కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు... అయినా 130కి పైగా దేశాలు చుట్టేశారు ఈయన

ఫొటో సోర్స్, The Travel Show, BBC News
"నేను అంటార్కిటికా సహా ప్రపంచంలోని ప్రతి ఖండాన్నీ సందర్శించాను. ప్రపంచంలోని దేశాలన్నీ చుట్టేసి రావడమే నా లక్ష్యం" అని టోనీ గైల్స్ అంటున్నారు.
ఆయనకు కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు. అయినా, దూర ప్రయాణాలు చేయాలన్న తపన ఆయనను 130కి పైగా దేశాలకు తీసుకెళ్లింది.
"మీరు ఇంతగా దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు అని కొందరు నాకు అంటుంటారు. కానీ, కళ్లు కనిపించకున్నా, చెవులు వినిపించకున్నా తమదైన దృష్టితో ప్రపంచాన్ని చూడవచ్చు అని నేను వారికి చెబుతున్నాను" అని ఇంగ్లాండ్‌కు చెందిన ఈ 41 ఏళ్ల టోనీ చెప్పారు.
ఇటీవల తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో పర్యటిస్తుండగా బీబీసీ ట్రావెల్ షో బృందం ఆయనతో ముచ్చటించింది.

ఫొటో సోర్స్, The Travel Show, BBC News
స్పర్శ ద్వారా అనుభూతి
"నా చుట్టూ ఉండేవారి మాటలు వింటాను. పర్వతాల మీదికి వెళ్తా, జాగ్రత్తగా దిగుతాను. నా చర్మం, కాళ్ళ ద్వారా అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తాను. నేను ఒక దేశాన్ని అలాగే చూస్తాను. తేడాలను గమనిస్తాను" అని ఆయన వివరించారు.
టోనీ గత 20 ఏళ్లుగా అనేక కొత్త ప్రదేశాలను సందర్శించారు.
ఒక పర్యటనలో ఆయన తన గ్రీకు గర్ల్‌ఫ్రెండ్‌ని కూడా కలుసుకున్నారు. ఆమెకు కూడా చూపు లేదు.
గత ఏడాది ఆమెతో కలిసి రష్యా వెళ్లారు. వైశాల్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యాను రైలులో చుట్టేశారు.
కానీ, చాలా ప్రయాణాలలో ఆయన ఒంటరిగానే వెళ్తారు.

ఫొటో సోర్స్, The Travel Show, BBC News
తండ్రి పెన్షన్ డబ్బులతో
ఈ ప్రయాణాల కోసం ఆయన తండ్రి పెన్షన్ డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా చాలా ముందుగానే ప్లాన్ చేస్తారు.
విమానం టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఆయన తల్లి సాయపడతారు. ఎందుకంటే, చాలా ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్లలో చూపులేనివారు సొంతంగా టికెట్లు బుక్ చసుకునే వెసులుబాటు లేదని ఆయన అంటున్నారు.
తను వెళ్లాలనుకుంటున్న ప్రదేశంలో తనలాంటి వారికి సాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా? అని తెలుసుకుంటారు. కొన్ని వెబ్‌సైట్ల ద్వారా వారిని సంప్రదిస్తూ ఉంటారు.
"నేను ఎప్పుడంటే అప్పుడు ఏదో ఒక ప్రదేశానికి వెళ్లలేను. వెళ్లే ప్రదేశం గురించి ముందే బాగా తెలుసుకోవాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్న విషయాలు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడు వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అని ప్రణాళిక వేసుకుంటాను' అని ఆయన చెప్పారు.
తాను గతంలో ఎప్పుడూ వెళ్లని కొత్త నగరాలలో దారులను వెతుక్కోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఆయన అంటున్నారు.
"కొన్నిసార్లు, ఎవరిని కలవబోతున్నానో, ఏం జరగబోతుందో నాకు తెలియదు. నాకు అదొక సాహసం లాంటిది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, The Travel Show, BBC News
చిన్నప్పుడే చూపు పోయింది
ఆయనకు దృష్టి లోపం ఉన్నట్లు 9 ఏళ్ల వయసులో తెలిసింది. మరో ఏడాదిలో చూపు పూర్తిగా పోయింది.
చిన్నప్పటి నుంచే చెవులు సరిగా వినిపించేవి కాదు. కొన్నాళ్లకు ఆ సమస్య మరింత ఎక్కువైంది. ప్రస్తుతం ఆయన అత్యంత శక్తివంతమైన డిజిటల్ వినికిడి పరికరాలను ఉపయోగిస్తున్నారు. అయినా అన్ని శబ్దాలను వినలేకపోతున్నారు.
ఓ ప్రత్యేక పాఠశాలలో ఆయన చదువుకున్నారు. చదువుకునే సమయంలోనే ఆయనకు విదేశీ ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. స్కూల్ ట్రిప్‌లో భాగంగా 16 ఏళ్ల వయసులో ఆయన బోస్టన్ వెళ్లారు.
ప్రపంచాన్ని చుట్టేయాలన్న ఆ కుతూహలానికి అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు ఆటంకం కలిగిస్తున్నాయి. 2008లో ఆయన మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆయన మారు తండ్రి ఆ మూత్రపిండాన్ని దానం చేశారు.
మద్యానికి బానిస
ఆయన 15 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయారు. మరో ఏడాదికి అతని ప్రాణ స్నేహితుడు కూడా మరణించారు.
"ఆ బాధ నుంచి బయటపడేందుకు ఆరేడు ఏళ్లపాటు మద్యానికి బానిస అయ్యాను. 24 ఏళ్ల వయస్సులో మద్యం కాస్త తగ్గించాను" అని గైల్స్ గుర్తు చేసుకున్నారు.
"మా నాన్న వాణిజ్య నౌకాదళంలో పనిచేశారు. దూర ప్రయాణాలు చేయడం గురించి మా నాన్న చెప్పిన విషయాలు నాలో కుతూహలాన్ని పెంచాయి" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, The Travel Show, BBC News
మధ్యలో తప్పుకోవద్దు
2000 మార్చిలో అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ పర్యటనతో ఆయన ఈ సుదీర్ఘ సాహస యాత్ర ప్రారంభమైంది.
"అప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. ప్రయాణం ప్రారంభించే ముందు కాసేపు అలా నిలబడిపోయాను. రెండుసార్లు గట్టిగా ఊపిరి తీసుకున్నాను. ఏది ఏమైనా సరే, వెనక్కి తిరగకూడదని నిర్ణయించుకున్నాను. ఆ ప్రయాణంలోనే అమెరికాలోని అన్ని రాష్ట్రాలను చుట్టేసి వచ్చాను" అని ఆయన తన మొదటి పర్యటన గురించి గుర్తు చేసుకున్నారు.
ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వెనక్కి వెళ్లకూడదన్న ఆలోచనతో తాను ఆ ప్రయాణాన్ని ఆపలేదని ఆయన అంటున్నారు.
క్రొత్త ప్రదేశాలకు వెళ్లడం వల్ల తనకు భావోద్వేగపూరితమైన ఉత్సాహం లభిస్తుందని ఆయన చెబుతున్నారు.
"నా ప్రయాణంలో అనేక మందిని కలుస్తుంటాను. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. నాకు కళ్లు కనిపించనందు వల్ల సాయం చేసేందుకు వాళ్లు రావట్లేదు, నా మంచితనం వల్లే వాళ్లు వస్తున్నారని అనుకుంటాను" అని ఆయన చెప్పారు.
టోనీ గైల్స్ చాలావరకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాలు చేస్తుంటారు. ప్రజా రావాణాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఫొటో సోర్స్, The Travel Show, BBC News
"గరుకుగా ఉండే ప్రదేశాలు నాకు అనుకూలంగా ఉంటాయి. అందుకే వస్తువులను తాకే వెసులుబాటు ఉన్న ప్రదర్శన కేంద్రాలకు వెళ్తుంటాను" అని ఆయన చెప్పారు.
ఇథియోపియాలోని అడిస్‌లో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వెళ్లారు. అక్కడ ప్రదర్శనకు ఉంచిన వస్తువులను తాకేందుకు నిర్వాహకులు ఆయనకు అనుమతి ఇచ్చారు.
కొన్నిసార్లు వ్యక్తిగత గైడ్‌లను నియమించుకుంటారు. కొన్నిసార్లు గైడ్ లేకున్నా స్వయంగా ఎలాంటి భయం లేకుండా తిరుగుతారు. అవసరమైనప్పుడు ఇతరుల సాయం అడుగుతారు.
కొంతమంది తనను వారి ఇంటికి తీసుకెళ్లడంతో పాటు, తన ప్రయాణానికి కూడా సహాయం చేశారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, The Travel Show, BBC News
అపరిచితులపై నమ్మకం
ఏటీఎం నుంచి నగదు తీసుకోవడం, వివిధ దేశాల కరెన్సీ నోట్లను లెక్కించడం ఆయనకు అతిపెద్ద సవాలు.
"డబ్బులు లెక్కించడం ఇబ్బందిగా ఉంటుంది. దాంతో, ముందుగా ఎవరితోనైనా కాసేపు మాట్లాడి, వారి గురించి ఒక అంచనాకు వస్తాను. వారు నన్ను మోసం చేయరన్న నమ్మకం కలిగితే సాయం అడుగుతుంటాను" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, The Travel Show, BBC News
పర్యటనల్లో వేర్వేరు సంగీత వాయిద్యాలను వాయించేందుకు ప్రయత్నిస్తారు.
"నాకు బాగా ఇష్టమైన వాటిలో సంగీతం ఒకటి. అందుకే అవకాశం వచ్చినప్పుడు సంగీత వాయిద్యాలను వాయిస్తుంటాను. అది నాకు ఎంతో అనుభూతిని ఇస్తుంది. ఎక్కడికి వెళ్లినా అక్కడ బాగా ప్రాచుర్యం పొందిన రకరకాల వంటకాలను రుచి చూడటం కూడా నాకు ఇష్టం" అని ఆయన చెప్పారు.
మరో విశేషం ఏమిటంటే... టోనీ ఒక వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. అందులో తన పర్యటనల విశేషాలను, ఫొటోలను పెడుతుంటారు.
ఇవి కూడా చదవండి:
- గోదావరి పడవ ప్రమాదాలు: ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటి? ఫలితాలేమైనా ఉన్నాయా?
- అబ్ఖాజియా: ఇదో అజ్ఞాత దేశం.. దీనిని భారత్ ఇప్పటికీ గుర్తించలేదు
- అమర్నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక
- వంతెన మెట్లపై కాఫీ చేస్తున్న పర్యటకులకు రూ.73 వేల జరిమానా
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- షార్క్‌లు మనుషులపై ఎందుకు దాడులు చేస్తాయంటే...
- హూస్టన్‌లో మోదీ సభా ప్రాంగణం ఎదుట ఆర్టికల్ 370 సవరణకు వ్యతిరేకంగా నిరసనలు
- పాకిస్తాన్ నుంచి పారిపోయిన గులాలాయీ ఎవరు, ఆమె ఎందుకు అమెరికా చేరారు
- సౌదీలో డ్రోన్ దాడులు: అమెరికా చమురును భూగర్భంలో ఎందుకు దాచిపెడుతోంది?
- మహాత్మా గాంధీ మతం ఏమిటి? గాంధీ దృష్టిలో దేవుడు ఎవరు?
- భారత్, అమెరికా ప్రజలను తీవ్రవాదుల నుంచి కాపాడుకుంటాం - ట్రంప్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








