పెళ్లికొడుకు మెడలో తాళి కట్టిన పెళ్లికూతురు.. ఎందుకిలా చేశారు? ఇది ఏమి ఆచారం?

ఫొటో సోర్స్, Baragundi family
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
పెళ్లి మంటపంలో ఓ పెళ్లికూతురు పెళ్లికొడుకు మెడలో తాళి కట్టేసింది.. ఈ ఘటన కర్నాటకలోని విజయపుర జిల్లా నాలతవాడ గ్రామంలో జరిగింది. ఈ సంఘటన విని అందరూ ఆశ్చర్యపోయారు.
ఆ కళ్యాణమంటపంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఒక జంట అమిత్-ప్రియ, మరొక జంట ప్రభు శంభులింగ-అంకిత. ఈ రెండు పెళ్లిళ్లూ కులాంతర వివాహాలే.
కర్నాటకలో ఓ పెళ్లిలో మంటపంలో రెండు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అక్కడున్న మంగళసూత్రాన్ని ఇద్దరు పెళ్లికూతుళ్లు, తమ భర్తల మెడలో కట్టారు. మీరు చదివింది నిజమే.. పెళ్లికొడుకుల మెడలో మంగళసూత్రం కట్టడం ఓ పురాతన సంప్రదాయమట.
ఈ పెళ్లి వార్తలను స్థానిక పత్రికల్లో చదివాక ప్రజలు.. 'అసలు ఏం జరుగుతోంది..?' 'ఇదెక్కడి వింత..!' అని ముక్కున వేలేసుకున్నారు. ఈ పెళ్లిళ్లతో.. పెళ్లికొడుకు తండ్రి అశోక్ బారగుండి కుటుంబం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
''ఇందులో వింత ఏముంది? మా కుటుంబంలో చాలా పెళ్లిళ్లు ఇలానే జరిగాయి'' అని అశోక్ బీబీసీతో అన్నారు.
అసలు ఏం జరిగింది?
ఆ పెళ్లి మంటపంలో ఇద్దరు పెళ్లికూతుళ్లు, ఇద్దర పెళ్లికుమారులు కూర్చున్నారు. వారి పక్కగా 12వ శతాబ్దానికి చెందిన సంఘసంస్కర్త బసవణ్ణ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆ విగ్రహం పక్కన శ్రీ మహంతేశ్వర సంస్థాన మఠంకు చెందిన గురుమహంత స్వామీజీ, ఇల్కల్ ఇద్దరూ కూర్చున్నారు.
ఇద్దరు వరులకు రుద్రాక్షలతో చేసిన వివాహముద్రలను చెరొకటి ఇచ్చారు. ఇవి మంగళసూత్రంతో సమానం. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళసూత్రానికి బదులు వీటినే ధరిస్తారు.
ఈ వివాహముద్రలను వరులు ఇద్దరూ.. తమకు కాబోయే భార్యల మెడలో కట్టారు. తర్వాత, వాటిని పెళ్లికూతుళ్లకు ఇచ్చారు. వారిద్దరూ పెళ్లికుమారుల మెడలో ఆ వివాహముద్రలను కట్టారు.
అనంతరం వధూవరులు పూలదండలను ఒకరి మెడలో ఒకరు వేసుకుని, స్వామీజీతోపాటు లేచి నిలబడ్డారు. ఆయన ఈ కొత్త జంటలతో కొన్ని ప్రమాణాలు చేయించారు.
''ఈ పెళ్లి కేవలం వైవాహికమైనది మాత్రమే కాదు.. ఇది ప్రేమ, ఆధ్యాత్మికతల సంయోగం.
ఒకరినొకరు అర్థం చేసుకుని, ఇద్దరం ఒక్కటిగా జీవిస్తాం. స్వార్థ, సామాజిక ప్రయోజనాల కోసం కాకుండా, ఇతరుల పట్ల సేవ, ధర్మం కలిగివుండి, సమాజ హితం కోసం జీవిస్తాం.
వీటికితోడు ధర్మం, రాజ్యం, కుటుంబ వాతావరణం, ఆనందం.. విషయాల పట్ల కూడా అప్రమత్తంగా ఉంటాం.
అసూయ, మూఢనమ్మకాలు, మూఢాచారాలకు దూరంగా జీవిస్తాం. పరుల సొమ్ము ఆశించక, ఇతరులను నిందించక, హింసించక, నిష్కళంకమైన జీవితం గడుపుతాం.
అత్యాశ, చెడు నడవడిక, దురలవాట్ల ప్రభావాలకు లోనుకాకుండా, సన్మార్గంలో నడుస్తాం.
బసవణ్ణ, ఇతర మతపెద్దలు చెప్పినట్లుగా.. జ్ఞానంతో కూడిన జీవితాన్ని జీవిస్తూ, ప్రపంచానికి మంచిని పంచుతామని.. ధర్మగురువు బసవణ్ణను అనుసరించే 'శరణ వర్గం'కు చెందిన ప్రజల ముందు ప్రమాణం చేస్తున్నాం. జై గురు బసవణ్ణ శరణు శరణతి'' అని ప్రతిజ్ఞ చేశారు.

ఫొటో సోర్స్, Baragundi family
అక్షింతలూ లేవు, కన్యాదానమూ లేదు
వీరి పెళ్లిలో వధూవరులపై ఎవరూ అక్షింతలు వేయలేదు. వారిపై పూలు వేసి ఆశీర్వదించారు. పెళ్లళ్లలో సాధారణంగా కనిపించే కన్యాదాన ఆచారం కూడా జరగలేదు.
అంతే.. పెళ్లయిపోయింది.
అగ్నిగుండం చుట్టూ వధూవరులు తిరగడం, ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకోవడం లాంటివి ఈ పెళ్లిలో కనిపించలేదు.
బసవణ్ణను అనుసరించే చాలామంది లింగాయత్ కులానికి చెందినవారిలాగే.. పెళ్లిమంటపంలోని బారగుండి, దుడ్డగి కుటుంబాలకు కూడా ఈ ఆచారం కొత్తదేమీ కాదు.
ముంబై-కర్నాటక, హైదరాబాద్-కర్నాటక ప్రాంతాల్లోని లింగాయత్ వర్గానికి చెందిన కుటుంబాల్లో ఇది ఓ ఆచారం. (వీరశైవులను వ్యతిరేకించి, వేదాల్లోని కొన్ని ఆచారాలను ప్రత్యేకంగా ఆకళింపు చేసుకున్నారు.)
ఇల్కల్ మఠానికి చెందిన కీ.శే. డా.మహంత స్వామిగళు చితరాగిని అనుసరించే వారిలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది.
''12వ శతాబ్దంలో చెప్పిన బసవణ్ణ స్వామి ఉపదేశాలను ఆచరిస్తూ, ఆయన వరకట్న వ్యతిరేక ఉద్యమాన్ని నడిపారు. మహిళలను దానంగా ఇవ్వడాన్ని ఆయన అంగీకరించరు. అందుకే ఈ ఆచారంలో కన్యాదానం ఉండదు. స్త్రీని దానం చేశాక, ఆమె.. ఒక మనిషిగా విలువ కోల్పోతుంది. అందుకే పురుషుడు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడు'' అని గురుమహంత స్వామీజీ అన్నారు.
''వివాహముద్ర అన్నది ఈ మఠానికి చెందిన ఒక కొత్త విధానం. బసవణ్ణ ప్రవచనాలను అనుసరించేవారు ఈ ఆచారాలను పాటిస్తారు. వేదకర్మలను ఆచరించడం మొదలైన తర్వాత, ప్రజలు బసవణ్ణను నిర్లక్ష్యం చేశారు. కానీ ఇల్కా మఠానికి చెందిన సీనియర్ స్వామీజీ బసవణ్ణ విధానాలను అనుసరించి, వాటికి ప్రచారం కల్పించారు'' అని వచన స్టడీస్ మాజీ డైరెక్టర్ రమజాన్ దర్గా అన్నారు.
''గత ముప్పై సంవత్సరాలుగా మేము ఈ ఆచారాన్ని పాటిస్తున్నాం. మా తమ్ముడు సంజీవ్ కూడా ఇలానే పెళ్లి చేసుకున్నాడు. నా కూతురు పూజతోపాటు షీలా, పూర్ణిమల పెళ్లిళ్లు కూడా ఇలానే జరిగాయి'' అని అశోక్ అన్నారు.

ఫొటో సోర్స్, Baragundi family
''పురుషుడిపై కూడా నైతికపరమైన ఒత్తిడి ఉండాలన్నది ఈ వివాహముద్రల ముఖ్యోద్దేశం. ఇలా చేస్తే పురుషుడు పరాయి స్త్రీని పెళ్లాడటంకానీ, జీవించడంకానీ చేయడు'' అని గురుమహంత స్వామీజీ అన్నారు.
మహిళలు తాళిని ధరించినట్లుగా అమిత్ బారగుండి కూడా ఈ వివాహమద్రను ఎల్లప్పుడూ మెడలో ధరిస్తారా?
''అవును.. తప్పకుండా ధరిస్తాను. ఈ క్రతువు మొత్తం, స్త్రీ పురుషుల మధ్య సమానత్వం గురించి చెబుతుంది. కానీ ఈ వివాహముద్రలు పురుషుడిపై నైతికపరమైన ఒత్తిడి కలిగిస్తుందని నేననుకోను. అది.. దంపతుల మధ్య ఉండాల్సిన ఒక అవగాహన'' అని పెళ్లికొడుకు అమిత్ బారగుండి అన్నారు. ఈయన ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.
ఈ పందిట్లో జరిగిన రెండు పెళ్ళళ్లూ.. కులాంతర వివాహాలే. అమిత్ భార్య ప్రియ, ఆస్ట్రేలియాలో తన కంపెనీలోనే పని చేస్తున్నారు. ఇద్దరూ కొలీగ్స్.
అలా ప్రేమలోపడిన ఇద్దరూ, తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రియ కురుబ కులానికి చెందినవారు.
''ఇది ఓ గొప్ప అనుభూతి. స్త్రీపురుషులు ఇద్దరూ సమానమేనని మా అత్తమామలు నిరూపించారు. ఆచారంలో భాగంగా, పురుషుడి మెడలో వివాహముద్రను కట్టాలన్నపుడు నేను చాలా ఆశ్చర్యపోయాను'' అని ప్రియ అన్నారు.
అమిత్ ఈ వివాహముద్రను ఎప్పుడూ ధరిస్తారని ఏమిటి నమ్మకం?
''అమిత్ కచ్చితంగా ధరిస్తాడు. ఎందుకంటే అతను నాకు ప్రామిస్ చేశాడు.''
ఇవి కూడా చదవండి
- తలపై జుట్టు లేకుండా.. 'పెళ్లి కూతురు' ఫొటోషూట్
- ఆవలింత ఎందుకు వస్తుంది, ఎవరైనా ఆవలిస్తే మీకూ ఆవలింత ఎందుకు వస్తుంది
- #HisChoice: నేను పెళ్లి చేసుకోలేదు.. ఒంటరిగానే ఉంటా.. ఈ సమాజానికేంటి నష్టం?
- పతన దశలో వెబ్... అందరం కలసి కాపాడుకోవాలి: బీబీసీతో టిమ్ బెర్నర్స్-లీ
- #HisChoice: హిజ్రాను పెళ్లాడిన ఒక మగాడి కథ
- సంప్రదాయబద్ధంగా మగాళ్లిద్దరూ మనువాడారు!
- అట్టహాసంగా పెళ్లిళ్లు.. అప్పుల పాలవుతున్న యువకులు
- #BBCShe: పెళ్లి కోసం యువకుల కిడ్నాప్
- ఆయుష్షు పెరగాలంటే.. పెళ్లి చేసుకోండి
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- తొలిరాత్రి కన్యత్వ పరీక్ష: నెత్తురు కనిపించకపోతే ఆమెకు నరకమే!
- హోలీకి ముందే Surf Excel వెంటపడుతున్న జనం
- ఇచట వృద్ధులకు పెళ్లిళ్లు చేయబడును!
- ఎన్నికల్లో వందకు వంద శాతం పోలింగ్.. పోటీ చేసేవాళ్లంతా గెలుపు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








