ఇటలీ వలసలు: సముద్రంలో సాయంపై ఎన్నో ప్రశ్నలు

బోటులో వలసలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రియాలిటీ చెక్ టీమ్
    • హోదా, బీబీసీ న్యూస్

దాదాపు 600 మందికి పైగా వలసదారులతో వచ్చిన సహాయ నౌక ఆక్వేరియస్‌ను తమ తీరానికి రావటానికి తిరస్కరించిన ఇటలీపై మానవతా వాదం ప్రాతిపదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి.

అంతర్జాతీయ నిబంధనలను ఇటలీ ఉల్లంఘించిందని మాల్టా ప్రధానమంత్రి జోసెఫ్ ముస్కాట్ ఆరోపించారు. ఆక్వేరియస్ దుస్థితి.. ఇటలీ - ఫ్రాన్స్‌ల మధ్య దౌత్య వివాదానికి దారితీసింది.

ప్రాణాలను రక్షించటం ఒక బాధ్యత అయినప్పటికీ.. ‘‘ఇటలీని ఓ పెద్ద శరణార్థి శిబిరంగా మార్చటం బాధ్యత కాదు’’ అని ఇటలీ అంతర్గత వ్యవహారాల మంత్రి, మితవాది మట్టో సాల్విని వ్యాఖ్యానించారు.

దీంతో ఆ నౌకను స్పెయిన్‌కు మళ్లించారు.

మరి వలసదారులతో సముద్రంలో ప్రయాణించే నౌకల విషయంలో చట్టబద్ధమైన బాధ్యత ఎవరిది?

ఆక్వేరియస్ నౌక

ఫొటో సోర్స్, Getty Images

యూరప్ పరిష్కారం లేదు...

వలసదారులు యూరోపియన్ యూనియన్‌లో తాము చేరుకున్న మొదటి దేశంలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనల ఫలితంగా.. వలసల ప్రవాహాన్ని ఎలా నిర్వహించాలనే అంశం మీద యూరప్ దేశాల మధ్య వాద ప్రతివాదనలు కొన్నేళ్లుగా కొనసాగాయి.

ఈ నిబంధన వల్ల.. సముద్ర మార్గంలో వచ్చే వారి భారీ బాధ్యతను తామే మోయాల్సి వస్తుందని ఇటలీ, గ్రీస్ దేశాలు అంటున్నాయి.

ఈయూ బోర్డర్ అండ్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీ ఫ్రాంటెక్స్ ప్రధాన విధి.. సరిహద్దు మీద నిఘా, భద్రత అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీకి చెప్పారు.

అయితే.. ఫ్రాంటెక్స్ నిర్వహించే నౌక ఏదైనా ఒక సంఘటన పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే.. ఆ నౌక తాను రక్షించిన వారిని అత్యంత సమీపంలోని ఈయూ రేవుకు తీసుకెళుతుందని ఆమె వివరించారు.

ఆక్వేరియస్ నౌకలోని వలసదారులను.. ఫ్రాంటెక్స్ సాధారణ కార్యకలాపాల ప్రాంతానికి వెలుపల రక్షించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

నౌకలో శరణార్థులు

ఫొటో సోర్స్, Getty Images

వలసదారులతో ప్రయాణించే నౌకల విషయంలో ఈయూ సభ్య దేశాల చట్టపరమైన బాధ్యతల వివరాల గురించి ఈయూ కమిషన్‌ను బీబీసీ సంప్రదించగా.. ప్రస్తుతమున్న అంతర్జాతీయ సముద్ర ప్రాంత ఒడంబడికలు, చట్టాలే వర్తిస్తాయని ఆ కమిషన్ పేర్కొంది.

వాటిలో.. సముద్రంలో ప్రాణాలకు భద్రత మీద 1974 ఒడంబడిక కూడా ఉంది. సముద్రంలో మనుషులు ఆపదలో ఉన్నట్లు తెలుసుకున్న ఏ నౌక అయినా ‘‘వారికి సాయం చేయటానికి పూర్తి వేగంతో వెళ్లాలి’’ అని అది నిర్దేశిస్తోంది.

ఆపైన.. తన జెండాతో ప్రయాణించే నౌక ఉన్న ప్రతి దేశమూ.. సముద్రంలో ఆపదలో ఉన్న వారిని రక్షించాల్సి ఉంటుందని సముద్ర చట్టం మీద 1982 ఐక్యరాజ్యసమితి ఒడంబడిక చెప్తోంది.

సముద్రంలో రక్షణ చర్యల వెనుక గల మార్గదర్శకాలను రూపొందించటానికి దోహదపడిన ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ప్రకారం.. సముద్రంలో రక్షించిన వ్యక్తులను సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతంలో దించాల్సిన బాధ్యత ఆ సంస్థ సభ్య దేశాలకు ఉంది.

నౌకలో శరణార్థులు

ఫొటో సోర్స్, EPA

నిర్వచనాల సమస్య

కానీ.. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి. ఆపద అనేదానిని అతిగా నిర్వచించటం వాటిలో ఒకటని యూరోపియన్ మైగ్రేషన్ లా వెబ్‌సైట్ ఎడిటర్ యెస్ పాస్కో చెప్పారు. ఈయూ అంతటా ఆశ్రయం, వలస చట్టాల మీద ఈ వెబ్‌సైట్ సలహాలు అందిస్తుంది.

‘‘ఇది నిర్వచనం గురించిన సమస్య’’ అని ఆయన అన్నారు. ఆక్వేరియస్ నౌక మాల్టా, ఇటలీ జలాల దిశగా పయనించినపుడు.. యాంత్రిక కష్టాల్లో లేదు. ‘‘ఆ నౌక పరిస్థితి ఆపద నిర్వచనానికి అనుగుణంగా ఉందని వారు (ఇటలీ, మాల్టా) భావించలేదు’’ అని ఆయన చెప్పారు.

నౌకలోని వారికి మాల్టా అధికారులు ఆహారం, నీరు అందించారు. అయితే.. ఆ నౌకలో 120 మందికి పైగా చిన్నారులు తమ తల్లిదండ్రులు/సంరక్షుకులు ఎవరూ తోడు లేకుండా ప్రయాణిస్తున్నారని, ఏడుగురు గర్భిణిలు కూడా ఉన్నారని సమాచారం.

చాలా మంది ఆరుబయటే నిద్రపోతున్నారని.. వాతావరణ దుష్ప్రభావాలకు గురవుతున్నారని నౌకలో ఉన్న ఒక జర్నలిస్టు చెప్పారు.

ఆ నౌకను నిర్వహిస్తున్న ఎన్‌జీఓలు.. ఇటలీలో ఆ నౌక తీరం చేరడానికి అనుమతించకపోవటం, నౌకలో ఉన్న వారు స్పెయిన్ చేరుకోవటం కోసం మరిన్ని రోజులు సముద్రంలో గడిపేలా చేయటం.. వారిని మరిన్ని కష్టాలకు గురిచేస్తుందని వాదిస్తున్నాయి.

నౌకలో శరణార్థులు

ఫొటో సోర్స్, Getty Images

చట్టాల్లో లొసుగులు

సురక్షితమైన ప్రాంతం అంటే ఏమిటి? రక్షించిన వారిని సముద్రం మీద దించాలా? లేక నేల మీద దించాలా? అనే అంశాల మీద కూడా సమస్యలున్నాయి.

‘‘ఒక నిర్దిష్ట గాలింపు, రక్షణ ప్రాంతానికి సంబంధించిన ఒక దేశానికి, లేదా ఒక రక్షణ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్న దేశానికి.. అలా రక్షించిన వారిని తమ భూభాగంపైకి స్వీకరించాలనే తప్పనిసరి బాధ్యత లేదు’’ అని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యారీటైమ్ లా ప్రొఫెసర్ అయిన్‌హో కాంపాస్ వెలాస్కో చెప్తారు.

అయినా.. గాలింపు, రక్షణ చర్యల్లో మానవతా దృక్పథం కూడా భాగం కావాలన్న ఉద్దేశాన్ని ఆమె ప్రస్తావించారు.

డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్, ఎస్ఓఎస్ మెడిటరేనీ అనే స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆక్వేరియస్.. లిబియా తీరంలో వలసలను రక్షించినపుడు ఇటలీ ఆ రక్షణ చర్యలను సమన్వయం చేస్తున్నట్లు తెలుస్తోందని ఆమె చెప్పారు.

ఎన్‌జీఓ నిర్వహించే నౌకలు.. వలసలను తమ దేశానికి తీసుకురావటానికి తాను ఒప్పుకోనని ఇటలీ స్పష్టం చేసింది. అయితే.. ఇంతకుముందు లిబియా తీరంలో 900 మందిని రక్షించిన తన సొంత తీరగస్తీ నౌకను తన రేవుకు రావటానికి ఇటలీ అంగీకరించింది.

సముద్ర ప్రాంత నిబంధనల ప్రకారం.. నౌకలు తమ ప్రాదేశిక సముద్ర జలాలలోకి ప్రవేశించటానికి అనుమతించటానికి కానీ తిరస్కరించటానికి కానీ దేశాలకు అధికారం ఉందన్న విషయం కూడా గమనార్హం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)