వెనిస్‌లో వంతెన మెట్లపై కాఫీ చేస్తున్న పర్యటకులకు రూ.73 వేల జరిమానా

పర్యాటకులు

ఫొటో సోర్స్, COMUNE VENEZIA

ఇటలీలోని ప్రఖ్యాత పర్యటక నగరం వెనిస్‌లో పురాతన వారధి రియాల్టో బ్రిడ్జి మెట్లపై ట్రావెల్ కుకర్‌తో కాఫీ చేస్తున్న ఇద్దరు జర్మనీ పర్యటకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి 950 యూరోలు అంటే సుమారు రూ.73,500 జరిమానా విధించారు. వెనిస్ వీడి వెళ్లాలని వీరికి నిర్దేశించారు.

జర్మనీ రాజధాని బెర్లిన్‌కు చెందిన ఈ ఇద్దరు పర్యటకుల్లో ఒకరి వయసు 32 ఏళ్లు, మరొకరి వయసు 35.

వెనిస్

ఫొటో సోర్స్, Getty Images

వెనిస్‌లో గ్రాండ్ కెనాల్‌పై ఉన్న అత్యంత పురాతనమైన నాలుగు వంతెనల్లో రియాల్టో బ్రిడ్జి ఒకటి.

దీని మెట్లపై ఈ ఇద్దరు పర్యటకులు కాఫీ చేసుకొంటుండగా ఆ మార్గంలో వెళ్తున్న ఒక వ్యక్తి చూసి పోలీసులకు సమాచారమిచ్చారు.

వెనిస్‌ను ఏటా దాదాపు మూడు కోట్ల మంది సందర్శిస్తారు.

వెనిస్

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని స్థలాల్లో పిక్నిక్ జరుపుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో చొక్కా ధరించకపోవడం లాంటి చర్యలను నేరాలుగా పరిగణిస్తూ వెనిస్ గతంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది.

వెనిస్ మేయర్ లూగీ బ్రుగ్నారో మాట్లాడుతూ- వెనిస్‌కు వచ్చేవారు నగరాన్ని గౌరవించాల్సిందేనని చెప్పారు. ఇక్కడికి వచ్చి ఇష్టమొచ్చినట్లు చేద్దామనుకొనే, పద్ధతితెలియని వ్యక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు పర్యటకుల విషయంలో పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

వెనిస్

ఫొటో సోర్స్, Getty Images

వెనిస్‌కు పర్యటకులు పోటెత్తుతుండటంపై స్థానిక ప్రజలు చాలా కాలంగా అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు. పర్యటకుల తాకిడితో వెనిస్ స్వభావం దెబ్బతింటోందని వారు వాపోతున్నారు.

ఈ క్రమంలో వెనిస్‌లో స్వల్ప కాలం ఉండే పర్యటకుల నుంచి దాదాపు పది యూరోల (దాదాపు రూ.770 ) వరకు ప్రవేశ రుసుము వసూలు చేసేందుకు అధికార యంత్రాంగానికి గత ఏడాది డిసెంబరులో అనుమతి లభించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)