికర్ బీబీసీతో చెప్పారు.
2010-15 మధ్య కాలంలో లూస్ టూత్ వేరుపడొచ్చని ఆమె 2002లో అంచనా వేశారు.
''ఇన్నేళ్ల తర్వాత మంచు ముక్క వేరుపడుతుండటం చూస్తుంటే ఉద్విగ్నంగా ఉంది. ఇది జరుగుతుందని తెలుసు కానీ, ఇలా అవుతుందని మేం ఊహించలేదు. మునివేళ్లపై నించుని ఎదురుచూసేలా చేసింది'' అని ఆమె అన్నారు.
అయితే, పర్యావరణ మార్పులకు ఈ మంచు ముక్క వేరుపడటానికి ఏ సంబంధమూ లేదని హెలెన్ చెప్పారు.
''అంటార్కిటాకా గురించి ఆందోళన చెందాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ, డీ28 వేరుపడ్డ విషయంపై ఎలాంటి ఆందోళనా అక్కర్లేదు'' అని అన్నారు.
వేసవిలో ఉపరితలం భారీగా కరుగుతున్నా, చుట్టూ ఉన్న ప్రాంతాలతో అమెరీ దిబ్బ దాదాపు సమతుల్యంతో ఉందని 1990ల నుంచి తీసిన శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయి.
అమెరీలో తదుపరి స్పందనలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆస్ర్టేలియా అంటార్కిటికా విభాగం గమనించనుంది. ఈ ప్రాంతంలో వారి పరిశోధనలు సాగుతున్నాయి.
ఇంత పెద్ద మంచు ముక్క వేరుపడటం వల్ల అమెరీ దిబ్బ తీర భాగం ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి. మరిన్ని పగుళ్లకు ఇది దారి తీయొచ్చు. లూస్ టూత్ స్థిరత్వం కూడా దెబ్బతినొచ్చు.
వైశాల్యంలో డీ28కి మూడు రెట్లు పెద్దదైన ఏ68 మంచు ముక్క అంటార్కిటికాలోని లార్సెన్ సీ మంచు దిబ్బ నుంచి 2017లో వేరుపడింది.
సముద్ర ప్రవాహాలు, పవనాల వల్ల డీ28 పశ్చిమం వైపు కదులుతుంది. అది ముక్కలైపోయి, పూర్తిగా కరిగిపోయేందుకు కొన్నేళ్లు పట్టొచ్చు.
ఇవి కూడా చదవండి:
- అంటార్కిటికా సముద్రం అడుగున రహస్యాలు ఇవే
- 17 ఏళ్లుగా దొరకని నేరస్తుడిని డ్రోన్ల సాయంతో పట్టుకున్న పోలీసులు
- ఆర్కిటిక్ కాలుష్యం: స్వచ్ఛమైన మంచు ఖండంలో ప్లాస్టిక్ విష పదార్థాలా...
- గోదావరిలో మునిగిన బోటు బయటకు వస్తోందా?
- మనుషులు చేరలేని మహాసముద్రాల లోతుల్లో ప్లాస్టిక్ సంచులు, చాక్లెట్ రేపర్లు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి?
- ప్రపంచయుద్ధంలో మునిగిన చమురు ట్యాంకర్‌తో ముప్పు
- 'మా అమ్మను, తోబుట్టువులను నా ముందే చంపేశారు... చనిపోయినట్లు నటించి నేను బయటపడ్డా'
- ఈ చిత్రాలు... ఇండోనేసియా సునామీ బీభత్సానికి సాక్ష్యాలు
- వృద్ధురాలి వంటగదిలో దొరికిన రూ.46 కోట్ల విలువైన కళాఖండం
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








