'ఇస్లామిక్ స్టేట్‌'కు పూర్తిగా అంతం పలికాం.. సిరియా సేనల ప్రకటన

ఎస్డీఎఫ్ జెండాలు

సిరియాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐఎస్) పాలనకు పూర్తిగా ముగింపు పలికినట్లు కుర్దిష్‌ల నేతృత్వంలోని సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) ప్రకటించాయి. మిలిటెంట్ల ఓటమితో అయిదేళ్ల వారి పాలనకు అంతం పలికినట్లయిందని ఈ బలగాలు వెల్లడించాయి.

జిహాదీ గ్రూపుల అధీనంలో ఉన్న చిట్టచివరి ప్రాంతం బఘూజ్‌లో ఎస్డీఎఫ్ యోధులు విజయ పతాకాలు ఎగురవేస్తూ ముందుకుసాగారు.

అయితే, విజయోత్సవాలు మొదలైనప్పటికీ 'ఇస్లామిక్ స్టేట్' వల్ల ప్రపంచానికి ఇంకా ముప్పుందన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి.

నైజీరియా నుంచి ఫిలిప్పీన్స్ వరకు పలు దేశాల్లో జిహాదీల ఉనికి ఉండడంతో ఈ హెచ్చరికలు తప్పడం లేదు.

ఐఎస్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో సిరియా, ఇరాక్‌లలో 88,000 చదరపు కిలోమీటర్ల భూభాగం వారి అధీనంలో ఉండేది.

అయిదేళ్లుగా సాగిన భీకర పోరు అనంతరం ఐఎస్ ప్రభావం క్రమంగా తగ్గుతూ ఇరాక్, సిరియాల సరిహద్దుల్లో కొన్ని వందల చదరపు మీటర్ల విస్తీర్ణానికే పరిమితమైంది.

2018 చివరి నాటికి ఎవరికి ఎక్కడెక్కడ పట్టుందో చూపే చిత్రం

అంతిమ యుద్ధం ఇలా..

తూర్పు సిరియాలోని బఘూజ్ గ్రామ ప్రాంతంలో ఉన్న ఐఎస్ మిలిటెంట్లపై మార్చి మొదటి వారం నుంచి ఎస్డీఎఫ్ సంకీర్ణ సేనలు ఈ అంతిమ యుద్ధాన్ని ప్రారంభించాయి.

అయితే అక్కడి భవనాలు, గుడారాలు, సొరంగాల్లో సాధారణ పౌరులూ పెద్ద సంఖ్యలో తలదాచుకుంటుండడంతో ఎస్డీఎఫ్ దాడులను తగ్గించింది.

ఈ చివరి యుద్ధం సమయంలో అక్కడి నుంచి తరలిపోయిన ప్రజలకు ఎస్డీఎఫ్ శిబిరాలు నిర్వహించి ఆశ్రయం కల్పించింది.

అక్కడున్న ఐఎస్ మిలిటెంట్లలోనూ చాలా మంది పారిపోయినప్పటికీ మిగిలి ఉన్న కొద్ది మంది సూసైడ్ బాంబ్లు, కార్ బాంబులతో ఎస్డీఎఫ్‌ను తీవ్రంగా ప్రతిఘటించారు.

చివరకు ఎస్డీఎఫ్ మిలిటెంట్లు అందరినీ తుదముట్టించి ఐఎస్ పాలనను అంతమొందించినట్లు ఎస్డీఎఫ్ మీడియా ఆఫీస్ చీఫ్ ముస్తాఫా బాలి శనివారం ప్రకటించారు.

ఎస్డీఎఫ్

ఫొటో సోర్స్, Reuters

స్లీపర్ సెల్స్‌పై ఆపరేషన్ కొనసాగిస్తాం: ఎస్డీఎఫ్

ఐఎస్ స్లీపర్ సెల్స్‌ను తుదముట్టించడానికి ఇకపై ఆపరేషన్ కొనసాగిస్తామని ఎస్డీఎఫ్ జనరల్ మజ్లూమ్ కోబానీ వెల్లడించారు.

ఐఎస్ అంతంపై ఎస్డీఎఫ్ చేసిన ప్రకటన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. ''మా దేశానికి ఉన్న పెను ముప్పును నిర్మూలించారు'' అంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ ఎస్డీఎఫ్ ప్రకటనను స్వాగతించారు.

బ్రిటన్ ప్రధాని థెరెసా మే కూడా ఈ సమాచారాన్ని స్వాగతిస్తూ ఐఎస్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రజలు, ఇతరులకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)