రఫేల్ ఒప్పందం: ఎందుకీ వివాదం... అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, DASSAULT RAFALE
36 రఫేల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒక నివేదికను కాగ్... రాజ్యసభలో ప్రవేశపెట్టింది.
అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కంటే 2.86 శాతం తక్కువ మొత్తానికి రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందం జరిగిందని ఈ నివేదికలో తెలిపారు. ఫిబ్రవరి 11న దానిని రాష్ట్రపతి, ప్రభుత్వం ముందు ఉంచామని, పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అనుమతి పొందామని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, ప్రధాని నరేంద్ర మోడీ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించడంతో ఈ మల్టీ బిలియన్ డాలర్ల ఒప్పందం వివాదాస్పదమైంది.
బీజేపీ ప్రభుత్వం ఈ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలూ జరగలేదని చెప్పింది.

ఫొటో సోర్స్, BARCROFT MEDIA
అసలు రఫేల్ డీల్ ఏంటి?
2015 ఏప్రిల్‌లో ఫ్రాన్స్ విమాన తయారీ సంస్థ డసో ఏవియేషన్ తయారు చేసిన రఫేల్ ఫైటర్ జెట్లను భారత్ కొనుగోలు చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు.
2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమెరికా, రష్యా, యూరప్ నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో రపేల్ జెట్ విమానాలను ఎంచుకుంది.
అయితే, 2016లో బీజేపీ ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 రఫేల్ విమానాలను కొనాలని నిర్ణయించింది. రెండు దేశాలు దీనికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు కూడా చేశాయి.
ఈ ఒప్పందంలో భాగంగా ఈ కొనుగోలు జరగాలంటే విమానాలు అమ్మే విదేశీ సంస్థ తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఆ దేశంలో పెట్టుబడి పెట్టాలనే 'అఫ్‌సెట్ క్లాస్' షరతు ఉంది. దానికి అంగీకరించిన డసో 8.7 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులో 50 శాతం మొత్తాన్ని భారత వ్యాపార వేత్త అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌లో జరిగే జెట్ విడిభాగాల తయారీ కోసం పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇది వార్త ఎందుకైంది?
రఫేల్ డీల్, విమానాల ధర గురించి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని 2017 నవంబర్‌లో కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఒప్పందంలోని ధర కంటే ఒక్కో విమానానికి మూడు రెట్లు అధికంగా చెల్లిస్తోందని విమర్శించింది.
ఒప్పందంలోని 'అఫ్‌సెట్ క్లాజ్' ప్రకారం డసోకు భారత భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను ఎంపిక చేయడం అక్రమం అని ఆరోపించింది. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చడానికే ఇలా చేశారని విమర్శించింది.
రఫేల్ డీల్ వివరాలను బహిరంగపరచాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2018 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె. "భారత ప్రభుత్వమే రఫేల్ డీల్ కోసం రిలయన్స్ డిఫెన్స్ పేరును సూచించిందని, ఆ విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని" చెప్పడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.
అయితే, భారత రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఈ నిర్ణయం వెనుక భారత, ఫ్రాన్స్ ప్రభుత్వాల ప్రభావం లేదని, తమ భారత భాగస్వామ్య కంపెనీని ఎంచుకునే స్వేచ్ఛ డసోకు ఉందని చెప్పింది.
అంతేకాదు, ఈ ఒప్పందం సమాచారం ఇవ్వడం జాతీయ భద్రతకే ప్రమాదంగా భావించిన ప్రభుత్వం దాని వివరాలు కూడా వెల్లడించలేదు.
దాంతో, ఈ ఒప్పందంపై కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
కానీ, 2018 డిసెంబర్ 14న కోర్ట్ ఈ పిటిషన్లను కొట్టివేసింది. మోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
వాటాదారులెవరు?
2015లో ఈ ఒప్పందంపై సంతకాలు చేశాక, దీనిపై ఎన్నోసార్లు చర్చలు జరిపిన మోదీ ప్రభుత్వం ఈ ఒప్పందంలో పారదర్శకత ఉందని సమర్థించుకుంది.
రాజ్యసభలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన వెంటనే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సత్యమేవ జయతే- సత్యం జయిస్తుంది. రఫేల్‌పై కాగ్ రిపోర్ట్ నిజం సాధించిన విజయం అన్నారు.
మరోవైపు విపక్షాలకు నేతృత్వం వహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఒప్పందంలో పారదర్శకత కొరవడిందని ఆరోపించారు.
ఇటు డసో-రియలన్స్ జాయింట్ వెంచర్ ద్వారా భారత వైమానిక దళానికి రఫేల్ జెట్లు అందించడానికి తాము నిబద్ధతతో ఉన్నట్టు డసో ఏవియేషన్ పునరుద్ఘాటించింది.
రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ కూడా తమను ఈ ఒప్పదంలో భారత భాగస్వామిగా ఎంపిక చేయడం అక్రమం అంటూ వస్తున్న వార్తలను ఖండిస్తోంది.

స్పందన ఏంటి?
ఈ అంశంలో మీడియా స్పష్టత కోరుకుంటోంది. పారదర్శకత వల్ల మాత్రమే ఈ ఒప్పందంపై ఉన్న సందేహాలు పటాపంచలు అవుతాయని భావిస్తోంది.
ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక ‘ద హిందూ’ ఫిబ్రవరి 9న ప్రచురించిన ఒక ఎడిటోరియల్‌లో ప్రభుత్వానికి దీనిపై ప్రశ్నలు సంధించింది. "ఒప్పందం వివరాలలో అనిశ్చితి ఉన్నప్పుడు, విపక్షాలకు వ్యక్తిగతంగా సమాచారం అందించి సర్దుకుపోకుండా, ఈ ఒప్పందంపై దర్యాప్తునకు అనుమతించకుండా కూడా ఎందుకు అనుమతించరో అర్థం కావడం లేదని అంది.
అలా చేయకపోతే, "సాధారణంగా అందరూ అందులో ఏదో దాస్తున్నారనే ఊహిస్తారు" అని ఎడిటోరియల్‌లో చెప్పారు.
"రఫేల్ డీల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను బలోపేతం చేయడానికా, లేక ఇబ్బందుల్లో ఉన్న పారిశ్రామిక వేత్తను బలోపేతం చేయడానికా.. మోదీ సమాధానం చెప్పాలని" ఫిబ్రవరి 9న శివసేన కూడా డిమాండ్ చేసింది.
భారత్, ఫ్రాన్స్ మధ్య రఫేల్ ఒప్పందం గురించి చర్చలు జరిగిన సమయంలో ప్రధానమంత్రి కార్యాలయం సమాంతర చర్చలు నిర్వహించడంపై రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిందని హిందూ ప్రచురించిన తర్వాత రోజే శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాతేం జరుగుతుంది?
యుద్ధ విమానాల ధర అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా తక్కువగా ఉందని ఇప్పుడు కాగ్ నివేదిక పేర్కొనడం, దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.
ఇంతకుముందు, ఒప్పందం ధరల వివరాలు ఇవ్వకపోవడం కాంగ్రెస్‌కు ఏప్రిల్ లేదా మేలో జరిగే సాధారణ ఎన్నికల సమయంలో ప్రధాన ఎన్నికల అంశంగా మారి ఉండేది.
ఫిబ్రవరి 11న మరాఠీ పత్రిక మహారాష్ట్ర టైమ్స్ ఎన్నికల వేళ మోదీ ప్రభుత్వంపై ఎక్కుపెట్టేందుకు రఫేల్ డీల్ ప్రతిపక్షాలకు దొరికిన అతిపెద్ద అస్త్రంగా వర్ణించింది.
కానీ, ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాయో, తమ వాక్చాతుర్యంతో దీనిని ఎలాంటి ప్రధాన అస్త్రంగా మార్చుకుంటాయో రాబోయే వారాల్లో తేలనుంది.
ఇవి కూడా చదవండి:
- త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తే నిజంగానే ఆరోగ్యంగా ఉంటామా?
- ఆరోగ్యం: హిప్ రీప్లేస్మెంట్ అవసరం ఎప్పుడు వస్తుంది?
- ఆరోగ్యంపై హార్మోన్ల ప్రభావం గురించి మహిళలు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- ‘తమిళనాడులో టిక్‌టాక్’ యాప్‌ను నిషేధించాలని నిర్ణయం’
- హైదరాబాద్‌లో ఈ అమ్మాయి బైక్ విన్యాసాలు చూస్తే.. కళ్లు తిరుగుతాయ్
- హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి.. తమ ప్రేమను నిలబెట్టుకున్నారు
- ఎల్ చాపో గజ్మన్: ప్రపంచంలోనే అత్యంత పేరుమోసిన నేరస్తుడిపై ముగిసిన విచారణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో
సబ్‌స్క్రైబ్ చేయండి.)









