డీకే అరుణ, జయసుధ: కండువా మారింది, స్వరం మారింది

డీకే అరుణ

ఫొటో సోర్స్, fb/BJP4Telangana

ఫొటో క్యాప్షన్, డీకే అరుణ బీజేపీలో చేరారు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో నాయకులు పెద్ద ఎత్తున పార్టీలు మారుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల్లో నేతల రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి.

తెలంగాణలో గత కొద్ది వారాల్లో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరగా, డీకే అరుణ బీజేపీ గూటికి చేరారు.

ఇలా పార్టీలు మారుతున్న నేతలు గతంలో ఏమన్నారు? పార్టీ కండువా మార్చిన తర్వాత ఏం చెబుతున్నారు?

డీకే అరుణ

2018 సెప్టెంబర్ 6న తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు కేసీఆర్ నిర్ణయం ప్రకటించిన తర్వాత డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ...

"బీజేపీ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకుని కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు వస్తాయని కేసీఆర్ అంటున్నారు, కానీ వాళ్లకు వందలో సున్నాలు తీసేస్తే, ఒక్క సీటు కూడా రాదు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది" అన్నారు.

డీకే అరుణ

ఫొటో సోర్స్, fb/DKAruna.TG

ఫొటో క్యాప్షన్, డీకే అరుణ ఫేస్‌బుక్ పేజీ కవర్ ఫొటో

2019 మార్చిలో

ఆమె తాజాగా బీజేపీలో చేరారు. అనంతరం, టీవీ9 ఛానల్‌తో ఆమె మాట్లాడుతూ...

"తెలంగాణలో ఉన్న కొందరు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారు. కాంగ్రెస్ ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయన్న ఆశలు పోయాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు బీజేపీ మాత్రమే సరైన ప్రత్యామ్నాయం. మోదీ మళ్లీ ప్రధాని కావాలి. ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా. కార్యకర్తలందర్నీ కలుపుకుని తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు వ్యూహాలు రూపొందిస్తా" అన్నారు.

జయసుధ

ఫొటో సోర్స్, fb/ysjagan

జయ సుధ

2016 జనవరిలో ఎన్టీఆర్ పార్టీ (టీడీపీ)లో చేరడం తనకు ఎంతో ఆనందంగా ఉందని జయసుధ అన్నారు.

"హైదరాబాద్ ఉన్నత స్థానానికి ఎదగడానికి కారణం చంద్రబాబే. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలందరికీ సేవ చేయాలన్న ఆలోచనతో ఇందులో చేరాను" అని జయసుధ చెప్పారు.

2019 మార్చిలో

"నన్ను ఎవరు రాజకీయాల్లో పరిచయం చేశారో, తిరిగి అదే వైఎస్సార్ కుటుంబ సభ్యురాలిగా నేను వైసీపీలో చేరాను. జగన్ ఎలా ఆదేశిస్తే దాని ప్రకారం పనిచేస్తా. ఈ ఎన్నికల్లో పార్టీ వంద శాతం గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. పార్టీని ఇంకా బలోపేతం చేసేందు ఇందులో చేరాను" అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)