అమెరికాలో ‘అత్యంత పేద పట్టణం’ ఎలా ఉందో చూడండి

అమెరికాలో ఆర్థికంగా అత్యంత వెనుకబడిన పట్టణం టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఇస్కోబారెస్.
అమెరికా- మెక్సికో దేశాల సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈ పట్టణంలో ఉపాధి అవకాశాలు లేక తాము ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు.
అమెరికా జనాభా లెక్కల ప్రకారం, ఈ ఇస్కోబారెస్ పట్టణ జనాభాలో 62 శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు.
అమెరికాలోని 1,000కి పైగా జనాభా ఉన్న పట్టణాల్లో పేదరికం అధికంగా ఉన్నది ఇక్కడేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఇక్కడ పేదరికానికి ప్రధాన కారణం ఉపాధి అవకాశాలు లేకపోవడమే.
"ఇక్కడ భవిష్యత్తు పెద్దగా లేదు. ఉపాధి లేక మేము వెనుకబడిపోతున్నాం" అని ఓ యువతి చెప్పారు.
"నేను చెత్త సేకరిస్తాను. అది తక్కువ స్థాయి పనే అయినా చేసేందుకు సిగ్గుపడను. చేయక తప్పదు. మంచి ఉద్యోగం దొరకాలంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే" అని ఓ యువకుడు వివరించారు.
"ఈ పట్టణం ఆర్థికంగా వ్యాపారాలతో అభివృద్ధి చెందలేదు. కానీ, మాఫియా, నేరాల విషయంలో మాత్రం చాలా ఎదిగింది. నేను నిలబడిన చోటే గతంలో ఒకరు హత్యకు గురయ్యారు" అని ఆ యకువకుడు చెప్పారు.
ఈ పట్టణంలో 98 శాతం మంది స్పానిష్ మాట్లాడతారు.

"ఒకప్పుడు ఇక్కడ సరిహద్దు ఉండేది కాదు. కానీ, కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందంతో ఇది సరిహద్దుగా మారింది. సరిహద్దు వల్ల అనేక సమస్యలు ఉంటాయి. అది తీసుకురాకూడదు.. ఇది తేకూడదు.. అని సరిహద్దుకు ఇటువైపున ఉన్నవాళ్లంటారు. అటువైపున ఉన్నవాళ్లు కూడా అలాగే షరతులు పెడుతుంటారు. దాంతో, ఎటు వెళ్లాలన్నా, ఏం చేయాలన్నా ఇబ్బందులే. సరిహద్దులో జీవితం అంటే ఇలాగే ఉంటుంది" అని ఈ పట్టణ డిప్యూటీ మేయర్ రుపర్టో వివరించారు.
ఇస్కోబారెస్‌కు 2005లో పట్టణంగా గుర్తింపు వచ్చింది. దాంతో అభివృద్ధి జరుగుతుందని స్థానికులు ఆశించారు. కానీ, మార్పు పెద్దగా కనిపించడంలేదు.

తమ ఊరికి పట్టణంగా గుర్తింపు వచ్చినా.. తమ బతుకులు పెద్దగా మారలేదని స్థానిక మహిళ చెప్పారు. అభివృద్ధి జరగలేదు కానీ, పేదరికం, నేరాలు మాత్రం భారీగా పెరిగిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇక్కడ ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. పెద్ద పరిశ్రమలు లేవు. ఎవరైనా ఇక్కడ భారీ పరిశ్రమ పెట్టి.. ఇక్కడి ప్రజలకు ఉపాధి కల్పిస్తారని ఆశిస్తున్నాం. అదే మా అతిపెద్ద ఆకాంక్ష" అని డిప్యూటీ మేయర్ రుపర్టో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాకు ఆ పేరు పెట్టిన మధ్యయుగాల నాటి మ్యాప్ ఇదే
- గ్వాంటానమో బే: 'మాభూమి మాకిచ్చేయండి' అంటున్న క్యూబా
- #MeToo: 'పని మనుషులపై లైంగిక వేధింపులు.. లక్షల్లో బాధితులు'
- టోక్యో ఒలింపిక్స్: పాత సామానుతో.. పతకాల తయారీ
- నమ్మకాలు-నిజాలు: బిడ్డకు తల్లిపాలు మంచివా? పోతపాలు మంచివా?
- ట్రంప్ టెంపుల్: ‘దేవుడు’ అమెరికాలో.. భక్తుడు బచ్చన్నపేటలో
- అమెరికా గన్ లాబీ: ఆయుధాలు నిషేధిస్తామంటే ఎలా ఒప్పుకుంటాం?
- అమెరికాలో అరెస్టైన విద్యార్థులు విడుదలయ్యేది ఎప్పుడు
- చాక్లెట్ అంతం: ప్రపంచ ఉత్పత్తిలో సగం తినేస్తున్న యూరప్, అమెరికా ప్రజలు
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









