కష్టాలకు లొంగలేదు.. తన కష్టాన్నే ఆయుధంగా మలుచుకుంది

మైనా

మధ్యప్రదేశ్‌లోని మంద్సోర్ గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న ఓ మెకానిక్ షాపులో ఓ మహిళ బిజీగా పని చేస్తున్నారు. బరువైన లారీలు, ట్రాక్టర్ల చక్రాలకు రిపేర్లు చేస్తున్నారు. సాధారణంగా పురుషులు చేసే ఈ వృత్తిలో.. ప్యాంటు, షర్టు వేసుకున్న మైనాను మీరు చూడొచ్చు.

ముగ్గురు పిల్లల ఒంటరి తల్లి మైనా.. ఈ కఠినమైన పనులను చేస్తున్నారు. ఆమె పనులే కాదు.. ఆమె జీవితం కూడా చాలా కఠినంగా ఉంది. భర్త చనిపోయాక మైనా ఈ వృత్తిలోకి వచ్చారు.

తన తండ్రి వద్ద నేర్చుకున్న పనే ప్రస్తుతం ఆమెకు జీవనాధారం అయ్యింది. ఈ వృత్తిలో ఆమె ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఎన్నో అవహేళనలను చవిచూశారు.

మహిళలకు ఏ పనీ కష్టం కాదని ఆమె విశ్వాసం. జీవితంలో కష్టాలకు ఎదురొడ్డి పోరాడుతున్నారు. ఆమె జీవన పోరాటం ఆమె మాటల్లోనే...

వీడియో క్యాప్షన్, ‘మహిళలకు ఏదీ కష్టం కాదు..’

మా నాన్న ఈ పని చేసేవారు. అలా నేను కూడా టైర్లు రిపేరు చేయడం నేర్చుకున్నాను. పెళ్లయ్యాక అత్తగారింటికి వెళ్లాను. నాకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. నా భర్త చనిపోయినపుడు నేను గర్భవతిని.

ఈ పనిలో.. దాదాపు 30 ఏళ్లు గడిచిపోయాయి. టైర్లు రిపేరు చేస్తాను, వాటికి గ్రీజ్ రాస్తాను. ఈమధ్యనే కార్ల సర్వీస్ సెంటర్ కూడా ప్రారంభించాను. ఈ పని చేస్తూ, కార్ వాష్ కూడా చేస్తాను.

నా భర్త చనిపోయినపుడు పిల్లలు చాలా చిన్నవాళ్లు. ఒకరికి ఐదేళ్లు, మరొకరికి నాలుగేళ్లు, చిన్నదానికి మూడేళ్లు. నా తోడబుట్టినవాళ్లు కూడా చిన్నవారే. అందర్నీ నేనే చదివించాను. ఒకవైపు ఈ పని చేస్తూ, మరోవైపు వాళ్ల బాగోగులన్నీ చూశాను. నా ఆరోగ్యం దెబ్బతింది. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను.

అప్పట్లో ఇది వన్ వే రోడ్డు. ఒకేఒక షాపు ఉండేది. చుట్టూ ఈ మార్కెట్ ఉండేది కాదు. పగలు, రాత్రి తేడా లేకుండా, పని చేసేదాన్ని. పని చేసేటపుడు ప్యాంట్, షర్ట్ వేసుకుంటాను.

మొదట్లో మా అమ్మతో కలిసి ఉండేదాన్ని. ఆమెతో గొడవలయ్యాయి. నా పిల్లలను తీసుకుని బయటకు వచ్చేసి, ఇక్కడే ఇల్లు ఏర్పాటుచేసుకున్నా. తినడానికి ఏమీలేక, చాలా సార్లు అటుకులు తినేదాన్ని.

నా పిల్లల్ని మాత్రమే తీసుకుని, కట్టుబట్టలతో బయటకు వచ్చేసి, కొన్ని బోర్డులతో ఇల్లు కట్టుకున్నాను.

చుట్టుపక్కలవాళ్లకు నన్ను చూస్తే కుళ్లు. 'ఒక స్త్రీ ఇంత సంపాదిస్తోందా..? టైర్లు రిపేరు చేస్తుంది, గ్రీజింగ్ కూడా చేస్తుంది, ఈ పనులన్నీ మాకు రావే..' అని వారి బాధ.

ఒక స్త్రీ సంపాదిస్తుంటే చుట్టూ ఉన్నవారు ఓర్వలేరు. ఆమె ఎదుగుదలకు అడ్డుపడుతూ ఎన్నో అవమానాలకు గురి చేస్తారు.

'అరే.. ఓ మహిళ అయ్యుండీ ఎంతో కష్టపడుతోంది.. కనీసం సాయం చేద్దాం' అనుకోరు.

ఈ పని చాలా కష్టం. వెన్నెముక దగ్గర నొప్పి పుడుతుంది. అయినా రోజంతా పని చేస్తూనే ఉంటాను. నొప్పి మరీ ఎక్కువుంటే కాసేపు పడుకుంటాను. మళ్లీ లేచి పని చేస్తా.

మా షాపుకు వచ్చేవాళ్లలో 80 శాతం మంది మంచివాళ్లుంటే, 20 శాతం మంది చెడ్డవాళ్లుంటారు. అలాంటివారిని వెంటనే వెళ్లిపోమని చెబుతాను. వారిని తరమడానికి ఒక్కోసారి తిట్టడం, చేతలతో బెదిరించడం చేస్తుంటాను.

టైరు రిపేరు చేసినందుకు వంద రూపాయలు తీసుకుంటాను. పది టైర్లు వస్తే, రోజుకు వెయ్యి రూపాయలు వస్తుంది. ఈ కాలంలో ఆ సంపాదన ఏపాటిది?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)