#MeToo: 'పని మనుషులపై లైంగిక వేధింపులు.. లక్షల సంఖ్యలో బాధితులు'

లైంగిక వేధింపులు

కొన్ని నెలల కిందట భారత్‌లో #MeToo ఉద్యమం పెద్దఎత్తున సాగింది. వివిధ రంగాలకు చెందిన కొందరు మహిళలు తమను లైంగికంగా వేధిస్తున్న వారి పేర్లను బయటపెట్టారు. అయితే, ఆ ఉద్యమంలో అతికొద్ది మంది మాత్రమే తమకు ఎదురైన అనుభవాలు, అన్యాయాలు చెప్పారని.. అసంఘటిత రంగంలో పనిచేసే లక్షలాది మంది మహిళలకు ఆ ఉద్యమం చేరలేదని ప్రొఫెసర్ శ్రీపర్ణ ఛటోపాధ్యాయ అంటున్నారు.

45 ఏళ్ల మీనా (ఆమె విజ్ఞప్తి మేరకు పేరు మార్చాం) బెంగళూరులో ఇళ్లల్లో పనిచేస్తుంటారు. పనిచేసే చోట లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళల్లో ఆమె ఒకరు.

ఆమె రోజూ మూడు ఇళ్లలో వంట చేసి, గిన్నెలు కడుగుతారు. ప్రస్తుతం నెలకు రూ.6,000 వస్తున్నాయి. గతంలో ఆమె రూ.18,000 సంపాదించేవారు. కానీ, పనిచేసే ఇళ్ల యజమానులు తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపణలు చేయడంతో కొన్ని ఇళ్లల్లో పని మానేయాల్సి వచ్చింది.

తన కుమార్తె పెళ్లి కోసం తాను పనిచేసే ఓ ఇంటి యజమాని దంపతుల నుంచి రూ.100,000 అప్పు తీసుకున్నప్పటి నుంచి తనపై లైంగిక వేధింపులు మొదలయ్యాయని ఆమె చెప్పారు.

"ఆ ఇంట్లో మూడేళ్లు పనిచేశాను. మొదట్లో నేను ఇల్లు ఊడ్చుతుంటే, ఫ్లోర్ కడుగుతుంటే ఇంటి యజమాని దగ్గరగా వచ్చేవారు. తర్వాత ఉద్దేశపూర్వకంగానే నన్ను తాకేందుకు ప్రయత్నించేవారు, చీర లాగేవారు" అని మీనా వివరించారు.

లైంగిక వేధింపులు
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

"ఆయన భార్య ఎక్కువగా నిద్రపోతూ ఉండేవారు. కాబట్టి, అతని అసభ్య ప్రవర్తన ఆమెకు తెలిసుండదు" అని మీనా అన్నారు.

"అలాంటి పనులు చేయొద్దని చెప్పాను. కానీ, ఒకరోజు అమ్మగారు బెడ్‌రూం తలుపులు మూసేసి లోపల నిద్రపోతున్నారు. అప్పుడు ఆయన వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని, సోఫా మీదకు లాగేందుకు ప్రయత్నించారు" అని ఆమె ఆరోపించారు.

అయితే, అతనితో పెనుగులాడి తప్పించుకున్నానని, అప్పటి నుంచి ఆ ఇంటి గడప తొక్కలేదని ఆమె చెప్పారు.

ఈ విషయం చెబితే తనను ఎవరూ నమ్మరన్న ఆలోచనతో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని మీనా తెలిపారు.

"తర్వాత ఆ దంపతులు తమ దగ్గర తీసుకున్న అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి పెంచారు. డబ్బు చెల్లించలేకపోతే, అప్పు తీరే వరకు ఇంట్లో పనిచేయాలని అన్నారు. తొలుత ఫోన్‌లో బెదిరించేవారు. తర్వాత మా ఇంటికి కొందరు వ్యక్తులను పంపించారు" అని ఆమె వివరించారు.

"మగాళ్లను రెచ్చగొట్టేలా, వారి దృష్టిని ఆకర్షించేలా దుస్తులు వేసుకుంటున్నావు అని ఆ యజమాని భార్య నాపైనే నింద వేసింది" అని మీనా చెప్పారు.

"ఆ ఇంటికి వెళ్లాలంటేనే భయంగా ఉండేది. ఏం చేయాలో అర్థంకాక మానసికంగా కుంగిపోయాను. వారి వద్ద తీసుకున్న అప్పు ఒకేసారి పూర్తిగా తీర్చలేను. అలాగని, మళ్లీ వాళ్లింటికి పనికి వెళ్లలేను" అని మీనా అన్నారు.

లైంగిక వేధింపులు

మీనా పనిచేసే మరో ఇంటి దంపతులు మాత్రం తమతో ఆమె తన సమస్యలను పంచుకునేలా వ్యవహరించేవారు. వారి సాయంతోనే మీనా కార్మిక సంఘంతో పాటు, బెంగళూరులో మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇతర సంస్థలను ఆశ్రయించారు.

మీనాపై వేధింపులు ఆపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కార్మిక సంఘం ప్రతినిధి ఆమెను వేధించిన వ్యక్తిని హెచ్చరించారు.

అప్పటి వరకు పొదుపు చేసుకున్న డబ్బుతో సాధ్యమైనంత మేరకు అప్పు తీర్చేయాలని మీనా నిర్ణయించుకున్నారు. కానీ, ఆమెకు మరో సమస్య వచ్చింది. ఆమె చిన్న బిడ్డకు పక్షవాతం వచ్చింది. దాంతో, చాలా ఖర్చు చేయాల్సి వచ్చింది.

తనకు మరికొన్ని ఇళ్లల్లోనూ వేధింపులు ఎదురయ్యాయని, దాంతో మూడు ఇళ్లల్లోనే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మీనా చెప్పారు.

లైంగిక వేధింపులు

17 శాతం బాధితులు

దేశంలోని మహిళా శ్రామికుల్లో 94 శాతం మంది.. మీనాలా ఇళ్లల్లో పని చేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, వస్త్ర దుకాణాల్లో పనిచేసేవారే.

కానీ, వారు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, దాడుల విషయాలు చాలా అరుదుగా వెలుగులోకి వస్తున్నాయి.

2012లో దేశంలోని 8 నగరాల్లో ఆక్స్‌ఫాం సంస్థ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం, సంఘటిత.. అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళల్లో 17 శాతం మంది పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు.

బాధితుల్లో ఎక్కువగా కూలీలు (29 శాతం), ఇళ్లల్లో పనిచేసే వారు (23 శాతం) మంది ఉన్నారు.

పని మనుషులు
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

2018లో దేశ రాజధాని దిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఓ సర్వేలో 29 శాతం మంది పని మనుషులు లైంగిక వేధింపుల బాధితులేనని తేలింది.

సంఘటిత రంగంతో వెలుగుచూసిన ఉదంతాలతో పోల్చితే ఈ సంఖ్యలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే, సంఘటిత రంగాల్లో బాధితులు ఎక్కువ మంది ధైర్యంగా బయటకొచ్చి పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటారు.

బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్(బీపీవీ) రంగంలో 88 శాతం, వైద్య రంగంలో 57 శాతం మంది బాధిత మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు.

అసంఘటిత రంగ మహిళా కార్మికులు కేసులు పెట్టకపోవడానికి కారణం ఆర్థిక, సామాజిక పరిస్థితులే. ఒకవేళ కేసులు పెట్టినా, ప్రతీకార చర్యలకు భయపడి చాలామంది బాధితులు ఆ కేసులను వెనక్కి తీసుకుంటారు.

దాంతో, అనేక మంది పేద మహిళలు లోలోపలే వేదన అనుభవిస్తున్నారు.

మీటూ ఉద్యమం

దిల్లీలోని ఓ అపార్టుమెంటులో యజమాని పనిమనిషిపై దాడి చేసి కొట్టారని ఆరోపిస్తూ.. అనేకమంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు భారీ ధర్నా చేశారు.

2011లో పనిమనిషిపై అత్యాచారం కేసులో ఓ బాలీవుడ్ నటుడు దోషి అని కోర్టు తేల్చింది. అలా కోర్టు దాకా వచ్చే కేసులు చాలా తక్కువే.

కొన్ని నెలల క్రితం #MeToo ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అనేక మంది మహిళలు తమను లైంగికంగా వేధించిన వారి పేర్లను బయటపెట్టారు. నిందితుల్లో పలువురు ప్రముఖ నేతలు, సినీ నిర్మాతలు, నటుటులు, కళాకారులు, పాత్రికేయుల పేర్లు కూడా బయటకు వచ్చాయి.

అయితే, భారత్‌లో అయినా, ప్రపంచవ్యాప్తంగా అయినా ఈ ఉద్యమం గురించి పట్టణ ప్రాంతాలు, విద్యావంతులతో పాటు, కొందరు చైతన్యవంతులైన మహిళలకు మాత్రమే పాల్గొన్నారు.

అనేక మంది పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన బాధితులు ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నారు.

భన్వారీ దేవి

ఫొటో సోర్స్, COURTESY: VIVIDHA

ఫొటో క్యాప్షన్, భన్వారీ దేవి (మధ్యలో)

రాజస్థాన్‌లో బాల్య వివాహాలను అడ్డుకున్న భన్వారీ దేవి అనే దళిత అభివృద్ధి ప్రాజెక్టు కార్యకర్తపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర అనారోగ్యం పాలైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి దోషులను కోర్టు ముందు నిలబెట్టారు.

ఆ కేసుతోనే దేశంలో తొలిసారిగా పనిచేసే చోట వేధింపుల, నివారణ, నిషేధ, పరిహార చట్టం-2013 వచ్చింది.

పనిచేసే చోట జరిగే లైంగిక వేధింపులను అరికట్టడానికి 10 మందికి మించి పనిచేసే ఏ ప్రదేశంలోనైనా మహిళల కోసం ఓ ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి. జిల్లా మెజిస్ట్రేట్ నేతృత్వంలోని స్థానిక ఫిర్యాదుల కమిటీ (ఎల్‌సీసీ) ఆ ఫిర్యాదులను పరిశీలించాలని ఆ చట్టం చెబుతోంది. కానీ, పట్టణాల్లో లేదా జిల్లాల్లో అలాంటి కమిటీలు లేవు.

ఇప్పుడు #MeToo నుంచి #UsAll ఉద్యమాన్ని ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

(రచయిత పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలో సీనియర్ పరిశోధనా శాస్త్రవేత్త)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)