సద్దాం హుసేన్ పాలనలో ఇరాక్: ‘నా కళ్ళ ముందే మా అమ్మను, తోబుట్టువులను చంపేశారు, నేను చనిపోయినట్లు నటించి బయటపడ్డా'

ఫొటో సోర్స్, TAIMOUR ABDULLAH AHMED
''మా అమ్మను నా కళ్ల ముందే చంపేశారు. నేనేమీ చేయలేకపోయా. నా తోబుట్టువులనూ పొట్టనపెట్టుకున్నారు''
తైమూర్ అబ్దుల్లా అహ్మద్ 1998లో మేలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఈ మాటలు చెబుతున్నారు. అప్పటికి ఆయన 12 ఏళ్ల పిల్లాడు.
ఇరాకీ సైనికులు ఆయనతోపాటు పదుల సంఖ్యలో చిన్నారులను, మహిళలను ఓ గొయ్యిలోకి పంపించి, కాల్పులు జరపడం మొదలుపెట్టారు.
సద్దాం హుస్సేన్ పాలనలోని ఇరాక్‌లో ఉండటమే వారు చేసుకున్న పాపం.
''ఆ రోజు నా కుటుంబ సభ్యులతోపాటే నా మనసు కూడా చచ్చిపోయింది. ఇప్పటికీ ఆ క్షణాలు నా కళ్ల ముందు కదలాడుతుంటాయి. నిద్రలో పీడ కలలై వస్తుంటాయి'' అని అహ్మద్ చెప్పారు.
ప్రస్తుతం అహ్మద్ వయసు 33 ఏళ్లు.
తమ కుటుంబసభ్యులతోపాటు అప్పుడు చనిపోయినవారికి న్యాయం కావాలని అహ్మద్ ప్రస్తుతం పోరాడుతున్నారు.

ఫొటో సోర్స్, TAIMOUR ABDULLA AHMED
'అన్ఫల్' పేరుతో ఉత్తర ఇరాక్‌లోని కర్డులపై సద్దాం ప్రభుత్వం మూకుమ్మడిగా అమలు చేసిన శిక్షలో భాగంగానే అహ్మద్ కుటుంబ సభ్యుల హత్యలు జరిగాయి.
తిరుగుబాటును అణిచివేసే చర్యలని వీటిని ఇరాక్ ప్రభుత్వం సమర్థించుకుంది. 1980-88 ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో కొందరు కర్డులు శత్రువులకు సహకారం అందించారని ఆరోపించింది.
వ్యవస్థీకృతంగా ఇరాక్ చేపట్టిన జాతి హననంలో లక్షకు పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ వెల్లడించింది. ఇందుకు రసాయనిక ఆయుధాలను కూడా ప్రభుత్వం వినియోగించినట్లు పేర్కొంది. కర్డులు చెబుతున్న లెక్కల ప్రకారం మాత్రం మృతి చెందిన పౌరుల సంఖ్య 1.8 లక్షలకుపైనే ఉండొచ్చు.
అహ్మద్ కుటంబం కులాజో అనే మారుమూల గ్రామంలో నివసించేది. ఆ గ్రామంలో సుమారు 110 మంది ప్రజలు ఉండేవారు. వాళ్లంతా ఒకరికొకరు బంధువులే అవుతారు.
తమ గ్రామాన్ని గుర్తించడం కూడా కష్టమేనని అహ్మద్ బీబీసీతో చెప్పారు. సద్దాం హుస్సేన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న కొందరు కర్డులు.. 1988 ఏప్రిల్‌లో దేశ బలగాలను తమ వైపు మళ్లించారని ఆయన అన్నారు.
ఆ గ్రామాన్ని బలగాలు చట్టుముట్టాయి. అక్కడున్నవారిని ఓ సైనిక శిబిరం వద్దకు తీసుకెళ్లాయి. మహిళలు, చిన్నారులను ఓ గుంపుగా, పురుషులను ఒక గుంపుగా విడదీశాయి. అహ్మద్ చివరగా తన తండ్రిని చూసింది అప్పుడే.
ఒక నెల తర్వాత అహ్మద్‌తో పాటు మిగతా చిన్నారులు, మహిళలను ట్రక్కుల్లో ఎక్కించి, దక్షిణం వైపు తీసుకువెళ్లారు.

ఫొటో సోర్స్, TAIMOUR ABDULLA AHMED
''ఆ ట్రక్కుల తలుపులు తీయగానే మూడు గొయ్యిలు కనిపించాయి. ఇద్దరు ఇరాకీ సైనికులు ఏకే 47 రైఫిల్స్ పట్టుకుని నిల్చున్నారు'' అని అహ్మద్ గుర్తు చేసుకున్నారు.
''చిన్నారులను, మహిళలను బలవంతంగా ట్రక్కుల్లో నుంచి కిందకు దించారు. కొందరు ఆడవాళ్లు చేతుల్లో పసిపాపలతో ఉన్నారు. మమ్మల్నందరినీ ఆ గొయ్యిల్లోకి బలవంతంగా పంపారు. ఒక్కసారిగా మాపై కాల్పులు మొదలుపెట్టారు'' అని ఆయన చెప్పారు.
అహ్మద్ ఎడమ భుజానికి ఓ తూటా తాకింది.
''నా తల, చేతులు, కాళ్ల పక్క నుంచి తూటాలు దూసుకువెళ్తున్నాయి. అక్కడ నేల వణికిపోతోంది. మొత్తం ప్రాంతమంతా రక్తసిక్తమైపోయింది. నా వీపులోకి రెండు తూటాలు దూసుకువచ్చాయి. నా చావు కోసం ఎదురుచూస్తున్నా'' అని అహ్మద్ అన్నారు.

ఫొటో సోర్స్, TAIMOUR ABDULLA AHMED
కానీ, అహ్మద్ అప్పుడు చనిపోలేదు. సైనికులు వెళ్లిపోయేంతవరకూ చనిపోయినట్లు నటించారు. వాళ్లు వెళ్లాక, చీకట్లో ఆ మృతదేహాల మధ్య నుంచి లేచి, పారిపోయారు.
బెడువిన్ జాతికి చెందిన ఓ కుటుంబం ఆయన్ను చేరదేసింది. మూడేళ్ల పాటు ఆ కుటుంబంతోనే ఆయన ఉన్నారు.
ఆ తర్వాత బతికి బయటపడ్డ కొందరి బంధువులతో అహ్మద్ మాట్లాడగలిగారు. తిరిగి తన ప్రాంతానికి వెళ్లారు. అయితే, ఆయన అధికారులకు కనపడకుండా అక్కడ దాక్కొని జీవించాల్సి వచ్చింది.
1996లో అమెరికా అహ్మద్‌కు పునరావాసం కల్పించింది. ఇప్పుడు ఆయన అమెరికాలోనే నివాసముంటున్నారు.

ఫొటో సోర్స్, TAIMOUR ABDULLA AHMED
2009లో సద్దాం హుస్సేన్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అహ్మద్ ఇరాక్‌కు తిరిగివచ్చారు. తమవారిని ఊచకోత కోసి, సామూహికంగా సమాధి చేసిన ఆ ప్రదేశానికి వెళ్లారు.
''వారి సమాధులను చూసినప్పుడు నేను వణికిపోయా. వెక్కివెక్కి ఏడ్చా. ఆ సమాధులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా, నాకు తెలియజేయాలని ఇరాక్ ప్రభుత్వాన్ని కోరా'' అని అహ్మద్ చెప్పారు.
ఈ ఏడాది జూన్‌లో అక్కడి సమాధులను ప్రభుత్వం తవ్వడం ప్రారంభించింది. ఈ సమాచారాన్ని అహ్మద్‌కు ఇవ్వలేదు. తవ్వి తీసిన మృతదేహాలను కర్డు ప్రాంతంలో తిరిగి సమాధి చేయాలని ఇరాక్ ప్రభుత్వం భావిస్తోంది.
అహ్మద్‌కు స్నేహితుల ద్వారా ఈ విషయం తెలిసింది. వెంటనే ఆయన అమెరికా నుంచి ఇరాక్‌కు వెళ్లారు.
అప్పటికే ఆ ప్రదేశంలో 170 మృతదేహాలను ప్రభుత్వ అధికారాలు బయటకు తీయించారు.

ఫొటో సోర్స్, Getty Images
సమాధులను తవ్వేవారు కొన్ని ఎముకలను, అవశేషాలను అలాగే వదిలేస్తున్నారని అహ్మద్ ఆరోపించారు.
ప్రస్తుతం ఆయన అక్కడి ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తున్నారు. తన తల్లి, ఇద్దరు తోబుట్టువులు ఉండే సమాధిని తవ్వకుండా అధికారులను అడ్డుకుంటున్నారు.
సమాధులను తవ్వేవిషయంలో గౌరవప్రదంగా వ్యవహరిస్తూ, తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే తాము ప్రభుత్వం తవ్వకాలను కొనసాగినివ్వనిస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు.
ఊచకోతకు బాధ్యులైనవారిని విచారించాలన్నది కూడా వారి డిమాండ్లలో ఒకటి.
ఈ ఊచకోత విషయంపై మొత్తం ప్రపంచం దృష్టి పడాలని కోరుకుంటున్నానని అహ్మద్ చెప్పారు.
''అమాయక చిన్నారులు, వారిని హత్తుకుని మరణించిన తల్లుల మృతదేహాలను కెమెరాలు జూమ్ చేసి చూపించాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
''నా తోబుట్టువులు, తల్లితో కనీసం ఒక ఫోటో కూడా నేనెప్పుడూ దిగలేదు. వారి అవశేషాలనైనా ఫొటో తీసుకోవాలనుకుంటున్నా'' అని ఉద్వేగంగా చెప్పారు.
ఊచకోత బాధితుల బంధువులను సంప్రదించే బాధ్యత స్థానిక కర్డు ప్రభుత్వానిదేనని ఇరాకీ అధికారులు చెబుతున్నారు.
అవశేషాలను పరీక్షించి, బాధితులను గుర్తించిన తర్వాత వారి బంధువులను సంప్రదించగలుగుతామని కర్డిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫవాద్ ఒస్మాన్ తాహా అన్నారు.
సేకరించిన ఆధారాలను ఊచకోత బాధ్యులను విచారించే ప్రత్యేక కోర్టుకు పంపిస్తున్నట్లు ఆయన చెప్పారు.
తమ డిమాండ్లు నెరవేరే వరకూ ఆ సమాధులున్న స్థలంలోనే ఉండేందుకు అహ్మద్ ప్రణాళికలు వేసుకుంటున్నారు.
''దేవుడు నన్ను బతికించడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. ఊచకోతకు గురై మాట్లాడలేకపోతున్న ఆ అమాయకుల గొంతుకనై వినిపించే బాధ్యతను దేవుడు నా మీద పెట్టాడు'' అని అహ్మద్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ఇసుకలో ముగ్గురు పిల్లల మృతదేహాలు.. హత్యకు ముందు ఒకరిపై అత్యాచారం
- కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- పాకిస్తాన్‌ను టార్గెట్ చేసిన మోదీ.. ‘సొంత దేశాన్నే చూసుకోలేకపోతున్న వారు, భారత్‌లో ఏం చేసినా ఇబ్బంది పడిపోతున్నారు’
- అబద్ధాలు చెప్పే వారిని ఎలా గుర్తించాలి?
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
- గ్లోబల్ వార్మింగ్ వెనుక ఉన్న డర్టీ సీక్రెట్ ఇదే
- మోదీకి గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే అవార్డుపై అభ్యంతరాలు ఎందుకు?
- ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?
- పీరియడ్ బ్లడ్ చూపిస్తే తప్పేంటి... శానిటరీ ప్యాడ్స్ యాడ్‌పై ఫిర్యాదులను తిరస్కరించిన ఆస్ట్రేలియా
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
- అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు
- హాజీపూర్ బాలికల హత్యలు: ‘ముందు ఊపిరాడకుండా చేస్తాడు.. చనిపోయాక రేప్ చేస్తాడు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








