తెలంగాణలో ఆంధ్రావాళ్లను కొడుతున్నారన్న పవన్ కల్యాణ్.. కేటీఆర్ స్పందన ఇదీ

ఫొటో సోర్స్, fb/janasenaparty
తెలంగాణలో ఆంధ్రా ప్రాంతం వారిని కొడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.
శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నామినేషన్ వేసేందుకు వెళ్లే ముందు పవన్ మాట్లాడుతూ... ఏపీలో ప్రజలు కులమతాలుగా విడిపోయి కొట్టుకుంటుంటే, తెలంగాణలో మాత్రం ఏపీ ప్రజల్ని ఆంధ్రులంటూ కొడుతున్నారని వ్యాఖ్యానించారు.
''విభిన్న సామాజికవర్గాలు, మతాల పేరుతో మనలోమనం ఇక్కడ కొట్టుకుంటున్నాం. కానీ, తెలంగాణకెళ్తే మనందరినీ కలిపి ఆంధ్రావాళ్ల కింద కొడుతున్నారు. దళితులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు ఎవరైనా... తెలంగాణ వారికి మాత్రం మనం ఆంధ్రులం" అని ఆయన అన్నారు.
"జనసేనలో చేరాలనుకున్న నాయకులను టీఆర్‌ఎస్ నేతలు భయపెట్టి వైసీపీలో చేరేలా చేశారు. జగన్‌కు కేసీఆర్ అంటే భయం. కేసీఆర్ ఒక ఉద్యమనాయకుడన్న గౌరవం ఉంది కానీ, ఆయనంటే నాకు భయం లేదు. తెలంగాణలో ఉన్న నా ఇంటిని, పదెకరాల భూమిని లాక్కుంటారా? ఏం... తెలంగాణ పాకిస్తాన్ అనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చి ఏపీ రాజకీయాలను మార్చేస్తారా?" అని పవన్ వ్యాఖ్యానించారు.
కేటీఆర్ స్పందన
పవన్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు.
"మీ అభిప్రాయాన్ని తప్పుగా వ్యక్తీకరించారని భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఇక్కడ 29 రాష్ట్రాల ప్రజలూ ప్రశాంతంగా నివసిస్తున్నారన్న విషయం మీకు తెలుసు. ఇలాంటి వ్యాఖ్యలు అవాంఛనీయమైన ప్రతికూలతలకు దారితీస్తాయన్న విషయాన్ని మీరు అంగీకరిస్తారని అనుకుంటున్నాను" అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పోస్టును కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తాను హైదరాబాద్‌లో ఉంటున్నానని, దేశంలో ఈ నగరాన్ని మించిన సురక్షితమైన ప్రాంతం మరోటి ఉండదని రామకృష్ణ అనే వ్యక్తి ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు.
కొందరు నెటిజన్లు మాత్రం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వక్రీకరించిందని విమర్శించారు.
నన్ను కొట్టేందుకు 100 మంది వచ్చారు
"నేను తెలంగాణలో సభ పెడితే నన్ను కొట్టేందుకు దాదాపు ఒక 100 మంది జనంలో దూరిపోయారు. కానీ, మీరు కొడితే నేను చేతులు ముడుచుకొని అయ్యా.. బాబూ అనే వ్యక్తిని కాదమ్మా గుర్తుపెట్టుకోండి. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పెరిగినవాళ్లం, ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాం. అధర్మాన్ని ఎదిరించడానికి వచ్చాం. సత్యం మాట్లాడుతాం. తప్పుంటే సరిదిద్దుకుంటాం. తప్పు చేస్తే తోలు తీస్తాం. ప్రజాస్వామ్యంలో మా గొంతును నొక్కే హక్కు ఎవరికీ లేదు" అని పవన్ అన్నారు.

ఫొటో సోర్స్, fb/janasenaparty
అప్పుడు ప్రశంస, ఇప్పుడు విమర్శ
రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి, సామరస్యంగా జీవిస్తున్నారని గతంలో పవన్ కల్యాణ్ అన్నారు.
2018 మార్చి 4న హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రజలంతా సుఖశాంతులతో, సామరస్యంగా ఉంటున్నారని, అందుకు తెలంగాణ కేసీఆర్ సీఎం అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రశంసనీయమన్నారు.
"ప్రత్యేక పరిస్థితుల వల్ల విడిపోయాం కానీ, మన మధ్య మనస్ఫర్థలు లేవు. గొడవల్లేవు. దానికి ముఖ్య కారణం.. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ అందరూ సుఖశాంతులతో, సామరస్యంగా ఉండటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకెళ్లిన విధానం, వారు పోషించిన పాత్ర ఎంతో ప్రశంసనీయం. దీన్ని ఆంధ్రాప్రాంత ప్రజలు మరచిపోలేదు. అంతకంటే మరో అడుగు ముందుకేసి, ఏపీకి ప్రత్యేక హోదాకు మీరు(కేసీఆర్) మద్దతు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అని పవన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సిత్రాలు సూడరో: డీకే అరుణ, జయ సుధల.. కండువా మారింది, స్వరం మారింది
- నీరవ్ మోదీ: భారత్‌కు ఎలా రప్పిస్తారు? రూ.11,360 కోట్ల సంగతేంటి?
- 1996లో నల్లగొండ లోక్‌సభకు 480 మంది పోటీ
- ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...
- ఒంగోలు గిత్తల కథ: ఇక్కడ అరుదై పోయాయి.. బ్రెజిల్లో వెలిగిపోతున్నాయి
- టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా ఇదే
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








