డార్జీలింగ్ టీ పొడి: కిలో లక్షా 30 వేలు.. ఈ తేయాకును పౌర్ణమి వెలుగులోనే కోస్తారు

ఫొటో సోర్స్, Arindam Mukherjee
- రచయిత, కల్పనా ప్రధాన్
- హోదా, బీబీసీ కోసం
డార్జిలింగ్ టీ... దీనిని ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ టీకి విశేష ఆదరణ ఉంటుంది.
పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ కొండల్లో ఎటు చూసినా వేలాది ఎకరాల్లో తేయాకు తోటలే కనువిందు చేస్తాయి. ఇక్కడ ఉన్న 87 టీ ఎస్టేట్లలో విభిన్న రుచుల తేనీటిని అందించడంలో దేనికదే సాటి. అందులోనూ ఒక అత్యంత అరుదైన టీ ఉంది. అది భారత దేశంలోనే అత్యంత ఖరీదైన టీ.
డార్జిలింగ్ పట్టణానికి దక్షిణం వైపున సాహసం చేసి ఓ 30 కిలోమీటర్ల దూరం వెళ్తే ఒక పురాతన టీ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన తేయాకు పరిశ్రమల్లో ఇదొకటి. ఇక్కడ అత్యంత అరుదైన టీ దొరుకుతుంది.
'సిల్వర్ టిప్స్ ఇంపీరియల్'గా పేరున్న ఈ తేయాకును మకైబరి ఎస్టేట్‌లో అనుభవజ్ఞులైన కూలీలు మాత్రమే కోస్తారు. పౌర్ణమి వెలుగుల్లో మాత్రమే కోస్తారు.
భారత్‌లో ఉత్పత్తయ్యే తేయాకులో అత్యంత ఖరీదైనది ఇదే. 2014లో కిలో దాదాపు లక్షా 30 వేల రూపాయలు పలికిందంటే దీని ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
చాలా ప్రత్యేకం
మకైబరి తేయాకు ఎస్టేట్‌ను 1859లో ఏర్పాటు చేశారు. డార్జిలింగ్ ప్రాంతంలో అత్యంత పురాతనమైనదిగా, ప్రపంచంలో మొట్టమొదటి బయోడైనమిక్ (నైతికతతో కూడిన పర్యావరణ హిత సాగు) తేయాకు తోటగా దీనికి పేరుంది.
సాధారణంగా పంటలు ఎప్పుడు కోయాలన్నది నిర్ణయించేందుకు మట్టి, నేల, మొక్కల తీరును పరిశీలిస్తారు. మకైబరి ఎస్టేట్ వాళ్లు మాత్రం గ్రహాల కదికలను కూడా చూస్తారు. మార్చి నుంచి అక్టోబర్ వరకు గ్రహాల గమనం, ఖగోళ క్యాలెండర్‌కు అనుగుణంగా తేయాకును ఎప్పుడు కోయాలన్నది నిర్ణయిస్తారు.

ఫొటో సోర్స్, BBC/others
వేడుకలా తేయాకు కోతలు
మార్చి ద్వితీయార్ధం నుంచి మే వరకు వచ్చే మొదటి పౌర్ణమి నాడు, సముద్రాలలో ఆటుపోట్లు అధికంగా ఉన్నప్పుడు, మొక్కలలో నీటి పరిమాణం తగ్గుతుంది. ఆ రోజు గాలిలో ఆక్సిజన్, శక్తి అధికంగా ఉండటం వల్ల మృదువైన, సున్నితమైన, రుచికరమైన తేయాకు లభిస్తుందని మకైబరి నిర్వాహకులు నమ్ముతారు.
ఆ రోజు సాయంత్రం అవుతుండగానే ఈ ఎస్టేట్‌లో కోతలకు కూలీలంతా సిద్ధమవుతారు. సూర్యుడు అస్తమించాక పున్నమి వెలుగుల్లో ఒక ఉత్సవంలా అంతా కలిసి కోతలు మొదలుపెడతారు.
మార్చి నుంచి అక్టోబర్ వరకు తేయాకు కోతల సీజన్ ఉంటుంది. ఈ సీజన్‌లో నాలుగైదు సార్లు మాత్రమే ఈ ఎస్టేట్‌లో తేయాకు కోతలు జరుగుతాయి.

ఫొటో సోర్స్, Arindam Mukherjee
ప్రతి కోతకు ముందూ వందలాది కూలీలు బెంగాలీ సంప్రదాయ దుస్తుల్లో, సంధ్యా సమయంలోనే ఎస్టేట్ వద్దకు చేరుకుంటారు.
పురుషులు డ్రమ్స్ వాయిస్తుంటే, మహిళలు ప్రార్థనలు చేస్తారు. రాత్రి 8 గంటల తరువాత చంద్రుడు వెలుగులు చిమ్ముతుంటే, 80 నుంచి 100 మంది ప్రత్యేకంగా శిక్షణ పొందిన కూలీలు తేయాకు కోస్తారు. పాటలు పాడుతూ ఉత్సాహంగా పనిచేస్తారు.
అటువైపు చిరుత పులులు రాకుండా చూసేందుకు కొందరు చుట్టూ కాపలా కాస్తూ, జంతువుల కొవ్వుతో కాగడాలు వెలిగిస్తారు.
సూర్యరశ్మి తాకితే టీ సువాసన, ప్రత్యేక గుణాలు తగ్గిపోతాయని అంటారు. అందుకే, అర్ధరాత్రికల్లా కోతలు పూర్తి చేస్తారు. తెల్లవారేలోగానే ఆ తేయాకును ప్రాసెస్ చేస్తారు.
200 కిలోల ఆకులను కోస్తే, అందులో 50 కిలోల శుద్ధి చేసిన (ప్రాసెస్డ్) సిల్వర్ టిప్స్ ఇంపీరియల్ టీ వస్తుంది. మార్చి ద్వితీయార్ధం నుంచి మే వరకు కోసే తేయాకుకు వ్యాపారులు అధిక ధర చెల్లిస్తారు. ఆ మధ్య కాలంలో కోసే ఆకులు చాలా మృదువుగా, అధిక సువాసన కలిగి ఉంటాయని చెబుతుంటారు.

ఫొటో సోర్స్, Arindam Mukherjee
బ్రిటన్ రాణికి బహుమతిగా
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ టీకి అమెరికా, బ్రిటన్, జపాన్ లాంటి దేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. 2015లో బ్రిటన్ రాణికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ తేయాకును బహుమతిగా ఇచ్చారు. 2014 ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ వద్ద కూడా ఈ టీని ప్రత్యేకంగా అమ్మారు.
డార్జీలింగ్‌లో మరికొన్ని ఏస్టేట్స్‌లో కూడా కొద్ది మొత్తంలో సిల్వర్ టిప్స్ ఇంపీరియల్ టీని ఉత్పత్తి చేస్తున్నాయి. మకైబరి ఎస్టేట్స్ మాత్రం పూర్తిస్థాయిలో ఈ టీని మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. అంటే, ఈ ఎస్టేట్‌లో కోతలన్నీ కేవలం పౌర్ణమి రోజే జరుగుతాయి.
భారత్‌లో బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లని అతికొద్ది తేయాకు తోటల్లో ఇదొకటి.
డార్జీలింగ్ కొండల్లో 159 ఏళ్ల క్రితం జీసీ బెనర్జీ ఈ తేయాకు పరిశ్రమను నెలకొల్పారు. ఇప్పుడు దానికి ఆయన మునిమనుమడు రాజాహ్ బెనర్జీ చూస్తున్నారు. నాణ్యత, ప్రత్యేకతల విషయంలో ఎప్పుడూ తాము 'రాజీపడలేదు, రాజీపడబోము' అని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, AFP
భూమి కోతను తగ్గించారు
అత్యంత ఏటవాలుగా ఉండే ఈ ప్రాంతంలో జూన్ -సెప్టెంబర్ మధ్య కాలంలో పడే వర్షాలకు మట్టి కోతకు గురయ్యేది.
అలాగే కొనసాగితే కొంతకాలం తర్వాత తేయాకు తోటలకు ఆ భూమి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని గ్రహించిన యజమాని, తోటలో భూమి కోతను నిరోధించేందుకు చర్యలు చేపట్టారు.
తేయాకు మొక్కల మధ్యలోనే ఇతర మొక్కలను నాటారు. దాంతో, మట్టి కోత తగ్గింది. ప్రస్తుతం 668 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ మకైబరి ఎస్టేట్‌లో తేయాకు మొక్కలు 33 శాతం మాత్రమే ఉన్నాయి, మిగతా 67 శాతం ఇతర మెక్కలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- మనసు కశ్మీర్లో.. మనుగడ లేహ్‌లో
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో నిరుద్యోగం మరింత పెరుగుతుందా
- "ఇంటి నుంచి ఆస్పత్రికి రాలేం.. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లలేం"
- "కశ్మీర్ పరిస్థితి ఏ రాష్ట్రానికైనా రావొచ్చు.. కేంద్రం చర్యకు ప్రతిఘటన కొరవడటం ఆందోళనకరం"
- పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే 'పీవోకే'పైనే: రాజ్‌నాథ్ సింగ్
- కేరళ వరదలు: ‘హత్తుకొని పడుకునే వారు.. హత్తుకొనే ప్రాణాలొదిలారు’
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
- గుండెజబ్బు నివారణకు నాలుగు ఔషధాలున్న ఒకే మాత్ర
- అంబేడ్కర్ హౌస్: ఇద్దరు వ్యక్తుల ఫిర్యాదుతో లండన్‌లోని అంబేడ్కర్ ‘మ్యూజియం’... భవిష్యత్ ప్రశ్నార్థకం
- ఈ దేశాలు రాజధాని నగరాలను ఎందుకు మార్చాయి?
- ఆసియాలోనూ సైనిక సూపర్ పవర్ అమెరికానేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








